ఎన్‌జేఏసీ చెల్లదు
అది రాజ్యాంగవిరుద్ధం; ఆ చట్టాన్ని రద్దు చేస్తున్నాం: సుప్రీం
రాజ్యాంగ మౌలిక స్వరూపానికది విరుద్ధం
* ఆ చట్టంతో రాజ్యాంగంలోని అధికార విభజన నిబంధనల ఉల్లంఘన
* మళ్లీ అమల్లోకి కొలీజియం; కోర్టు సంచలన తీర్పు
* ఎన్‌జేఏసీని సమర్థించిన జస్టిస్ చలమేశ్వర్.. కానీ, మెజారిటీకే మొగ్గు..
* విచారణను విస్తృత బెంచ్‌కి నివేదించాలన్న కేంద్రం అభ్యర్థన తిరస్కరణ
న్యూఢిల్లీ: ఎన్డీయే ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ. మోదీ సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన జాతీయ న్యాయ నియామకాల సంస్థ(నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్‌మెంట్స్ కమిషన్-ఎన్‌జేఏసీ) చెల్లనేరదంటూ శుక్రవారం సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది.
2014లో పార్లమెంటు ఏకగ్రీవంగా ఆమోదించిన ఎన్‌జేఏసీ చట్టం, సంబంధిత 99వ రాజ్యాంగ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధమని తేల్చిచెప్పింది. సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో జడ్జీల నియామకం, బదిలీలకు సంబంధించి గతంలో అమల్లో ఉన్న కొలీజియం వ్యవస్థకు మళ్లీ ప్రాణప్రతిష్ట చేసింది. ‘రాజ్యాంగ(99వ సవరణ) చట్టం-2014 రాజ్యాంగ విరుద్ధం. అది చెల్లనేరదు. అలాగే, ఎన్‌జేఏసీ కూడా రాజ్యాంగ విరుద్ధమని, చెల్లనేరదని ప్రకటిస్తున్నాం. ఉన్నత న్యాయస్థానాల్లో జడ్జీల నియామకం, బదిలీలకు సంబంధించి ఈ చట్టాల కన్నాముందు నాటి వ్యవస్థ(కొలీజియం)నే అమల్లో ఉంటుంది’ అని తీర్పునిచ్చింది. విచారణను మరింత విస్తృత ధర్మాసనం మందుకు తీసుకువెళ్లాలన్న కేంద్రం అభ్యర్థనను తోసిపుచ్చింది.
కేంద్రం తీసుకువచ్చిన 99వ రాజ్యాంగ సవరణ చట్టం, తదనుగుణంగా వచ్చిన ఎన్‌జేఏసీ చట్టం.. ఈ రెండూ రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మారుస్తున్నాయంటూ వాటి రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ అనంతరం ధర్మాసనం పై తీర్పునిచ్చింది. ఈ తీర్పుతో న్యాయవ్యవస్థకు, కార్యనిర్వాహక వ్యవస్థకు మధ్య పోరు మరో ఆసక్తికర మలుపు తీసుకుంది. తీర్పుపై రాజకీయ, న్యాయ, ప్రభుత్వ రంగాల నుంచి భిన్న స్పందనలు వచ్చాయి. ఈ తీర్పు తనను విస్మయానికి గురిచేసిందన్న కేంద్ర న్యాయశాఖ మంత్రి డీవీ సదానంద గౌడ.. దీనిపై ప్రధాని మోదీ, ఇతర కేబినెట్ సహచరులతో చర్చించిన అనంతరం ప్రభుత్వపరంగా తదుపరి కార్యాచరణను నిర్ణయిస్తామన్నారు.
