RK Laxman
-
ఆ క్షణం నాకు వెన్ను నుంచి వణుకు పుట్టుకువచ్చింది..
ఇండియన్ పొలిటికల్ కార్టూన్ అంటే ప్రపంచం తల తిప్పి ఆర్కే లక్ష్మణ్ అనే సంతకం వైపు చూస్తుంది . అటువంటి మహా చిత్రకారుడు ఆర్కే లక్ష్మణ్ కథ బొమ్మలనే సాధనగా, సాధనే జీవితంగా సాగిన లక్ష్మణ్ జీవితంలో లైఫ్ స్కెచింగ్ చోటు చేసుకున్నంతగా మరే భారతీయ వ్యంగ చిత్రకారుడి జీవితంలో ఈ సాధన రక్తంలో రక్తంగా కలిసిపోవడాన్ని విని ఉండలేదు. లక్ష్మణ్ పార్లమెంట్‌ని ఫొటోల్లో చూసి తన బొమ్మల్లోకి దింపలేదు. పార్లమెంట్ ఎదురుగా కూచుని దానిని అన్ని కోణాల్లో బొమ్మగా మార్చుకున్నాడు. రాజకీయనాయకులని, బ్యాంక్ ఉద్యోగస్తులని, చెట్టు కింద చిలుక జ్యోతిష్కుడిని, మెరైన్ డ్రైవ్ రహదారి అంచున కూర్చున్న మనుషులని ఎవరిని కూడా ఊహించుకుని వేసిన బొమ్మలు కావవి. అందరిని చూసాడు, తనలో ఇంకించుకున్నాడు. బొంబాయి నగరాన్నంతా కట్టల కొద్దీ స్కెచ్ పుస్తకాల్లో నమోదు చేసుకున్నాడు . జీవిత నిరంతరం సాధన చేస్తూనే ఉన్నాడు. అందుకే తనది ఇక మరెవరూ దాటలేని నల్లని ఇంకు గీతల లక్ష్మణరేఖ ఐయింది. ఇరవైల ప్రాయంలో లక్ష్మణ్ జీవితంలోని కొన్నిపేరాల సంఘటనలు ఇక్కడ.. అప్పటికప్పుడు పత్రిక సంపాదకుడ్ని కలిసి నా గురించి ఆయనకు చెప్పుకున్నాను . అంతా విని ఆయన మరో మాట ఏమీ లేకుండా వెంటనే ‘కల్బాదేవి కాల్పులపై’ ఒక కార్టూన్ స్ట్రిప్ చిత్రించమని పని నాకు ఇచ్చాడు. కల్బాదేవి అనేది బొంబాయిలో బాగా పేరున్న ఒక ప్రముఖ వ్యాపార కేంద్రం. మన దేశానికి స్వాతంత్ర్యం రాకముందు జరిగిన అతి పెద్ద ఉగ్రవాద దాడికి, మారణకాండకు ఈ ప్రాంతమే కేంద్రం. 14 సెప్టెంబర్ 1946న ఇండియన్ ఆర్మీ క్యాంపునకు సంబంధించిన ఇద్దరు సైనికులు సైనిక లారీలో తమ యూనిట్ నుండి ఆయుధాలతో సహా తప్పించుకుని బైకుల్లా రైల్వే స్టేషన్ సమీపంలో ఒక టాక్సీని కిరాయికి తీసుకుని కల్బాదేవి వైపు వెళ్ళమన్నారు. ఆ టాక్సీ నారిమన్ అనే పార్సీ వ్యక్తికి చెందింది. ఆ సమయంలో ఆ టాక్సీలో అతనితో పాటు యుక్తవయస్కుడైన అతని కొడుకు కూడా ఉన్నాడు. హంతకులు నేరుగా టాక్సీని కల్బాదేవి వేపు తీసుకెళ్ళి, టాక్సీ నుండి దిగీ దిగగానే ఇద్దరూ తమ చేతిలో ఉన్న మెషిన్ గన్లతో రహదారిపై కాల్పులు జరపడం మొదలుపెట్టారు. ఇటువంటి దారుణాన్ని ఊహించని డ్రైవర్, అతని కొడుకు ఇద్దరూ భయాందోళనలకు గురై టాక్సీని వదిలి పారిపోజూశారు. ఆ హంతకులు ఈ తండ్రీ కొడుకులు ఇరువురిని కూడా చంపేశారు. ఈ దారుణకాండలో దుకాణంలో కూచుని ఉన్న ఒక నగల వ్యాపారి, ఉదయాన్నే బడికి బయలుదేరిన ఒక చిన్న పిల్లవాడు, రోడ్డు మీద కూరగాయలు అమ్మే ఒక మనిషి, టీ దుకాణంలో కూచుని టీ తాగుతున్న ఒక వ్యక్తి ఇంకా కొంతమంది పాదచారులతో సహా మొత్తం ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇరవైమంది తీవ్రంగా గాయపడ్డారు. నిందితులను బాంబే పోలీసులు సంఘటన జరిగిన రెండు నెలల్లో అరెస్టు చేశారు. భారతదేశానికి స్వాతంత్ర్యం రావడానికి కొన్ని రోజుల ముందు కోర్టు వారిని విచారించి మరణశిక్ష విధించింది. ఇదంతా నేను బొంబాయి చేరుకునే సమయం ముందుగా జరిగింది. ఆ సమయంలో ఇది దేశ వ్యాప్తంగా చాలా పెద్ద సంచలన వార్త. బ్లిట్జ్ ఎడిటర్ నాకు ఈ కథను క్లుప్తంగా చెప్పాడు. ఈ సంఘటన విచారణకు సంబంధించిన కోర్ట్ కాగితాల ప్రతులను కూడా నాకు అందచేశాడు. ఈ ఇతివృత్తాన్ని ఒక బొమ్మల కథగా తయారు చేయాలని, ఆ కథ ప్రతీ వారం తమ పత్రికలో రావాలని, ఇందుకు గానూ ఆయన నాకు వెయ్యి రూపాయలు ఇస్తానని ఆఫర్ చేశాడు. పంతొమ్మిది వందల నలభైలలో వేయి రూపాయలంటే చాలా పెద్ద డబ్బు. ప్రస్తుతం నేను మద్రాసు నుండి వెలువడే స్వరాజ్య పత్రికవాళ్ళు నా కార్టూన్లకు పంపుతున్న డబ్బుతో బొంబాయిలో కాలం నెట్టుకొస్తున్నాను. ఇప్పుడు రాబోతున్న బ్లిట్జ్ డబ్బులు ఇవన్నీ కలుపుకుని బొంబాయిలో ఇంకొంత కాలం గడపవచ్చు కదా అని సంబరపడ్డాను. బొమ్మల కథకు అవసరమైన నేపథ్యాన్ని అధ్యయనం చేయడానికి కాల్పులు జరిగిన కల్బాదేవి ప్రాంతం గుండా నన్ను తీసుకెళ్లడానికి, కాల్పులు జరిగినపుడు అక్కడే ఉన్న కొంతమంది ప్రత్యక్ష సాక్షులను, బాధితులను నేను కలుసుకుని మాట్లాడ్డానికి , వారి ద్వారా జరిగిన సంఘటన తబ్సీలు ఎక్కించుకోవటానికి గాను నా కోసం ఆ ప్రాంతపు ఆనుపానులు తెలిసిన వారిని కొంతమందిని సహాయంగా కల్బాదేవి ప్రాంతానికి పంపించాడు బ్లిట్జ్ ఎడిటర్. కల్బాదేవి అనేది దాదాపు అరకిలోమీటరు పొడవునా రద్దీగా ఉన్న రహదారి మార్గం. రోడ్డుపై బస్సులు, కార్లు, సైకిళ్లు, తోపుడు బళ్ళు, మనుష్యులు అనేకులు బిలబిలమని కదులుతూనే ఉన్నారు. వీధికి రెండు వైపులా పుస్తకాలు అమ్మేవాళ్ళు, గడియారాలు రిపేర్లు చేసే చిన్న చిన్న కొట్లవాళ్ళు, మంగలి షాపులు, టీ షాపులు, వెండిపని చేసే కంసాలి దుకాణాలు, బట్టలు అమ్మే వ్యాపారులు, ఇలా ఎన్నో రకాల వ్యాపారాలు బారులు బారులుగా నడుస్తున్నాయి . వీధిలో అటూ ఇటూ చూసుకుంటూ నేను అక్కడ జరిగిన నరమేధం గురించి ఆలోచిస్తున్నాను. ముందస్తుగా ఎటువంటి ఘోరాన్ని ఊహించని ఒక ఉదయాన వీధి నడి బొడ్డున వచ్చి ఆగిన ఒక టాక్సీ నుండి నిప్పులు కక్కుతూ తుపాకులు సృష్టించిన భీకర మారణకాండని తలుచుకుంటే ఆ క్షణం నాకు వెన్ను నుండి వణుకు పుట్టుకువచ్చింది. కల్బాదేవి దారుణ సంఘటనను బొమ్మల కథగా మలచడానికి ఆ రహదారిలో నిలబడి నేనొక భ్రమను నా చుట్టూ అల్లుకున్నాను. ఆ సంఘటన జరిగిన రోజున ఆ నేరగాళ్ళు ప్రయాణించిన కారులో నేనూ అదృశ్యంగా ఉన్నట్టు, వారి సంభాషణ మొత్తం నా సమక్షంలోనే జరుగుతున్నట్టు, వారి తుపాకి నుండి వెలువడిన ప్రతి తూటా నా కళ్ళ ముందే దూసుకుపోయినట్టు – రవ్వలు కక్కే ఆ అంగుళమంత నిప్పుముక్క ఏ దుకాణపు తలుపును ఛేదించుకుంటూ పోయిందో! ఏ మనిషి కడుపును కుళ్ళపొడుస్తూ తన రక్తదాహం తీర్చుకుందో! మనుషులు ఆర్తనాదాలు చేస్తూ ఎలా కకావికలమయ్యారో, ఎలా కుప్పకూలిపోయారో! – అశరీరంగా నేను చూస్తున్నట్లు బొమ్మలు వేసేందుకు అనువయిన ప్రతి సన్నివేశాన్ని అనేకానేక కోణాల నుండి గమనించినట్లు ఒక అవాస్తవ భ్రాంతిని సృష్టించుకున్నాను . ఆ సమయంలో నేను మొదటి సారిగా కల్బాదేవి వీధిలో నడుస్తూ నిలువెల్లా వణికిపోయినవాడిని కాను. నా ఎరుక లేకుండా జరిగిపోయిన దానిని కూడా అవసరమైనపుడు ఊహాపోహలుపోయి కళ్ళముందుకు తెచ్చుకుని దానిని నల్లని గీతలతో పునఃప్రతిష్ట చేయగలిగిన చిత్రకారుడిని నేను. నేను లక్ష్మణ్‌ని. -అన్వర్, ఆర్టిస్ట్, సాక్షి. -
భయపడితే... చూపుడువేలైనా బెదిరిస్తుంది!
