గచ్చిబౌలి (హైదరాబాద్): తాళం వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. సైబరాబాద్ క్రైం డీసీపీ బి.నవీన్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఉప్పుగూడ నివాసి కట్టెల అనూప్ కుమార్ అలియాస్ నితీష్ అలియాస్ రాజు అలియాస్ టింకు(24) ఎనిమిదేళ్లుగా దొంగతనాలకు పాల్పడుతున్నాడు. తాళం వేసిన ఇళ్లకు కన్నం వేయటం ఇతని నైజం. గత ఏడాది జూలైలో చర్లపల్లి జైలు నుంచి విడుదలై ఉప్పుగూడా రైల్వే స్టేషన్ సమీపంలో ఉండే నల్ల రంజిత్ కుమార్ (24) తో జతకట్టి మళ్లీ చోరీలకు పాల్పడుతున్నాడు.
ఈ క్రమంలో సరూర్ నగర్ సీసీఎస్ పోలీసులకు బుధవారం పట్టుబడ్డారు. ఇద్దరూ కలసి అమీర్‌పేట, సరూర్ నగర్, ఎల్‌బీ నగర్, సైదాబాద్, మలక్ పేట పోలీస్‌స్టేషన్ల పరిధిలో పగటి పూట రెక్కీ వేసి, రాత్రి వేళల్లో ఐదు చోట్ల దొంగతనాలు చేశారు. ఎల్‌బీ నగర్ పీఎస్ పరిధిలో ఐ20 కారు, సరూర్‌నగర్, బేగంపేట పీఎస్ పరిధిలో బైక్‌లను కూడా ఎత్తుకెళ్లారు. పట్టుబడిన నిందితుల నుంచి రూ.20 లక్షల విలువ చేసే 26 తులాల బంగారు ఆభరణాలు, కారు, రెండు బైక్‌లు, రెండు ల్యాప్‌టాప్‌లు, రెండు డీవీడీ ప్లేయర్లు, ఎల్‌సీడీ టీవీ, డిజిటల్ కెమెరా, హోం థియేటర్, మోటోజీ సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉండగా అనూప్ కుమార్ ఎనిమిదేళ్ల 34 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని డీసీపీ తెలిపారు. నాన్‌బెయిలబుల్ వారెంట్లున్నా తప్పించుకు తిరుగుతూ మకాంను ఉప్పుగూడలోని శివాజీనగర్‌కు మార్చాడని వెల్లడించారు.
తాళమేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీ: ఇద్దరి అరెస్టు
Published Wed, Jun 10 2015 7:36 PM | Last Updated on Sat, Aug 25 2018 6:21 PM
Advertisement