భయపడితే... చూపుడువేలైనా బెదిరిస్తుంది! | Cartoonist RK Laxman On 100th Birth Anniversary Guest Column | Sakshi
Sakshi News home page

భయపడితే... చూపుడువేలైనా బెదిరిస్తుంది!

Published Mon, Oct 25 2021 1:42 AM | Last Updated on Mon, Oct 25 2021 1:42 AM

Cartoonist RK Laxman On 100th Birth Anniversary Guest Column - Sakshi

1975 జూన్‌ రోజులు. ఆనాటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో అత్యవసర పరిస్థితి విధించారు. ఎమ ర్జెన్సీలో భాగంగా పత్రికా వార్తలపై సెన్సార్‌షిప్‌ మొదలైంది. వాటితో పాటే నా కార్టూన్లూ సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెన్సార్‌ పర్యవేక్షణ క్రింద ఉంచబడ్డాయి. నేను నా తెలివి తేటలు ఉపయోగించి అరటి తొక్క మీద కాలు వేసి జారిపోయే ముతక హాస్యము, చీరల కొట్టులో మహిళామణుల బేరసారాల వెకిలి హాస్యాల కార్టూన్లు కొన్ని పట్టుకుని సరాసరి ప్రధా నిని కలిశా. ఈ సెన్సార్‌షిప్‌ నుంచి నాకు మినహా యింపు ఇవ్వమని కోరుకున్నాను.

ఆవిడ చాలా ఓపిగ్గా ఈ అప్పడాల కర్ర కార్టూన్లు అన్ని పరిశీ లించి నా కార్టూన్లు బొత్తిగా నిరపాయకరమనీ, నేను కార్టూన్లను పత్రికలో నిరభ్యంతరంగా ప్రచు రించుకోవచ్చనీ అభయం ఇచ్చారు. ఢిల్లీ నుండి బొంబాయికి తిరిగి రాగానే నేను ప్రధానమంత్రి ముందు ఒలకబోసిన దొంగ వేషం కట్టిపెట్టి ఒకటీ రెండు రోజులు అప్పడాల కార్టూన్లు వంటివి వేసినా, 3వ రోజునుండి నా అసలు రంగు చూపిం చడం మొదలు పెట్టాను. మొదట కాంగ్రెస్‌ పార్టీ మీద దాడి చేసే కార్టూనులు, ఆ పై ఎమర్జెన్సీని తూర్పారపట్టే కార్టూనులు... ఒకదాని తరువాత మరొకటిగా నిప్పు రగిలిస్తున్నా.

చండీగఢ్‌లో ఆల్‌ ఇండియా కాంగ్రెస్‌ కమిటీ సెషన్‌ ప్రారంభమైన రోజున టైమ్స్‌ మొదటి పేజీలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు దేబ్‌ కాంత్‌  బరూవా – ఎమర్జెన్సీలను కలిపి కార్టూన్‌ అచ్చయింది. బరువాకు కార్టూన్‌ సెగ బాగా తగిలింది. వీసీ శుక్లా అప్పుడు సమాచార, ప్రసార శాఖ మంత్రిగా ఉన్నారు. బరువా, శుక్లాని తన దగ్గరికి పిలిపించుకుని నా కార్టూన్‌ చూపించి నానా చీవాట్లు పెట్టారు. శుక్లా సరాసరి ఢిల్లీ నుండి బొంబాయి వచ్చారు నా సంగతి కనుక్కోడానికి! 

కట్‌ చేస్తే శుక్లా బసచేసిన తాజ్‌ హోటల్‌ సూట్‌లో నేను ఉన్నాను. హలో, హాయ్, నమస్తే వంటి పరామర్శ ఏమీ లేదు. కనీసం నన్ను కూచో మని అన్నది కూడా లేదు. ఒకే మాట ‘ఇంకోసారి ఇటువంటి పిచ్చి గీతలు గీస్తే నిన్ను అత్తారింటికి పంపిస్తా ఏమనుకుంటున్నావో... గెటవుట్‌’  చూపుడు వేలు ఆడిస్తూ శుక్లా పరమక్రూరంగా! నా కాళ్ళు గజగజ వణికిపోయాయి. నాకు భయం వేసింది, దుఃఖం అనిపించింది, అవమానంగా ఉంది, కడుపు రగిలిపోతోంది.

ఇంటికి తిరిగి రాగానే నా భార్య కమలని పిలిచి విషయం చెప్పాను: ‘ఈ పొలిటికల్‌ కార్టూనింగ్‌ పనంటూ చేస్తే వెన్నెముక విరుచుకుని పనిచేయాలి, లేదా అసలు ఈ పనే చేయకూడదు, ఇప్పుడు అదే దశ వచ్చింది. నేను ఇక ఈ ఉద్యోగం చేయను, రాజీనామా ఇచ్చేస్తాను’. మా ఆవిడ తెగ సంతోష పడింది. ‘ఎందుకులెద్దూ వెధవ లంపటమూ, ముప్ఫయ్‌ ఏళ్ళు చేశారు. ఇన్నాళ్ళకు మంచి నిర్ణయం ఒకటి తీసుకున్నారు. హమ్మయ్య!’ 