1975 జూన్ రోజులు. ఆనాటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో అత్యవసర పరిస్థితి విధించారు. ఎమ ర్జెన్సీలో భాగంగా పత్రికా వార్తలపై సెన్సార్షిప్ మొదలైంది. వాటితో పాటే నా కార్టూన్లూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెన్సార్ పర్యవేక్షణ క్రింద ఉంచబడ్డాయి. నేను నా తెలివి తేటలు ఉపయోగించి అరటి తొక్క మీద కాలు వేసి జారిపోయే ముతక హాస్యము, చీరల కొట్టులో మహిళామణుల బేరసారాల వెకిలి హాస్యాల కార్టూన్లు కొన్ని పట్టుకుని సరాసరి ప్రధా నిని కలిశా. ఈ సెన్సార్షిప్ నుంచి నాకు మినహా యింపు ఇవ్వమని కోరుకున్నాను. ఆవిడ చాలా ఓపిగ్గా ఈ అప్పడాల కర్ర కార్టూన్లు అన్ని పరిశీ లించి నా కార్టూన్లు బొత్తిగా నిరపాయకరమనీ, నేను కార్టూన్లను పత్రికలో నిరభ్యంతరంగా ప్రచు రించుకోవచ్చనీ అభయం ఇచ్చారు. ఢిల్లీ నుండి బొంబాయికి తిరిగి రాగానే నేను ప్రధానమంత్రి ముందు ఒలకబోసిన దొంగ వేషం కట్టిపెట్టి ఒకటీ రెండు రోజులు అప్పడాల కార్టూన్లు వంటివి వేసినా, 3వ రోజునుండి నా అసలు రంగు చూపిం చడం మొదలు పెట్టాను. మొదట కాంగ్రెస్ పార్టీ మీద దాడి చేసే కార్టూనులు, ఆ పై ఎమర్జెన్సీని తూర్పారపట్టే కార్టూనులు... ఒకదాని తరువాత మరొకటిగా నిప్పు రగిలిస్తున్నా. చండీగఢ్‌లో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సెషన్ ప్రారంభమైన రోజున టైమ్స్ మొదటి పేజీలో కాంగ్రెస్ అధ్యక్షుడు దేబ్ కాంత్ బరూవా – ఎమర్జెన్సీలను కలిపి కార్టూన్ అచ్చయింది. బరువాకు కార్టూన్ సెగ బాగా తగిలింది. వీసీ శుక్లా అప్పుడు సమాచార, ప్రసార శాఖ మంత్రిగా ఉన్నారు. బరువా, శుక్లాని తన దగ్గరికి పిలిపించుకుని నా కార్టూన్ చూపించి నానా చీవాట్లు పెట్టారు. శుక్లా సరాసరి ఢిల్లీ నుండి బొంబాయి వచ్చారు నా సంగతి కనుక్కోడానికి! కట్ చేస్తే శుక్లా బసచేసిన తాజ్ హోటల్ సూట్లో నేను ఉన్నాను. హలో, హాయ్, నమస్తే వంటి పరామర్శ ఏమీ లేదు. కనీసం నన్ను కూచో మని అన్నది కూడా లేదు. ఒకే మాట ‘ఇంకోసారి ఇటువంటి పిచ్చి గీతలు గీస్తే నిన్ను అత్తారింటికి పంపిస్తా ఏమనుకుంటున్నావో... గెటవుట్’ చూపుడు వేలు ఆడిస్తూ శుక్లా పరమక్రూరంగా! నా కాళ్ళు గజగజ వణికిపోయాయి. నాకు భయం వేసింది, దుఃఖం అనిపించింది, అవమానంగా ఉంది, కడుపు రగిలిపోతోంది. ఇంటికి తిరిగి రాగానే నా భార్య కమలని పిలిచి విషయం చెప్పాను: ‘ఈ పొలిటికల్ కార్టూనింగ్ పనంటూ చేస్తే వెన్నెముక విరుచుకుని పనిచేయాలి, లేదా అసలు ఈ పనే చేయకూడదు, ఇప్పుడు అదే దశ వచ్చింది. నేను ఇక ఈ ఉద్యోగం చేయను, రాజీనామా ఇచ్చేస్తాను’. మా ఆవిడ తెగ సంతోష పడింది. ‘ఎందుకులెద్దూ వెధవ లంపటమూ, ముప్ఫయ్ ఏళ్ళు చేశారు. ఇన్నాళ్ళకు మంచి నిర్ణయం ఒకటి తీసుకున్నారు. హమ్మయ్య!’ సాయంకాలం ఆఫీస్‌కు వెళ్ళి దీర్ఘకాలిక సెల వుకు దరఖాస్తు చేశాను. అక్కడి నుండి సరాసరి ఒక ట్రావెల్ ఏజన్సీకి వెళ్ళి మా దంపతులిరువురి పేరిట మారిషస్‌కు టిక్కెట్లు కొన్నాము. మూడు వారాల పాటు అక్కడ ఉండాలనేది మా ఆలోచన. ఆ దీవిలో ఆ సముద్ర తీరాన బేఫికర్‌గా జీవితాన్ని అస్వాదిం చాము. అక్కడి విదేశీయులు నా భార్య కమల చీర కట్టు గురించీ, నుదుటన దాల్చిన సిందూరం గురించీ ప్రశ్నలు అడగడమే తరువాయి ‘మా దేశం, మా ప్రాచీన సంస్కృతి, మా సంప్రదాయం’ అంటూ రొమ్ము విరుచుకుని వాళ్ళకు జవాబు ఇవ్వ డంలో గొప్ప ఆనందాన్ని పొందేవాణ్ణి. ఒకరోజు మా సాయంకాలపు వాహ్యాళి ముగించుకుని ఇసుక తీరంలోని ఒక కాటేజ్‌లో విశ్రాంతిగా కూర్చు న్నాము. మాకు సమీపంలో ఒక నల్లజాతీయుడు కూచుని ఉన్నాడు. మాకు మాటా మాటా కలిసింది. అతనికి లెబనాన్‌లో ఏదో ఎగుమతి చేసే వ్యాపారం ఉంది. ఆయన నన్ను అడిగాడు: ‘ఇంతకూ మీరేం పని చేస్తారో చెప్పనే లేదు?’ ‘నేనా? వార్తా పత్రికలో పని చేస్తా, పాత్రికే యుణ్ణి.’ ‘ఓ పత్రికా పనా! గుడ్. అది చాలా గొప్ప వృత్తి, సంపాదకీయాలు అవీ రాస్తారా మీరు?’ ‘రాస్తాను.’ ‘మరి మీరిక్కడ సెలవులో ఉంటే అక్కడ మీ పత్రికలో సంపాదకీయాలు ఎలా రాస్తారు? అది చాలా ముఖ్యమైన పని కదా?’ ‘మహాశయా! నేను వ్రాయను, నేను కార్టూన్లు గీస్తాను.’ ‘కార్టూన్లా! అంటే వ్యంగ్య చిత్రాలు! అబ్బో, అది చాలా అద్భుతమైన కళ, ఇంతకు మీరు ఏ పత్రికలో పని చేస్తారో?’ ‘టైమ్స్ ఆఫ్ ఇండియా.’ ‘నాకు తెలుసుగా ఆ పత్రిక! మీ పేరు?’ ‘లక్ష్మణ్’ ‘వావ్! యూ సెడ్ ఇటా?’ నేను అదిరి పోయాను. భారత దేశానికి అయిదు వేల మైళ్ల దూరంలోని ఒక ప్రదేశంలో, అటు ఆ దేశానికీ, ఇటు ఈ దేశానికీ చెందని ఒక వ్యక్తి నోటి నుండి నేను రోజూ వేసే కార్టూన్ శీర్షిక, అతని యాసలో! ‘మీకు ఎలా తెలుసు?’ ‘లెబనాన్‌లో మీ దేశపు రాయబారి ఎల్కే సింగ్ ఉంటారు. అతనికి, నాకు పరిచయం. నేను అతని వద్దకు వెళ్లినప్పుడల్లా మీ కార్టూన్లు చూపిస్తారు. చూపిస్తూ ఇలా అంటారు: ‘‘చూశావా! మా ప్రజా స్వామ్యం గొప్పతనం! మా దేశంలో అత్యవసర పరిస్థితి ఉన్నప్పటికీ, పత్రికా స్వేచ్ఛకు మాత్రం అడ్డం లేదు. అక్కడ మా కార్టూనిస్ట్ ఆర్కే లక్ష్మణ్ ఎమర్జెన్సీలో కూడా అక్కడి రాజకీయ నాయకుల డొక్క చింపుతున్నాడు. ఆ నాయకులు కూడా ప్రజా స్వామ్యాన్ని గౌరవిస్తూ ఆ కార్టూన్లని ప్రచురించ డానికి తల ఒగ్గి ఉన్నారు. అదీ మా దేశ మంటే! సారే జహా సే అచ్ఛా’. దేవుడా! బహుశా ఆ కార్టూన్లు నేను దేశం వదిలి వచ్చేముందు గీసినవి అయి ఉంటాయి. వాటి ఆధారంగా పరాయి దేశంలో మా పత్రికా స్వేచ్ఛని, మా కార్టూనిస్టుల పదును నైజాన్ని, నా దేశపు ప్రజాస్వామ్యపు స్వేచ్ఛని నిరూపించడానికి దేశం కాని దేశంలో వాటిని భద్రంగా ఉపయోగి స్తున్నారు. ఇక్కడ ఒక విదేశీయుడు వాటి ఆధా రంగా మమ్మల్ని, మా ధైర్యాన్ని గానం చేస్తున్నాడు. నేనేం చేస్తున్నాను? ఒక చూపుడు వేలు బెదిరింపు నకు వణికిపోయి ఇక్కడికి వచ్చి కూచున్నాను. లేచి నిలబడి బట్టలకంటిన ఇసుక దులుపుకొన్నాను. కమల అడిగింది: ‘ఎక్కడికి, హోటల్ రూం కా?’ ‘కాదు, సెలవు ముగిసింది, వెళ్ళి ఇక కార్టూన్లు వేయాలి.’ – ఆర్కే లక్ష్మణ్ అంతరంగ కథనం: అన్వర్ (ఇండియన్ పొలిటికల్ కార్టూన్ అంటే ప్రపంచమంతా తలతిప్పి ఆర్ కే లక్ష్మణ్ అనే సంతకం వైపు చూస్తుంది. అక్టోబర్ 24న రాశిపురం కృష్ణస్వామి లక్ష్మణ్ శతజయంతి) -
సమాజాన్ని ప్రతిబింబిస్తాయి
ఆర్కే లక్ష్మణ్ కార్టూన్లపై గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ హైదరాబాద్: ఆర్కే లక్ష్మణ్ కార్టూన్లు భారతదేశంలోని విద్యావంతులను బాగా తీర్చిదిద్దాయని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ అన్నారు. మేధావులు, విద్యావంతులకు సమాజ పోకడలకు సంబంధించిన విషయాలను తన కార్టూన్ల ద్వారానే తెలిపారని కొనియాడారు. గురువారం రెడ్‌హిల్స్‌లోని ఫ్టాప్సీలో ఆర్కే లక్ష్మణ్ స్మారకోపన్యాసానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఆర్కే లక్ష్మణ్ రూపొందించిన కామన్‌మ్యాన్ కార్టూన్ సమాజంలో సమకాలీన మానవుని హృదయాన్ని ఆవిష్కరింపజేసిందని ఆయన ప్రశంసించారు. సమాజంలో నెలకొన్న సమస్యలు, రాజకీయ, సామాజిక స్థితిగతులు తదితర విషయాలు తన కార్టూన్ల ద్వారా ఆవిష్కరించారని అన్నారు. ఆర్కే లక్ష్మణ్ ఒక పొలిటికల్ సైంటిస్ట్ అని, విమర్శకుడు అని కొనియాడారు. ఆర్కే ఐపీఆర్ ఫౌండేషన్ ప్రతినిధి ఉషా లక్ష్మణ్ మాట్లాడుతూ... ఆర్కే లక్ష్మణ్ పేరిట అంతర్జాతీయ స్థాయి కార్డూన్ అకాడమీని స్థాపించబోతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫ్టాప్సీ అధ్యక్షుడు రవీంద్రమోడీ, ఫిక్కీ తెలంగాణ కౌన్సిల్ చైర్మన్ వెంకటేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు -
సెల్యూట్ టు ‘కామన్ మ్యాన్’
మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో ప్రముఖ దివంగత కార్టూనిస్టు ఆర్కే లక్ష్మణ్ సృష్టించిన ‘కామన్ మ్యాన్’, ఆయనకు సెల్యూట్ చేస్తున్న పోలీసు విగ్రహాల ప్రారంభోత్సవ దృశ్యం. వీధుల సుందరీకరణ ప్రాజెక్టులో భాగంగా మహారాష్ట్ర ప్రభుత్వం వీటిని గురువారం ఏర్పాటుచేసింది. -
‘లక్ష్మణ్ రేఖ’ చిరంజీవి
‘‘బడ్జెట్ మీద కార్టూన్ వేయాలంటే మీ సమీక్ష నేలబారు మనిషికి చేరాలి. ఆర్థికమంత్రికి కాదు. కార్టూన్ దృశ్యం. బొమ్మ మాట్లాడాలి. వాక్యం కాదు. వాక్యమే కావాలంటే వ్యాసం రాయి. బొమ్మ అక్కరలేదు.’’ మనం తరచు చూసే దృశ్యం లో చూడని కోణాన్ని చూపిం చేది - కళ. మనం తరచు చేసే ఆలోచనలో ఆలోచించని కోణాన్ని ఆవిష్కరించేది కార్టూన్. అదీ కళే. ఈ రెంటినీ కేవలం 90 సంవత్సరాలు ఉపాసించిన కళాకారుడు ఆర్కే లక్ష్మణ్. మొదటి దృశ్యం - కాకి. లక్ష్మణ్ చిత్రాల్ని చూసినప్పుడు మనం రోజూ చూసే కాకిలో ఇంత కళాత్మకమైన వైవిధ్యం ఉన్నదా అని పిస్తుంది. మనం రోజూ వినే వార్తల పట్ల ఆయన కార్టూ న్ మన మనసుని గిలిగింతలు పెడుతూనే ఒక హెచ్చరిక చేస్తుంది. మన నాయకులు లక్షలు, కోట్లు ఖర్చు చేస్తున్నారు - ప్రజాసంక్షేమం పేరిట. డ్యామ్‌లు నిర్మిస్తున్నారు- ప్రజాభ్యుదయం పేరిట. ప్రణాళికలు చేస్తున్నారు - ప్రజల్ని ఉద్ధరించే లక్ష్యంతో. ఆస్పత్రులను, విద్యాసంస్థలను, పునరావాస కేంద్రాలను నిర్మిస్తున్నారు- ప్రజల వికాసానికి. కాని, ఇంకా ఇంకా సగటు మనిషి అలాగే అడుక్కుతింటున్నాడు - అన్న సత్యాన్ని స్థూలంగా ఆర్కే లక్ష్మణ్ తన జీవిత కాలమంతా తన కార్టూన్ ద్వారా ఆవి ష్కరించారు. ఆయన కార్టూన్లలో గొప్ప శిల్పం ఏమిటంటే ఈ సగటు మనిషి ఏనాడూ నోరు విప్పి మాట్లా డలేదు. కళ గొప్ప సూచన. గొప్ప విశ్లేషణ. గొప్ప కను విప్పు. నేటితరం రాజకీయ నాయకుల గురించి ఆయన సమీక్ష వినదగ్గది. ‘‘ఆనాటి నాయకులు - నెహ్రూ, మొరార్జీ దేశాయ్, ఇందిరాగాంధీ, పీవీ నరసింహారావు వంటివారు తమదైన వ్యక్తిత్వాలతో కనిపించేవారు. వారి మీద కార్టూన్ వేయడం ఒక అవకాశంలాగ ఉండేది. ఈ తరం నాయకులు- లాలూ ప్రసాద్ యాదవ్, జయలలిత వినా- అందరూ ఒకే మూస. తమదైన వ్యక్తిత్వాలు ప్రత్యేకంగా ఏమీ కని పించవు.’’ నోరెత్తి మాట్లాడని బడుగు మనిషి సమకాలీన సమాజపు సమీక్ష కోసం కోట్లాది మంది పాఠ కులు ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’లో ‘యూ సెడ్ ఇట్’అనే రెండంగు ళాల కార్టూన్ కోసం 50 సంవత్స రాల పాటు పత్రికను చదివారు. రోడ్ల మీద గుంటలు, ట్రాఫిక్ దిగ్బం ధాలు, నీటి ఎద్దడి, బిచ్చగాళ్లు, నాయ కుల వెర్రితలలు- ఏవీ ఆయన దృష్టినీ, కార్టూన్లనీ దాటి పోలేదు. డెరిల్ డి‘మాంటే అనే చిత్రకారుడు ఆయనతో టైమ్స్ ఆఫ్ ఇండియాలో పనిచేశారు. ఒకసారి వ్యవసాయ భూముల మీద గరిష్ట పరిమితిని ప్రభుత్వం ఎత్తి వేసింది. కుంచించుకుపోతున్న రైతు నెత్తి మీద పెద్ద గుది బండని వేసి లక్ష్మణ్ కార్టూన్ పంపారు. ఇది బొత్తిగా ‘కథ చెప్పినట్టుంది’ అన్నారట డి‘మాంటే. వెంటనే ఆ కార్టూన్ని తెప్పించి- ఆ బండ మీద రాజకీయ నాయకుడు జల్సాగా కూర్చున్న చిత్రాన్ని వేశారట. మరో కితకితలు పెట్టే కార్టూన్. ఒక రాజకీయ నాయకుడి కారు ముందు బడుగు మనిషి నిలబడి ఉన్నా డు. నాయకుడు పక్కవాడితో అంటున్నాడు, ‘‘ఇంకా నయం. స్వచ్ఛమైన తాగునీరు, స్కూళ్లు కావాలని అడు గుతారేమోనని భయపడుతున్నాను. అదృష్టవశాత్తూ వాళ్లు ప్రత్యేక రాష్ట్రాన్ని అడుగుతున్నారు.’’ ఓ పాత్రికేయుడు, ‘‘అయ్యా! మీ కార్టూన్లలో మేధావి చెణుకులు కనిపించవేం?’’ అని అడిగారట. ఆయన సమాధానం- ‘‘బడ్జెట్ మీద కార్టూన్ వేయాలం టే మీ సమీక్ష నేలబారు మనిషికి చేరాలి, ఆర్థికమంత్రికి కాదు. కార్టూన్ దృశ్యం. బొమ్మ మాట్లాడాలి. వాక్యం కాదు. వాక్యమే కావాలంటే వ్యాసం రాయి. బొమ్మ అక్క రలేదు.’’ ఆయన తరం కార్టూనిస్టు, ఆయన అభిమాని- సుధీర్ ధర్ ఆ రోజుల్లో ‘హిందుస్తాన్ టైమ్స్’లో పనిచేసేవారు. ఓసారి హిందు స్తాన్ టైమ్స్ ఆఫీసులో ఆయన బొమ్మ వేసుకుంటూండగా ఎవరో టేబుల్ దగ్గరకి వచ్చి నిలబడ్డారు. చూస్తే లక్ష్మణ్. ఆనందంతో ఉబ్బితబ్బి బ్బయ్యి తన సమక్షంలో బడుగు మనిషిని వేయమని అడిగారట. అతి సులువుగా వేసి, దాని మీద ‘హిందూస్తాన్ టైమ్స్’ అని రాసి పక్కనే ఒక శీర్షిక పెట్టారట: ‘టైమ్స్ ఆఫ్ ఇండియా తప్పక చదవండి!’అని. ధర్ ఆత్రుతగా ‘మీ ఆటోగ్రాఫ్, ఆటోగ్రాఫ్’ అని అన్నారట. లక్ష్మణ్ పెన్ను తీసు కుని ఆటోగ్రాఫ్ రెండుసార్లు పెట్టారట. ఆయనకి ప్రభుత్వం పద్మ భూషణ్ పురస్కారాన్నీ, దరిమి లాను పద్మవిభూషణ్ పురస్కా రాన్నీ ఇచ్చింది. వ్యవస్థని దుయ్యబట్టే కళకి వ్యవస్థ అర్పించిన గౌరవప్రదమైన నివాళి ఇది. సామాజిక అరా చకం పట్ల కళాకారుడి విమర్శ- ఆరోగ్యకరమైన చికిత్స అని తన జీవిత కాలంలోనే వ్యవస్థను ఒప్పించిన కళాకా రుడు, నేలబారు మనిషిని ప్రజల మనసుల్లో చిరంజీవిని చేసిన అపూర్వ సృష్టికర్త ఆర్కే లక్ష్మణ్. మారని ఈ లోకం లో మార్పు అవసరమన్న స్పృహని ఒక పక్క చిన్న నవ్వు తో, వెనువెంటనే చిన్న కవ్వింపుతో ఒక జీవితకాలం కలి గించిన గొప్ప వైద్యుడు లక్ష్మణ్. - గొల్లపూడి మారుతీరావు -
సంక్షేమ హాస్టళ్లకు శాశ్వత సమీక్షా కమిటీలు
హాస్టల్ విద్యార్థులకు ఇస్తున్న మెస్‌చార్జీలు, ఇతర కేటాయింపులు 2012 నాటివే నేటికీ కొనసాగుతున్నాయి. వీటిని పెరిగిన ధరలకు అను గుణంగా పెంచాలనే డిమాండు ముందుకొస్తూనే ఉన్నా ప్రభుత్వానికి చెవికెక్కడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం మారి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినా హాస్టళ్లకు జరిపే కేటాయింపుల్లో ఎలాంటి మార్పులు ఉండ టం లేదు. ప్రస్తుతం ఉన్న ధరలకు అవి ఏమాత్రం సరిపోక విద్యార్థులు అర్ధాకలితో అలమటిస్తున్నారు. వార్డెన్లు/మేట్రెన్లు అనేక అవస్థలు పడు తున్నారు. ప్రభుత్వ చట్టం ప్రకారమే విద్యార్థుల కేటాయింపుల్లో ప్రతి ఏటా 10 శాతం పెరుగుదల ఉండాలి. అది ఎక్కడా అమలుకు నోచుకో వటం లేదు. ఒక యంత్రాంగమంటూ లేనందున ప్రభుత్వం పావలా పెంచి, ముప్పావలా ప్రచారం చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నది. ఆ పెంపుదల కూడా ఏదో భిక్షం వేస్తున్నట్లుగా ఉంటున్నది. అసెంబ్లీలో, పార్లమెంట్లో సభ్యుల జీత, భత్యాలను వారే పెంచుకుంటారు. ఉద్యోగు ల వేతనాల పెరుగుదలకు పి.ఆర్.సి లాంటి శాశ్వత యంత్రాంగాలు ఉన్నాయి. కానీ రాష్ర్టంలో దాదాపు 2,217 హాస్టళ్లలో చదువుతున్న దళిత, బలహీన, గిరిజన విద్యార్థుల అవసరాలు గుర్తించటానికి మా త్రం ఏ యంత్రాంగమూ లేదు. భోజనవసతి కల్పించటం ద్వారా అక్షరా స్యతా శాతాన్ని పెంచటానికి, డ్రాపవుట్ రేటు తగ్గించటానికి, మళ్లీ బడికి, మధ్యాహ్నం భోజన పథకాన్ని అమలు పరుస్తున్నారు. కాని ఇప్పటికే వసతి గృహాల్లో చదువుకుంటామని వ స్తున్న విద్యార్థులను అర్ధాకలితో చంపటం భావ్యం కాదు. హాస్టల్ విద్యార్థులకు కేవలం మెస్ చార్జీలే కాదు. జి.ఓ-126 ప్రకారం రావలసిన అన్ని సౌకర్యాలు వాటికి కేటా యింపులు కూడా సరిపోయే విధంగా పెంచాల్సివుంది. కాస్మో టిక్స్, బట్టల కట్టుకూలీ, గుడ్డ కొనుగోలు, హాస్టల్ నిర్వహణ, ట్యూషన్ ఫీజు లను మారిన, పెరిగిన ధరలకు అనుగుణంగా పెంచాలి. ప్రభుత్వం నిర్దేశించే వస్తువుల కొనుగోలుకి రాష్ర్ట స్థాయిలో, జిల్లా స్థాయిలో కొనుగోలు కమిటీలు ఉన్నట్లే వార్షిక సమీక్షా కమి టీలను కూడా జిల్లా స్థాయిలో, రాష్ర్టస్థాయిలో ఏర్పాటు చేయాలి. ఇం దులో కొనుగోలు కమిటీ చైర్మన్, పౌర సరఫరాల అధికారి, ఏఎస్డబ్ల్యూఓ, వార్డెన్, మేట్రన్, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు, విద్యార్థి సంఘాలకు ప్రాతినిధ్యం ఉండాలి. ఇది ప్రతి ఏటా హాస్టల్‌కు విడుదల అవుతున్న నిధులు, విద్యార్థులకు అందవలసిన సౌకర్యాలు సరిగా అం దుతున్నాయా? లేదా? ధరలు ఎంత శాతం పెరిగాయి, వాటికను గుణంగా మెస్, కాస్మోటిక్స్ ఛార్జీలు, ఇతర సౌకర్యాలకు కేటాయిం పులు ఎంత శాతం పెంచాలో నిర్ధారించి ప్రభుత్వానికి నివేదించాలి. ఎం.శోభన్ నాయక్ ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ర్ట అధ్యక్షులు కార్టూన్ సూపర్ స్టార్ ఐదు దశాబ్దాలపాటు జాతి అంతర్వాణిగా, సామాన్యుల మనస్సాక్షిగా కోట్లమంది హృదయాల్లో నిలిచిన మహోన్నత కార్టూనిస్టు ఆర్కే లక్ష్మణ్. భారతీయ ప్రజాస్వామ్యం, రాజకీయాలు నడుస్తూ వచ్చిన బాధామ యమైన ప్రక్రియలో హాస్యాన్ని, చమత్కారాన్ని ఇంత గొప్పగా చిత్రిం చిన కార్టూనిస్టు మరొకరు లేరు. కార్టూన్లలో ఆయన పొందుపర్చిన హాస్య చమత్కార వ్యాఖ్యలు జీవితానికి సంబంధించిన అత్యద్భుత కొటేషన్లుగా రూపొందాయి. సామాన్యుల వాణిని తన రేఖలో ఇముడ్చుకుని అట్టడుగు ప్రజల వేదనను రాజ కీయంగా, సామాజికంగా ఉన్నత స్థానాల్లో ఉన్న వారి వద్దకు ప్రతిరోజూ కార్టూన్ రూపంలో తీసుకునిపోయి తన కాలపు కలలను, వాటి వెనుక వాస్తవ జీవిత వేద నను జాతిముందు పరిచిన మాన్యుడు ఆయన. కార్టూన్ అంటేనే ఒక ధిక్కార కళ అని, పరిహాస కళ అని నిర్వచించిన వాడు.. సామాన్యుల తరపున నిలిచి ఆ పరిహాసాన్నే, తిరస్కారాన్నే వ్యంగ్యరేఖగా మలచి పాలకులను హెచ్చరించాడు. మారుమూల ప్రాంతాల్లో ఉండే సామా న్యుల ఆర్థిక, రాజకీయ, సామాజిక పరిస్థితులకు అద్దం పట్టిన వక్రరేఖే కామన్ మేన్. తన మనోగతాన్నే సామాన్యుల మనోగతంగా మార్చి చూపిన ఈ అపర కార్టూన్ బ్రహ్మకు నివాళి. ప్రత్యూష బంజారా హిల్స్, హైదరాబాద్ -
‘కామన్ మేన్’ సృష్టికర్త ఇకలేరు
-
‘కామన్ మేన్’ సృష్టికర్త ఇకలేరు
అనారోగ్యంతో కన్నుమూసిన ప్రముఖ కార్టూనిస్ట్ ఆర్కే లక్ష్మణ్ దైనందిన జీవితంలో అష్టకష్టాలు పడుతూ అన్నిచోట్లా తారసపడే నిస్సహాయ ‘కామన్ మేన్’ సృష్టికర్త, ప్రఖ్యాత కార్టూనిస్టు ఆర్కే లక్ష్మణ్(94) ఇక లేరు. ఐదు దశాబ్దాలుగా సామాన్యుడివైపు నిలిచి రాజకీయ నేతలపై చురుక్కుమనిపించే వ్యంగ్యాస్త్రాలు సంధించిన ఆయన సోమవారం పుణేలో అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన మృతిపట్ల రాష్ట్రపతి ప్రణబ్, ప్రధాని మోదీ, కేసీఆర్, చంద్రబాబు, వైఎస్ జగన్ తదితరులు సంతాపం తెలిపారు. అనారోగ్యంతో కన్నుమూసిన ‘సామాన్యుడి’ సృష్టికర్త పుణే/న్యూఢిల్లీ/సాక్షి, హైదరాబాద్: దైనందిన జీవితంలో అష్టకష్టాలు పడుతూ అన్నిచోట్లా తారసపడే నిస్సహాయ ‘కామన్ మేన్’ సృష్టికర్త, ప్రఖ్యాత కార్టూనిస్టు ఆర్కే లక్ష్మణ్(94) ఇక లేరు. ఐదు దశాబ్దాలుగా సామాన్యుడివైపు నిలిచి రాజకీయ నేతలపై చురుక్కుమనిపించే వ్యంగ్యాస్త్రాలు సంధించిన ఆయన సోమవారం పుణేలోని దీనానాథ్ మంగేష్కర్ ఆస్పత్రిలో అనారోగ్యంతో కన్నుమూశారు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సాయంత్రం 