
శత్రుచర్ల జీతభత్యాలు రాబట్టండి
- అధికారులకు హైకోర్టు ఆదేశం
- 1999, 2004 మధ్య కాలంలో జీతభత్యాలు వెనక్కి తీసుకోవాలి
- ఆయన్ని ప్రాసిక్యూట్ చేయాలన్న అభ్యర్థన కొట్టివేత
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజుకు ఉమ్మడి హైకోర్టు గట్టి షాక్‌నిచ్చింది. విజయరామరాజు ఎస్టీ కాదని ఇప్పటికే న్యాయస్థానాలు తీర్పునిచ్చిన నేపథ్యంలో 1999 నుంచి 2004 వరకు శాసనసభ్యునిగా పనిచేసిన కాలానికి ఆయనకు చెల్లించిన జీతభత్యాలన్నింటినీ తిరిగి రాబట్టాలని ఆంధ్రప్రదేశ్ శాసనసభ కార్యదర్శిని ఆదేశించింది. ఎస్టీ కాని విజయరామరాజు విజయనగరం జిల్లా, నాగూరు అసెంబ్లీ (ఎస్టీ) స్థానం నుంచి పోటీ చేసినందుకు ఆయన్ని ప్రాసిక్యూట్ చేసేందుకు ఆదేశాలు ఇవ్వాలన్న పిటిషనర్ అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది.
అలాగే తనకు కొండదొర (ఎస్టీ) ధ్రువపత్రం ఇచ్చేలా అధికారులను ఆదేశించాలంటూ విజయరామరాజు చేసిన అభ్యర్థనను సైతం హైకోర్టు కొట్టేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావు సోమవారం తీర్పు ఇచ్చారు. 1999 ఎన్నికల్లో నాగూరు ఎస్టీ నియోజకవర్గం నుంచి విజయరామరాజు పోటీ చేసి గెలుపొందారు. ఆయన ఎస్టీ కాదని, క్షత్రియ అని, అందువల్ల ఆ ఎన్నికను కొట్టేయాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే నిమ్మక జయరాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశా రు. విచారణ జరిపిన హైకోర్టు విజయరామరాజు క్షత్రియ అని తేల్చింది. సుప్రీంకోర్టు సైతం హైకోర్టు తీర్పునే సమర్థించింది.
ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేగా అంటే 1999 నుంచి 2004 వరకు విజయరామరాజుకు చెల్లించిన జీతభత్యాలన్నింటినీ తిరిగి రాబట్టేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ జయరాజ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. జయరాజ్ తరఫున సీనియర్ న్యాయవాది ఎ.సత్యప్రసాద్ వాదనలు వినిపించారు. వాటిని పరిగణనలోకి తీసుకు న్న న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావు, శత్రుచర్ల విజయరామరాజు ఎస్టీ కాదని కోర్టు లు స్పష్టంగా తేల్చినందున, అతనికి ఎమ్మెల్యేగా చెల్లించిన జీతభత్యాలు లేదా గౌరవ వేతనాన్ని తిరిగి రాబట్టాలని అధికారులను ఆదేశించారు.