
వివాహితపై ఇద్దరు వ్యక్తుల ఘాతుకం
నగ్న వీడియోలు చూపుతూ బ్లాక్‌మెయిల్
బాధితురాలు ఫిర్యాదు చేసినా పట్టని పోలీసులు
ఏలూరు రేంజ్ ఐజీని కలిసిన బాధితురాలు, కుటుంబసభ్యులు
ఏలూరు (టూటౌన్): తనను బెదిరించి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడంతో పాటు తనను నగ్నంగా వీడియోలు తీసిన ఇద్దరు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలంటూ ఓ వివాహిత కుటుంబ సభ్యులతో కలిసి ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్‌కుమార్‌కు సోమవారం వినతిపత్రం అందజేసింది. పోలీసులను ఆశ్రయించినా కనీసం పట్టించుకోవడం లేదని, పైగా రాజీకి రావాలని, లేదంటే కౌంటర్ కేసు పెడతామని పోలీసులే బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.
గత్యంతరం లేని పరిస్థితుల్లో తనకు, తన కుటుంబసభ్యులకు రక్షణ కల్పించాలంటూ ఐజీని కలిసినట్టు చెప్పింది. బాధితురాలు, ఆమె బంధువులు స్థానిక ఏటిగట్టు వద్ద ఉన్న జిల్లా రజక సంఘం కార్యాలయంలో సోమవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం ఎన్‌ఆర్‌పీ అగ్రహారం గ్రామానికి చెందిన ఓ వివాహితపై అదే ప్రాంతానికి చెందిన యర్రంశెట్టి రవి, అతని స్నేహితుడు గుబ్బల సోమేశ్వరరావు అలియాస్ సోము అనుచితంగా ప్రవర్తించారు.
ఆమెను బలవంతంగా లోబర్చుకోవాలని ప్రయత్నించారు. మాట వినకపోతే ఆమె భర్తను, కుటుంబాన్ని చంపేస్తామని బెదిరించారు. ఈ క్రమంలో వివాహితను బలవంతంగా గదిలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆ సమయంలో ఆమెకు మత్తు మందు ఇచ్చి నగ్నంగా వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేశారు. ఈ క్రమంలో బీచ్‌కు, భీమవరంలోని స్నేహితుల గదికి తీసుకువెళ్లి పలుమార్లు లైంగిక దాడికి తెగబడ్డారు. అలాగే ఆమెను బెదిరించి పలు దఫాలుగా ఆమె నుంచి రూ.2.50 లక్షలు తీసుకుని మళ్లీ డబ్బులు కావాలంటూ వేధిస్తున్నారు.
రాజీ చేసుకోవాలని పోలీసుల ఒత్తిడి
తనకు జరిగిన అన్యాయంపై బాధితురాలు ఉండి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు పట్టించుకోకపోగా నిందితుల పక్షాన కొమ్ము కాశారంటూ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. కేసును వెనక్కి తీసుకోకపోతే తన భర్తపై, భర్త సోదరునిపై కౌంటర్ రేప్ కేసు పెడతామని, రాజీ చేసుకోవాలని పోలీసులే బెదిరిస్తున్నారని ఆమె వాపోయింది. ఈ విషయంపై పలుమార్లు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లినా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేసింది.
ఈ క్రమంలో బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులు రాష్ట్ర రజక సంఘం ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా రజక సంఘం అధ్యక్షుడు చిలకలపల్లి కట్లయ్యతో కలిసి ఏలూరు రేంజ్ ఐజీ అశోక్‌కుమార్‌ను కలిసి తమకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. దీనిపై ఐజీ అశోక్‌కుమార్ స్పందించారని, పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీని విచారణ అధికారిగా నియమించారని, తగిన న్యా యం చేస్తామని హామీ ఇచ్చారని కట్లయ్య తెలి పారు. సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కె.మురళీకృష్ణ, యలమంచిలి శేషు, బుద్దవరపు గోపి, యండమూరి వీర్రాజు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment