AIFF
-
స్టిమాక్ కాంట్రాక్ట్ పునరుద్ధరణపై ఏఐఎఫ్ఎఫ్ విచారణ
న్యూఢిల్లీ: భారత ఫుట్‌బాల్ కోచ్‌గా పని చేసిన ఐగర్ స్టిమాక్ కాంట్రాక్ట్ పునరుద్ధరణ, అతనికి చెల్లించాల్సి వచ్చిన నష్టపరిహారంపై అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ మొత్తం వ్యవహారంలో జరిగిన తప్పులు, స్టిమాక్‌కు అనుకూలంగా ఉన్న నిబంధనపై సమాఖ్య సర్వసభ్య సమావేశంలో చర్చ జరిగింది. దీనికి సంబంధించి స్వతంత్ర విచారణ జరపాలని ఏఐఎఫ్ఎఫ్ నిర్ణయం తీసుకుంది. ఎవరి కారణంగా స్టిమాక్‌కు భారీ మొత్తం చెల్లించాల్సి వచ్చిందనే అంశం విచారణలో తేలుతుందని ఏజీఎంలో సభ్యులు అభిప్రాయపడ్డారు.భారత జట్టు కోచ్‌గా ఐగర్ స్టిమాక్ పదవీకాలం 2023లో ముగిసింది. ఆ తర్వాత మళ్లీ దానిని జూన్ 2025 వరకు పునరుద్ధరించారు. అయితే స్టిమాక్ రెండోసారి కాంట్రాక్ట్‌పై సంతకం చేసినప్పుడు నిబంధనలు, షరతులు అతనికి అనుకూలంగా తయారు చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఇందులో ఏఐఎఫ్ఎఫ్ కీలక పదవుల్లో పని చేసిన కొందరి పాత్ర ఉందని ఏజీఎంలో సభ్యులు ఆరోపించారు. ఈ ఏడాది జూన్‌లో ‘ఫిఫా’ వరల్డ్ కప్ క్వాలిఫయర్స్‌లో సులువైన ‘డ్రా’ ఉన్నా భారత జట్టు చెత్త ప్రదర్శనతో రెండో రౌండ్లోనే నిష్క్రమించింది. దాంతో వెంటనే స్టిమాక్‌ను కోచ్ పదవి నుంచి తొలగించారు.ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న స్టిమాక్ 9 లక్షల 20 వేల డాలర్లు (రూ. 7 కోట్ల 72 లక్షలు) నష్టపరిహారం కోరుతూ ఫిఫా ఫుట్‌బాల్ ట్రిబ్యునల్‌లో ఫిర్యాదు చేశాడు. మరో ఏడాది తన పదవీకాలం మిగిలి ఉన్నా తనను తీసేయడం నిబంధనలకు విరుద్ధమంటూ సవాల్ చేశాడు. చివరకు మధ్యవర్తిత్వం ద్వారా ఏఐఎఫ్ఎఫ్ సమస్యను పరిష్కరించుకుంది. స్టిమాక్‌కు 4 లక్షల డాలర్లు (సుమారు రూ. 3.20 కోట్లు) నష్టపరిహారం ఇచ్చేందుకు అంగీకరించి గొడవను ముగించింది. ఈ అంశంపై ప్రస్తుతం ఏజీఎంలో చర్చ జరుగుతుంది.చదవండి: భారత ఫుట్‌బాలర్ అన్వర్ అలీపై నిషేధం -
భారత ఫుట్‌బాలర్ అన్వర్ అలీపై నిషేధం
కోల్‌కతా: ఆటగాళ్ల బదిలీకి సంబంధించి ఉన్న నిబంధనలను ఉల్లంఘించిన భారత ఫుట్‌బాల్ ప్లేయర్ అన్వర్ అలీపై అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) చర్యలు తీసుకుంది. అతనిపై నాలుగు నెలల నిషేధాన్ని విధిస్తున్నట్లు ప్రకటించింది. మోహన్ బగాన్ సూపర్ జెయింట్ జట్టుతో కాంట్రాక్టు కుదుర్చుకున్న తర్వాత అన్వర్ ఆ కాంట్రాక్ట్‌ను పాటించకుండా అనూహ్యంగా ఈస్ట్ బెంగాల్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) జట్టుకు మారాడు. మరోవైపు వచ్చే ఏడాది వరకు కొత్త ఆటగాళ్లను తీసుకోవడంపై నిషేధం ఉన్నా సరే... దానిని ధిక్కరించి ఢిల్లీ ఎఫ్‌సీ కూడా అన్వర్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ అంశం తీవ్ర వివాదం రేకెత్తించింది. దాంతో విచారణ జరిపిన ఏఐఎఫ్ఎఫ్ అన్వర్‌పై నిషేధంతో పాటు భారీ జరిమానా విధించింది. అన్వర్ అలీ నుంచి రూ.12 కోట్ల 90 లక్షలు నష్టపరిహారం పొందేందుకు మోహన్ బగాన్ క్లబ్ జట్టుకు అర్హత ఉందని స్పష్టం చేసింది. జరిమానా మొత్తాన్ని ఈస్ట్ బెంగాల్ క్లబ్, ఢిల్లీ ఎఫ్‌సీ, అన్వర్ కలిసి చెల్లించాలని ఏఐఎఫ్ఎఫ్ ఆదేశించింది. -
కోచ్‌గా స్టిమాక్ కొనసాగింపు!
న్యూఢిల్లీ: భారత ఫుట్‌బాల్ జట్టు మైదానంలో నిరాశాజనక ఫలితాలు సాధిస్తున్నప్పటికీ... కోచ్‌గా ఐగర్ స్టిమాక్ కొనసాగనున్నారు. 2026 ఫిఫా ప్రపంచకప్ ఆసియా క్వాలిఫయర్స్‌లో అఫ్గానిస్తాన్లాంటి చిన్న జట్టుతో ఓటమి పాలవడం ఆయన కోచ్ పదవికి ఎసరు తెచ్చింది. అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) సాంకేతిక కమిటీ కూడా హెడ్ కోచ్‌ను తప్పించాలనే సిఫార్సు చేసింది. అయితే ఒప్పంద నిబంధనలు ఆయన్ని ఉన్నపళంగా తప్పిస్తే భారీ మూల్యం చెల్లించేలా ఉన్నాయి. దీంతో వేటు కంటే కొనసాగించడమే మేలని ఏఐఎఫ్ఎఫ్ భావిస్తోంది. ‘ఇప్పుడున్న పరిస్థితుల్లో స్టిమాక్ ఇన్చార్జ్గా జూన్ వరకు జట్టుతో కలిసి పనిచేస్తారు’ అని ఏఐఎఫ్ఎఫ్ అధికారి ఒకరు తెలిపారు. జూన్‌లో ఆసియా క్వాలిఫయర్స్‌కు సంబంధించిన రెండు మ్యాచ్‌లు ఉన్నాయి. గ్రూప్ ‘ఎ’లో భారత్... కువైట్, ఖతర్లతో తలపడాల్సివుంటుంది. ఈ ఫలితాలను బట్టే తదుపరి మూడో రౌండ్‌కు అర్హత సాధించేది లేనిది తేలుతుంది. అఫ్గానిస్తాన్‌తో ఇంటా బయటా జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ భారత్ నిరాశపరిచింది. అఫ్గాన్‌కు సంబంధించిన హోమ్ మ్యాచ్ సౌదీలో జరగ్గా భారత్ డ్రా చేసుకుంది. -
మెస్సీని మిస్సయ్యాం!.. అర్జెంటీనా వస్తానంటే భారత్ వద్దన్నది
లియోనల్ మెస్సీకి విశ్వవ్యాప్తంగా అభిమానులున్నారు. అతను ఒక మ్యాచ్ ఆడితే కోట్లలో వీక్షిస్తారు. అలాంటి మెస్సీ మన దేశానికి వచ్చి ఒక ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడుతానంటే భారత్ వద్దనడం ఆశ్చర్యం కలిగించింది. అర్జెంటీనా ప్రస్తుతం ఫుటబాల్లో చాంపియన్ అన్న సంగతి తెలిసిందే. గతేడాది డిసెంబర్లో ఖతర్ వేదికగా జరిగిన ఫిఫా వరల్డ్‌కప్‌లో మెస్సీ సేన ఫ్రాన్స్‌పై ఫూటౌట్లో 4-2తో విజయం సాధించి మూడోసారి వరల్డ్‌కప్ గెలుచుకుంది. అన్నీ తానై నడిపించిన మెస్సీ అర్జెంటీనాకు కప్ అందించి 36 సంవత్సరాల నిరీక్షణకు తెరదించాడు. ఇలాంటి మేటి చాంపియన్ టీమ్ వచ్చి ఫ్రెండ్లీ మ్యాచ్‌లు ఆడతామంటే ఫుట్‌బాల్ అభివృద్ధి కోరే ఏ దేశమైనా ఎగిరి గంతేస్తుంది. ఎర్రతివాచీ పరిచి మరీ ఆహ్వానిస్తుంది. కానీ జనాభాలో చైనాను మించిన భారత్ మాత్రం తమ ఫుట్‌బాల్ అబిమానులకు నిరాశ కలిగించే నిర్ణయంతో అర్జెంటీనా వస్తనంటే వద్దన్నది. అర్జెంటీనా జట్టు అయినా.. ఆ జట్టు ఆటగాళ్లయినా మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్స్. అలాంటి జట్టు అప్పియరెన్స్ ఫీజుగా 50 లక్షల డాలర్లు(రూ.40 కోట్లు) ఇస్తే చాలు అందుబాటులో ఉన్న జూన్ 12 నుంచి 20వ తేదీల్లో భారత్ వేదికపై ఒక మ్యాచ్ ఆడి వెళతామంది. కానీ అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య(AIFF) అంత మొత్తం ఇవ్వలేం అనేసరికి మెస్సీ టీమ్ జూన్ 15న బీజింగ్‌లో ఆస్ట్రేలియాతో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడింది. మనకంటే చిన్నదేశం ఇండోనేషియా వాళ్లు అడిగినంత ఫీజులో ఏ లోటు లేకుండా చెల్లించి జకార్తాలో 19న అర్జెంటీనాతో మ్యాచ్ ఆడి తమ కోరికను నెరవేర్చుకుంది. అభివృద్ది చెందుతున్న దేశాల జాబితాలో ఉన్న మన భారత్ మాత్రం రూ. 40 కోట్లు ఇచ్చుకోలేక అర్జెంటీనాతో మ్యాచ్ ఆడేందుకు నిరాకరించడం విస్మయం కలిగించే అంశం. చదవండి: #LionelMessi: ఆపడం ఎవరి తరం.. కెరీర్లోనే అత్యంత ఫాస్టెస్ట్ గోల్ -
బైచుంగ్ భుటియా ఘోర పరాజయం.. ఏఐఎఫ్ఎఫ్ అధ్యక్షుడిగా కళ్యాణ్ చౌబే
అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) కొత్త అధ్యక్షుడిగా మాజీ ఫుట్‌బాల్ ఆటగాడు.. బీజేపీ నేత కళ్యాణ్ చౌబే ఎన్నికయ్యాడు. టీమిండియా మాజీ ఫుట్‌బాల్ స్టార్ బైచుంగ్ భుటియాతో జరిగిన పోటీలో 33-1 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించాడు. మొత్తం 34 ఓట్లలో భుటియాకు కేవలం ఒక్క ఓటు మాత్రమే పడింది. కాగా 34 సభ్యుల ఓటర్ల జాబితాలో భూటియాకు మద్దతుదారులు కరువయ్యారు. 85 ఏళ్ల భారత ఫుట్‌బాల్ సమాఖ్య చరిత్రలో ఒక మాజీ ఆటగాడు అధ్యక్షుడిగా ఎంపికవ్వడం ఇదే తొలిసారి. ఇక మాజీ ప్లేయర్ అయిన చౌబే గతంలో మోహన్ బగాన్, ఈస్ట్ బెంగాల్ జట్లకు ఆడాడు. అయితే చౌబే ఇండియా సీనియర్ జట్టుకు ఎప్పుడూ ఆడింది లేదు. కానీ పలుమార్లు జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. ఇండియా తరపున ఏజ్ గ్రూపు ఇంటర్నేషనల్ టోర్నీల్లో మాత్రం అతను ప్రాతినిధ్యం వహించాడు. తన ప్రత్యర్థి ఉన్న భూటియాతో కలిసి చౌబే గతంలో ఈస్ట్ బెంగాల్ జట్టుకు కలిసి ఆడాడు. ఏఐఎఫ్ఎఫ్ ఉపాధ్యక్షుడి పోస్టుకు కర్నాటక ఫుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్.ఏ హరిస్ గెలుపొందాడు. రాజస్థాన్‌కు చెందిన మన్వేందర్ సింగ్‌పై హరిస్ విజయం సాధించాడు.అలాగే ట్రెజరరీ పోస్టును అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన కిపాఅజయ్ దక్కించుకున్నాడు. ఇక చౌబే గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ తరపున బెంగాల్‌లోని కృష్ణానగర్ సీటు నుంచి పోటీచేసి ఓటమిపాలయ్యాడు. కాగా ఆగస్టు 17న ఏఐఎఫ్ఎఫ్లో తృతీయ పక్షం జోక్యం సహించేది లేదని 'ఫిఫా' పలుమార్లు హెచ్చరించినప్పటికి అఖిల భారత సమాఖ్య ఫుట్‌బాల్ ఫెడరేషన్ పట్టించుకోలేదు. దీంతో ఫిఫా భారత్ ఫుట్‌బాల్ సమాఖ్యపై నిషేధం విధించింది. ఏఐఎఫ్ఎఫ్ పూర్తిస్థాయి కార్యవర్గంతో పనిచేస్తేనే నిషేధం ఎత్తివేస్తామని ఫిఫా తెలిపింది. కాగా భారత ఫుట్‌బాల్ సమాఖ్యపై విధించిన నిషేధాన్ని ఫిఫా ఆగస్టు 27న ఎత్తివేసింది. ఏఐఎఫ్ఎఫ్ ఎగ్జిక్యూటివ్ కమిటీని రద్దు చేసి రోజూవారీ కార్యకలాపాలపై సమాఖ్య పరిపాలనా వర్గం పూర్తిగా పట్టు చేజిక్కించుకున్నట్లు తెలియడంతో తాము ఈ నిర్ణయం తీసుకున్నామని ‘ఫిఫా’ ప్రకటించింది. భారత్‌లో పరిస్థితిని సమీక్షిస్తూ ఉంటామని, ఎన్నికలను సరైన రీతిలో నిర్వహించేందుకు సహకారం అందిస్తామని స్పష్టం చేసింది. దీంతో అక్టోబర్ 11నుంచి భారత్‌లో జరగాల్సిన అండర్–17 మహిళల ప్రపంచ కప్‌ను యథావిధిగా నిర్వహించేందుకు అనుమతిచ్చింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఏఐఎఫ్ఎఎఫ్లో జరిగిన ఎన్నికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. We congratulate Mr. @kalyanchaubey on being elected as the President, Mr. @mlanaharis as the Vice President, and Mr. Kipa Ajay as the Treasurer of the All India Football Federation 🙌🏼#AIFFGeneralBodyElections2022 🗳️ #IndianFootball ⚽ pic.twitter.com/YRwexiUntx — Indian Football Team (@IndianFootball) September 2, 2022 -
AIFF నిషేధంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
-
క్రీడలపై క్రీనీడ!
