ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసుకు సంబంధించిన వివరాలతో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు హైదరాబాద్ పయనమయ్యారు. ఈ కేసు పురోగతిని మంగళవారం తమకు సీల్డ్ కవర్‌లో సమర్పించాలంటూ అడ్వొకేట్ జనరల్‌ను ఉమ్మడి హైకోర్టు ధర్మాసనం ఆదేశించిన నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం సిట్ ఇన్‌చార్జ్‌గా ఉన్న ఏసీపీ బీవీఎస్ నాగేశ్వరరావు, మరికొంతమంది సిబ్బందితో హైదరాబాద్ వెళ్లారు. దర్యాప్తు నివేదికను రూపొందించేందుకు సిట్, ఇతర ఉన్నతాధికారులు కొద్దిరోజులుగా కసరత్తు చేశారు. ఉన్నత న్యాయస్థానం ఏయే అంశాలపై దృష్టి సారిస్తుందో ముందుగా అంచనా వేసి అందుకనుగుణంగా వీరు నివేదికను సిద్ధం చేశారు.