ప్రేమను చంపుకోలేక..
► తిరుపతి హోటల్ గదిలో ఉరేసుకుని ప్రేమజంట ఆత్మహత్య
► అబ్బాయిది వరంగల్, అమ్మాయిది ప.గో
► కలిసి బతకడం కష్టమనే నిర్ణయంతో బలవన్మరణం
ఇదో విచిత్ర బంధం. పెద్దలు కలిపిన బంధం కాదు. వారికి వారే పెనవేసుకున్న అనురాగ బంధం. ప్రాంతాలు.. కులాలు వేరైనా మనసులు మాత్రం ఒక్కటయ్యాయి. దీంతో ఒకరినొకరు ప్రాణంగా ఇష్టపడ్డారు. కలిసి జీవించాలని కలలు కన్నారు. కానీ... అప్పటికే వివాహితులైన ఆ ఇద్దరూ సమాజానికి భయపడ్డారు. ఇదేమని ఎవరైనా అడిగితే ఏం బదులు చెప్పాలో తెలియక కలవరపడ్డారు. కలిసి బతకలేమన్న భీతితో చివరకు తనువు చాలించారు. చనిపోయేప్పుడు ఎలా ఉంటుందో తెలియదు గానీ... ప్రాణంగా ప్రేమించిన వాళ్లు పరాయి వాళ్లుగా మారుతుంటే మాత్రం ప్రాణం పోయినట్లుంటుందన్న నిర్ణయానికి వచ్చారు. ఈ నిర్ణయమే వారిని మృత్యువుకు చేరువ చేసింది. వీడలేని బంధం మాదంటూ ఒకేసారి విగతజీవులయ్యారు. ఈ సంఘటన శుక్రవారం తిరుపతిలో వెలుగు చూసింది.
తిరుపతి / తిరుపతి క్రైం : తిరుపతిలో ఓ ప్రేమజంట గురువా రం ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా.. పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం బెజవాడవారి పల్లెకి చెందిన దేవల పాపారావు, శ్రీదేవి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. రెండో కుమార్తె మౌనికకు మూడునెలల కిందటే దగ్గర బంధువుతో పెళ్లైంది. ఈ పెళ్లికి ముందు మౌనికకు రంజిత్‌తో పరిచయం ఉంది. వరంగల్ జిల్లా మోదుగులగూడెం మండలం పానరసకి చెందిన తేజావత్ రంజిత్ కుమార్ (31) వరంగల్ ఫారెస్టు డిపార్ట్‌మెంట్‌లో కాంట్రాక్టు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కొన్నాళ్ల కిందటే వివాహమై ఓ కుమార్తెను కలిగిన రంజిత్ భార్య చనిపోయింది. కాగా అడపాదడపా ఆచం ట నుంచి బంధువులున్న వరంగల్‌కు రాకపోకలు సాగించే క్రమంలో మౌనికకు రంజిత్‌తో పరిచయమైంది. ఈ పరిచయం ప్రేమగా మారింది. అయితే అప్పటికే వివాహమై కుమార్తెను కలిగి ఉన్న రంజిత్‌తో వివాహం కష్టమని నిర్ణయించుకున్న మౌనిక తల్లిదండ్రులకు ఎదురు చెప్పలేక పెద్దలు చేసిన పెళ్లికి తలొంచింది. అయితే మనసులోని రంజిత్‌ను మాత్రం మర్చిపోలేకపోయింది. జనవరి 22న ఇంటి నుంచి పారిపోయింది. అదే నెల 29వతేదీ వరకు ఆమె భర్త, తల్లిదండ్రులు గాలించినా కనబడకపోవడంతో వారి ఫిర్యాదు మేరకు ఆచంట పోలీసులు మిస్సింగ్ కేసు నమో దు చేశారు.
అనంతరం వీరిరువురూ ఈనెల 13న తిరుపతికి చేరుకుని ఆర్టీసి బస్టాండు ఎదురుగా ఉన్న ఓ ప్రముఖ హోటల్‌లో భార్యాభర్తలమని చెప్పి గదిని అద్దెకు తీసుకున్నారు. అప్పటి నుంచి తిరుమల, తిరుపతిలోని దేవాలయాలను సందర్శించారు. అయితే శుక్రవారం మధ్యాహ్నం సమయంలో రూమ్‌ను శుభ్రపరిచేందుకు రూమ్‌బాయ్ కాలింగ్ బెల్ వేశాడు. ఎంతసేపటికీ డోర్ తీయక పోవడంతో హోటల్ మేనేజర్‌కు సమాచారం అందించగా అతను పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఈస్టు సీఐ రాంకిషోర్, ఎస్‌ఐ ఘటనా స్థలం చేరుకుని గది డోర్‌ను పగులకొట్టి లోపలకు వెళ్లి చూడగా వీరిద్దరు ఒకే ఫ్యాన్‌కు ఒకరు వైరుతో, మరొకరు చున్నీతో ఉరివేసుకున్నారు. సెల్‌ఫోన్ ఆధారంగా ఇరువురి ఆచూకీ తెలుసుకుని పోలీసులు వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.