రిటైర్మెంట్పై అనూప్ ప్రకటన
అహ్మదాబాద్:భారత కబడ్డీ జట్టు కెప్టెన్ అనూప్ కుమార్ తన అంతర్జాతీయ రిటైర్మెంట్పై నిర్ణయాన్ని వెల్లడించాడు. ఈ వరల్డ్ కప్ తరువాత అంతర్జాతీయ మ్యాచ్ల నుంచి వీడ్కోలు తీసుకోనున్నట్లు తెలిపాడు. అయితే ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్)లో కొనసాగుతానని తెలిపాడు. 'నేను ఒక ప్రొఫెషనల్ ప్లేయర్గా ఉండాలనుకుంటున్నా. ఈ మేరకు అంతర్జాతీయ కబడ్డీకి గుడ్ బై చెబుతున్నా. ఈ వరల్డ్ కప్ అనంతరం జాతీయ జట్టు నుంచి విశ్రాంతి తీసుకుంటా. యువ ఆటగాళ్లు రావాలనేది నా కోరిక. దానిలో భాగంగానే రిటైర్ అవుతున్నా'అని అనూప్ తెలిపాడు. ప్రస్తుత వరల్డ్ కప్ను భారత్ సాధించాలనేది తన కల అని, ఈ ఏడాది వరల్డ్ కప్ కల తీరుతుందని ఆశిస్తున్నట్లు అనూప్ పేర్కొన్నాడు.
హరియాణా రాష్ట్రంలోని గుర్గావ్ జిల్లాలోని పాల్రా అనే చిన్న గ్రామం నుంచి వచ్చిన అనూప్ అంచెలంచెలుగా తన కబడ్డీ ప్రస్థానాన్ని కొనసాగించాడు. ప్రస్తుత ఆ రాష్ట్ర పోలీస్ శాఖలో డిప్యూటీ కమిషనర్గా అనూప్ పని చేస్తున్నాడు. 2006లో శ్రీలంకలో జరిగిన దక్షిణాసియా గేమ్స్ తో కబడ్డీ జాతీయ జట్టులోకి అడుగుపెట్టిన అనూప్.. భారత జట్టులో రెగ్యులర్ ప్లేయర్ గా మారిపోయాడు. రాకేశ్ కుమార్ కెప్టెన్సీలో వైస్ కెప్టెన్ గా పని చేసిన అనూప్.. 2012లో అర్జున అవార్డును అందుకున్నాడు. 2016లో భారత కబడ్డీ జట్టు కెప్టెన్ గా నియమించబడ్డాడు.
ఇదిలా ఉండగా, ప్రొ కబడ్డీ లీగ్లో యు ముంబై జట్టుకు సారథిగా వ్యవహరిస్తున్నాడు. దీనిలో భాగంగా కబడ్డీ లీగ్ రెండో సీజన్ 2015లో యు ముంబైకు కప్ ను అందించాడు. అంతకుముందు 2014, 16ల్లో యు ముంబైను ఫైనల్ కు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పటివరకూ ప్రొ కబడ్డీ లీగ్ లో 330 పాయింట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అందులో 305 రైడింగ్ పాయింట్లను సాధించడం విశేషం.