
పంచకుల (హరియాణా): భారత కబడ్డీ దిగ్గజం అనూప్ కుమార్ ఆటకు రిటైర్మెంట్ ప్రకటించాడు. అనూప్ కెప్టెన్సీలో భారత జట్టు 2010, 2014 ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాలు సాధించడంతో పాటు 2016 ప్రపంచకప్ నెగ్గి విశ్వవిజేతగా నిలిచింది. మట్టి ఆటకు విస్తృత ప్రాచుర్యం అందించిన ప్రొ కబడ్డీ లీగ్ రెండో సీజన్‌లో యు ముంబా ఫ్రాంచైజీకి సారథిగా వ్యవహరించిన 35 ఏళ్ల అనూప్ జట్టును విజేతగా నిలిపాడు. ‘కబడ్డీ ఆడటం ప్రారంభించిన తొలినాళ్లలో దేశానికి ఆడాలని కలలు కనేవాడిని. అతి కొద్ది మందే తమ స్వప్నాలను సాకారం చేసుకోగలుగుతారు. అలాంటి అదృష్టం నాకు దక్కింది’ అని అనూప్ పేర్కొన్నాడు.
జైపూర్‌పై గుజరాత్ గెలుపు: ప్రొ కబడ్డీ లీగ్‌లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ 33–31తో జైపూర్ పింక్ పాంథర్స్‌పై విజయం సాధించింది. గుజరాత్ తరఫున ప్రపంజన్ 11, సచిన్ 8 పాయింట్లతో మెరిశారు. పట్నా పైరేట్స్, బెంగళూరు బుల్స్ మధ్య జరిగిన మ్యాచ్ 40–40తో ‘డ్రా’గా ముగిసింది. నేటి మ్యాచ్‌ల్లో దబంగ్ ఢిల్లీతో జైపూర్ పింక్ పాంథర్స్, బెంగాల్ వారియర్స్‌తో తమిళ్ తలైవాస్ తలపడనున్నాయి.