సొలిసిటర్ జనరల్‌గా రంజిత్ కుమార్
ఆరుగురు అదనపు ఎస్‌జీల నియామకం
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది రంజిత్ కుమార్‌ను నూతన సొలిసిటర్ జనరల్(ఎస్‌జీ)గా ప్రభుత్వం నియమించింది. రంజిత్‌కుమార్‌ను ఎస్‌జీగా నియమిస్తూ శనివారం న్యాయశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. సీనియర్ న్యాయవాదులు మనిందర్ సింగ్, తుషార్ మెహతా, ఎల్ నాగేశ్వరరావు, పీఎస్ పత్వాలియా, నీరజ్ కిషన్ కౌల్, పీఎస్ నరసింహలను అదనపు సొలిసిటర్ జనరల్ పదవుల్లో నియమించింది. వీరి నియామకాలను జూన్ 4వ తేదీనే కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదించింది. సొహ్రాబుద్దీన్ షేక్ ఎన్‌కౌంటర్ కేసు సహా పలు కేసుల్లో గుజరాత్ తరఫున సుప్రీంకోర్టులో రంజిత్‌కుమార్ వాదించారు.
ఇటీవల సంచలనం సృష్టించిన ‘స్నూప్‌గేట్’ కేసులో గూఢచర్యానికి గురైన మహిళ కుటుంబం తరఫున కూడా రంజిత్ సుప్రీంకోర్టులో వాదించారు. ఒక మహిళపై గుజరాత్ ప్రభుత్వం గూఢచర్యానికి పాల్పడిందని, అందులో ప్రస్తుత ప్రధాని, అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ హస్తం ఉందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అదే ‘స్నూప్‌గేట్’గా ప్రఖ్యాతిగాంచింది.అయితే, కేంద్ర ప్రభుత్వ అత్యున్నత న్యాయాధికారి అయిన అటార్నీ జనరల్ నియామకంపై ప్రభుత్వం ఇంతవరకు ఏ నిర్ణయం తీసుకోలేదు. ఆ పదవికి తన సమ్మతిని తెలియజేసినట్లు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ ఇటీవలే వెల్లడించారు.