కొలీజియం అనేది అసలు రాజ్యాంగంలో లేనేలేదని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ వ్యాఖ్యానించారు. ఎన్‌జేఏసీ చట్టాన్ని రద్దు చేస్తూ జస్టిస్ జేఎస్ ఖేహర్ నేతృత్వంలో జస్టిస్ ఎంబీ లోకుర్, జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయెల్, జస్టిస్ జాస్తి చలమేశ్వర్ సభ్యులుగా ఉన్న ఐదుగురు సభ్యుల రాజ్యాంగ బెంచ్ 1,030 పేజీలతో తుది తీర్పునిచ్చింది. జస్టిస్ చలమేశ్వర్ మాత్రం మిగతా నలుగురితో విభేదించి, 99వ సవరణ చట్టబద్ధతను సమర్థించారు. కానీ మెజారిటీ నిర్ణయాన్ని దృష్టిలో పెట్టుకుని బెంచ్ తుది తీర్పుకు కట్టుబడి ఉన్నారు.
ఈ అంశాన్ని 9 లేక 11 మంది సభ్యుల విస్తృత ధర్మాసనానికి నివేదించాలన్న అభ్యర్థనను, గతంలో వచ్చిన ‘రెండో జడ్జీల కేసు(1993), మూడో జడ్జీల కేసు(1998)’లను పునః సమీక్షించాలన్న అభ్యర్థనను కూడా బెంచ్ తిరస్కరించింది. కొలీజియాన్ని మరింత మెరుగుపర్చే సూచనలు స్వీకరించేందుకు ఉద్దేశించిన విచారణను నవంబర్ 3కు వాయిదా వేసింది.కొలీజియాన్ని సమర్థంగా తీర్చిదిద్దేందుకు సహకరించాలని ప్రభుత్వాన్ని, సీనియర్ లాయర్లను జస్టిస్ ఖేహర్ కోరారు. ఎన్‌జేఏసీలో ఇద్దరు ప్రముఖులకు స్థానం కల్పించడం రాజ్యాంగవిరుద్ధమని, రాజ్యాంగ మౌలిక స్వరూపానికే అది వ్యతిరేకమని ఆయన తీర్పులో పేర్కొన్నారు.
‘జడ్జీల నియామక అధికారాన్ని ఎలాంటి పరిమితులు లేకుండా కార్యనిర్వాహక వర్గం లేదా ప్రభుత్వానికి అప్పజెప్పడం ప్రమాదకరమని రాజ్యాంగ పరిషత్‌లో అంబేద్కర్ చేసిన హెచ్చరికను ప్రస్తావించారు. రాజ్యాంగంలోని 124, 217 అధికరణాల్లో పేర్కొన్న ‘సంప్రదింపులు’ అనే పదం కార్యానిర్వాహక వర్గ అధికారాల కుదింపునకు ఉద్దేశించినదేనని వివరించారు. తమకున్న వీటో అధికారంతో, ఎలాంటి కారణం చూపకుండానే ఆ ఇద్దరిలో ఎవరైనా నియామక ప్రక్రియను అడ్డుకునే అవకాశముందని జస్టిస్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘అది ఎలాంటి జవాబుదారీతనం లేని అధికారం’ అని వ్యాఖ్యానించారు.
ఖేహర్ భావోద్వేగం.. తీర్పు వెలువరించేముందు జస్టిస్ ఖేహర్ కాస్త భావోద్వేగానికి గురయ్యారు. ఈ కేసు విచారణలో సహకరించిన న్యాయవాదులకు కృతజ్ఞతలు తెలిపారు. ‘ఈ ఐదుగురు సభ్యుల బెంచ్‌లో భాగం పంచుకోవాలన్న నిర్ణయం హృదయంతో కాదు.. ఆలోచనతో తీసుకున్నది. అది నేను నా సొంత నిర్ణయం’ అన్నారు. గతంలో అమల్లో ఉన్న కొలీజియంలో సభ్యుడిగా ఉన్నందువల్ల, ఎన్‌జేఏసీ అమల్లోకి వస్తే అందులోనూ భాగం పంచుకునే అవకాశమున్నందువల్ల ఈ విచారణలో పాలుపంచుకోకూడదన్న విషయంపై ఖేహర్ స్పందించారు.
