Ramalingeswara rao
-
జస్టిస్ రామలింగేశ్వర్రావు కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: జస్టిస్ ఎ.రామలింగేశ్వర్రావు గుండె పోటు తో కన్ను మూశారు. జర్మనీలో ఉన్న కూతురును చూడడానికి వెళ్లగా శుక్రవారం ఉదయం ఒక్కసారిగా రామలింగేశ్వర్‌రావుకు ఛాతీలో నొప్పి వచ్చింది. వెంటనే ఆస్ప త్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆయన మృతదేహాన్ని హైదరాబాద్‌కు తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. 1956, మే 21న ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో ఆయన జన్మించారు. ఉస్మానియా నుంచి ఎల్ఎల్ఎం పూర్తి చేసిన ఆయన 1982లో న్యాయవాదిగా నమోదు చేసుకు న్నారు. 1984లో జస్టిస్ ఏ.వెంకట్రామిరెడ్డి వద్ద జూనియర్‌గా చేరి 1987లో స్వతంత్ర న్యాయ వాదిగా ప్రాక్టీస్ ప్రారంభించారు. న్యాయవాదిగా కొనసాగుతూనే ఉస్మానియాలో పార్ట్‌టైమ్ లెక్చరర్‌గా పీజీ విద్యార్థులకు ఇంటర్నేషనల్ లా పాఠాలు చెప్పారు. 2013లో న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టే వరకు సామాజిక న్యాయం, పర్యావరణంతోపాటు పలు విభాగాల్లో సమర్థవంతమైన న్యాయవాదిగా వాదనలు వినిపించారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని అడవుల రక్షణకు వాదించిన కేసు దేశమంతటా ‘సమత’ కేసుగా ప్రసిద్ధి చెందింది. ప్రభుత్వ న్యాయవాదిగా, టీటీడీ, ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ తదితరాలకు న్యాయవాదిగా పనిచేశారు. సాహిత్యం, కళలపై ఆయనకు మక్కువ ఎక్కువ. విపరీతంగా పుస్తకాలు చదవడంతో పాటు రాయడం అలవాటు. న్యాయమూర్తిగా దాదాపు 13 వేల తీర్పులు ఇచ్చారు. వీటిలో 100కు పైగా లా జర్నల్‌లో ప్రచురితం కావడం విశేషం. 2018లో న్యాయమూర్తిగా పదవీ విరమణ పొందారు. అనంతరం ఏపీ ప్రభుత్వం ఆయన్ను స్కూల్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ చైర్మన్‌గా నియమించింది. -
అదనపు జడ్జిగా జస్టిస్ రామలింగేశ్వరరావు కొనసాగింపు
ఎన్‌జేఏసీపై తీర్పు వాయిదా నేపథ్యంలో పొడిగింపు దేశంలోని అదనపు న్యాయమూర్తులందరికీ ఇదే వర్తింపు సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టు అదనపు న్యాయమూర్తి జస్టిస్ ఆశపు రామలింగేశ్వరరావుకు అదనపు జడ్జిగా మూడు నెలల పొడిగింపు లభించింది. ఈ నెల 21 నుంచి మూడు నెలల పాటు ఆయన హైకోర్టు అదనపు జడ్జిగా కొనసాగుతారు. వాస్తవానికి అదనపు న్యాయమూర్తిగా పదవీ కాలం పూర్తి చేసుకున్న వెంటనే ప్రతీ న్యాయమూర్తి శాశ్వత న్యాయమూర్తిగా నియమితులవుతారు. అయితే ప్రస్తుతం సుప్రీంకోర్టు కొలీజియం వ్యవస్థ లేకపోవడం, దాని స్థానంలో ఏర్పాటైన జాతీయ న్యాయమూర్తులు నియామకపు కమిషన్ (ఎన్‌జేఏసీ)పై సుప్రీంకోర్టు తీర్పును వాయిదా వేసిన నేపథ్యంలో శాశ్వత న్యాయమూర్తి నియామకపు ఉత్తర్వులను రాష్ట్రపతి జారీ చేయలేదు. అలాగే ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులై బదిలీపై కేరళ హైకోర్టుకు వెళ్లిన జస్టిస్ దామా శేషాద్రి నాయుడుకు సైతం అదనపు న్యాయమూర్తిగా పొడిగింపు లభించింది. జాతీయ న్యాయమూర్తుల నియామకపు కమిషన్ వ్యవహారం సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నందున దేశవ్యాప్తంగా అదనపు న్యాయమూర్తులుగా నియమితులైన వారందరికీ మూడు నెలల పాటు పొడిగింపు లభించింది. -
రామలింగేశ్వరరావు, శేషాద్రినాయుడు అదనపు జడ్జీలుగా ప్రమాణం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా ఎ.రామలింగేశ్వరరావు, దామా శేషాద్రినాయుడు ప్రమాణం చేశారు. శనివారం ఉదయం 10.30 గంటలకు మొదటి కోర్టు హాలులో అట్టహా సంగా జరిగిన కార్యక్రమంలో వీరిద్దరితో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా ప్రమా ణం చేయించారు. సీనియారిటీ ప్రకారం మొదట రామలింగేశ్వరరావు ప్రమాణం చేయగా, తరువాత శేషాద్రినాయుడు ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, రిజిష్ట్రార్లు, అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్‌రెడ్డి, అదనపు ఏజీలు, లాయర్ల సంఘం అధ్యక్షుడు ఎ.