సీనియారిటీ, స్థానికత ప్రాతిపదికన విభజన
న్యాయాధికారుల విభజనపై సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ: సీనియారిటీ, స్థానికత, ఆప్షన్లను ప్రాతిపదికగా తీసుకుని న్యాయాధికారుల విభజన చేపడతామని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు విన్నవించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య న్యాయాధికారుల విభజన చేపట్టేందుకు వీలుగా మార్గదర్శకాల ముసాయిదాను కోర్టుకు సమర్పి ంచింది. న్యాయాధికారుల కేడర్ విభజనకు సంబంధించి ఉమ్మడి హైకోర్టు రూపొందించిన మార్గదర్శకాలను సవాలు చేస్తూ తెలంగాణ న్యాయాధికారుల సంఘం దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ జాస్తి చలమేశ్వర్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టిన విషయం తెలిసిందే.
ఇప్పటికే ఉమ్మడి హైకోర్టు రూపొందించిన కేడర్ విభజన మార్గదర్శకాలను ముసాయిదాగా పరిగణించాలని, వీటిపై తగిన సూచనలు తీసుకుని జూన్ 17 లోగా మార్గదర్శకాల తుది ముసాయిదాను తయారు చేయాలని ఈ ఏడాది ఏప్రిల్‌లో కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే ఉమ్మడి హైకోర్టుతో సంప్రదింపులు జరిపి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు తమ తమ రాష్ట్రాల్లో ఉండాల్సిన సబార్డినేట్ జుడీషియల్ అధికారుల సంఖ్యను నిర్ధారించాలని కూడా ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఈ నేపథ్యంలో మంగళవారం ఈ కేసు విచారణకు రాగా... కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ మణిందర్‌సింగ్ మార్గదర్శకాల తుది ముసాయిదాను ధర్మాసనానికి సమర్పించారు. న్యాయాధికారుల విభజనలో సీనియారిటీ, స్థానికతను పరిగణనలోకి తీసుకుని ప్రాంతం ఎంపికకు ఆప్షన్ ఇవ్వాలన్నదే ప్రధాన మార్గదర్శకమని వివరించారు. ఈ సందర్భంలో జస్టిస్ చలమేశ్వర్ జోక్యం చేసుకుంటూ... ఒక రాష్ట్రంలో స్థానికుడై ఉండి మరో రాష్ట్రంలో ఆప్షన్ ఎంచుకున్నప్పుడు దానిని ఏ ప్రాతిపదికన పరిగణనలోకి తీసుకుంటారని ప్రశ్నించారు.
ఆమోదయోగ్యం కాదు..
ఇదే సందర్భంలో తెలంగాణ న్యాయాధికారుల సంఘం తరçఫున సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ తన వాదన వినిపిస్తూ... సీనియారిటీ, ఆప్షన్ ప్రాతిపదిక తమకు ఆమోదయోగ్యం కాదని చెప్పారు. విభజన తేదీ నాటికి మంజూరైన న్యాయాధికారుల పోస్టుల సంఖ్య, ఖాళీలు, విభజన తేదీ తరువాత రెండు రాష్ట్రాల్లో న్యాయాధికారుల సంఖ్య, ఖాళీలు తదితర వివరాలు ఉన్నాయా అంటూ న్యాయమూర్తి ప్రశ్నించగా... జాబితా సిద్ధంగా లేదని, కొంత సమయం కావాలని హైకోర్టు తరఫు సీనియర్ న్యాయవాది రమణీరావు విన్నవించారు. సంబంధిత వివరాలను బుధవారం నాటికి కోర్టుకు సమర్పించాల ని న్యాయమూర్తి ఆదేశిస్తూ కేసు విచారణను సెప్టెంబరు 5కు వాయిదా వేశారు.