ఖాళీలే... ఖాళీలు
ఎన్‌జేఏసీ ద్వారా నియామకాలు చేపట్టొద్దని ఈ ఏడాది ఏప్రిల్ 23న కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. దాంతో ఆరునెలలుగా కొత్త జడ్జీ నియామకాల్లేవు. రిటైరయ్యే వారు మాత్రం రిటైరైపోయారు. దాంతో వివిధ హైకోర్టుల్లో ఖాళీలు విపరీతంగా పెరిగిపోయాయి. కేంద్ర న్యాయశాఖ లెక్కల ప్రకారం ఈ నెల ఒకటో తేదీ నాటికి ఉన్న ఖాళీలివి...
సుప్రీంకోర్టు 3 హైకోర్టులు 406
చక్రవర్తుల్లా అధికారమిస్తోంది
‘‘ఎన్‌జేఏసీలో నియమితులయ్యే ఇద్దరు ప్రముఖులకు వీటో అధికారాన్ని కల్పించడం... వారికి చక్రవర్తుల్లా అపరిమిత అధికారాలను కట్టబెట్టడమే. ప్రజాజీవితంలో ఏ రంగంలో నుంచి వచ్చిన ప్రముఖులతోనైనా సంప్రదింపులు జరపడానికి అభ్యంతరమేమీ లేదు. అయితే జడ్జీల నియామకాలకు సంబంధించి... రాష్ట్రపతి లేదా భారత ప్రధాన న్యాయమూర్తి నిర్ణయాలను కూడా వారు వీటో చేయగలరనేదే మింగుడుపడటం లేదు. అపరిమిత అధికారాలను ఎన్‌జేఏసీ చట్టం వీరికి కట్టబెడుతోంది. పైగా ఎలాంటి జవాబుదారీతనం లేకుండా. ఏదైనా నియామకాన్ని వీటో ద్వారా అడ్డుకున్నపుడు... దానికి వీరు కారణం కూడా చెప్పనక్కర్లేదు (ఎన్‌జేఏసీలోని ఆరుగురు సభ్యుల్లో ఏ ఇద్దరు వీటో చేసినా నియామకం ఆగిపోతుంది). నామినేట్ అయ్యే ప్రముఖ వ్యక్తులను కూడా కొన్ని వర్గాల నుంచే ఎంపిక చేయాలని పరిమితం చేయడం సబబు కాదు. అయితే ఇది విధానపరమైన నిర్ణయం కాబట్టి దానిపై ఇంతకన్నా ఎక్కువ మాట్లాడలేం. అయితే పునరాలోచన చేయాలని మాత్రం చెప్పగలం’’ - సుప్రీం ధర్మాసనం
కొలీజియం పారదర్శకమే: జస్టిస్ ఖేహర్
‘‘కొలీజియంలో రహస్యం ఏమీ లేదు. అంతా పారదర్శకంగానే ఉంటుంది. న్యాయవ్యవస్థ, ప్రభుత్వ వర్గం మధ్య సంప్రదింపులు బహిరంగంగానే జరుగుతాయి. నియామకాలకు సంబంధించి ఇరువర్గాల మధ్య సౌహార్ద్రత ఉంది. ఎన్‌జేఏసీలో న్యాయవ్యవస్థకు సరైన ప్రాతినిధ్యం లేదు. అది న్యాయవ్యవస్థ సర్వోత్కృష్టతను నిలబెట్టేలా లేదు. ఇది జ్యుడీషియరీ స్వతంత్రతకు వ్యతిరేకమే. కేంద్ర న్యాయశాఖ మంత్రిని ఎన్‌జేఏసీలో సభ్యుడిగా చేర్చడం రాజ్యాంగంలో పేర్కొన్న అధికారాల విభజన నిబంధనలను ఉల్లంఘించడమే. ఎన్‌జేఏసీలో ఇద్దరు ప్రముఖులకు స్థానం కల్పించడం రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధం. రాజ్యాంగంలో చేర్చిన 124(ఏ) అధికరణలో అనేక రాజ్యాంగ ఉల్లంఘనలు ఉన్నాయి’’
ప్రాథమిక బాధ్యతకే ఎసరు: జస్టిస్ గోయెల్
భారత రాజ్యాంగం ప్రకారం జడ్జిల నియామక బాధ్యత న్యాయవ్యవస్థది. దీనికి 99వ రాజ్యాంగ సవరణ ఎసరు తెస్తోంది కనుక ఇది చెల్లదు. ఎన్‌జేఏసీ ఏర్పాటుకు భూమిక అయిన 99వ రాజ్యాంగ సవరణే చెల్లనపుడు, ఎన్‌జేఏసీ చట్టం రాజ్యాంగబద్ధతను సమీక్షించాల్సిన అవసరం ఉందని నేననుకోవడం లేదు. న్యాయ మంత్రికి సీజేఐతో సమానపాత్ర కల్పించారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుంచీ ఇలాంటిదెప్పుడూ లేదు. జడ్జిల నియామక ప్రక్రియ ప్రారంభం నుంచి, ఉత్తర్వులు ఇచ్చే దాకా న్యాయమంత్రి పాత్ర పరిమితంగానే ఉండేది. న్యాయమంత్రి, ఇద్దరు నామినేటెడ్ సభ్యులు జడ్జిల నియామకాలను తీవ్రంగా ప్రభావితం చేయగలుగుతారు. అలాంటపుడు న్యాయవ్యవస్థ స్వతంత్రతపై ప్రభావం పడుతుంది.