గిరిధరరావు, పలువురు లాయర్లు, ప్రమాణం చేసిన ఇరువురు న్యాయమూర్తుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ప్రమా ణం అనంతరం భోజన విరామ సమయంలో ఈ ఇద్దర్నీ పలువురు న్యాయవాదులు అభినందించారు. జస్టిస్ అశుతోష్ మొహంతతో కలిసి జస్టిస్ రామలింగేశ్వరరావు కేసుల్ని విచారించగా, జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డితో కలిసి జస్టిస్ శేషాద్రినాయుడు వాదనలు విన్నారు. వీరిద్దరూ రెండేళ్లపాటు అదనపు జడ్జీలుగా కొనసాగుతారు. ఆ తరువాత శాశ్వత న్యాయమూర్తులవుతారు. వీరిద్దరి నియామకంతో హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 25కు చేరింది. భర్తీ కావాల్సిన పోస్టులు ఇంకా 24 ఉన్నాయి. -
హైకోర్టుకు ఇద్దరు కొత్త జడ్జిలు
అద నపు న్యాయమూర్తులుగా రేపు రామలింగేశ్వరరావు, శేషాద్రి నాయుడు ప్రమాణం సాక్షి, న్యూఢిల్లీ, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా అసపు రామలింగేశ్వరరావు, దామా శేషాద్రి నాయుడులు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరిద్దరు రాష్ట్ర హైకోర్టులో న్యాయవాదులుగా పనిచేస్తున్నారు. బాధ్యతలు స్వీకరించిన రోజునుంచి రెండేళ్లపాటు వీరిద్దరు అదనపు న్యాయమూర్తులుగా ఉంటారని కేంద్ర న్యాయశాఖ గురువారం రాత్రి ఢిల్లీలో విడుదల చేసిన ఒక అధికార ప్రకటనలో పేర్కొంది. కాగా, శనివారం ఉదయం హైకోర్టు మొదటి కోర్టు హాలులో జరిగే కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా వీరిద్దరి చేత న్యాయమూర్తులుగా ప్రమాణం చేయించనున్నారు. గురువారం ఉత్తర్వులు అందుకున్న వెంటనే వీరిద్దరూ ప్రధాన న్యాయమూర్తిని మర్యాదపూర్వకంగా కలిశారు. సాహిత్యాభిమాని రామలింగేశ్వరరావు రామలింగేశ్వరరావు 1956 మే 21న పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలులో జన్మించారు.చిన్నప్పటి నుంచి చదువులో ముందుండేవారు.ఇంటర్ వరకు తణుకులో చదివారు. భీమరంలోని డీఎన్ఆర్ కాలేజీ నుంచి డిగ్రీ పూర్తి చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎల్.ఎల్.బి, ఎల్.ఎల్.ఎం డిగ్రీలు సాధించారు.కొంతకాల ం పార్ట్‌టైమ్ లెక్చరర్‌గా పీజీ విద్యార్థులకు ‘ఇంటర్నేషనల్ లా’ లో పాఠాలు బోధించారు. 1982లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. 1984లో జస్టిస్ ఎ.వెంకటరామిరెడ్డి వద్ద జూనియర్‌గా చేరారు. వెంకటరామిరెడ్డి న్యాయమూర్తి అయిన తరువాత రామలింగేశ్వరరావు స్వతంత్రంగా ప్రాక్టీస్ చేపట్టి,పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలను వాదించారు. మెడికల్ కాలేజీల్లో ఫీజులు, మద్య నిషేధం, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన కేసులను ఆయన వాదించారు. ప్రభుత్వ న్యాయవాదిగా, పలు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు న్యాయసలహాదారుగా వ్యవహరించారు. సాహిత్యం పట్ల ఎంతో మక్కువ ఉన్న రామలింగేశ్వరరావుకు, సాహిత్య వేదిక యువభారతితో ఎంతో అనుబంధం ఉంది. విజయవాడ నుంచి ప్రచురితమవుతున్న ‘నడుస్తున్న చరిత్ర’ మాస పత్రికకు కాలమిస్ట్‌గా వ్యవహరించారు. వ్యవసాయ కుటుంబం నుంచి శేషాద్రినాయుడు దామా శేషాద్రినాయుడు 1962 జూన్ 19న చిత్తూరు జిల్లా, తిరుపతి రూరల్ మండలం, గంగనగుంట గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. పాఠశాల విద్య మొత్తం తిరుచానూర్‌లో సాగింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి బి.ఎ. డిగ్రీ, ఎస్.వి.యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ సాధించారు. 1997లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. తిరుపతిలో సీనియర్ న్యాయవాది ఐ.గురుస్వామి వద్ద జూనియర్‌గా చేరారు. తరువాత తన ప్రాక్టీస్‌ను హైదరాబాద్‌కు మార్చారు. పలు కార్పొరేట్ సంస్థలకు, జాతీయ బ్యాంకులకు న్యాయవాదిగా వ్యవహరించారు. రాష్ట్ర జ్యుడీషియల్ అకాడమీలో గత ఐదేళ్లుగా గెస్ట్ ఫ్యాకల్టీగా పాఠాలు బోధిస్తున్నారు.