న్యూఢిల్లీ: త్వరలో భారత్ లో నిర్వహించబోతున్న కొత్త ఫుట్ బాల్ లీగ్ ప్రీమియర్ ఫుట్‌సాల్ (ఫైవ్-ఎ-సైడ్) వ్యవహారం మరింత ముదురుతోంది. ఎటువంటి అధికారిక గుర్తింపు లేని ఫుట్సాల్ లీగ్ తో అనవరసమైన సమస్యలు సృష్టించడానికి సిద్ధమవుతున్నారని ఇటీవల ఆలిండియా ఫుట్ బాల్ ఫెడరేషన్(ఏఐఎఫ్ఎఫ్) చేసిన వ్యాఖ్యలపై ఆ లీగ్ తాజాగా మండిపడింది. అసలు తమకు ఏఐఎఫ్ఎఫ్ గుర్తింపే అవసరం లేదంటూ ప్రీమియర్ ఫుట్సాల్ తేల్చి చెప్పింది. తమకు ఫుట్సాల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్ఏఐ) సహకారం ఉన్నందును ఇక ఏఐఎఫ్ఎఫ్ అనుమతి అవసరం లేదని పేర్కొంది.
మన ప్రజాస్వామ్యం ప్రకారం లీగ్ ను నిర్వహించే అన్ని అనుమతులు తమకు ఉన్నాయని ఫుట్సాల్ తెలిపింది. న్యాయనిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ లీగ్ నిర్వహించడానికి సిద్దమైనట్లు పేర్కొంది. ఇక ఫుట్సాల్ లీగ్ ను నిర్వహించడమే ఇక తరువాయిగా పేర్కొంది. ఈ మేరకు ఆయా జట్లకు చెందిన యజమానుల పేర్లను మంగళవారం చెన్నైలో వెల్లడిస్తామని తెలిపింది. 'ఫైవ్-ఎ సైడ్' అనే పేరుతో పిలవబడే ఈ లీగ్ జూలై 15 వ తేదీ నుంచి 24 వ తేదీ వరకూ భారత్ లోని వివిధ నగరాల్లో జరుగనుంది. ఈ టోర్నమెంట్లో మొత్తం 21 దేశాలకు చెందిన 50 మంది ఆటగాళ్లు పాల్గొనున్నారు. ప్రీమియర్ ఫుట్‌సాల్‌కు పోర్చుగల్ దిగ్గజ ఫుట్‌బాలర్ లూయిస్ ఫిగో నేతృత్వం వహిస్తున్నారు.
గత నెల్లో ఆ లీగ్కు టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి బ్రాండ్ అంబాసిండర్ వ్యవహరించడాన్ని ఆలిండియా ఫుట్ బాల్ ఫెడరేషన్ తప్పుబట్టిని సంగతి తెలిసిందే.ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్)తో ప్రమేయం ఉన్న వ్యక్తి వేరే లీగ్‌లతో ఎలా సంబంధం పెట్టుకుంటాడని ఏఐఎఫ్‌ఎఫ్ అధ్యక్షుడు ప్రఫుల్ పటేల్ విమర్శించారు.