ట్రావెల్స్‌ యాజమాన్యాలకు చంద్రబాబు అండ | YS Jaganmohan Reddy comments on Bus accident issue | Sakshi
Sakshi News home page

ట్రావెల్స్‌ యాజమాన్యాలకు చంద్రబాబు అండ

Published Wed, Mar 1 2017 5:27 AM | Last Updated on Sat, Aug 18 2018 8:05 PM

ట్రావెల్స్‌ యాజమాన్యాలకు చంద్రబాబు అండ - Sakshi

ట్రావెల్స్‌ యాజమాన్యాలకు చంద్రబాబు అండ

నిబంధనలు ఉల్లంఘించినా పట్టదా?: వైఎస్‌ జగన్‌

డ్రైవర్‌ తాగాడో లేదో తెలియదంటున్నారు
మృతదేహానికి పోస్టుమార్టం కూడా చేయలేదు  
రెండో డ్రైవర్‌ను తప్పించి.. కొత్త డ్రైవర్‌ను తెస్తున్నారు 
మృతుల కుటుంబాలకు రూ.20 లక్షలు ఇవ్వాలి
ఘటనా స్థలాన్ని సందర్శించిన ప్రతిపక్ష నేత
నందిగామ ఆసుపత్రిలో బాధితులకు పరామర్శ    


సాక్షి, అమరావతి బ్యూరో: ‘‘నిర్లక్ష్యంగా బస్సులు నడిపి ప్రయాణికుల మృతికి కారణమైన ట్రావెల్స్‌ యాజమాన్యాలను కాపాడేందుకు ప్రభు త్వం ప్రయత్నిస్తోంది. బస్సు నడిపిన డ్రైవర్‌ తాగి ఉన్నాడో లేదో పరీక్షలు చేయలేదు. రెండో డ్రైవర్‌ను తప్పించారు. ట్రావెల్స్‌ యజమానులైన టీడీపీ ఎంపీలకు ముఖ్య మంత్రి చంద్రబాబు అండగా నిలుస్తున్నారు. నిబంధనలను అడ్డగోలుగా ఉల్లంఘి స్తున్నా పట్టించుకోవడం లేదు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు’’ అని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

ఆయన మంగళవారం కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు సమీపంలోని ముండ్లపాడు గ్రామానికి చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని బాధిత కుటుంబాలను ఓదార్చారు. జిల్లా కలెక్టర్‌ బాబు.ఎ, పోలీసులు, వైద్యులతో మాట్లాడి సహాయక, వైద్య సేవల గురించి ఆరా తీశారు. అనంతరం విలేకరులతో మాట్లా డారు. మృతుల కుటుంబాలకు బస్సు యాజమాన్యం నుంచి రూ.20 లక్షల చొప్పున పరిహారం ఇప్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే...

‘‘ప్రమాదంలో చనిపోయినవారి మృత దేహాలకు పోస్టుమార్టం చేయకపోయినా చేసినట్లుగా చూపిస్తున్నారు. డ్రైవర్‌ మద్యం సేవించి బస్సు నడిపాడా లేదా అనేదానిపై పోస్టుమార్టం చేశారా? అని అడిగితే.. చేయలేదని డాక్టర్లు చెబుతున్నారు. డ్రైవర్‌ మద్యం తాగి బస్సు నడిపాడో లేదో తెలియ దని అంటున్నారు. పోస్టుమార్టం చేస్తే డ్రైవర్‌ మద్యం తాగి ఉన్నాడో లేదో తెలుస్తుంది కాబట్టి ఏకంగా మృతదేహాన్ని మూట గట్టేశారు. ఫోరెన్సిక్‌ పరీక్షలూ చేయలేదు. రెండో డ్రైవర్‌ ఏమయ్యాడు? బస్సు భువనేశ్వర్‌ నుంచి బయల్దేరి హైదరాబాద్‌కు వస్తోంది. బస్సు కాంట్రాక్ట్‌ క్యారియరా? స్టేజ్‌ క్యారియరా? అని అడిగితే కలెక్టర్‌ సమాధానం చెప్పడం లేదు. రెండో డ్రైవర్‌ ను తీసుకొచ్చామని కలెక్టర్‌ అంటున్నారు.

