ఉత్తమ వైద్య సేవలందించండి
సీఎం చంద్రబాబు ఆదేశం
సాక్షి, అమరావతి: బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంపై మంగళవారం వెలగపూడి సచివాలయంలోని తన కార్యాలయంలో సమీక్షించారు. గాయపడిన వారికి అత్యుత్తమ వైద్య సేవలందించాలని అధికారులను ఆదేశించారు. చికిత్స, సహాయ ఏర్పాట్లను పర్యవేక్షించాలని జిల్లా మంత్రులకు సూచించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు తనకు చెప్పాలని హోంమంత్రి, జిల్లా మంత్రులకు సూచించారు. మంగళవారం డీజీపీ సాంబశివరావు సచివాలయంలో సీఎంను కలసి ప్రమాదం, అందుకు కారణాలు, తర్వాత పరిణామాలను వివరించారు.
కాగా, సచివాలయంలో సీఎం చంద్రబాబు గ్రేట్ లేక్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ వ్యవస్థాపకుడు, చాన్సలర్ డాక్టర్ వి.బాలచంద్రన్ బృందంతో సమావేశమయ్యారు. మరోవైపు అమరావతిలో ఎయిమ్స్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవసరమైన అనుమతుల్ని పదిరోజుల్లోగా ఇవ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు. కాగా, ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక చట్టం పేరును మారుస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. దీన్ని ఇకనుంచి ఎస్సీ, ఎస్టీ సుస్థిర, సమ్మిళిత అభివృద్ధి నిధిగా వ్యవహరించాలని నిర్ణయించారు.