రాష్ట్రపతిని డమ్మీని చేస్తుంది: జస్టిస్ లోకుర్
జడ్జీల నియామకాల్లో రాష్ట్రపతి పాత్రను ఎన్‌జేఏసీ నామమాత్రం చేస్తుంది. భారత ప్రధాన న్యాయమూర్తికి రాజ్యాంగమిచ్చిన ప్రాధాన్యతను తగ్గిస్తుంది. ఎన్‌జేఏసీలో ఆరుగురు సభ్యుల్లో ఒకరిగా సీజే మారిపోతారు. రాష్ట్రపతి సీజేల మధ్య ప్రత్యక్ష సంప్రదింపులు ఉండవు. ఎన్‌జేఏసీ మధ్యవర్తిత్వం వహిస్తుంది. న్యాయవ్యవస్థ స్వతంత్రత సంక్షోభంలో పడుతుంది. ఎంపిక ప్రక్రియలో సీజేఐ ప్రాధాన్యత తగ్గిపోతుంది. రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని దెబ్బతీస్తుంది కాబట్టి 99వ రాజ్యాంగ సవరణ చెల్లదు. కొలీజియం వ్యవస్థను మరింత మెరుగ్గా, పారదర్శకంగా తీర్చిదిద్దేందుకు సలహాలు, సూచనలు స్వీకరించడానికి తదుపరి విచారణ జరగాలి.
కొలీజియం మెరుగవ్వాలి: జస్టిస్ జోసెఫ్
కొలీజియం వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం లోపించాయి. నమ్మకం సడలడం వ్యవస్థ విశ్వసనీయతను దెబ్బతీసింది. ఇది మెరుగుపడాలి. అర్హులైన వారిపై శీతకన్ను వేశారని, ఎవరి ప్రయోజనాల కోసమే... మరొకరి నియామకాన్ని ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. వీటిపై లోతుగా ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఆరోగ్యకరమైన వ్యవస్థ అయితే లేదు. అందువల్ల దీన్ని మెరుగుపర్చడానికి తదుపరి విచారణ అవసరం. 99వ రాజ్యాంగ సవరణ రాజ్యాంగవిరుద్ధం. దీని ద్వారా ఏర్పడిన ఎన్‌జేఏసీ చట్టపరంగా ఉనికిలో లేదు. ఇంకా పుట్టని బిడ్డ జాతాకాన్ని రాయడమెందుకు.
పారదర్శకత లేదు: జస్టిస్ చలమేశ్వర్
‘‘కొలీజియం వ్యవస్థలో పారదర్శకత లేదు. ఆ ప్రక్రియలో ఏం జరుగుతుందనేది ఎవరికీ తెలియదు. రాజ్యాంగబద్ధ పాలనలో పారదర్శకత అత్యంతావశ్యక అంశం. న్యాయమూర్తుల నియామకమనేది న్యాయవ్యవస్థకున్న విశేష అధికారం అని, అది రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగమని ఉన్న భావన పూర్తిగా తప్పు. గత 20 ఏళ్లుగా హైకోర్టు కొలిజియాలు ఇచ్చిన అనేక సిఫారసులను సుప్రీంకోర్టు కొలీజియం తిరస్కరించింది. ఇందులో జవాబుదారీతనం లేదు.