6.50 గంటలకు తుదిశ్వాస విడిచారని ఆస్పత్రి వైద్యుడు సమీర్ జోగ్ తెలిపారు. మూత్రనాళ ఇన్ఫెక్షన్, శ్వాస సమస్యలతో లక్ష్మణ్ ఈ నెల 17న ఆస్పత్రిలో చేరారు. పలు కీలక అవయవాలు పనిచేయకపోవడంతో ఆయనకు వెంటిలేటర్‌పై శ్వాస అందించారు. చికిత్సకు స్పందించినా ఆదివారం పరిస్థితి విషమించింది. లక్ష్మణ్‌కు భార్య, రచయిత్రి కమల, మాజీ జర్నలిస్టు అయిన కుమారుడు శ్రీనివాస్, కోడలు ఉష ఉన్నారు. సుప్రసిద్ధ ఆంగ్ల రచయిత ఆర్కే నారాయణ్‌కు ఆయన తమ్ముడు. లక్ష్మణ్ అంత్యక్రియలను మంగళవారం నిర్వహించనున్నారు. ‘మీ బొమ్మలు సామాన్యుల మనోభావాలు’ లక్ష్మణ్ మృతితో ఆయన అభిమానులు విచారంలో మునిగిపోయారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ తదితర ప్రముఖులు ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆయన చిత్రాలు సామాన్యుల మనోభావాలని కొనియాడారు. సామాన్యుడిని జాతి ప్రతిమలా మలచిన ప్రజ్ఞాశాలిని కోల్పోయామని, తాను లక్ష్మణ్ అభిమానినని ప్రణబ్ పేర్కొన్నారు. ‘దేశం మిమ్మల్ని కోల్పోయింది. మా జీవితాల్లో అవసరమైన హాస్యాన్ని పంచి, మా ముఖాల్లో నవ్వులు పూయించినందుకు మీకు ఎంతో కృతజ్ఞులం’ అని మోదీ ట్వీటర్లో పేర్కొన్నారు. సమకాలీన రాజకీయాలపై లక్ష్మణ్ కార్టూన్లు పదునైన విమర్శలని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. లక్ష్మణ్ సృజనాత్మకతకు సున్నిత హాస్యాన్ని జోడించారని తెలంగాణ సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. దేశంలో రాజకీయ వ్యంగ్యచిత్రానికి నడకలు నేర్పిన మహామనీషి లక్ష్మణ్ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కొనియాడారు. ఆయన కార్టూన్లు జాతీయ సంపద అని, ఆయన మరణం తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నారు. సీపీఎం నేత బీవీ రాఘవులు, సీపీఐ నేత కె.రామకృష్ణ కూడా సంతాపం తెలిపారు. లక్ష్మణ్ పూర్తిపేరు రాసీపురం కృష్ణస్వామి లక్ష్మణ్. 1921, అక్టోబరు 24న మైసూర్లో ఓ బడిపంతుల కుటుంబంలో జన్మించారు. ఏడుగురు తోబుట్టువుల్లో ఆయన ఆఖరి వారు. అన్నయ్య సుప్రసిద్ధ నవలా రచయిత ఆర్కే నారాయణ్. లక్ష్మణ్ బాల్యం నుంచే చిత్రకళపై ఆసక్తి కనబరచారు. అక్షరాలు అబ్బకముందే బొమ్మలు గీశారు. మైసూరు మహారాజా కాలే జీలో చదువుతుండగా స్వరాజ్య, బ్లిట్జ్ పత్రికలకు బొమ్మలు వేశారు. ముంబైలోని ‘జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్’లో చేరాలని దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఆయన బొమ్మల్లో పరిణతి లేదని కాలే జీ అడ్మిషన్ నిరాకరించింది. లక్ష్మణ్ నిరాశపడకుండా తన కళ లో మరింత కృషి చేశారు. మైసూరు వర్సిటీ నుంచి బ్యాచ్‌లర్ ఆఫ్ ఆర్ట్స్ పట్టా సాధించారు. ఆ తర్వాత పలు పత్రికల్లో కార్టూన్లు, ఇలస్ట్రేషన్లు వేసి పేరు తెచ్చుకున్నారు. దివంగత శివసేన అధినేత, కార్టూనిస్టు బాల్ ఠాక్రేతో కలసి కొన్నాళ్లు ‘ఫ్రీ ప్రెస్ జర్నల్’లో పనిచేశారు. పతనమౌతున్న ప్రజాస్వామిక విలువలపై వ్యంగ్యాస్త్రాలు సంధించి గొప్ప మానవతావాదిగా కూడా పేరు గడించారు. లక్ష్మణ్ 1951లో ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ పత్రికలో ‘యూ సెడిట్’ శీర్షికతో కామన్ మేన్ కార్టున్లు ప్రారంభించి యావత్ దేశాన్ని ఆకర్షించారు. ఆ పత్రిక 150వ వార్షికోత్సం సందర్భంగా 1988లో ‘కామన్ మేన్’పై ఓ పోస్టల్ స్టాంపు విడుదలైంది. పుణేలో 16 అడుగుల ఎత్తున్న కామేన్ మేన్ విగ్రహాన్నీ నెలకొల్పారంటే ఆ కార్టూన్లకు దక్కిన ఆదరణను అర్థం చేసుకోవచ్చు. లక్ష్మణ్ 1985లో లండన్‌లో తన చిత్రాలను ప్రదర్శించారు. ఓ భారతీయ కార్టూనిస్టు చిత్రాలను ఆ నగరంలో ప్రదర్శించడం అదే తొలిసారి. ‘దేశానికి రాజకీయ నాయకులు చెడ్డవాళ్లే కావొచ్చుగానీ నా వృత్తికి మాత్రం మంచివాళ్లే’ అని ఆయన చమత్కరించేవారు. ‘నా కామన్ మేన్ సర్వాంతర్యామి.. అతడు ఈ యాభై ఏళ్ల నుంచీ మౌనంగా ఉంటున్నాడు. కేవలం వింటుంటాడు’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. లక్ష్మణ్ బహుముఖ ప్రజ్ఞశాలి కూడా. ‘ది టన్నెల్ ఆఫ్ టైమ్’ పేరుతో ఆత్మకథ రాశారు. ‘హోటల్ రివేరా’ తదితర నవలలూ రచించారు. నారాయణ్ రాసిన ‘మాల్గుడీ డేస్’ టీవీ ప్రసారాలకు, కొన్ని హిందీ సినిమాలకు ఇలస్ట్రేటర్‌గా పని చేశారు. ఆయన భరతనాట్య కళాకారిణి, అలనాటి సినీనటి కుమారి కమలను వివాహం చేసుకున్నారు. విభేదాలతో ఆమెనుంచి విడాకులు తీసుకున్నారు. తర్వాత కమల అనే రచయిత్రిని పెళ్లాడారు. 2003లో పక్షవాతం వచ్చేవరకు టైమ్స్ ఆఫ్ ఇండియాతో అనుబంధం కొనసాగింది. కళలు, సాహిత్యం, జర్నలిజంలో విశిష్ట కృషికి ఆయన పద్మవిభూషణ్, మెగసెసే తదితర విశిష్ట పురస్కారాలు అందుకున్నారు. కార్టూనే ఖఢ్గం.. ఆర్కే లక్ష్మణ్ అనగానే పాఠకులకు అతని కామన్ మేన్ గుర్తుకొస్తాడు. బట్టతల, గాంధీ కళ్లద్దాలు, గళ్ల కోటు, ధోవతీతో అన్నిచోట్లా తిరుగుతూ సమస్త అన్యాయాలనూ మౌనంగా భరించే ఆ సామాన్యుడి చిత్రంతో లక్ష్మణ్ దిగజారుడు రాజకీయాలపై పదునైన విమర్శలు చేశాడు. సామాన్యుల ఆశలను వమ్ము చేసి వాగ్దాన భంగాలకు పాల్పడే నాయకులను వెటకారాల గీతలతో దునుమాడారు. సమకాలీన రాజకీయ, సామాజిక పరిణామాలకు అద్దం పడుతూ సున్నితమైన హాస్యంతోనే అయినా ఘాటు విమర్శలు సంధించారు. -
ఆర్కే లక్ష్మణ్ కార్టూన్లు జాతీయ సంపద:వైఎస్ జగన్
హైదరాబాద్: ప్రముఖ కార్టూనిస్టు ఆర్కే లక్ష్మణ్ మృతికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి తీవ్ర సంతాపం ప్రకటించారు. దేశంలో రాజకీయ వ్యంగ్య చిత్రానికి నడకలు నేర్పిన మహా మనిషి లక్ష్మణ్ అని కొనియాడారు. ఆయన కార్టూన్లు మన జాతీయ సంపద అని పేర్కొన్నారు. అంతటి మహానుభావుడు అస్తమించాడన్న వార్త విని ఎంతో బాధ చెందినట్లు తెలిపారు. . ఆ మహనీయుడికి యావత్ భారత్ జాతి గుండెల నిండా కన్నీరు నింపుకొని నివాళి అర్పిస్తోందని పేర్కొన్నారు. భారతదేశమే కాక ప్రపంచమే గర్వించదగ్గ కార్టూనిస్టుగా లక్ష్మణ్ ఎప్పటికీ నిల్చిపోతారని కీర్తించారు. -
స్కూళ్లలో బోధించాలి!
