అడ్డంగా దొరికిపోయిన ఏపీ సర్కార్
- దివాకర్ ట్రావెల్స్ ఉల్లంఘనకు పాల్పడలేదన్న ఏపీ
- ఉల్లంఘనకు పాల్పడిందని నివేదిక ఇచ్చిన టీ సర్కార్
- దీంతో ఏపీ ప్రభుత్వ తీరుపై ధర్మాసనం అసంతృప్తి
- దివాకర్ ట్రావెల్స్‌కు క్లీన్‌చిట్‌పై ఘాటు వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జిల్లా, ముండ్లపాడు వద్ద ఫిబ్రవరిలో ప్రమాదానికి గురైన దివాకర్ ట్రావెల్స్ బస్సు నిబంధనలను ఉల్లంఘించ లేదంటూ క్లీన్‌చిట్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం మంగళవారం ఉమ్మడి హైకోర్టులో అడ్డంగా దొరికిపోయింది. దివాకర్ ట్రావెల్స్ కు ఏపీ ప్రభుత్వం క్లీన్‌చిట్ ఇస్తూ నివేదిక ఇవ్వగా, తెలంగాణ ప్రభుత్వం అందుకు విరుద్ధంగా నివేదిక ఇవ్వడంతో ఏపీ బండారం బట్టబయ లైంది. ఏపీ సర్కార్ తరఫున రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి సుమితా దావ్రా దాఖలు చేసిన నివేదికలో పస లేదని ధర్మాసనం తేల్చి చెప్పింది. అలాగే కార్మికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపునిచ్చేందుకు నిరాకరించింది. మోటారు వాహన కార్మికుల చట్ట నిబంధనలను అమలు చేసే విషయంలో.. చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై ఇప్పటివరకు ఏం చర్యలు తీసుకున్నారో వివరించాలని ఏపీ సర్కార్‌ను ఆదేశించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ తెల్లప్రోలు రజనీతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
రిజిస్టర్ చేసుకోకపోతే ఉల్లంఘన కాదా?
మోటారు వాహన చట్ట నిబంధనలకు విరు ద్ధంగా ఉభయ రాష్ట్రాల్లో బస్సు ఆపరేటర్లు బస్సులు నడుపుతున్నా అధికారులు పట్టించు కోవడం లేదని, ఈ నేపథ్యంలోనే ముండ్లపాడు వద్ద దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం జరిగిందంటూ న్యాయవాది కేవీ సుబ్బారెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం, పూర్తి వివరాలతో నివేదికలు సమర్పించాలని ఉభయ రాష్ట్రాల రవాణా శాఖ, కార్మికశాఖ ఉన్నతాధికారులను ఆదేశిం చింది. ఈ ఆదేశాల మేరకు ఏపీ సర్కార్ తరఫున రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి సుమి తా దావ్రా నివేదికను కోర్టు ముందుంచారు. ముండ్లపాడు వద్ద ప్రమాదం జరిగే సమయా నికి దివాకర్ ట్రావెల్స్ బస్సులో ఇద్దరు డ్రైవర్లు ఉన్నారని, ఆ బస్సు పూర్తి ఫిట్‌గా ఉందని, నిబంధనలను ఎక్కడా ఉల్లంఘిం చలేదని పేర్కొన్నారు. మంగళవారం ఈ వ్యాజ్యంపై మరోసారి విచారణకు వచ్చినప్పుడు పిటిషనర్ తరఫు న్యాయవాది పీఏవీ పద్మనాభం ఏపీ ప్రభుత్వం దివాకర్ ట్రావెల్స్‌కు క్లీన్‌చిట్ ఇవ్వడాన్ని ఎత్తిచూపారు.
దివాకర్ ట్రావెల్స్ బస్సు మోటారు ట్రాన్స్‌పోర్ట్ కార్మికుల చట్టం కింద రిజిస్ట్టర్ చేసుకోలేదని తెలంగాణ ప్రభుత్వం తన నివేదికలో స్పష్టంగా చెప్పిం దని, అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం దివాకర్ ట్రావెల్స్ ఎటువంటి చట్ట ఉల్లంఘ నలకు పాల్పడలేదని తమ విచారణలో తేలినట్లు చెబుతోందని, ఇదెలా సాధ్యమని ప్రశ్నించారు. పద్మనాభం వాదనలతో ధర్మాస నం ఏకీభవించింది. ప్రతీ దానిని ఖండిస్తూ పోవడమేనా.. అంటూ విస్మయం వ్యక్తం చేసింది. చట్టం కింద రిజిస్టరే చేసుకోక పోవడం చట్ట ఉల్లంఘనే అవుతుందని, మరి ఉల్లంఘించలేదని ఎలా చెబుతారని ఏపీ సర్కార్ తరఫున హాజరైన అడ్వొకేట్ జనరల్ శ్రీనివాస్‌ను ప్రశ్నించింది.
అధికారులు కోర్టు ఆదేశాల పట్ల సీరియస్‌గా ఉన్నట్లు కనిపిం చడం లేదని, అలా లేకుంటే ఆ విషయాన్ని తమకు చెప్పాలని, ఏం చేయాలో తమకు బాగా తెలుసునని ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది. ఈ సమయంలో ఏజీ ఈ మొత్తం వ్యవహారంలో చోటు చేసుకున్న వైరుధ్యాలను అంగీకరించారు. చివరగా మూడు వారాల గడువునిస్తే పూర్తి వివరాలను కోర్టు ముందుంచుతానని ధర్మాసనాన్ని అభ్యర్థించారు. ఇందుకు ధర్మాసనం అంగీకరిస్తూ విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.