anup kumar
-
రైలు ద్వారా బల్క్ సిమెంట్ సరఫరా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సిమెంట్ సరఫరాలో సరికొత్త అధ్యాయానికి భారతి సిమెంట్, కాంకర్ గ్రూప్ నాంది పలికాయి. భారత్‌లో తొలిసారిగా రైలు ద్వారా బల్క్ సిమెంట్ సరఫరాను ప్రా రంభించాయి. ఇందుకోసం కాంకర్ గ్రూప్ రూపొం దించిన 20 అడుగుల కస్టమైజ్డ్ ట్యాంక్ కంటైనర్స్, లైనర్స్‌తో కూడిన బాక్స్ కంటైనర్స్‌ను కంపెనీ వినియోగించింది. వికా గ్రూప్ జాయింట్ వెంచర్ అయిన భారతి సిమెంట్‌కు ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా ఎర్రగుంట్ల వద్ద ప్లాంటు ఉంది. ఈ కేంద్రం నుంచి తమిళనాడులోని కోయంబత్తూరుకు బల్క్ సిమెంట్‌తో కూడిన రైలు శుక్రవారం ప్రారంభమైంది. ప్రధాన మార్కెట్లు అయిన చెన్నై, నైరుతీ తమిళనాడు, కేరళకు ఈ విధానంలో సిమెంట్ సరఫరా చేయనున్నట్టు భారత్‌లో వికా గ్రూప్ సీఈవో అనూప్ కుమార్ సక్సేనా తెలిపారు. కోయంబత్తూరులో ప్రత్యేక ప్యాకేజింగ్ టెర్మినల్ నిర్మిస్తున్నట్టు వెల్లడించారు. కంటైనర్లు, అత్యాధునిక టెర్మినల్ కోసం రూ.130 కోట్లు వెచ్చిస్తున్నామని చెప్పారు. నూతన అధ్యాయం.. రైలు ద్వారా బల్క్ సిమెంట్ సరఫరాతో రవాణా ఖర్చులు, కర్బన ఉద్గారాలు తగ్గుతాయని సక్సేనా తెలిపారు. ‘కస్టమర్లకు మెరుగ్గా సేవలు అందించే వీలు అవుతుంది. భారతి సిమెంట్ మొదటిసారిగా స్వీకరించిన ఈ మోడల్ దేశంలో సిమెంట్ రవాణాలో విప్తవాత్మక మార్పులతోపాటు నూతన అధ్యాయానికి నాంది పలుకుతుంది’ అని వివరించారు. ఎర్రగుంట్ల ప్లాంటు నుంచి తొలి రైలును జెండా ఊపి సక్సేనా ప్రారంభించారు. కార్యక్రమంలో భారతి సిమెంట్ డైరెక్టర్లు ఎం.రవీందర్ రెడ్డి, జి.బాలాజీ, జె.జె.రెడ్డి, హరీష్ కామర్తి, ఎరిక్, దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ ఆర్.ధనుంజయులు, ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ జాన్ ప్రసాద్, కాంకర్ ఈడీ శేషగిరి రావు పాల్గొన్నారు. రైల్వే బోర్డ్ మెంబర్ ఆపరేషన్, బిజినెస్ డెవలప్మెంట్ సంజయ్ మహంతి, కాంకర్ ఎండీ వి.కళ్యాణ రామ న్యూఢిల్లీ నుంచి వర్చువల్‌గా పాలుపంచుకున్నారు. వేగంగా సిమెంట్ రవాణా .. ప్రత్యేక కంటైనర్లలో బల్క్ సిమెంట్ రవాణా వల్ల తయారీ కంపెనీలతోపాటు తమ సంస్థకు మేలు చేకూరుస్తుందని దక్షిణ మధ్య రైల్వే ఇన్చార్జ్ జీఎం అరుణ్ కుమార్ జైన్ తెలిపారు. ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉండటంతోపాటు వేగంగా సిమెంట్ రవాణా సాధ్యపడుతుందని అన్నారు. -
కబడ్డీకి అనూప్ వీడ్కోలు
పంచకుల (హరియాణా): భారత కబడ్డీ దిగ్గజం అనూప్ కుమార్ ఆటకు రిటైర్మెంట్ ప్రకటించాడు. అనూప్ కెప్టెన్సీలో భారత జట్టు 2010, 2014 ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాలు సాధించడంతో పాటు 2016 ప్రపంచకప్ నెగ్గి విశ్వవిజేతగా నిలిచింది. మట్టి ఆటకు విస్తృత ప్రాచుర్యం అందించిన ప్రొ కబడ్డీ లీగ్ రెండో సీజన్లో యు ముంబా ఫ్రాంచైజీకి సారథిగా వ్యవహరించిన 35 ఏళ్ల అనూప్ జట్టును విజేతగా నిలిపాడు. ‘కబడ్డీ ఆడటం ప్రారంభించిన తొలినాళ్లలో దేశానికి ఆడాలని కలలు కనేవాడిని. అతి