సాక్షి, హైదరాబాద్: వైద్య విద్యా సంచాలకులు (డీఎంఈ) పరిధిలోని బోధనాస్పత్రుల్లో 1,827 స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు అనుమతులు మంజూరు చేస్తూ ఆర్థికశాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ మెడికల్ హెల్త్ అండ్ రిక్రూట్‌మెంట్ బోర్డు ప్రత్యక్ష నియామకం పద్ధతిలో వీటిని భర్తీ చేయనుంది. కాగా, జిల్లాకో వైద్య కళాశాల ఏర్పాటు చేయాలనే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు లక్ష్యాన్ని వేగంగా చేరుకుంటున్నామని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఓ ప్రకటనలో తెలిపారు.
తెలంగాణ ఏర్పాటుకు ముందు ఐదు వైద్య కళాశాలలు మాత్రమే ఉంటే, ఇప్పుడు ఆ సంఖ్య 26కు చేరిందన్నారు. వచ్చే ఏడాదిలో మరో 8 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. దీంతో పేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు చేరువవుతుండటంతో పాటు, తెలంగాణ బిడ్డలకు వైద్య విద్య అందుబాటులోకి వస్తుందన్నారు.
వైద్య కళాశాలలు ఏర్పాటు చేయడంతో పాటు అవసరమైన వైద్యులను, నర్సులను, ఇతర సిబ్బందిని భర్తీ చేస్తుందన్నారు. ఇప్పటికే 1,061 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీ ప్రక్రియ పూర్తి చేసి, వారిని బోధనాస్పత్రుల్లో నియమించుకున్నామని, 5,204 స్టాఫ్ నర్సుల నియామక ప్రక్రియ కొనసాగుతోందని ఇందుకు సంబంధించి ఆగస్టులో కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment