పాతకక్షల నేపథ్యంలో హత్య
పాత మిత్రుల మధ్య ఘర్షణ
దారుణానికి దారి తీసిన వాగ్వాదం
స్నేహితుడి సోదరుడి చేతిలో హతం
కామారెడ్డిలో కలకలం రేపిన కత్తిపోట్లు
కామారెడ్డి అర్బన్ (కామారెడ్డి): వారిద్దరు మిత్రులు.. మనస్పర్థలతో బద్ధ శత్రువులుగా మారారు.. ఒకరిపై మరొకరు కేసులూ పెట్టుకున్నారు.. ఆ తర్వాత రాజీ కుదర్చుకొని ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. అయితే, మంగళవారం రాత్రి ఇద్దరి మధ్య మొదలైన వాగ్వాదం ఘర్షణకు దారి తీసింది. ఈ క్రమంలో జరిగిన దాడిలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. కామారెడ్డిలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. పట్టణ ఎస్‌హెచ్‌వో శ్రీధర్‌కుమార్ కథనం ప్రకారం.. హనుమాన్‌నగర్ కాలీనికి చెందిన అన్వర్, మాజిద్ స్నేహితులు. మనస్పర్థలు రావడంతో తరచూ గొడవ పడ్డారు. 2014లో ఇద్దరి మధ్య ఘర్షణలు చోటు చేసుకొని పోలీసుస్టేషన్ వరకు చేరింది పంచాయతీ. కేసులు నమోదు కావడంతో ఇద్దరూ రాజీ కుదుర్చుకున్నారు.
అయితే, మంగళవారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో పట్టణంలోని రైల్వేస్టేషన్ వద్ద అన్వర్, మాజిద్‌లు వారి వారి స్నేహితులతో కలిసి ఒకే చోట కలుసుకున్నారు. ఈ క్రమంలో అన్వర్, మాజీద్‌ల మధ్య మాటమాటా పెరిగి వాగ్వాదం జరిగింది. పాత కక్షల నేపథ్యంలో ఇది ఘర్షణగా మారింది. గొడవ గురించి సమాచారం అందుకున్న మాజీద్ సోదరుడు అక్బర్ అక్కడికి చేరుకొని అన్వర్‌పై కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన అన్వర్‌ను అతడి స్నేహితులు వెంటనే ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందాడు.
డీఎస్పీ ప్రసన్నరాణి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రత్యక్ష సాక్షులను విచారించి వివరాలు నమోదు చేసుకున్నారు. అన్వర్ స్నేహితుడు అంజద్‌ఖాన్ ఫిర్యాదు మేరకు అక్బర్, మాజీద్, అజీమ్, మెహెరాజ్‌లపై కేసు నమోదు చేశామని ఎస్‌హెచ్‌వో శ్రీధర్‌కుమార్ తెలిపారు. మృతుడు అన్వర్‌కు భార్య, కుమారుడు ఉన్నారు. ఉద్రిక్త పరిస్థితుల మధ్య బుధవారం సాయంత్రం అన్వర్ అంత్యక్రియలు జరిగాయి. ఇరువర్గాల ఘర్షణ నేపథ్యంలో జరిగిన హత్య కావడంతో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.