కార్టూన్లపై ఆర్.కె. లక్ష్మణ్ ఇంటర్వ్యూ: పన్నాల సుబ్రహ్మణ్యభట్టు మంచి బొమ్మలతో పాటు రాజకీయ వ్యంగ్య చిత్రాలకు తలమానికం వంటి ఆలోచనలతో ఎక్కడా వన్నె తగ్గకుండా, ప్రజాదరణ కోల్పోకుండా, తేలిపోని చిత్రాలు వేసినవారు ఆంగ్లపత్రికా రంగంలో ఇద్దరే ఇద్దరు. వారు ఇద్దరూ ‘ఆకుంచె శ్రీమంతులు’. బంగారు కుంచెతో పుట్టినవారి క్రింద లెక్క. వారు - శంకర్, ఆర్.కె. లక్ష్మణ్. అతి తక్కువ లైన్లతో రంగులు పూసిన గీతల క్యారికేచర్లు అనే పోలికల హెచ్చుతగ్గుల ఆలోచనాత్మకమైన ముఖ కవళికల రూపురేఖలు దిద్దగల్గిన దిగ్దంతులు వాళ్లిద్దరే. మరొకరు జన్మించరేమో! లక్ష్మణ్ ‘ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ’లో అతి తక్కువ గీతలతో గీసిన రంగు బొమ్మలను కాపీ చేస్తూ నా మిత్రుడూ, నేనూ 1965లో సెలవులు గడుపుతుండేవాళ్ళం. మొహంలో కండలు నిర్ణయించే గీతలు, వ్యక్తి పోలికలకు పారా కాసే రేఖలు పట్టుకోవడానికి తంటాలుపడుతూ ఉండేవాళ్ళం. పెద్ద కుర్చీలో కూర్చున్న చిన్న లాల్‌బహదూర్ శాస్త్రి బొమ్మను కాపీ చేయడం దగ్గర నుండి ఆరంభమయిన నా యాత్ర త్వరగానే ముగిసింది కానీ, ఆ బొమ్మలు గీసిన మహానుభావుణ్ణి చూడాలన్న కోరిక మాత్రం నాలుగు దశాబ్దాలకు గానీ తీరలేదు. అదీ నాటకీయంగా కుదిరింది. ఆమధ్య ‘విజయవాడ పుస్తక ప్రదర్శన’కు అతిథిగా వచ్చిన ఆర్.కె. లక్ష్మణ్ గారిని దుర్గ గుడికి తీసుకెళ్లడం నా పని. ఆయనకు దేవాలయ సందర్శనం అప్పుడు చేయడం ఇష్టం లేదు. శ్రీమతి కమలా లక్ష్మణ్ తప్పదన్నారు. ప్రత్యేక ఏర్పాట్లతో ఆవిడ ముందు వరుసకు పదోన్నతి పొందారు. లక్ష్మణ్‌గారు వెనుకబడ్డారు. క్యూలో చాలాసేపు పట్టింది. ‘మీకూ తప్పలేదు చూశారా’ అని నేను నవ్వాను. ‘ఇదే మనకు ఆహారం’ అన్నారాయన. నెత్తి మీద అక్కడే కోతి కిచకిచలు. ‘‘హనుమంతుడు కూడా నిరసన తెలియజెబుతున్నాడు చూశావా’’ అన్నారు. ప్రక్కనే ఎవరి చంకలోనో ఉన్న పిల్లాడు ఆయనకు ముద్దు వచ్చాడు. ఆయన ఆ పిల్లవాడి బుగ్గ మీద చిటికేశారు. తండ్రికి కోపం లాంటి విసుగొచ్చింది. రెండేళ్ళు నిండని తన పసిపిల్లాణ్ణి తాకిన పరాయివాడంటే సద్భావం కలగలేదు. ఆయనకు ‘‘మనం ఆమోదయోగ్యులం కాదు కదా! నాకు తెలుసు’’ అన్నారు ఆర్.కె. లక్ష్మణ్. కమలగారు దర్శనం చేసుకున్నారు. ఈయన ఆనందంగా బయటకు వచ్చారు. ఈ నేపథ్యంలో నేను ఆయన్ని తీసుకెళ్ళి ఇంటర్వ్యూ చేయాలి. ఆయనకు చెప్పలేదు ఇంటర్వ్యూ అని! ఆయన కాదంటే మొదటికే మోసం వస్తుంది. ‘‘మీకు దండలు వేయడానికి అక్కడ ఒకాయన చాలాసేపు నుంచి వెయిటింగ్. సాధారణ మనిషి ఒకరు ఎదురుచూస్తున్నా’’రని చెప్పి రేడియో స్టేషనుకి తీసుకెళ్ళాను. సంతోషించారు. నాలుగు మాటలు... మీ అభిమానులు సంతోషిస్తారని మైకు ముందు మొదలుపెట్టాను. చివరన ‘‘అభిమాని మంచి ప్రశ్నలు వేశాడే’’ అని నవ్వారు. ఆ ఇంటర్వ్యూ ఇంగ్లీషులో సాగింది. అందులోని కొన్ని భాగాలు: ప్రశ్న: మీలాటి గొప్ప కార్టూనిస్టులు అరుదుగా కనబడతారు ఏ దేశంలోనైనా! కోపం వస్తే నివారించుకోవడానికి కార్టూన్లను వేసుకుంటూ ఉంటారా? నిజం చెప్పండి. ఆర్.కె. లక్ష్మణ్: కోపం అని అనుకోను, వంగ్య వ్యాఖ్య అంటాను. ప్రజల మీద, ముఖ్యంగా రాజకీయ నాయకుల మూర్ఖత్వం మీద, నాయకులం అనుకుని దేశాన్ని నడిపించే నాయకుల మీద! నాయకులే కాదు, మామూలు ప్రజలు కూడా! తప్పని తెలిసే రోడ్లను ఆక్రమించేవారు, మార్గమధ్యంలో నించునేవారు, లారీలు వస్తున్నా రోడ్లు దాటేవారు, ఎర్రదీపాన్ని ధిక్కరించేవారు - అందరూ నాకు కార్టూనుకు పనికొచ్చే సంగతులే. ఇది వేయాలన్న ఆలోచన తటాలున వస్తుందా? ఆర్.కె: లేదు. గంటలకొద్దీ మథనపడితే కానీ రాదు. అది కాదని, ఇది కాదని, చివరికి ఎంపిక చేసుకుని రేపటికి పనికివస్తుందో రాదో చూసుకునీ - చాలా తంటాలుపడాలి. చాలా అలసిపోయాననిపిస్తుందా? ఆర్.కె: నిజమే. అయిదారు గంటలు శ్రమపడితే కానీ కార్టూన్ గీయడానికి ఆ రోజుకు ఆలోచన రాదు. అదో నిరంతర ప్రక్రియ. ఇక్కడ కూర్చున్నా అదే ధ్యాస. బుర్రలో కదలాడుతూ ఉంటుంది. కానీ గీతల్లో గ్రాఫిక్‌గా రిజిస్టర్ కాదు. అక్కడ సంఘటనలో ఏదో వ్యంగ్యం తారాడుతూనే ఉంటుంది. తరచూ, రోజుకో ఆలోచనను ఎలా దింపగల్గుతున్నారు? ఆర్.కె: నాకు భోజనం పెట్టేదే అది. చేయక తప్పదు. కార్టూనిస్టును కాకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఇంజనీరుగా ఇళ్లు కడుతూ ఉండేవాడినేమో! మంచి కార్టూన్ కాకపోయినా ప్రచురించి, పాఠకులు పొగిడితే, బాగుందంటే - మీరు వాళ్ళను చూసి నవ్వుకున్న సందర్భాలున్నాయా? ఆర్.కె: బాగుండని కార్టూనే ప్రతిరోజూ వేస్తున్నాను. వేసినందుకు విచారిస్తాను. రేపు మంచిది వేద్దామని ఆశపడతాను. నా కార్టూను విజయానికి వీళ్ళు కారకులు అని ఎవరినైనా చెప్తారా? ఆర్.కె: నా దేశం, నా ప్రజాప్రతినిధులు. వీళ్లు తెంపు లేకుండా నా జీవితంలో ప్రతిరోజూ ఆలోచనలు సరఫరా చేస్తున్నవారు. వీళ్ళే కారకులు నా విజయానికి! ఇక కార్టూను గీసే యంత్రాంగంలో ఏయే నాయకులు సదుపాయంగా, గీతలకు ఆదర్శవంతంగా కనబడతారు? ఆర్.కె: దీనికి సమాధానం కష్టం. క్యారికేచర్ కళాకారుడికి నెహ్రూ బొమ్మ గీయడం కష్టంగా ఉంటుంది. అయితే గాంధీ దేశానికి సేవ చేయడానికే జన్మించలేదు, కార్టూనిస్టులకీ సదుపాయం కల్గించాడు. ఆయన రూపం అలాంటిది. బట్టతల, పెద్ద చెవులు, చట్టిముక్కు, ముఖంమీద ఎప్పుడూ నవ్వు, దుస్తులు, ధోతీ, కండువా, నడుము వద్ద వేలాడుతున్న జేబు గడియారం - అన్నీ క్యారికేచర్ వేసేవాళ్ళ కోసమా అన్నట్లుంటాయి. కార్టూన్లకు పనికి వచ్చే వస్తువులకు వస్తే నెహ్రూ గారి యుగం బాగా ఉత్సాహం కలిగించేదిగా చెప్పుకోవచ్చా? ఆర్.కె: అబ్బే! అన్ని కాలాలూ ప్రోత్సాహజనకాలే. నెహ్రూ యుగమనేమీ లేదు. ఆ మాటకొస్తే మీ తెలుగు ప్రాంతం నుంచి వచ్చిన పి.వి. నరసింహారావు నా కార్టూన్ల అయిడియాలకి చాలా ఉపయోగపడ్డారు. రాజకీయ వ్యంగ్య చిత్రాలనే మా మీద బలంగా రుద్దుతున్నారెందుకు? సాంఘిక పరిస్థితుల మీద, కుటుంబ విషయాల మీద కార్టూన్లకు ప్రాముఖ్యం లేదేం? ఆర్.కె: ఇప్పటికిప్పుడు ఈ ప్రశ్న నీకు తోచినదనుకోవడం లేదు. మన దేశంలో రాజకీయాలు లేకుండా సాంఘిక జీవనం లేదు. సోషల్ లైఫ్ లేకుండా రాజకీయాలు లేవు. గుడికెళ్ళు. ఇవాళ వెళ్ళాం కదా! ఇద్దరు ఎంపిలు, ఎమ్మెల్యేలు వచ్చి గర్భగుడిలోకి సామాన్య ప్రజలను వెళ్ళనీయకుండా అడ్డుపడ్డారు కదా! దేవాలయం పవిత్రమైన స్థలం. అందరూ సమానమే. కానీ రాజకీయ నాయకులొచ్చి - రేపు మళ్ళీ ఈ పదవుల్లో ఉంటారో ఉండరో తెలియని రాజకీయ నాయకులు వచ్చి - దర్శనాన్ని రాజకీయం చేశారు. పుస్తక ప్రదర్శన ఆరంభించడానికి రాజకీయ నాయకుడు కావాలి. మీ ఇంటికి నీరు సరఫరా కావాలంటే స్థానిక ఎం.