ఇసుక అక్రమ రవాణాపై ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న
సాక్షి, హైదరాబాద్: ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాకు సంబంధించిన ఫిర్యాదులను విచారించేందుకు ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ ఇప్పటివరకు ఏం చేసిందో చెప్పాలని ఉమ్మడి హైకోర్టు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలంటూ రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి, మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ తదితరులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్‌రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌ల ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. మహబూబ్‌నగర్ జిల్లా, పెద్దముంగలచేడు గ్రామ పరిధిలోని పెదవాగులో ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఎన్.మహేందర్‌రెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై మంగళవారం ధర్మాసనం విచారణ జరిపింది.
వ్యాజ్యం దాఖలు చేయడానికి వీల్లేదు...
ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది ఎం.రత్నారెడ్డి వాదనలు వినిపిస్తూ... పెదవాగులో నిబంధనలకు విరుద్ధంగా భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు జరిపి, అక్రమంగా తరలిస్తున్నారన్నారు. ఈ విషయంలో అధికారులు ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదన్నారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సంజీవ్‌కుమార్ స్పందిస్తూ... ఈ విషయంలో వచ్చే ఫిర్యాదులపై స్పందించేందుకు కోర్టు ఆదేశాల మేరకు ఓ ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేశామన్నారు. ఈ క్రమంలో పిటిషనర్ తన ఫిర్యాదులను కమిటీ ముందుకు తీసుకెళ్లాలే తప్ప, ఇలా వ్యాజ్యం దాఖలు చేయడానికి వీల్లేదన్నారు. దీనిపై ధర్మాసనం అభ్యంతరం వ్యక్తం చేస్తూ... ఆ ఉన్నతస్థాయి కమిటీ ఇప్పటి వరకు ఏం చర్యలు తీసుకుందో వివరించాలని ఆదేశించింది.
ఉన్నతస్థాయి కమిటీ చేసిందేమిటి?
Published Wed, Mar 22 2017 3:51 AM | Last Updated on Tue, Aug 28 2018 8:41 PM
Advertisement