క్రీడా మైదానాల్లో సమవుజ్జీలైన రెండు జట్లు నువ్వా నేనా అన్నట్టు తలపడుతూ అభిమానుల్లో ఉత్కంఠ రేపాలి. తమ ప్రతిభా పాటవాలతో స్టేడియంలను హోరెత్తించాలి. కానీ అందుకు భిన్నంగా ఈ ఆటలు నిర్వహించాల్సిన సంఘాల్లోని పెద్దలే ముఠాలు కట్టి పరస్పరం తలపడుతూ, క్రీడలను గాలికొదిలితే దేశం నగుబాటు పాలవుతుంది. అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య(ఏఐఎఫ్ఎఫ్)పై అంతర్జాతీయ ఫుట్‌బాల్ సంఘాల సమాఖ్య(ఫిఫా) నిషేధాస్త్రం సంధించిన నేపథ్యంలో మన క్రీడా సంఘాల పనితీరు మరోసారి చర్చకొచ్చింది. 2012లో భారత్ ఒలింపిక్ సంఘం(ఐఓఏ) కూడా ఈ మాదిరే వివాదాల్లో చిక్కుకోవడంతో అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం(ఐఓసీ) దాన్ని సస్పెండ్ చేయాల్సివచ్చింది. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్(బీసీసీఐ) వ్యవహారాలు సైతం గతంలో ఇలాగే బజారుకెక్కడంతో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ఒక కమిటీని ఏర్పాటు చేసి ప్రక్షాళనకు పూను కుంది. అయినా మన క్రీడాసంఘాల్లో చెప్పుకోదగ్గ మార్పు రాలేదు. పర్యవసానంగా భారత ఫుట్ బాల్ సమాఖ్య దోషిగా నిలబడింది. క్రీడలతో పెద్దగా సంబంధం లేని రాజకీయ నాయకులు ఈ సంఘాల్లోకి జొరబడి వాటిని నియంత్రించడం, ఆ రంగంలో సుదీర్ఘానుభవం ఉన్నవారిని తృణీక రించడం మన దేశంలో రివాజుగా మారింది. ఇందువల్ల సంఘాల్లో నిధులు దుర్వినియోగం కావడం, నిబంధనలు గాలికొదిలి ఇష్టానుసారం వ్యవహరించడం పెరిగింది. దాంతో అసలైన ఔత్సాహిక క్రీడాకారులకు ప్రోత్సాహం కరువవుతోంది. మహిళా క్రీడాకారిణులకు లైంగిక వేధిం పులు ఎదురవుతున్నాయన్న ఆరోపణలు సరేసరి. ఎన్ని సమస్యలున్నా ఈమధ్య జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో మనవాళ్లు మంచి ప్రతిభ కనబరిచి పతకాల సాధనలో నాలుగో స్థానంలో నిలిచారు. 22 బంగారు పతకాలు, 16 వెండి పతకాలు, 23 కాంస్య పతకాలు–మొత్తంగా 61 పతకాలు తీసు కొచ్చారు. 2010లో ఇంతకన్నా ఎక్కువ పతకాలు సాధించి రెండో స్థానంలో నిలిచిన సంగతి నిజమే అయినా ఆ తర్వాత నిరాశ తప్పలేదు. ఇప్పుడిప్పుడే అంతా సర్దుకుంటోంది. ఈ ఉత్సాహాన్ని నీరుగార్చేలా ఏఐఎఫ్ఎఫ్పై నిషేధం వేటుపడింది. అంతర్జాతీయంగా 211 దేశాలకు సభ్యత్వం ఉన్న ఫిఫా కొంతకాలంగా మన సమాఖ్య పనితీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా పట్టించుకునే నాథుడు లేకపోయాడు. మా నిబంధనావళిని బేఖాతరు చేస్తున్నారంటూ ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ వస్తున్నా వినేవారే లేకుండా పోయారు. సమాఖ్యకు కొత్త కార్యవర్గం ఎన్నికై, దాని అధీనంలో రోజువారీ కార్యకలాపాలుండాలని ఫిఫా సూచిస్తోంది. సాధారణంగా క్రీడాసంఘాలకు అధికారంలో ఉండే పెద్దలవల్ల సమస్యలెదురవు తాయి. కానీ ఫుట్‌బాల్ సమాఖ్యకు విపక్ష ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్ గుదిబండగా మారారు. వరసగా మూడుమార్లు ఎన్నికైన ఆయన పదవీకాలం 2020లోనే ముగిసినా న్యాయస్థానాలను ఆశ్రయించి ఆ పదవి పట్టుకుని వేలాడారు. చివరకు సుప్రీంకోర్టు జోక్యంతో ఫుట్‌బాల్ సమాఖ్యకు ఆయన్నుంచి విముక్తి కలిగినా కొత్త సమస్యలొచ్చి పడ్డాయి. పటేల్‌ను తప్పించినప్పుడే ఫిఫా నిబంధనావళికి అనుగుణంగా చర్యలు తీసుకోమని ఆదేశాలిస్తే వేరుగా ఉండేది. కానీ సమాఖ్య కార్యకలాపాల నిర్వహణకంటూ ఒక పరిపాలక సంఘాన్ని(సీఓఏ) ఏర్పాటుచేయడం, ఆ సంఘం వెనువెంటనే మాజీ ఫుట్‌బాల్ క్రీడాకారులతో ఓటర్ల జాబితా తయారుచేసి, ఎన్నికైన 36 సంఘాల ప్రతినిధులను బేఖాతరు చేయడం, ఎన్నికలకు సిద్ధం కావడం వివాదాన్ని మరింత ముదిరేలా చేసింది. సీఓఏను ఫిఫా గుర్తించడానికి నిరాకరించి, మన ఫుట్‌బాల్ సమాఖ్యను నిషేధించడంతో కేంద్రం కూడా రంగంలోకి దిగక తప్పలేదు. నిజానికి బీసీసీఐ కేసు తనముందుకు వచ్చినప్పుడే