న్యూఢిల్లీ: జాతీయ న్యాయ నియామకాల కమిషన్ (ఎన్‌జేఏసీ) రాజ్యాంగ చెల్లుబాటుపై వివాదం పరిష్కారమయ్యే వరకూ.. ఆ కమిషన్ ఉన్నత న్యాయవ్యవస్థలో ఎటువంటి నియామకాలూ చేపట్టబోదని కేంద్ర ప్రభుత్వం గురువారం సుప్రీంకోర్టుకు నివేదించింది. ఈ వివాదం పెండింగ్‌లో ఉండగా పదవీ కాలం ముగిసే హైకోర్టుల ప్రస్తుత అదనపు న్యాయమూర్తుల నియామకాలను మాత్రమే ఈ కమిషన్ చేపట్టాలని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా నిర్దేశించింది.
ఎన్‌జేఏసీ చట్టం చెల్లుబాటుపై పలు అవాంతరాల అనంతరం జస్టిస్ జె.ఎస్.ఖేహర్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం గురువారం ప్రాధమికంగా విచారణ చేపట్టింది. అటార్నీ జనరల్ ముకుల్ రోహ్తగి బదులిస్తూ.. కమిషన్ చెల్లుబాటుపై వివాదం పరిష్కారమయ్యే వరకూ ఎన్‌జేఏసీ ఎటువంటి నియామకాలూ చేపట్టబోదన్నారు.