ఆయన ఎక్కడున్నాడని అడిగితే.. వెళ్లిపోయాడని చెబుతున్నారు. అతడిని  పోలీసులు ఎందుకు అదుపులోకి తీసుకోలేదు? ఎందుకు పంపించేశారు? రెండో డ్రైవర్‌ తాగకపోయి ఉంటే, అతడి వద్ద లైసెన్స్‌ ఉంటే ఆయనను ఇక్కడే ఉంచే వారు. రెండో డ్రైవర్‌ తాగి అయినా ఉండాలి లేదా అతడికి లైసెన్స్‌ లేకపోయి అయినా ఉండాలి. ఈ రెండు కారణాల్లో ఏదో ఒకటి ఉంది కాబట్టే అతడిని తప్పించారు. ఇప్పుడు కొత్త డ్రైవర్‌ను తీసుకొస్తారు. అతడే రెండో డ్రైవరంటూ ఒక పద్ధతి ప్రకారం బస్సు యాజమాన్యాన్ని కాపాడే ప్రయత్నం జరుగుతోంది. ఇంతకంటే దారుణం ఇంకేదైనా ఉంటుందా?

తప్పు చేసిన వారిని ప్రశ్నించాలి
మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, రూ.5 లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని అంటున్నారు. ఇది సరైంది కాదు. బస్సు యాజమాన్యం నుంచి రూ.20 లక్షలకు తక్కువ కాకుండా పరిహారం ఇప్పిస్తేనే ఇలాంటి ప్రమాదాలు ఆగుతాయి. లేకపోతే భవిష్యత్తులోనూ పునరావృతం అవుతూనే ఉంటాయి. ట్రావెల్స్‌ యాజమాన్యాలను ప్రభు త్వం ఇలాగే రక్షిస్తూ పోతే రేపు ఇంకెంతో మంది బలయ్యే ప్రమాదం ఉంది. ప్రజల ప్రాణాలను మింగేస్తున్న బస్సు ప్రమాదాలు జరిగినప్పుడు మౌనంగా ఉండిపోవద్దు. పోలీసులు లోతుగా విచారణ చేపట్టాలి. తప్పు చేసిన వారిని ప్రశ్నిం చాలి. మృతుల కుటుంబాలకు యాజమాన్యాల నుంచి కనీసం రూ.20 లక్షల చొప్పున పరిహారం ఇప్పించాలి. రాజకీయాలను పక్కనపెట్టి మానవత్వంతో ఆలోచించాలి. మృతుల కుటుంబాలకు అందరూ తోడుగా నిలవాలి’’ అని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.  

లైసెన్స్‌ ఉందో లేదో కూడా చూడరు
గతంలో కూడా కేశినేని ట్రావెల్స్, దివాకర్‌ ట్రావెల్స్‌ బస్సులు ప్రమాదాల కు కారణమయ్యాయి. ఈ ట్రావెల్స్‌ యజమానులు అధికార తెలుగుదేశం పార్టీ ఎంపీలే. వీరికి సీఎం చంద్రబాబు దగ్గరుండి మరీ అండగా నిలుసు ్తన్నారు. అందుకే నిబంధనలు ఎక్కడా అమలు కావడం లేదు. ఒకే బస్సు పర్మిట్‌తో మూడు నాలుగు బస్సులు తిప్పుతున్నారు. కాంట్రాక్టు క్యారియర్‌కు అనుమతి తీసుకొని, నిబం ధనలకు విరుద్ధంగా స్టేజ్‌ క్యారియర్‌ కింద బస్సులు నడిపిస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ నిలిపేస్తూ ప్రయాణికు లను ఎక్కించుకుంటున్నారు. డ్రైవర్లు మద్యం సేవించి నిర్లక్ష్యంగా బస్సు నడిపినా పట్టించుకునేవారే ఉండరు. వారికి కనీసం లైసెన్స్‌ ఉందో లేదో కూడా చూడరు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement