ఇండియన్ పొలిటికల్ కార్టూన్ అంటే ప్రపంచం తల తిప్పి ఆర్కే లక్ష్మణ్ అనే సంతకం వైపు చూస్తుంది . అటువంటి మహా చిత్రకారుడు ఆర్కే లక్ష్మణ్ కథ
బొమ్మలనే సాధనగా, సాధనే జీవితంగా సాగిన లక్ష్మణ్ జీవితంలో లైఫ్ స్కెచింగ్ చోటు చేసుకున్నంతగా మరే భారతీయ వ్యంగ చిత్రకారుడి జీవితంలో ఈ సాధన రక్తంలో రక్తంగా కలిసిపోవడాన్ని విని ఉండలేదు. లక్ష్మణ్ పార్లమెంట్ని ఫొటోల్లో చూసి తన బొమ్మల్లోకి దింపలేదు.
పార్లమెంట్ ఎదురుగా కూచుని దానిని అన్ని కోణాల్లో బొమ్మగా మార్చుకున్నాడు. రాజకీయనాయకులని, బ్యాంక్ ఉద్యోగస్తులని, చెట్టు కింద చిలుక జ్యోతిష్కుడిని, మెరైన్ డ్రైవ్ రహదారి అంచున కూర్చున్న మనుషులని ఎవరిని కూడా ఊహించుకుని వేసిన బొమ్మలు కావవి.
అందరిని చూసాడు, తనలో ఇంకించుకున్నాడు. బొంబాయి నగరాన్నంతా కట్టల కొద్దీ స్కెచ్ పుస్తకాల్లో నమోదు చేసుకున్నాడు . జీవిత నిరంతరం సాధన చేస్తూనే ఉన్నాడు. అందుకే తనది ఇక మరెవరూ దాటలేని నల్లని ఇంకు గీతల లక్ష్మణరేఖ ఐయింది. ఇరవైల ప్రాయంలో లక్ష్మణ్ జీవితంలోని కొన్నిపేరాల సంఘటనలు ఇక్కడ..
అప్పటికప్పుడు పత్రిక సంపాదకుడ్ని కలిసి నా గురించి ఆయనకు చెప్పుకున్నాను . అంతా విని ఆయన మరో మాట ఏమీ లేకుండా వెంటనే ‘కల్బాదేవి కాల్పులపై’ ఒక కార్టూన్ స్ట్రిప్ చిత్రించమని పని నాకు ఇచ్చాడు. కల్బాదేవి అనేది బొంబాయిలో బాగా పేరున్న ఒక ప్రముఖ వ్యాపార కేంద్రం. మన దేశానికి స్వాతంత్ర్యం రాకముందు జరిగిన అతి పెద్ద ఉగ్రవాద దాడికి, మారణకాండకు ఈ ప్రాంతమే కేంద్రం.
14 సెప్టెంబర్ 1946న ఇండియన్ ఆర్మీ క్యాంపునకు సంబంధించిన ఇద్దరు సైనికులు సైనిక లారీలో తమ యూనిట్ నుండి ఆయుధాలతో సహా తప్పించుకుని బైకుల్లా రైల్వే స్టేషన్ సమీపంలో ఒక టాక్సీని కిరాయికి తీసుకుని కల్బాదేవి వైపు వెళ్ళమన్నారు. ఆ టాక్సీ నారిమన్ అనే పార్సీ వ్యక్తికి చెందింది. ఆ సమయంలో ఆ టాక్సీలో అతనితో పాటు యుక్తవయస్కుడైన అతని కొడుకు కూడా ఉన్నాడు.
హంతకులు నేరుగా టాక్సీని కల్బాదేవి వేపు తీసుకెళ్ళి, టాక్సీ నుండి దిగీ దిగగానే ఇద్దరూ తమ చేతిలో ఉన్న మెషిన్ గన్‌లతో రహదారిపై కాల్పులు జరపడం మొదలుపెట్టారు. ఇటువంటి దారుణాన్ని ఊహించని డ్రైవర్, అతని కొడుకు ఇద్దరూ భయాందోళనలకు గురై టాక్సీని వదిలి పారిపోజూశారు. ఆ హంతకులు ఈ తండ్రీ కొడుకులు ఇరువురిని కూడా చంపేశారు.
ఈ దారుణకాండలో దుకాణంలో కూచుని ఉన్న ఒక నగల వ్యాపారి, ఉదయాన్నే బడికి బయలుదేరిన ఒక చిన్న పిల్లవాడు, రోడ్డు మీద కూరగాయలు అమ్మే ఒక మనిషి, టీ దుకాణంలో కూచుని టీ తాగుతున్న ఒక వ్యక్తి ఇంకా కొంతమంది పాదచారులతో సహా మొత్తం ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇరవైమంది తీవ్రంగా గాయపడ్డారు.
నిందితులను బాంబే పోలీసులు సంఘటన జరిగిన రెండు నెలల్లో అరెస్టు చేశారు. భారతదేశానికి స్వాతంత్ర్యం రావడానికి కొన్ని రోజుల ముందు కోర్టు వారిని విచారించి మరణశిక్ష విధించింది. ఇదంతా నేను బొంబాయి చేరుకునే సమయం ముందుగా జరిగింది. ఆ సమయంలో ఇది దేశ వ్యాప్తంగా చాలా పెద్ద సంచలన వార్త.
బ్లిట్జ్ ఎడిటర్ నాకు ఈ కథను క్లుప్తంగా చెప్పాడు. ఈ సంఘటన విచారణకు సంబంధించిన కోర్ట్ కాగితాల ప్రతులను కూడా నాకు అందచేశాడు. ఈ ఇతివృత్తాన్ని ఒక బొమ్మల కథగా తయారు చేయాలని, ఆ కథ ప్రతీ వారం తమ పత్రికలో రావాలని, ఇందుకు గానూ ఆయన నాకు వెయ్యి రూపాయలు ఇస్తానని ఆఫర్ చేశాడు.
పంతొమ్మిది వందల నలభైలలో వేయి రూపాయలంటే చాలా పెద్ద డబ్బు. ప్రస్తుతం నేను మద్రాసు నుండి వెలువడే స్వరాజ్య పత్రికవాళ్ళు నా కార్టూన్లకు పంపుతున్న డబ్బుతో బొంబాయిలో కాలం నెట్టుకొస్తున్నాను. ఇప్పుడు రాబోతున్న బ్లిట్జ్ డబ్బులు ఇవన్నీ కలుపుకుని బొంబాయిలో ఇంకొంత కాలం గడపవచ్చు కదా అని సంబరపడ్డాను.
బొమ్మల కథకు అవసరమైన నేపథ్యాన్ని అధ్యయనం చేయడానికి కాల్పులు జరిగిన కల్బాదేవి ప్రాంతం గుండా నన్ను తీసుకెళ్లడానికి, కాల్పులు జరిగినపుడు అక్కడే ఉన్న కొంతమంది ప్రత్యక్ష సాక్షులను, బాధితులను నేను కలుసుకుని మాట్లాడ్డానికి , వారి ద్వారా జరిగిన సంఘటన తబ్సీలు ఎక్కించుకోవటానికి గాను నా కోసం ఆ ప్రాంతపు ఆనుపానులు తెలిసిన వారిని కొంతమందిని సహాయంగా కల్బాదేవి ప్రాంతానికి పంపించాడు బ్లిట్జ్ ఎడిటర్.
కల్బాదేవి అనేది దాదాపు అరకిలోమీటరు పొడవునా రద్దీగా ఉన్న రహదారి మార్గం. రోడ్డుపై బస్సులు, కార్లు, సైకిళ్లు, తోపుడు బళ్ళు, మనుష్యులు అనేకులు బిలబిలమని కదులుతూనే ఉన్నారు. వీధికి రెండు వైపులా పుస్తకాలు అమ్మేవాళ్ళు, గడియారాలు రిపేర్లు చేసే చిన్న చిన్న కొట్లవాళ్ళు, మంగలి షాపులు, టీ షాపులు, వెండిపని చేసే కంసాలి దుకాణాలు, బట్టలు అమ్మే వ్యాపారులు, ఇలా ఎన్నో రకాల వ్యాపారాలు బారులు బారులుగా నడుస్తున్నాయి .
వీధిలో అటూ ఇటూ చూసుకుంటూ నేను అక్కడ జరిగిన నరమేధం గురించి ఆలోచిస్తున్నాను. ముందస్తుగా ఎటువంటి ఘోరాన్ని ఊహించని ఒక ఉదయాన వీధి నడి బొడ్డున వచ్చి ఆగిన ఒక టాక్సీ నుండి నిప్పులు కక్కుతూ తుపాకులు సృష్టించిన భీకర మారణకాండని తలుచుకుంటే ఆ క్షణం నాకు వెన్ను నుండి వణుకు పుట్టుకువచ్చింది.
కల్బాదేవి దారుణ సంఘటనను బొమ్మల కథగా మలచడానికి ఆ రహదారిలో నిలబడి నేనొక భ్రమను నా చుట్టూ అల్లుకున్నాను. ఆ సంఘటన జరిగిన రోజున ఆ నేరగాళ్ళు ప్రయాణించిన కారులో నేనూ అదృశ్యంగా ఉన్నట్టు, వారి సంభాషణ మొత్తం నా సమక్షంలోనే జరుగుతున్నట్టు, వారి తుపాకి నుండి వెలువడిన ప్రతి తూటా నా కళ్ళ ముందే దూసుకుపోయినట్టు – రవ్వలు కక్కే ఆ అంగుళమంత నిప్పుముక్క ఏ దుకాణపు తలుపును ఛేదించుకుంటూ పోయిందో!
ఏ మనిషి కడుపును కుళ్ళపొడుస్తూ తన రక్తదాహం తీర్చుకుందో! మనుషులు ఆర్తనాదాలు చేస్తూ ఎలా కకావికలమయ్యారో, ఎలా కుప్పకూలిపోయారో! – అశరీరంగా నేను చూస్తున్నట్లు బొమ్మలు వేసేందుకు అనువయిన ప్రతి సన్నివేశాన్ని అనేకానేక కోణాల నుండి గమనించినట్లు ఒక అవాస్తవ భ్రాంతిని సృష్టించుకున్నాను . ఆ సమయంలో నేను మొదటి సారిగా కల్బాదేవి వీధిలో నడుస్తూ నిలువెల్లా వణికిపోయినవాడిని కాను. నా ఎరుక లేకుండా జరిగిపోయిన దానిని కూడా అవసరమైనపుడు ఊహాపోహలుపోయి కళ్ళముందుకు తెచ్చుకుని దానిని నల్లని గీతలతో పునఃప్రతిష్ట చేయగలిగిన చిత్రకారుడిని నేను. నేను లక్ష్మణ్ని.
-అన్వర్, ఆర్టిస్ట్, సాక్షి.
Comments
Please login to add a commentAdd a comment