క్రీడాసంఘాలకు రాజకీయ నాయకులు దూరంగా ఉండాలని సుప్రీంకోర్టు హితవు చెప్పింది. కానీ ఆ తర్వాత కూడా ఏమీ మారనందువల్లే 85 ఏళ్ల మన ఫుట్‌బాల్ సమాఖ్య తొలిసారి వీధిన పడాల్సి వచ్చింది. ఫిఫాతో మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దాలని సుప్రీంకోర్టు కేంద్రానికి చేసిన సూచనవల్ల ఈ భంగపాటు నుంచి సమాఖ్య బయటపడొచ్చు. కానీ ఎన్నాళ్లిలా? క్రీడా సంఘాలు అంకితభావంతో, స్వయంప్రతిపత్తితో పనిచేయలేవా? కొరడా ఝళిపించినప్పుడు మాత్రమే దారికొస్తాయా? క్రీడాసంఘాల తీరువల్ల ఆటగాళ్లలో నిరాశానిస్పృహలు అలుముకోవడం, దేశానికి తలవం పులు తప్పకపోవడం మాత్రమే కాదు... ఫిఫా తాజా నిర్ణయం పర్యవసానంగా ఏటా రావాల్సిన రూ. 4 కోట్ల నిధులు ఆగిపోతాయి. ఫుట్‌బాల్ క్రీడకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన కుంటుపడుతుంది. పైగా వచ్చే అక్టోబర్‌లో భారత్‌లో జరగాల్సిన మహిళల అండర్–17 ప్రపంచ కప్ సందిగ్ధంలో పడింది. నిషేధం ఎత్తేసేవరకూ అన్ని దేశాల ఫుట్‌బాల్ సమాఖ్యలూ మన దేశాన్ని దూరం పెడతాయి. ఈ నెలాఖరులో ఇరాన్లో జరగాల్సిన మ్యాచ్‌లలో... వచ్చే నెలలో వియత్నాం, సింగపూర్లలో జరిగే మ్యాచ్‌లలో మన క్రీడాకారులు పాల్గొనలేరు. అందుకే మన క్రీడాసంఘాలు కళ్లు తెరవాలి. క్రీడలపట్ల నిబద్ధత, నిమగ్నతా ఉన్నవారు మాత్రమే సారథ్యం వహించే స్థితి రావాలి. దిగ్గజ క్రీడాకారులూ, క్రీడాభిమానులూ సమష్టిగా నిలబడితే ఇదేమంత అసాధ్యం కాదు. క్రీడా సంఘాలు సర్వస్వతంత్ర సంఘాలుగా రూపొంది దేశంలో క్రీడాభివృద్ధికి కృషిచేస్తేనే మెరికల్లాంటి క్రీడాకారులు రూపొందుతారు. అందుకు భిన్నంగా నిర్ణయరాహిత్యమో, తప్పుడు నిర్ణయాలో రివాజుగా మారితే దేశం తీవ్రంగా నష్టపోతుంది. -
భారత్‌పై ఫిఫా నిషేధం.. విషయం చేయి దాటిపోయిందన్న స్టార్ ఫుట్‌బాలర్
FIFA Ban Threat To AIFF: భారత ఫుట్‌బాలర్లంతా ప్రపంచ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) హెచ్చరికల్ని పట్టించుకోకుండా ఆటపైనే దృష్టి పెట్టాలని స్టార్ స్ట్రయికర్ సునీల్ ఛెత్రి సూచించాడు. ఈ విషయంపై ఆటగాళ్లు అతిగా ఆలోచించాల్సిన అవసరం లేదని, ఇది మన చేతులు దాటిపోయిందని ఛెత్రి అన్నాడు. అఖిల భారత ఫుట్‌బాల్ సంఘం (ఏఐఎఫ్ఎఫ్) చాన్నాళ్లుగా అడ్‌హక్ కమిటీతో నడుస్తోంది. పూర్తిస్థాయి కార్యవర్గం లేకపోవడంతో, సంబంధం లేని (థర్డ్ పార్టీ) వ్యక్తుల జోక్యంతో భారత ఫుట్‌బాల్ కార్యకలాపాలు జరగడం ఇష్టపడని ‘ఫిఫా’ ఇటీవల నిషేధం విధిస్తామని హెచ్చరించింది. -
‘పద్మశ్రీ’కి విజయన్ పేరు సిఫారసు
న్యూఢిల్లీ: అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) ఫుట్‌బాల్ దిగ్గజం, మాజీ కెప్టెన్ ఐఎమ్ విజయన్ను ‘పద్మశ్రీ’ పురస్కారానికి సిఫారసు చేసింది. కేరళకు చెందిన మాజీ స్ట్రయికర్ 90వ దశకంలో భారత్ తరఫున విశేషంగా రాణించాడు. 79 అంతర్జాతీయ మ్యాచ్‌లాడిన విజయన్ 40 గోల్స్ చేశాడు. 1993, 1997, 1999లలో ‘ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’గా నిలిచాడు. 2000 నుంచి 2003 వరకు జట్టు సారథిగా వ్యవహరించాడు. 2003లో ఆయనకు అర్జున అవార్డు లభించింది. అత్యున్నత నాలుగో పురస్కారమైన ‘పద్మశ్రీ’కి విజయన్ పేరును పరిశీలించాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు ప్రతిపాదించామని ఏఐఎఫ్ఎఫ్ కార్యదర్శి కుశాల్ దాస్ తెలిపారు. పౌర పురస్కారానికి తనను సిఫార్సు చేయడం పట్ల విజయన్ సంతోషం వ్యక్తం చేశాడు. మరో వైపు భారత పురుషుల హాకీ జట్టు మాజీ సహాయ కోచ్ రమేశ్ పరమేశ్వరన్ ద్రోణాచార్య అవార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాది హాకీ ఇండియా (హెచ్ఐ) కరియప్ప, రమేశ్ పఠానియాలను ఆ అవార్డు కోసం నామినేట్ చేయగా... పరమేశ్వరన్ సొంతంగా హాకీ కర్ణాటక అండతో దరఖాస్తు చేసుకున్నారు. -
భవిష్యత్‌లో ఆలోచిస్తా!
న్యూఢిల్లీ: అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) అధ్యక్ష పదవి గురించి భవిష్యత్‌లో కచ్చితంగా ఆలోచిస్తానని భారత ఫుట్‌బాల్ జట్టు మాజీ కెప్టెన్ బైచుంగ్ భూటియా అన్నాడు. ఫేస్బుక్ చిట్‌చాట్‌లో అభిమానులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా భూటియా తన ఆకాంక్షను బయటపెట్టాడు. 2011లో కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఈ సిక్కిం ఆటగాడు ప్రస్తుతం తన దృష్టంతా క్షేత్రస్థాయిలో ఫుట్‌బాల్ అభివృద్ధిపైనే ఉందని పేర్కొన్నాడు. ‘ఏఐఎఫ్ఎఫ్ అధ్యక్ష పదవికి భవిష్యత్‌లో ఏదో ఒక రోజు పోటీదారుగా ఉంటా. కానీ ప్రస్తుతానికైతే క్షేత్రస్థాయి నుంచి ఫుట్‌బాల్ క్రీడ అభివృద్ధి చేయడమే నా లక్ష్యం. బైచుంగ్ భూటియా ఫుట్‌బాల్ స్కూల్, యునైటెడ్ సిక్కిం క్లబ్‌ల ద్వారా నేను అదే పనిలో ఉన్నా’ అని 43 ఏళ్ల భూటియా అన్నాడు. ఫుట్‌బాల్‌లో అపార నైపుణ్యం ఉన్న భూటియా భారత్‌కు చెందిన మిడ్‌ఫీల్డర్ బ్రాండన్ ఫెర్నాండోస్పై ప్రశంసల వర్షం కురిపించాడు ‘ఈ కాలం స్ట్రయికర్లలో సునీల్ ఛెత్రి, మిడ్ ఫీల్డర్లలో బ్రాండన్ ఫెర్నాండోస్ ఉత్తమ ప్లేయర్లు. ఐఎస్ఎల్లో ఎఫ్‌సీ గోవా తరఫున బ్రాండన్ అద్భుతంగా ఆడుతున్నాడు. మైదానంలో అతని నైపుణ్యాలు గొప్పగా ఉంటాయి’ అని భూటియా తెలిపాడు. 1995 నుంచి 2011 వరకు భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన భూటియా జూనియర్, సీనియర్ స్థాయిలలో కలిపి మొత్తం 104 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి 40 గోల్స్ సాధించాడు. -
హాకీ ఇండియా, ఏఐఎఫ్ఎఫ్ విరాళం రూ. 25 లక్షలు
న్యూఢిల్లీ: కరోనాపై పోరు కోసం చేతులు కలిపే వారి జాబితా తాజాగా హాకీ ఇండియా (హెచ్ఐ), అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) చేరాయి. పీఎం కేర్స్ సహాయ నిధి కోసం హెచ్ఐ, ఏఐఎఫ్ఎఫ్ చెరో రూ. 25 లక్షలు బుధవారం విరాళంగా ప్రకటించాయి. గంగూలీ ఉదారత కరోనా కారణంగా ఆహారం లేక ఇబ్బంది పడే వారిని ఆదుకునేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు, భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ముందుకొచ్చాడు. అతను బుధవారం రామకృష్ణ మిషన్ హెడ్‌కార్టర్స్ అయిన బేలూరు మఠానికి 2,000 కేజీల బియ్యాన్ని అందజేశాడు. ‘25 ఏళ్ల తర్వాత బేలూరు మఠాన్ని సందర్శించాను. అన్నార్థుల కోసం 2,000 కేజీల బియ్యాన్ని అప్పగించాను’ అని దాదా ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు. -
31 వరకు దేశంలో ‘నో’ ఫుట్‌బాల్
న్యూఢిల్లీ: దేశంలో జరిగే అన్ని ఫుట్‌బాల్ మ్యాచ్‌లను ఈ నెల 31 వరకు రద్దు చేస్తూ అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) శనివారం నిర్ణయం తీసుకుంది. దాంతో ఐ–లీగ్, డివిజన్–2, యూత్ లీగ్, గోల్డెన్ లీగ్, జాతీయ టోర్నీలు రద్దయ్యాయి. ఐ–లీగ్‌లోని 28 మ్యాచ్‌లను ప్రేక్షకులు లేకుండానే నిర్వహించాలని ఏఐఎఫ్ఎఫ్ తొలుత అనుకున్నా... కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సలహా మేరకు ఈ నెల చివరి వరకు దేశంలో ఎటువంటి ఫుట్‌బాల్ మ్యాచ్‌లను నిర్వహించరాదని నిర్ణయించింది. -
భారత కోచ్‌గా ఐగర్ స్టిమాక్
న్యూఢిల్లీ: క్రొయేషియాకు చెందిన ఐగర్ స్టిమాక్ భారత ఫుట్‌బాల్ జట్టు హెడ్ కోచ్‌గా నియమితుడయ్యాడు. గురువారం ఇక్కడ సమావేశమైన అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) ఎగ్జిక్యూటివ్ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ పదవి కోసం స్టిమాక్‌తో పాటు లీ మిన్ సంగ్ (దక్షిణ కొరియా), ఆల్బర్ట్ రోకా (స్పెయిన్), హకాన్ ఎరిక్సన్ (స్వీడన్)తో దరఖాస్తు చేశారు. వీరిలో స్టిమాక్ నేరుగా ఇంటర్వ్యూకు హాజరయ్యాడు. మిగతావారు స్కైప్ ద్వారా మాట్లాడారు. అనంతరం సుదీర్ఘంగా చర్చించిన కమిటీ... స్టిమాక్ వైపు మొగ్గింది. 51 ఏళ్ల స్టిమాక్ సెంటర్బ్యాక్గా 53 అంతర్జాతీయ మ్యాచ్‌లాడాడు. 1996 యూరో కప్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించాడు. 1998 ప్రపంచ కప్‌లో మూడో స్థానంలో నిలిచిన క్రొయేషియా జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. 2012–13 మధ్య తమ దేశ జటు కు కోచ్‌గా వ్యవహరించాడు. ఈయన ఆధ్వర్యంలోనే క్రొయేషి యా 2014 ప్రపంచ కప్‌నకు అర్హత సాధించింది. స్టిమాక్ మూడేళ్ల పాటు భారత కోచ్‌గా ఉండనున్నాడు. థాయ్‌లాండ్‌లో జూన్ 5 నుంచి జరుగనున్న కింగ్స్ కప్‌తో అతడి పదవీ కాలం ప్రారంభమవుతుంది. -
250 దరఖాస్తులు!
న్యూఢిల్లీ: ప్రపంచ ఫుట్‌బాల్‌లో భారత్ స్థానం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు! ప్రస్తుతం మన జట్టు ‘ఫిఫా’ ర్యాంకింగ్స్‌లో 103వ స్థానంలో ఉంది. అయినా సరే భారత జట్టు కోచ్ పదవిపై మాత్రం ఎంతో ఆసక్తి కనిపిస్తోంది. అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) కోచ్ పదవి కోసం దరఖాస్తులు ఆహ్వానించగా... దాదాపు 250 మంది దీని కోసం ముందుకు రావడం విశేషం. మార్చి 29న ఈ ప్రక్రియ ముగిసింది. వీరిలో యూరోప్‌కు చెందిన పలువురు ప్రముఖ కోచ్‌లు కూడా ఉన్నారు. కొన్నాళ్ల క్రితం ఆసియా కప్‌లో భారత్ నాకౌట్ దశకు చేరడంలో విఫలం కావడంతో కోచ్ స్టీఫెన్ కాన్స్టాంటైన్ తన పదవికి రాజీనామా చేశారు. అప్పటినుంచి కోచ్ స్థానం ఖాళీగా ఉంది. దరఖాస్తు చేసుకున్నవారిలో ఇండియన్ సూపర్ లీగ్, ఐ–లీగ్‌లలో కోచ్‌లుగా వ్యవహరించినవారు ఉన్నారు. ఈ జాబితాలో గియోవానీ బియాసీ (ఇటలీ), హాకెన్ ఎరిక్సన్ (స్వీడన్), రేమండ్ డామ్‌నెక్ (ఫ్రాన్స్), స్యామ్ అలార్డీస్ (ఇంగ్లండ్) తదితరులు ఉన్నారు. అయితే బెంగళూరు ఫుట్‌బాల్ క్లబ్‌కు అద్భుత విజయాలు అందించిన ఆల్బర్ట్ రోకా కోచ్ రేసులో ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. మరో వైపు పేరు ప్రఖ్యాతులకంటే భారత జట్టు అవసరాలకు అనుగుణంగా కోచ్‌ను ఎంపిక చేస్తామని ఏఐఎఫ్ఎఫ్ ప్రధాన కార్యదర్శి కుశాల్ దాస్ ఇప్పటికే చెప్పారు. -
'మాకు ఏఐఎఫ్ఎఫ్ గుర్తింపు అవసరం లేదు'
న్యూఢిల్లీ: త్వరలో భారత్ లో నిర్వహించబోతున్న కొత్త ఫుట్ బాల్ లీగ్ ప్రీమియర్ ఫుట్సాల్ (ఫైవ్-ఎ-సైడ్) వ్యవహారం మరింత ముదురుతోంది. ఎటువంటి అధికారిక గుర్తింపు లేని ఫుట్సాల్ లీగ్ తో అనవరసమైన సమస్యలు సృష్టించడానికి సిద్ధమవుతున్నారని ఇటీవల ఆలిండియా ఫుట్ బాల్ ఫెడరేషన్(ఏఐఎఫ్ఎఫ్) చేసిన వ్యాఖ్యలపై ఆ లీగ్ తాజాగా మండిపడింది. అసలు తమకు ఏఐఎఫ్ఎఫ్ గుర్తింపే అవసరం లేదంటూ ప్రీమియర్ ఫుట్సాల్ తేల్చి చెప్పింది. తమకు ఫుట్సాల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్ఏఐ) సహకారం ఉన్నందును ఇక ఏఐఎఫ్ఎఫ్ అనుమతి అవసరం లేదని పేర్కొంది. మన ప్రజాస్వామ్యం ప్రకారం లీగ్ ను నిర్వహించే అన్ని అనుమతులు తమకు ఉన్నాయని ఫుట్సాల్ తెలిపింది. న్యాయనిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ లీగ్ నిర్వహించడానికి సిద్దమైనట్లు పేర్కొంది. ఇక ఫుట్సాల్ లీగ్ ను నిర్వహించడమే ఇక తరువాయిగా పేర్కొంది. ఈ మేరకు ఆయా జట్లకు చెందిన యజమానుల పేర్లను మంగళవారం చెన్నైలో వెల్లడిస్తామని తెలిపింది. 'ఫైవ్-ఎ సైడ్' అనే పేరుతో పిలవబడే ఈ లీగ్ జూలై 15 వ తేదీ నుంచి 24 వ తేదీ వరకూ భారత్ లోని వివిధ నగరాల్లో జరుగనుంది. ఈ టోర్నమెంట్లో మొత్తం 21 దేశాలకు చెందిన 50 మంది ఆటగాళ్లు పాల్గొనున్నారు. ప్రీమియర్ ఫుట్సాల్కు పోర్చుగల్ దిగ్గజ ఫుట్‌బాలర్ లూయిస్ ఫిగో నేతృత్వం వహిస్తున్నారు. గత నెల్లో ఆ లీగ్‌కు టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి బ్రాండ్ అంబాసిండర్ వ్యవహరించడాన్ని ఆలిండియా ఫుట్ బాల్ ఫెడరేషన్ తప్పుబట్టిని సంగతి తెలిసిందే.ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)తో ప్రమేయం ఉన్న వ్యక్తి వేరే లీగ్‌లతో ఎలా సంబంధం పెట్టుకుంటాడని ఏఐఎఫ్ఎఫ్ అధ్యక్షుడు ప్రఫుల్ పటేల్ విమర్శించారు. -
కోహ్లి... వేరే లీగ్‌లతో సంబంధమేల!
న్యూఢిల్లీ: భారత టెస్టు క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి... ప్రీమియర్ ఫుట్సాల్ (ఫైవ్-ఎ-సైడ్) లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడాన్ని ఆలిండియా ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) అధ్యక్షుడు ప్రఫుల్ పటేల్ తప్పుబట్టారు. ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)తో ప్రమేయం ఉన్న వ్యక్తి వేరే లీగ్‌లతో ఎలా సంబంధం పెట్టుకుంటాడని విమర్శించారు. కోహ్లిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని పరోక్షంగా సంకేతాలిచ్చారు. ఐఎస్ఎల్ మాదిరిగానే రూపుదిద్దుకుంటున్న ప్రీమియర్ ఫుట్సాల్కు పోర్చుగల్ దిగ్గజ ఫుట్‌బాలర్ లూయిస్ ఫిగో నేతృత్వం వహిస్తున్నారు. -
ఈ యేటి మేటి సునీల్ చెత్రి
* వరుసగా రెండో ఏడాది అవార్డు * ఏఐఎఫ్ఎఫ్ వార్షిక పురస్కారాలు న్యూఢిల్లీ: భారత ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ సునీల్ చెత్రి వరుసగా రెండో ఏడాది అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) ‘ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డును దక్కించుకున్నాడు. ఐ-లీగ్‌లో తను బెంగళూరు ఎఫ్‌సీ జట్టు తరఫున ఆడి ఈ ఏడాది 14 గోల్స్ సాధించాడు. ఈ అవార్డు కింద చెత్రికి ట్రోఫీతో పాటు రూ.2 లక్షల బహుమతి లభించనుంది. మరోవైపు ‘మహిళల ఫుట్‌బాలర్ ఆఫ్ ద ఇయర్’గా బాలా దేవి ఎంపికైంది. కోచ్‌గా కాన్స్టాంటైన్: భారత జట్టు ఫుట్‌బాల్ చీఫ్ కోచ్‌గా స్టీఫెన్ కాన్స్టాంటైన్ ఎంపికయ్యారు. వచ్చే వారం అధికారికంగా ఆయన పేరును ప్రకటిస్తారు. గతంలో స్టీఫెన్ 2002 నుంచి 2005 వరకు భారత జట్టు కోచ్‌గా పనిచేశారు. 171కి దిగజారిన ర్యాంకు: ఐఎస్ఎల్ సూపర్ సక్సెస్‌తో ప్రపంచ ఫుట్‌బాల్‌ను ఆకర్షించిన భారత్... ఫిఫా ర్యాంకింగ్స్‌లో మాత్రం తొలిసారిగా 171వ ర్యాంకుకు దిగజారింది. మొత్తం 209 దేశాలకు ర్యాంకింగ్‌ను ప్రకటించారు.