ఆర్కే లక్ష్మణ్(ఫైల్)
పుణే: ప్రముఖ కార్టూనిస్ట్ ఆర్కే లక్ష్మణ్(94) కన్నుమూశారు. దీననాథ్ మంగేష్కర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం ఆయన తుదిశ్వాస విడిచారు. యూరినల్ ఇన్ఫెక్షన్, అవయవాలన్నీ సరిగా పనిచేయకపోవడం వంటి సమస్యలతో ఆస్పత్రిలో చేరిన ఆయన పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు. ఆయనకు భార్య కమల, కుమారుడు శ్రీనివాస్ ఉన్నారు. ఆర్కే లక్ష్మణ్ భార్య కమల రచయిత్రికాగా, కుమారుడు రిటైర్డ్ జర్నలిస్ట్.
కామన్ మేన్ కార్టూన్ సృష్టికర్త
సమకాలీన రాజకీయాలు, దిగజారుతున్న ప్రజాస్వామిక విలువలపై ‘ది కామన్ మేన్’ కార్టూన్ కామెంట్‌తో పత్రికా ప్రపంచంలో కొత్త చరిత్రను సృష్టించిన విఖ్యాత వ్యంగ్య చిత్ర కారుడు ఆర్కే లక్ష్మణ్‌కు బాల్యం నుంచే చిత్ర లేఖనంపై అమితాసక్తి. అక్షరాలు అబ్బకముందే బొమ్మలు గీయడం మొదలుపెట్టారు. బడిలో తాను కూర్చున్న చోటు పక్కనున్న కిటీకి నుంచి బయటకు చూస్తే కనిపించే చెట్లు, వాటి ఆకులు, వాటిపై తిరుగాడే తొండ, ఉడత లాంటి చిన్న చిన్న ప్రాణులను గీయడం ద్వారా చిత్ర లేఖనంలో ఓనమాలు దిద్దుకున్నారు.
బడిలోని బల్లలు, గోడలే ఆయనకు కాన్వాస్‌లయ్యాయి. వాటిని గమనించిన టీచర్లు తిట్టకుండా చిత్ర లేఖనంలో ఆయన్ని ప్రోత్సహించారు. అప్పటి నుంచి లక్ష్మణ్ బొమ్మలు గీయడమే తన ప్రపంచంగా మలుచుకున్నారు. ఇక తన చదువు... ప్రపంచాన్ని చదవడం, దాని నుంచి తాను గ్రహించింది బొమ్మల ద్వారా ప్రపంచానికి చాటటమే కర్తవ్యంగా ఎంచుకున్నారు. అందులో భాగంగానే ముంబైలోని ‘జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్’లో చేరాలని దరఖాస్తు చేసుకొన్నారు. అయితే అప్పటికి లక్ష్మణ్ గీస్తున్న బొమ్మల్లో అంత పరిపక్వత లేదంటూ ఆ కాలేజీ డీన్ అతనికి అడ్మిషన్ ఇవ్వడానికి నిరాకరించారు.
అందుకు లక్ష్మణ్ నిరాశ చెందకుండా తాను ఎంచుకున్న చిత్రలేఖనంలో మరింత నైపుణ్యాన్ని సాధించేందుకు పట్టుదలగా కృషి చేశారు. మైసూరులోని కాలేజీలో బ్యాచ్‌లర్ ఆఫ్ ఆర్ట్స్ పట్టా సాధించారు. ఆ తర్వాత పలు పత్రికల్లో తనదైన శైలిలో కార్టూన్లు, ఇలస్ట్రేషన్లు వేయడం ద్వారా ప్రఖ్యాతి చెందారు. సమకాలీన ప్రపంచంలో పతనమౌతున్న ప్రజాస్వామిక విలువలపై వ్యంగ్యాస్త్రాలు సంధించడం ద్వారా గొప్ప మానవతావాదిగా కూడా పేరు గడించారు.
1921, అక్టోబర్ 24న మైసూరులోని ఓ బడిపంతులు కుటుంబంలో జన్మించిన లక్ష్మణ్ పూర్తి పేరు రాసిపురం కృష్ణస్వామి అయ్యర్ లక్ష్మణ్. తన తండ్రి ఆరుగురు కుమారుల్లో లక్ష్మణ్ చివరివారు. పెద్ద అన్నయ్య సుప్రసిద్ధ నవలా రచయిత ఆర్కే నారాయణ్. మైసూరు మహారాజా కాలేజీలో చదువుతుండగానే స్వరాజ్య, బ్లిట్జ్ లాంటి పత్రికలకు కార్టూన్లు, బొమ్మలు వేశారు. ఆ తర్వాత ది స్ట్రాండ్ మేగజైన్, పంచ్, బై స్టాండర్డ్, వైడ్ వరల్డ్, టిట్ బిట్స్ లాంటి వాటిలో ఇలస్ట్రేషన్లు, కార్టూన్లు వేయడం ద్వారా పూర్తి స్థాయిలో పత్రికా ప్రపంచంలోకి అడుగుపెట్టారు.
1951లో ప్రారంభమైన ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ పత్రికలో ‘ది కామన్ మేన్’ ఈ సెడిట్ పేరిట రోజువారీ కార్టూన్లతో అలరించి యావత్ దేశాన్ని ఆక ర్షించారు. అప్పటి నుంచి ఆ కార్టూన్ కాలంను లక్ష్మణ్ దాదాపు ఐదు దశాబ్డాలపాటు కొనసాగించారు. ఒకరకంగా లక్ష్మణ్ బహుముఖ ప్రజ్ఞాశాలి. ‘ది టన్నెల్ ఆఫ్ టైమ్’ పేరుతో తన జీవిత చరిత్రతో పాటు కొన్ని నవలలు రచించారు. తన పెద్దన్న ఆర్కే నారాయణ్ రాసిన నవలల్లో కొన్నింటికి బొమ్మలు గీశారు. నారాయణ్ రాసిన ‘మాల్గుడీ దేస్’ టీవీ ప్రసారాలకు, కొన్ని హిందీ సినిమాలకు ఇలస్ట్రేటర్‌గా పని చేశారు.
ప్రముఖ భరతనాట్య కళాకారిణి, అలనాటి సినీ నటి కుమారి కమలను లక్ష్మణ్ పెళ్లి చేసుకున్నారు. సంసారంలో వచ్చిన ఒడుదుడుకుల వల్ల ఆమెకు విడాకులిచ్చారు. ఆ తర్వాత కొంతకాలానికి కమలా అనే మొదటి భార్య పేరుగల పిల్లల పుస్తకాల రచయిత్రిని పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుంచి సాఫీగా సాగిన ఆయన జీవితంలోకి వృద్ధాప్యం కారణంగా 2003 నుంచి ఆరోగ్య సమస్యలు వచ్చి పడ్డాయి. కర్ణాటక ప్రభుత్వం నుంచి గౌరవ డాక్టరేట్‌ను అందుకున్న లక్ష్మణ్.. అంతర్జాతీయంగా రామన్ మెగసెసె, జాతీయంగా పద్మ విభూషణ్ లాంటి ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్నారు.