
నిరుద్యోగ యువతకు నష్టం ఉండదు
వారసత్వ ఉద్యోగాలపై హైకోర్టుకు ‘సింగరేణి’ నివేదన
సాక్షి, హైదరాబాద్: సింగరేణి బొగ్గు గనుల్లో పనిచేస్తున్న వారి వారసులకు ఉద్యోగాలు కల్పించడం వల్ల నిరుద్యోగ యువతకు ఎటువంటి నష్టం ఉండదని సింగరేణి కాలరీస్ ఉమ్మడి హైకోర్టుకు నివేదించింది. బొగ్గు గని కార్మికుల సంక్షేమం కోసం తీసుకుంటున్న చర్యల్లో భాగంగానే వారి వారసులకు ఉద్యోగాలిస్తున్నామంది. ఈ పథకమేమీ ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చింది కాదని, 1981 నుంచి అమల్లో ఉందని వివరించింది. సింగరేణి కాలరీస్‌లో వారసత్వ ఉద్యోగాల భర్తీకి ఉద్దేశించిన ఉత్తర్వులను సవాలు చేస్తూ పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన కె.సతీశ్‌కుమార్ హైకోర్టులో వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై జస్టిస్ వి.రామసుబ్రమణియన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.
ఈ మొత్తం వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వం, సింగరేణి కాలరీస్‌ను ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు సింగరేణి కాలరీస్ జనరల్ మేనేజర్ (పర్సనల్) ఎ.ఆనందరావు కౌంటర్ దాఖలు చేశారు. కార్మికులు భూమిలో 400 మీటర్ల లోతులో పనిచేస్తుంటారని, అందువల్ల వారు తరచూ అనారోగ్యానికి గురవుతుంటారన్నారు. 2017 ఫిబ్రవరి నాటికి 5,875 మంది ఉద్యోగులు స్వచ్ఛంద పదవీ విరమణ కోసం దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. పదవీ విరమణ పథకం ద్వారా భర్తీ చేసే పోస్టులకు, ప్రత్యక్ష విధానం ద్వారా భర్తీ చేసే పోస్టులకు సంబంధం లేదన్నారు. కనుక ఈ వ్యాజ్యాన్ని కొట్టివేయాలని అభ్యర్థించారు.