పి. సాయపడాలి. సాంఘిక విషయాల కంటే మనం రాజకీయాలే ఎక్కువ చర్చిస్తాం. అందుకని మన దేశంలో రాజకీయ జీవితం, సాంఘిక జీవితం అని విడివిడిగా లేవు. ఇక్కడ ఒకే పాత్రల వరుస వ్యంగ్య చిత్రాలు - స్ట్రిప్ కార్టూన్లు - వృద్ధి చెందలేదేం? ఆర్.కె: ఇంగ్లండ్‌లోనూ పెంపొందలేదు. అమెరికా వారు వీటిని ముందు ఆరంభించారు. వారే కొనసాగించారు. మన దేశంలో ఇది నడిచే వ్యవహారం కాదు. ఏం ఎక్కువ చిత్రాలు వరుసగా ఏక్షన్‌తో వేయాల్సి ఉండడం వల్లనా? ఆర్.కె: అలాగని కాదు. దాంట్లో సృజనాత్మకత ఉండదు. అంతేకాకుండా కార్టూనిస్టు అనేవాడు బొమ్మగీయడం అనే ఆలోచనలో నుంచి జన్మిస్తాడు. కార్టూన్లు గీయడం పాఠశాలలో బోధించడం లేదు. బోధించాలి.రచయితలకు ముందు తరం వారి రచనలు ఆదర్శంగా ఉంటాయి. ఎక్కడ నుంచి ఆలోచన తోస్తుందో వారి రచనలు చెప్పి, సాయపడతాయి. ఆర్.కె: కాదు. చిత్రకారుడికీ, రచయితకీ చాలా భేదాలున్నాయి. రచయితకి దృశ్యం సాక్షాత్కరించే గుణం ఉండదు. ఉదాహరణకు బేట్‌మాన్, ఫాంటమ్ పాత్రలు ఆకాశహర్మ్యాల నుండి వీధిలోకి ఎగురుతూ రావడం, దాన్ని చూపటం - ఒక దర్శనీయ అనుభవం. రచయిత రచించగలడు, కాని ఎలా ఎగురుతుందో చూపించే విధంగా ఊహించలేడు. ఆ రెండూ రాయడం, ఊహించగలగడం కలిసి రావాలి. బొమ్మలు వేయడం, వాటిని కార్టూన్లుగా మలచడంలో మీ మీద ఇతర వ్యంగ్య చిత్రకారుని ప్రభావం ఎవరిది ఉంది? ఆర్.కె: నా మీద డేవిడ్‌లో అనే వ్యంగ్య చిత్రకారుడి ప్రభావం చాలా ఉంది. ఇప్పుడు ఆయనను ఎవరూ గుర్తుంచుకోరు. చాలా గొప్ప కార్టూనిస్టు... ఇంగ్లండులో. తరువాత ‘సర్’ బిరుదు పొందాడు. సరే ఇంగ్లండులోనే కార్టూన్ కళ ఆరంభమైంది. యూరప్‌లో ప్రారంభం కాలేదు. చిన్నప్పటి నుండీ నా మీద అమిత ప్రభావం చూపాడు ఆయన. అతని ఆలోచనలు నాకు అప్పుడు అర్థమయ్యేవి కావు. ఐర్లండ్ విప్లవం మీద ఉండేవి. డ్రాయింగ్లు మాత్రం బలమైన ప్రభావం చూపాయి. డ్రాయింగ్‌లో పనితనాన్ని నిర్లక్ష్యంగా చూడకూడదు. ఒక పద్ధతిలో మనిషి కార్టూనులో నిలబడినా, చేతులు పెట్టుకొని ఒక విదంగా నిద్రపోతున్నా - ఉదాహరణకి ‘గౌడా’లా -ఆ పోజు ఎలా వస్తుంది? నువ్వు మంచి డ్రాయింగ్ వేసే కళాకారుడివి కాగలిగినప్పుడే సాధ్యమవుతుంది. ముందు డ్రాయింగ్ చిత్రకారుడు, తరువాత కార్టూనిస్టు, తర్వాతే వ్యంగ్యం చూపగల సెటైరిస్టు కాగలరు. వ్యంగ్య రచయితలకీ, కార్టూనిస్టులకీ మధ్య కామిక్ ఊహాశక్తి సంబంధమైన పోలికలున్నాయా? ఆర్.కె: నేను వ్యంగ్య రచనలు చేపట్టలేదు. మనం చూసేవాటిలో ప్రతిదాన్లోనూ ఒక వ్యంగ్య దృష్టి ఉంటుంది. ప్రతివాడి అనుభవాన్నీ వ్యంగ్యాత్మకంగా మలచవచ్చు. వ్యంగ్యం రాసేవారికీ, వ్యంగ్య రచయితలైన వోలటైర్, షాలాంటి వాళ్లకీ మధ్యన; వ్యంగ్య రచయితలైన వారికీ కార్టూనిస్టులకీ మధ్య బంధం ఒకటి ఉంది. మంచి డ్రాయింగులు కాకుల మూకనీ, జంతువులనీ వాష్ డ్రాయింగ్‌లో చాలా బలంగా, అందంగా చిత్రిస్తూ బొమ్మలు వేశారు కదా! ఆర్.కె: నా చిన్నతనం నుండి నాకు కాకులంటే ఎంతో అభిమానం. మన దేశంలో ప్రతి పిల్లవాడూ కిటికీలో నుంచి మొదట చూసేది కాకిని. పచ్చటి చెట్టు వెనుక ఉంటే కాకి కనబడుతుంది. ముందు కాకి, వెనుక నీలాకాశం ఉంటుంది. ఎక్కడైనా అది సిద్ధంగా అందరికీ కనబడుతుంది. నెమలి అనే అంద వికారమైన పక్షినీ, పావురాన్నీ ఎవరూ గమనించకపోవచ్చు. అందుకే, నేను ఈ కాకి అనే పక్షినే చిత్రిస్తూ ఆనందించాను. హైందవ చిత్రకళ, వాస్తుకళ, శిల్పాలు మిమ్మల్ని అబ్బురపరచలేదా? ఆర్.కె: లేదు. దానికి కారణం ఉంది. భారతీయ వాస్తు శిల్పకళలు పరిణతి చెందిన శైలితో విలసిల్లుతూ ఉంటాయి. దుర్గామాత చాలా ఎత్తుగా కనబడుతుంది. ఎంత ఎత్తు అంటే ముందు నిల్చున్న అర్చకుడు చాలా చిన్నవాడుగా ఉంటాడు. వాస్తు శిల్పాలలో భాగాల విభజన వాస్తుకళను గమనించేవారికి చాలా ఆసక్తిని కలిగిస్తుంది, మురిపిస్తుంది. పురాణ పాత్రల నుండి కార్టూనిస్టులు చాలా విషయాలు గీయగలరేమో? అసంఖ్యాకమైన ఆలోచనలు పుడతాయి - పురాణాల నుండి! కానీ నేను పూర్తిగా వద్దనుకున్నాను. మతపరమైనవి కదా అని మానివేశారా? ఆర్.కె: అలాగని కాదు. అవి సందర్భాలను చిన్నగా చిత్రింప చేస్తాయి. విపులంగా తెలివిగా చెప్పనీయవు. రావణుడికి పదితలలు కదా అని ఒక తల బీదరికం, మరొకటి అజ్ఞానం, అనారోగ్యం... అలా చిత్రిస్తూపోవడం గొప్పకాదు. కార్టూన్ అంటేనే సూక్ష్మీకరించి చెప్పడం కూడా కదా? ఆర్.కె: కాదు కాదు. కార్టూన్లో వ్యంగ్యం ఉంటుంది. దెప్పిపొడుస్తున్న వ్యాఖ్యానం ఇస్తూ, నువ్వు అర్థం చేసుకునేలా గీయడం ఉంటుంది. అలా సూక్ష్మంగా చేస్తే కార్టూన్ కాదు. విపులీకరించే చిత్రం మాత్రం కాగలదు. ఈ దేశంలో కార్టూనిస్టులకు గౌరవం ఇస్తున్నారా? ఆర్.కె: సారీ! ఇస్తున్నారు అనే అంటాను. నేను ఇందిరాగాంధీని ప్రతిరోజూ దాడి చేస్తూనే వచ్చాను. ‘పద్మభూషణ్’ గౌరవం ఇచ్చారు. మర్యాద చేసినట్లే కదా! ఎన్నో బహుమతులు, గౌరవాలు నాకు లభించాయి. నేను వారి పట్ల మర్యాదగా ఉన్నందుకు కాదు... వాళ్లను గౌరవించనందుకు లభించాయి. మీ కార్టూన్ బాగులేదని తోచి మీకు మీరే మీ కార్టూన్ బయటకు రాకుండా చూసుకున్నారా? ఆర్.కె: నాకో చిత్రమైన పని చేసే పద్ధతి ఉంది. ఆఫీసుకెళ్లి రెండు మూడు గంటలు పేపర్లు చదువుతాను. ప్రతీదీ విశ్లేషిస్తాను. ఆలోచన వచ్చేదాకా సతమతమవుతాను. అయిడియా కుదిరాక ఫ్రేములో ఎలా దృశ్యంగా దాన్ని మలచడం అనే బాధ మొదలవుతుంది. అంటే ఆ ఆరాటం సినిమా దర్శకుడి చిత్రీకరణ లాంటిది. సీతారామ్ కేసరిని ఇక్కడ నిలబెట్టాలా, లేక లాలూప్రసాద్‌ని మరోచోట ఉంచాలా, లేదా లాలూని శిఖరాగ్రం మీద పెట్టి, కేసరి శిఖరం మీదకు పరిగెడ్తూ ఇద్దరూ పడిపోతారా - ఇలా సినీ దర్శకుడిలా ఆలోచిస్తాను. చివరికి ఓ ఏర్పాటు చేస్తా. ఒక చోట కేసరి, ఒక చోట రబ్రీదేవి, మరొక చోట లాలూప్రసాద్‌ని పెట్టి - అప్పుడు నేపథ్యం వగైరాలు చిత్రిస్తాను. తర్వాత వ్యాఖ్యానం తయారవుతుంది. ఎవరు ఏమంటారు అనే విషయం... అటువంటివి. మొన్న ఒక కార్టూన్ వేశాను. కేసరిగారి గదిలో కాంగ్రెస్ నాయకులు బయటకు పోదామని చూస్తూ ఉంటారు. గది తలుపు సగం తెరచి ఉంటుంది. తలుపు మీద ‘కేసరి’గారి పేరు. పైన మామూలు మనిషి పత్రిక చదువుతూ నిలబడి ఉంటాడు. ఆ పత్రిక మీద ‘కాంగ్రెస్ నుండి వలసలు’ అని రాసి ఉంటుంది. తలుపు నుండి బయటకు మహాత్మాగాంధీ లాంటివాడు బయటకు వస్తూంటాడు. తలుపులో నుండి ఒక గొంతు వినబడుతుంది. ‘బెంగపడకండి... చాలామంది గతంలో కాంగ్రెస్ నుండి వెళ్లిపోయారు’ అని! ఇలా కార్టూన్‌ను చిత్రించడానికి చాలా సమయం పడుతుంది. వ్యంగ్యంతో ఏమీ చేయలేము అని భావంతో నిండి ఉంటుంది. నా మెదడులో పూర్తిగా ఈ ఆలోచన చిత్రరూపం పొందేవరకు పెన్సిల్, కాగితం చేత పట్టను. అప్పుడే కార్టూన్ గీయడం ఆరంభిస్తాను. అంతవరకూ చేయను. ఆలోచన ఒకటి నడవకపోతే, ఇంకొకటి ఆలోచిస్తాను. అలా అశాంతితో ఉంటాను. మీరు అందర్నీ కార్టూన్ల ద్వారానే వేళాకోళం చేస్తారు, విమర్శిస్తారు. మరి మీలోని కార్టూనిస్టు మిమ్మల్ని ఎప్పుడైనా విమర్శించాడా? ఆర్.కె: ప్రతిదాన్నీ, ప్రతివాడినీ నేను విమర్శిస్తాను - నన్ను తప్ప. మీ కార్టూనుని, మీ సంపాదకుడు ఎప్పుడైనా కాదన్నాడా? తిరస్కరించాడా? ఆర్.కె: ఎవడూ, నా కార్టూన్ని ఎడిట్ చేయడు. నాకు ఎడిటర్ లేడు. నేను చిత్రించిన కార్టూన్ని మొదట చూసేవాడు నా దగ్గర పనిచేసే వ్యక్తి. నేను ఇచ్చింది తీసుకొని ముద్రణశాఖకు వెళ్తాడు. అక్కడి నుంచి ఆ కార్టూన్ పదకొండు కేంద్రాలకు వెళుతుంది. ఎడిటర్లు, మిగతావాళ్లు తరువాత ప్రింట్లో చూస్తారు. అంతే! అమ్మయ్యో! ఎవరో నా కార్టూన్‌ను కాదనడమే!! -