కొద్ది మందే తమ స్వప్నాలను సాకారం చేసుకోగలుగుతారు. అలాంటి అదృష్టం నాకు దక్కింది’ అని అనూప్ పేర్కొన్నాడు. జైపూర్పై గుజరాత్ గెలుపు: ప్రొ కబడ్డీ లీగ్‌లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ 33–31తో జైపూర్ పింక్ పాంథర్స్‌పై విజయం సాధించింది. గుజరాత్ తరఫున ప్రపంజన్ 11, సచిన్ 8 పాయింట్లతో మెరిశారు. పట్నా పైరేట్స్, బెంగళూరు బుల్స్ మధ్య జరిగిన మ్యాచ్ 40–40తో ‘డ్రా’గా ముగిసింది. నేటి మ్యాచ్‌ల్లో దబంగ్ ఢిల్లీతో జైపూర్ పింక్ పాంథర్స్, బెంగాల్ వారియర్స్‌తో తమిళ్ తలైవాస్ తలపడనున్నాయి. -
రిటైర్మెంట్పై అనూప్ ప్రకటన
అహ్మదాబాద్:భారత కబడ్డీ జట్టు కెప్టెన్ అనూప్ కుమార్ తన అంతర్జాతీయ రిటైర్మెంట్పై నిర్ణయాన్ని వెల్లడించాడు. ఈ వరల్డ్ కప్ తరువాత అంతర్జాతీయ మ్యాచ్‌ల నుంచి వీడ్కోలు తీసుకోనున్నట్లు తెలిపాడు. అయితే ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్)లో కొనసాగుతానని తెలిపాడు. 'నేను ఒక ప్రొఫెషనల్ ప్లేయర్‌గా ఉండాలనుకుంటున్నా. ఈ మేరకు అంతర్జాతీయ కబడ్డీకి గుడ్ బై చెబుతున్నా. ఈ వరల్డ్ కప్ అనంతరం జాతీయ జట్టు నుంచి విశ్రాంతి తీసుకుంటా. యువ ఆటగాళ్లు రావాలనేది నా కోరిక. దానిలో భాగంగానే రిటైర్ అవుతున్నా'అని అనూప్ తెలిపాడు. ప్రస్తుత వరల్డ్ కప్‌ను భారత్ సాధించాలనేది తన కల అని, ఈ ఏడాది వరల్డ్ కప్ కల తీరుతుందని ఆశిస్తున్నట్లు అనూప్ పేర్కొన్నాడు. హరియాణా రాష్ట్రంలోని గుర్గావ్ జిల్లాలోని పాల్రా అనే చిన్న గ్రామం నుంచి వచ్చిన అనూప్ అంచెలంచెలుగా తన కబడ్డీ ప్రస్థానాన్ని కొనసాగించాడు. ప్రస్తుత ఆ రాష్ట్ర పోలీస్ శాఖలో డిప్యూటీ కమిషనర్‌గా అనూప్ పని చేస్తున్నాడు. 2006లో శ్రీలంకలో జరిగిన దక్షిణాసియా గేమ్స్ తో కబడ్డీ జాతీయ జట్టులోకి అడుగుపెట్టిన అనూప్.. భారత జట్టులో రెగ్యులర్ ప్లేయర్ గా మారిపోయాడు. రాకేశ్ కుమార్ కెప్టెన్సీలో వైస్ కెప్టెన్ గా పని చేసిన అనూప్.. 2012లో అర్జున అవార్డును అందుకున్నాడు. 2016లో భారత కబడ్డీ జట్టు కెప్టెన్ గా నియమించబడ్డాడు. ఇదిలా ఉండగా, ప్రొ కబడ్డీ లీగ్‌లో యు ముంబై జట్టుకు సారథిగా వ్యవహరిస్తున్నాడు. దీనిలో భాగంగా కబడ్డీ లీగ్ రెండో సీజన్ 2015లో యు ముంబైకు కప్ ను అందించాడు. అంతకుముందు 2014, 16ల్లో యు ముంబైను ఫైనల్ కు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పటివరకూ ప్రొ కబడ్డీ లీగ్ లో 330 పాయింట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అందులో 305 రైడింగ్ పాయింట్లను సాధించడం విశేషం. -
కబడ్డీ ప్రపంచకప్ ట్రోఫీ ఆవిష్కరణ
అహ్మదాబాద్‌లో ఈ నెల 7 నుంచి జరిగే కబడ్డీ ప్రపంచకప్ ట్రోఫీని శనివారం ఆవిష్కరించారు. భారత జట్టు కెప్టెన్ అనూప్ కుమార్‌తో పాటు ఇరాన్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్, కెన్యా, అర్జెంటీనా కెప్టెన్ల సమక్షంలో గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రుపానీ ట్రోఫీని ఆవిష్కరించారు. -
భారత కబడ్డీ సారథి అనూప్
