హైకోర్టుకు ఇద్దరు కొత్త జడ్జిలు | Two Judges appointed as additonal Jugde to Highcourt | Sakshi
Sakshi News home page

హైకోర్టుకు ఇద్దరు కొత్త జడ్జిలు

Published Fri, Sep 20 2013 2:19 AM | Last Updated on Sat, Jun 2 2018 6:05 PM

Two Judges appointed as additonal Jugde to Highcourt

అద నపు న్యాయమూర్తులుగా రేపు రామలింగేశ్వరరావు, శేషాద్రి నాయుడు ప్రమాణం
 సాక్షి, న్యూఢిల్లీ, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా అసపు రామలింగేశ్వరరావు, దామా శేషాద్రి నాయుడులు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరిద్దరు రాష్ట్ర హైకోర్టులో న్యాయవాదులుగా పనిచేస్తున్నారు.
 
  బాధ్యతలు స్వీకరించిన రోజునుంచి రెండేళ్లపాటు వీరిద్దరు అదనపు న్యాయమూర్తులుగా ఉంటారని కేంద్ర న్యాయశాఖ గురువారం రాత్రి ఢిల్లీలో విడుదల చేసిన ఒక అధికార ప్రకటనలో పేర్కొంది. కాగా, శనివారం ఉదయం హైకోర్టు మొదటి కోర్టు హాలులో జరిగే కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా వీరిద్దరి చేత న్యాయమూర్తులుగా ప్రమాణం చేయించనున్నారు. గురువారం ఉత్తర్వులు అందుకున్న వెంటనే వీరిద్దరూ ప్రధాన న్యాయమూర్తిని మర్యాదపూర్వకంగా కలిశారు.
 
 సాహిత్యాభిమాని రామలింగేశ్వరరావు
 రామలింగేశ్వరరావు 1956 మే 21న పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలులో జన్మించారు.చిన్నప్పటి నుంచి చదువులో ముందుండేవారు.ఇంటర్ వరకు తణుకులో చదివారు. భీమరంలోని డీఎన్‌ఆర్ కాలేజీ నుంచి డిగ్రీ పూర్తి చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎల్.ఎల్.బి, ఎల్.ఎల్.ఎం డిగ్రీలు సాధించారు.కొంతకాల ం పార్ట్‌టైమ్ లెక్చరర్‌గా పీజీ విద్యార్థులకు ‘ఇంటర్నేషనల్ లా’ లో పాఠాలు బోధించారు. 1982లో న్యాయవాదిగా ఎన్‌రోల్ అయ్యారు. 1984లో జస్టిస్ ఎ.వెంకటరామిరెడ్డి వద్ద జూనియర్‌గా చేరారు.
 
 వెంకటరామిరెడ్డి న్యాయమూర్తి అయిన తరువాత రామలింగేశ్వరరావు స్వతంత్రంగా ప్రాక్టీస్ చేపట్టి,పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలను వాదించారు. మెడికల్ కాలేజీల్లో ఫీజులు, మద్య నిషేధం, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన కేసులను ఆయన వాదించారు. ప్రభుత్వ న్యాయవాదిగా, పలు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు న్యాయసలహాదారుగా వ్యవహరించారు. సాహిత్యం పట్ల ఎంతో మక్కువ ఉన్న రామలింగేశ్వరరావుకు, సాహిత్య వేదిక యువభారతితో ఎంతో అనుబంధం ఉంది. విజయవాడ నుంచి ప్రచురితమవుతున్న ‘నడుస్తున్న చరిత్ర’ మాస పత్రికకు కాలమిస్ట్‌గా వ్యవహరించారు.
 
 వ్యవసాయ కుటుంబం నుంచి శేషాద్రినాయుడు
 దామా శేషాద్రినాయుడు 1962 జూన్ 19న చిత్తూరు జిల్లా, తిరుపతి రూరల్ మండలం, గంగనగుంట గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. పాఠశాల విద్య మొత్తం తిరుచానూర్‌లో సాగింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి బి.ఎ. డిగ్రీ, ఎస్.వి.యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ సాధించారు. 1997లో న్యాయవాదిగా ఎన్‌రోల్ అయ్యారు. తిరుపతిలో సీనియర్ న్యాయవాది ఐ.గురుస్వామి వద్ద జూనియర్‌గా చేరారు. తరువాత తన ప్రాక్టీస్‌ను హైదరాబాద్‌కు మార్చారు. పలు కార్పొరేట్ సంస్థలకు, జాతీయ బ్యాంకులకు న్యాయవాదిగా వ్యవహరించారు. రాష్ట్ర జ్యుడీషియల్ అకాడమీలో గత ఐదేళ్లుగా గెస్ట్ ఫ్యాకల్టీగా పాఠాలు బోధిస్తున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement