సాక్షి, హైదరాబాద్: తమ సమస్యలను పరిష్కరించకుంటే సమరం చేయాల్సి ఉంటుందని తెలంగాణ బోధనా వైద్యుల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ఆ సంఘం సర్వసభ్య సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ అన్వర్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ జలగం తిరుపతిరావు, ఉపాధ్యక్షులు డాక్టర్ కిరణ్ మాదల, డాక్టర్ ప్రతిభాలక్ష్మి, కోశాధికారి డాక్టర్ కిరణ్ ప్రకాష్, ప్రాంతీయ కార్యదర్శి డాక్టర్ ఎల్.రమేష్ ఈ మేరకు ప్రకటించారు.
రాష్ట్రంలోని మొత్తం 25 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్లు సహా అదనపు డీఎంఈ స్థాయి వరకు బోధనా వైద్యులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ప్రతీ నెలా జరుగుతున్న సమీక్ష సమావేశంలో కేవలం లక్ష్యాలు ఇవ్వటమే కాక, వైద్యుల సమస్యల గురించి కూడా చర్చ జరగాలని వారు డిమాండ్ చేశారు.
సమస్యల విషయంలో గత ఏడాది నిరసన తెలిపినప్పుడు మంత్రి హరీశ్ రావు భరోసాతో వెనక్కి తగ్గినప్పటికీ, అందులో అనేక సమస్యలు అలాగే పరిష్కారం కాకుండా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలను మరోసారి ప్రభుత్వానికి తెలియజేస్తామని, అప్పటినుంచి నిర్ణీత వారం రోజుల సమయంలో స్పందించకపోతే, ‘చలో హైదరాబాద్‘ అనే నినాదంతో పోరాటం చేయాలని నిర్ణయించామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment