సాక్షి, గుంటూరు: స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత.. ఆయన పిటిషన్‌లను విచారించిన జడ్జిలపై రాజకీయపరంగా.. ఉద్దేశపూర్వకంగానే దూషణల పర్వం కొనసాగిందని ఏపీ ప్రభుత్వం కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ఈ మేరకు ఏపీ హైకోర్టులో ఇవాళ క్రిమినల్ కంటెంప్ట్ పిటిషన్‌పై విచారణ జరిగింది. పిటిషన్‌పై విచారణ నేపథ్యంలో.. టీడీపీ నేత బుద్దా వెంకన్న, గోరంట్ల బుచ్చయ్య చౌదరీ సహా 26 మందికి నోటీసులు జారీ చేయాలని బుధవారం హైకోర్టు ఏపీ డీజీపీని ఆదేశించింది.
క్రిమినల్ కంటెంప్ట్ పిటిషన్‌పై వాదనల సందర్భంగా.. ‘‘క్యాంపెయిన్‌గా జడ్జిపై ట్రోలింగ్ చేశార’’ని అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ తెలిపారు. ఇద్దరు హైకోర్టు జడ్జీలు, ఏసీబీ జడ్జి ఫ్యామిలీ టార్గెట్‌గా ట్రోలింగ్ నడిచిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారాయన. దీంతో ట్రోల్ చేసిన సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించి.. ఆ 26 మందికి నోటీసులు ఇవ్వాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది ఏపీ హైకోర్టు. తదుపరి చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రీని ఆదేశిస్తూ.. నాలుగు వారాలకు పిటిషన్‌పై విచారణ వాయిదా వేసింది హైకోర్టు.
యెల్లో బ్యాచ్‌తో పాటు
చంద్రబాబు అరెస్ట్ తర్వాత హైకోర్టు, దిగువ కోర్టు జడ్జిలపై దూషణల పర్వం కొనసాగింది. టీడీపీ నేతలు, చంద్రబాబు సానుభూతి పరులు న్యాయవ్యవస్థపై దుర్మార్గపు వ్యాఖ్యలు చేశారు. న్యాయమూర్తులపై నిందలు, ఆరోపణలు, విమర్శలు చేసింది పచ్చ మీడియా. దీంతో ఈ వ్యవహారంలో బుద్దా వెంకన్న సహా 26 మంది ప్రతివాదులుగా చేర్చింది ప్రభుత్వం. బుద్దా వెంకన్నతో పాటు ఎస్. రామకృష్ణ, మరికొన్ని సోషల్ మీడియా పేజీల నిర్వాహకులకు పరిశీలన తర్వాత నోటీసులు జారీ కానున్నాయి. అలాగే ప్రతివాదులుగా ఉన్న గూగుల్, ఎక్స్(ట్విటర్), ఫేస్‌బుక్‌కు కూడా నోటీసులు ఇవ్వాలని హైకోర్టు స్పష్టం చేసింది.
మహాదారుణంగా..
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబును ఏపీ సీఐడీ అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరిచింది. కోర్టులో 10 గంటల వాదనల తరువాత చంద్రబాబుకు రిమాండ్ విధించింది. ఆపై హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేయగా.. దానిని హైకోర్టు కొట్టేసింది. అయితే ఈ తీర్పులను ఇచ్చిన జడ్జీలను సామాజిక మాధ్యమాల వేదికగా వికృత రూపాల్లో తూలనాడుతూ పోస్టులు వెల్లువెడ్డాయి.
రాష్ట్రపతి కార్యాలయం స్పందన
మరోవైపు జడ్జీలపై అభ్యంతరకర పోస్టులపై రాష్ట్రపతి భవన్ పై స్పందించి పోస్ట్ లు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాష్ట్రపతి కార్యాలయం లేఖ రాసింది. తదనంతరం హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది ప్రభుత్వం. ప్రభుత్వం తరపున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించారు.
Comments
Please login to add a commentAdd a comment