ఆర్ కే లక్ష్మణ్ మృతికి కేసీఆర్ సంతాపం
హైదరాబాద్: ప్రఖ్యాత కార్టూనిస్ట్ ఆర్ కె లక్ష్మణ్(93) సోమవారం కన్నుమూశారు. ఆయన మృతికి తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు సంతాపం ప్రకటించారు. అద్భుతమైన సృజనాత్మకతకు సున్నితమైన హాస్యం జోడించి కార్టూస్లు రూపొందించడం ఆర్ కే లక్ష్మణ్ ప్రత్యేకత అని కేసీఆర్ అన్నారు. ఆయన కార్టూన్లు సామాన్యుల మనోభావాలను అద్దం పట్టే విధంగా ఉంటాయని స్మరించుకున్నారు. -
ఆర్కే లక్ష్మణ్ కన్నుమూత
పుణే: ప్రముఖ కార్టూనిస్ట్ ఆర్కే లక్ష్మణ్(94) కన్నుమూశారు. దీననాథ్ మంగేష్కర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం ఆయన తుదిశ్వాస విడిచారు. యూరినల్ ఇన్ఫెక్షన్, అవయవాలన్నీ సరిగా పనిచేయకపోవడం వంటి సమస్యలతో ఆస్పత్రిలో చేరిన ఆయన పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు. ఆయనకు భార్య కమల, కుమారుడు శ్రీనివాస్ ఉన్నారు. ఆర్కే లక్ష్మణ్ భార్య కమల రచయిత్రికాగా, కుమారుడు రిటైర్డ్ జర్నలిస్ట్. కామన్ మేన్ కార్టూన్ సృష్టికర్త సమకాలీన రాజకీయాలు, దిగజారుతున్న ప్రజాస్వామిక విలువలపై ‘ది కామన్ మేన్’ కార్టూన్ కామెంట్‌తో పత్రికా ప్రపంచంలో కొత్త చరిత్రను సృష్టించిన విఖ్యాత వ్యంగ్య చిత్ర కారుడు ఆర్కే లక్ష్మణ్‌కు బాల్యం నుంచే చిత్ర లేఖనంపై అమితాసక్తి. అక్షరాలు అబ్బకముందే బొమ్మలు గీయడం మొదలుపెట్టారు. బడిలో తాను కూర్చున్న చోటు పక్కనున్న కిటీకి నుంచి బయటకు చూస్తే కనిపించే చెట్లు, వాటి ఆకులు, వాటిపై తిరుగాడే తొండ, ఉడత లాంటి చిన్న చిన్న ప్రాణులను గీయడం ద్వారా చిత్ర లేఖనంలో ఓనమాలు దిద్దుకున్నారు. బడిలోని బల్లలు, గోడలే ఆయనకు కాన్వాస్‌లయ్యాయి. వాటిని గమనించిన టీచర్లు తిట్టకుండా చిత్ర లేఖనంలో ఆయన్ని ప్రోత్సహించారు. అప్పటి నుంచి లక్ష్మణ్ బొమ్మలు గీయడమే తన ప్రపంచంగా మలుచుకున్నారు. ఇక తన చదువు... ప్రపంచాన్ని చదవడం, దాని నుంచి తాను గ్రహించింది బొమ్మల ద్వారా ప్రపంచానికి చాటటమే కర్తవ్యంగా ఎంచుకున్నారు. అందులో భాగంగానే ముంబైలోని ‘జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్’లో చేరాలని దరఖాస్తు చేసుకొన్నారు. అయితే అప్పటికి లక్ష్మణ్ గీస్తున్న బొమ్మల్లో అంత పరిపక్వత లేదంటూ ఆ కాలేజీ డీన్ అతనికి అడ్మిషన్ ఇవ్వడానికి నిరాకరించారు. అందుకు లక్ష్మణ్ నిరాశ చెందకుండా తాను ఎంచుకున్న చిత్రలేఖనంలో మరింత నైపుణ్యాన్ని సాధించేందుకు పట్టుదలగా కృషి చేశారు. మైసూరులోని కాలేజీలో బ్యాచ్‌లర్ ఆఫ్ ఆర్ట్స్ పట్టా సాధించారు. ఆ తర్వాత పలు పత్రికల్లో తనదైన శైలిలో కార్టూన్లు, ఇలస్ట్రేషన్లు వేయడం ద్వారా ప్రఖ్యాతి చెందారు. సమకాలీన ప్రపంచంలో పతనమౌతున్న ప్రజాస్వామిక విలువలపై వ్యంగ్యాస్త్రాలు సంధించడం ద్వారా గొప్ప మానవతావాదిగా కూడా పేరు గడించారు. 1921, అక్టోబర్ 24న మైసూరులోని ఓ బడిపంతులు కుటుంబంలో జన్మించిన లక్ష్మణ్ పూర్తి పేరు రాసిపురం కృష్ణస్వామి అయ్యర్ లక్ష్మణ్. తన తండ్రి ఆరుగురు కుమారుల్లో లక్ష్మణ్ చివరివారు. పెద్ద అన్నయ్య సుప్రసిద్ధ నవలా రచయిత ఆర్కే నారాయణ్. మైసూరు మహారాజా కాలేజీలో చదువుతుండగానే స్వరాజ్య, బ్లిట్జ్ లాంటి పత్రికలకు కార్టూన్లు, బొమ్మలు వేశారు. ఆ తర్వాత ది స్ట్రాండ్ మేగజైన్, పంచ్, బై స్టాండర్డ్, వైడ్ వరల్డ్, టిట్ బిట్స్ లాంటి వాటిలో ఇలస్ట్రేషన్లు, కార్టూన్లు వేయడం ద్వారా పూర్తి స్థాయిలో పత్రికా ప్రపంచంలోకి అడుగుపెట్టారు. 1951లో ప్రారంభమైన ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ పత్రికలో ‘ది కామన్ మేన్’ ఈ సెడిట్ పేరిట రోజువారీ కార్టూన్లతో అలరించి యావత్ దేశాన్ని ఆక ర్షించారు. అప్పటి నుంచి ఆ కార్టూన్ కాలంను లక్ష్మణ్ దాదాపు ఐదు దశాబ్డాలపాటు కొనసాగించారు. ఒకరకంగా లక్ష్మణ్ బహుముఖ ప్రజ్ఞాశాలి. ‘ది టన్నెల్ ఆఫ్ టైమ్’ పేరుతో తన జీవిత చరిత్రతో పాటు కొన్ని నవలలు రచించారు. తన పెద్దన్న ఆర్కే నారాయణ్ రాసిన నవలల్లో కొన్నింటికి బొమ్మలు గీశారు. నారాయణ్ రాసిన ‘మాల్గుడీ దేస్’ టీవీ ప్రసారాలకు, కొన్ని హిందీ సినిమాలకు ఇలస్ట్రేటర్‌గా పని చేశారు. ప్రముఖ భరతనాట్య కళాకారిణి, అలనాటి సినీ నటి కుమారి కమలను లక్ష్మణ్ పెళ్లి చేసుకున్నారు. సంసారంలో వచ్చిన ఒడుదుడుకుల వల్ల ఆమెకు విడాకులిచ్చారు. ఆ తర్వాత కొంతకాలానికి కమలా అనే మొదటి భార్య పేరుగల పిల్లల పుస్తకాల రచయిత్రిని పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుంచి సాఫీగా సాగిన ఆయన జీవితంలోకి వృద్ధాప్యం కారణంగా 2003 నుంచి ఆరోగ్య సమస్యలు వచ్చి పడ్డాయి. కర్ణాటక ప్రభుత్వం నుంచి గౌరవ డాక్టరేట్‌ను అందుకున్న లక్ష్మణ్.. అంతర్జాతీయంగా రామన్ మెగసెసె, జాతీయంగా పద్మ విభూషణ్ లాంటి ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్నారు. -
ఆర్కే లక్ష్మణ్ పరిస్థితి విషమం
-
ఆర్కే లక్ష్మణ్ పరిస్థితి విషమం
పుణే: ప్రముఖ కార్టూనిస్ట్ ఆర్కే లక్ష్మణ్(94) ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. వెంటిలేటర్ పై ఉంచి ఆయనకు చికిత్స అందిస్తున్నారు. యూరినల్ ఇన్ఫెక్షన్ కారణంగా ఆయనను శనివారం దీననాథ్ మంగేష్కర్ ఆస్పత్రిలో చేర్చారు. అవయవాలన్నీ సరిగా పనిచేయకపోవడంతో ఆయనను ఇంటెన్సివ్ కేర్ ఉంచి చికిత్స అందిస్తున్నట్టు వైద్యులు తెలిపారు. ఆయన పరిస్థితి విషమంగా ఉందని ఆదివారం వెల్లడించారు. లక్ష్మణ్ పలురకాల ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్నారని డాకర్ట్ సమీర్ జంగ్ తెలిపారు. మూత్రపిండం, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తో బాధపడ్డారని వెల్లడించారు. 2010లో స్ట్రోక్ రావడంతో ఆయనకు కుడివైపు భాగం చచ్చుబడిపోయి, మాట పడిపోయిందని లక్ష్మణ్ సన్నిహితుడు కైలాశ్ భింగారి తెలిపారు.