ముంబై: ప్రపంచకప్‌లో భారత కబడ్డీ జట్టుకు హరియాణా స్టార్ రైడర్ అనూప్ కుమార్ సారథ్యం వహించనున్నాడు. 14 మంది సభ్యులుగల ఈ జట్టుకు బల్వన్ సింగ్ కోచ్‌గా వ్యవహరిస్తారు. భారత్ ఆతిథ్యమిచ్చే ఈ ప్రపంచకప్ కబడ్డీ టోర్నీ వచ్చే నెల 7 నుంచి అహ్మదాబాద్‌లో జరుగనుంది. మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జట్టు వివరాలను వెల్లడించారు. మొత్తం 12 దేశాలు ఈ టోర్నీలో పాల్గొంటాయి. భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ కబడ్డీ జట్టు జెర్సీని ఆవిష్కరించారు. ప్రపంచకప్‌కు భారత కబడ్డీ జట్టు: అనూప్ (కెప్టెన్), మన్జీత్ చిల్లర్ (వైస్ కెప్టెన్), అజయ్ ఠాకూర్, దీపక్ హుడా, ధర్మరాజ్, జస్వీర్ సింగ్, కిరణ్ పర్మార్, మోహిత్, నితిన్, పర్దీప్ నర్వాల్, రాహుల్ చౌదరి, సందీప్, సురేందర్, సుర్జీత్. పాక్‌ను ఆడించమంటారా..? కపిల్ ఆగ్రహం కబడ్డీ జట్టు ప్రకటన కార్యక్రమంలో ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నతో క్రికెట్ దిగ్గజం కపిల్ ఆగ్రహానికి లోనయ్యారు. ‘ఈ టోర్నీలో పాకిస్తాన్‌ను ఎందుకు ఆహ్వానించలేదు’ అని ఓ విలేకరి ప్రశ్నించగా... వెంటనే సహనం కోల్పోరుున కపిల్ ‘నువ్వో భారతీయుడవైవుండి ఈ ప్రశ్నను అడుగుతావా? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ప్రశ్నను అడుగుతారా..? పాక్‌ను పిలిచి ఆడించమంటారా?’ అని కస్సుమన్నాడు. యురీ ఘటనలో పాక్ ఉగ్రవాదుల దాడిలో 18 మంది భారత జవాన్లు మృతి చెందిన సంగతి తెలిసిందే. -
తాళమేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీ: ఇద్దరి అరెస్టు
గచ్చిబౌలి (హైదరాబాద్): తాళం వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. సైబరాబాద్ క్రైం డీసీపీ బి.నవీన్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఉప్పుగూడ నివాసి కట్టెల అనూప్ కుమార్ అలియాస్ నితీష్ అలియాస్ రాజు అలియాస్ టింకు(24) ఎనిమిదేళ్లుగా దొంగతనాలకు పాల్పడుతున్నాడు. తాళం వేసిన ఇళ్లకు కన్నం వేయటం ఇతని నైజం. గత ఏడాది జూలైలో చర్లపల్లి జైలు నుంచి విడుదలై ఉప్పుగూడా రైల్వే స్టేషన్ సమీపంలో ఉండే నల్ల రంజిత్ కుమార్ (24) తో జతకట్టి మళ్లీ చోరీలకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలో సరూర్ నగర్ సీసీఎస్ పోలీసులకు బుధవారం పట్టుబడ్డారు. ఇద్దరూ కలసి అమీర్‌పేట, సరూర్ నగర్, ఎల్బీ నగర్, సైదాబాద్, మలక్ పేట పోలీస్స్టేషన్ల పరిధిలో పగటి పూట రెక్కీ వేసి, రాత్రి వేళల్లో ఐదు చోట్ల దొంగతనాలు చేశారు. ఎల్బీ నగర్ పీఎస్ పరిధిలో ఐ20 కారు, సరూర్‌నగర్, బేగంపేట పీఎస్ పరిధిలో బైక్‌లను కూడా ఎత్తుకెళ్లారు. పట్టుబడిన నిందితుల నుంచి రూ.20 లక్షల విలువ చేసే 26 తులాల బంగారు ఆభరణాలు, కారు, రెండు బైక్‌లు, రెండు ల్యాప్‌టాప్‌లు, రెండు డీవీడీ ప్లేయర్లు, ఎల్సీడీ టీవీ, డిజిటల్ కెమెరా, హోం థియేటర్, మోటోజీ సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉండగా అనూప్ కుమార్ ఎనిమిదేళ్ల 34 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని డీసీపీ తెలిపారు. నాన్‌బెయిలబుల్ వారెంట్లున్నా తప్పించుకు తిరుగుతూ మకాంను ఉప్పుగూడలోని శివాజీనగర్‌కు మార్చాడని వెల్లడించారు.