సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా ఎ.రామలింగేశ్వరరావు, దామా శేషాద్రినాయుడు ప్రమాణం చేశారు. శనివారం ఉదయం 10.30 గంటలకు మొదటి కోర్టు హాలులో అట్టహా సంగా జరిగిన కార్యక్రమంలో వీరిద్దరితో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా ప్రమా ణం చేయించారు. సీనియారిటీ ప్రకారం మొదట రామలింగేశ్వరరావు ప్రమాణం చేయగా, తరువాత శేషాద్రినాయుడు ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, రిజిష్ట్రార్లు, అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్‌రెడ్డి, అదనపు ఏజీలు, లాయర్ల సంఘం అధ్యక్షుడు ఎ.గిరిధరరావు, పలువురు లాయర్లు, ప్రమాణం చేసిన ఇరువురు న్యాయమూర్తుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
ప్రమా ణం అనంతరం భోజన విరామ సమయంలో ఈ ఇద్దర్నీ పలువురు న్యాయవాదులు అభినందించారు. జస్టిస్ అశుతోష్ మొహంతతో కలిసి జస్టిస్ రామలింగేశ్వరరావు కేసుల్ని విచారించగా, జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డితో కలిసి జస్టిస్ శేషాద్రినాయుడు వాదనలు విన్నారు. వీరిద్దరూ రెండేళ్లపాటు అదనపు జడ్జీలుగా కొనసాగుతారు. ఆ తరువాత శాశ్వత న్యాయమూర్తులవుతారు. వీరిద్దరి నియామకంతో హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 25కు చేరింది. భర్తీ కావాల్సిన పోస్టులు ఇంకా 24 ఉన్నాయి.