దీనివల్ల జ్యుడీషియరీ విశ్వసనీయత దెబ్బతింటుంది. జడ్జీల నియామక ప్రక్రియలో కార్యనిర్వాహక వర్గం పాలు పంచుకోవడం మంచిదే. అది ప్రజలెన్నుకున్న ప్రజాస్వామ్య ప్రభుత్వమే కదా. ఈ కారణాల వల్ల 99 వ రాజ్యాంగ సవరణను నేను సమర్ధిస్తున్నాను. అయితే, మెజారిటీ జడ్జీల నిర్ణయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ తీర్పును ఆమోదిస్తున్నాను. 99వ రాజ్యాంగ సవరణే అక్రమమని తేల్చిన తరువాత.. దాని పర్యవసానంగా ఉద్భవించిన ఎన్‌జేఏసీ చట్టం రాజ్యాంగబద్ధతపై చర్చించడం శుద్ధ దండుగ. ఇంకాపుట్టని పాపాయికి జాతక చక్రం రాయడమెందుకు?’’
కొలీజియం అంటే..
* రెండో జడ్జీల కేసు, మూడో జడ్జీల కేసుల పర్యవసానంగా సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో జడ్జీల నియామకం, బదిలీలకు సంబంధించి 1993లో కొలీజియం అమల్లోకి వచ్చింది.
* కొలీజియంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ), సుప్రీం కోర్టులోని నలుగురు అత్యంత సీనియర్ జడ్జీలు సభ్యులుగా ఉంటారు. హైకోర్టు స్థాయిలో హైకోర్టు చీఫ్ జస్టిస్, ఇద్దరు సీనియర్ జడ్జీలు ఉంటారు.
కొలీజియంపై అభ్యంతరాలు..
* ఇది జడ్జీలే జడ్జీలను నియమించే విధానం. నియామకాల్లో పూర్తిగా న్యాయవ్యవస్థదే అధికారం. నియామకం, బదిలీల్లో పారదర్శకత లేదు.
* సమర్థత కన్నా వ్యక్తిగత అభిప్రాయాలకు పెద్ద పీట. అవినీతికి, అవకతవకలకు ఆస్కారం.
ఎన్‌జేఏసీ అంటే..
* 2014లో ఎన్డీయే అధికారంలోకి వచ్చిన తరువాత ఉన్నత న్యాయవ్యవస్థలోని నియామకాల్లో ప్రభుత్వ ప్రాధాన్యత పెరిగేలా ఎన్‌జేఏసీని ముందుకు తెచ్చింది.
* ఎన్‌జేఏసీకి సుప్రీంకోర్టు సీజేఐ చైర్మన్‌గా ఉంటారు. ఇద్దరు సుప్రీంకోర్టు అత్యంత సీనియర్ న్యాయమూర్తులు, కేంద్ర న్యాయశాఖ మంత్రి(ఎక్స్ అఫీషియొ), ఇద్దరు ప్రముఖ వ్యక్తులు ఇందులో సభ్యులుగా ఉంటారు. ఆ ఇద్దరు ప్రముఖులను సీజేఐ, ప్రధానమంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నేతలతో కూడిన కమిటీ ఎంపిక చేస్తుంది.
ఇవీ ఎన్‌జేఏసీపై అభ్యంతరాలు..
* న్యాయవ్యవస్థ ప్రాధాన్యతను, స్వతంత్రతను తగ్గించేలా ఉంది.
* కేంద్ర న్యాయశాఖ మంత్రి, ఇద్దరు ప్రముఖులు సభ్యులుగా ఉండటం వల్ల ప్రభుత్వ జోక్యం పెరుగుతుంది.
* ఇద్దరు ప్రముఖులకు న్యాయపరమైన అవగాహన లేనట్లయితే, నియామకాల్లో వారు పోషించే పాత్ర ఏమిటి?