Seshadri Naidu
-
AP: న్యాయమూర్తి నుంచి న్యాయవాదిగా..
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని వివిధ హైకోర్టుల్లో న్యాయమూర్తిగా పనిచేసి ఇటీవల రాజీనామా చేసిన జస్టిస్ దామా శేషాద్రినాయుడు మళ్లీ న్యాయవాది వృత్తిలోకి అడుగుపెట్టారు. చిత్తూరు జిల్లాకు చెందిన జస్టిస్ శేషాద్రినాయుడు 1997లో ఏపీ బార్ కౌన్సిల్లో సభ్యునిగా చేరారు. హైకోర్టులో సివిల్, క్రిమినల్ కేసులు వాదించారు. 2013లో ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. అనంతరం కేరళ, ముంబై హైకోర్టుల్లో విధులు నిర్వర్తించారు. 2021 ఆగస్టు 12న హైకోర్టు న్యాయమూర్తిగా రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మళ్లీ న్యాయవాద వృత్తిలోకి వచ్చిన జస్టిస్ నాయుడు సుప్రీంకోర్టులో ప్రాక్టీసు ప్రారంభించారు. సోమవారం ఓ కేసులో జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ బీవీ నాగరత్నలతో కూడిన ధర్మాసనం ముందు వాదనలు వినిపించారు. -
రామలింగేశ్వరరావు, శేషాద్రినాయుడు అదనపు జడ్జీలుగా ప్రమాణం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా ఎ.రామలింగేశ్వరరావు, దామా శేషాద్రినాయుడు ప్రమాణం చేశారు. శనివారం ఉదయం 10.30 గంటలకు మొదటి కోర్టు హాలులో అట్టహా సంగా జరిగిన కార్యక్రమంలో వీరిద్దరితో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా ప్రమా ణం చేయించారు. సీనియారిటీ ప్రకారం మొదట రామలింగేశ్వరరావు ప్రమాణం చేయగా, తరువాత శేషాద్రినాయుడు ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, రిజిష్ట్రార్లు, అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్‌రెడ్డి, అదనపు ఏజీలు, లాయర్ల సంఘం అధ్యక్షుడు ఎ.గిరిధరరావు, పలువురు లాయర్లు, ప్రమాణం చేసిన ఇరువురు న్యాయమూర్తుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ప్రమా ణం అనంతరం భోజన విరామ సమయంలో ఈ ఇద్దర్నీ పలువురు న్యాయవాదులు అభినందించారు. జస్టిస్ అశుతోష్ మొహంతతో కలిసి జస్టిస్ రామలింగేశ్వరరావు కేసుల్ని విచారించగా, జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డితో కలిసి జస్టిస్ శేషాద్రినాయుడు వాదనలు విన్నారు. వీరిద్దరూ రెండేళ్లపాటు అదనపు జడ్జీలుగా కొనసాగుతారు. ఆ తరువాత శాశ్వత న్యాయమూర్తులవుతారు. వీరిద్దరి నియామకంతో హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 25కు చేరింది. భర్తీ కావాల్సిన పోస్టులు ఇంకా 24 ఉన్నాయి. -
హైకోర్టుకు 10 మంది కొత్త న్యాయమూర్తులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి చెందిన పది మంది సీనియర్ న్యాయవాదులు, జిల్లా జడ్జిలను రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించేందుకు రంగం సిద్ధమైంది. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని కొలీజియం పంపిన సిఫారసులకు సుప్రీంకోర్టు ఆమోదం తెలిపినట్లు విశ్వసనీయంగా తెలిసింది. హైకోర్టులో న్యాయవాదులుగా ఉన్న దామా శేషాద్రినాయుడు, ఎ.రామలింగేశ్వరరావులతోపాటు జిల్లా జడ్జిలుగా పనిచేస్తున్న 9 మందిని హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలని కొలీజియం సిఫారసు చేసినట్లు తెలిసింది. ఈ సిఫారసులను పరిశీలించిన సుప్రీంకోర్టు శేషాద్రినాయుడు, రామలింగేశ్వరరావుతోపాటు 8 మంది జిల్లా జడ్జిలను హైకోర్టు న్యాయమూర్తులుగా నియామకానికి ఆమోదం తెలిపినట్లు సమాచారం. అనంతరం ఫైలు కేంద్ర న్యాయశాఖకు చేరింది. కేంద్ర న్యాయ శాఖ వర్గాలు నిబంధనల ప్రకారం శేషాద్రినాయుడు, రామలింగేశ్వరరావుల అంగీకారాన్ని కోరాయి. న్యాయమూర్తులుగా బాధ్యతలు చేపట్టేందుకు వారిద్దరూ గురువారం తమ అంగీకారాన్ని తెలిపారు. ప్రధాన మంత్రి, రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయగానే, న్యాయమూర్తులుగా వీరి నియామకంపై కేంద్ర న్యాయ శాఖ నోటిఫికేషన్ జారీ చేస్తుంది. శేషాద్రినాయుడు చిత్తూరు జిల్లాకు, రామలింగేశ్వరరావు పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకు చెందిన వారు.