సాయంకాలం ఆఫీస్‌కు వెళ్ళి దీర్ఘకాలిక సెల వుకు దరఖాస్తు చేశాను. అక్కడి నుండి సరాసరి ఒక ట్రావెల్‌ ఏజన్సీకి వెళ్ళి మా దంపతులిరువురి పేరిట మారిషస్‌కు టిక్కెట్లు కొన్నాము. మూడు వారాల పాటు అక్కడ ఉండాలనేది మా ఆలోచన. ఆ దీవిలో ఆ సముద్ర తీరాన బేఫికర్‌గా జీవితాన్ని అస్వాదిం చాము. అక్కడి విదేశీయులు నా భార్య కమల చీర కట్టు గురించీ, నుదుటన దాల్చిన సిందూరం గురించీ ప్రశ్నలు అడగడమే తరువాయి ‘మా దేశం, మా ప్రాచీన సంస్కృతి,  మా సంప్రదాయం’ అంటూ రొమ్ము విరుచుకుని వాళ్ళకు జవాబు ఇవ్వ డంలో గొప్ప ఆనందాన్ని పొందేవాణ్ణి.

ఒకరోజు మా సాయంకాలపు వాహ్యాళి ముగించుకుని ఇసుక తీరంలోని ఒక కాటేజ్‌లో విశ్రాంతిగా కూర్చు న్నాము. మాకు సమీపంలో ఒక నల్లజాతీయుడు కూచుని ఉన్నాడు. మాకు మాటా మాటా కలిసింది. అతనికి లెబనాన్‌లో ఏదో ఎగుమతి చేసే వ్యాపారం ఉంది. ఆయన నన్ను అడిగాడు: ‘ఇంతకూ మీరేం పని చేస్తారో చెప్పనే లేదు?’
‘నేనా? వార్తా పత్రికలో పని చేస్తా, పాత్రికే యుణ్ణి.’
‘ఓ పత్రికా పనా! గుడ్‌. అది చాలా గొప్ప వృత్తి, సంపాదకీయాలు అవీ రాస్తారా మీరు?’
‘రాస్తాను.’
‘మరి మీరిక్కడ సెలవులో ఉంటే అక్కడ మీ పత్రికలో సంపాదకీయాలు ఎలా రాస్తారు? అది చాలా ముఖ్యమైన పని కదా?’
‘మహాశయా! నేను వ్రాయను, నేను కార్టూన్లు గీస్తాను.’
‘కార్టూన్లా! అంటే వ్యంగ్య చిత్రాలు! అబ్బో, అది చాలా అద్భుతమైన కళ, ఇంతకు మీరు ఏ పత్రికలో పని చేస్తారో?’
‘టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా.’
‘నాకు తెలుసుగా ఆ పత్రిక! మీ పేరు?’
‘లక్ష్మణ్‌’
‘వావ్‌! యూ సెడ్‌ ఇటా?’ నేను అదిరి పోయాను. భారత దేశానికి అయిదు వేల మైళ్ల దూరంలోని ఒక ప్రదేశంలో, అటు ఆ దేశానికీ, ఇటు ఈ దేశానికీ చెందని ఒక వ్యక్తి నోటి నుండి నేను రోజూ వేసే కార్టూన్‌ శీర్షిక, అతని యాసలో!
‘మీకు ఎలా తెలుసు?’
‘లెబనాన్‌లో మీ దేశపు రాయబారి ఎల్‌కే సింగ్‌ ఉంటారు. అతనికి, నాకు పరిచయం. నేను  అతని వద్దకు వెళ్లినప్పుడల్లా మీ కార్టూన్లు చూపిస్తారు. చూపిస్తూ ఇలా అంటారు: ‘‘చూశావా! మా ప్రజా స్వామ్యం గొప్పతనం! మా దేశంలో అత్యవసర పరిస్థితి ఉన్నప్పటికీ, పత్రికా స్వేచ్ఛకు మాత్రం అడ్డం లేదు. అక్కడ మా కార్టూనిస్ట్‌ ఆర్‌కే లక్ష్మణ్‌ ఎమర్జెన్సీలో కూడా అక్కడి రాజకీయ నాయకుల డొక్క చింపుతున్నాడు. ఆ నాయకులు కూడా ప్రజా స్వామ్యాన్ని గౌరవిస్తూ ఆ కార్టూన్లని ప్రచురించ డానికి తల ఒగ్గి ఉన్నారు. అదీ మా దేశ మంటే! సారే జహా సే అచ్ఛా’.

దేవుడా! బహుశా ఆ  కార్టూన్లు నేను దేశం వదిలి వచ్చేముందు గీసినవి అయి ఉంటాయి. వాటి ఆధారంగా పరాయి దేశంలో మా పత్రికా స్వేచ్ఛని, మా కార్టూనిస్టుల పదును నైజాన్ని, నా దేశపు ప్రజాస్వామ్యపు స్వేచ్ఛని నిరూపించడానికి దేశం కాని దేశంలో వాటిని భద్రంగా ఉపయోగి స్తున్నారు. ఇక్కడ ఒక విదేశీయుడు వాటి ఆధా రంగా మమ్మల్ని, మా ధైర్యాన్ని గానం చేస్తున్నాడు. నేనేం చేస్తున్నాను? ఒక చూపుడు వేలు బెదిరింపు నకు వణికిపోయి ఇక్కడికి వచ్చి కూచున్నాను. లేచి నిలబడి బట్టలకంటిన ఇసుక దులుపుకొన్నాను.
కమల అడిగింది: ‘ఎక్కడికి, హోటల్‌ రూం కా?’
‘కాదు, సెలవు ముగిసింది, వెళ్ళి ఇక కార్టూన్లు వేయాలి.’

– ఆర్‌కే లక్ష్మణ్‌ అంతరంగ కథనం: అన్వర్‌
(ఇండియన్‌ పొలిటికల్‌ కార్టూన్‌ అంటే ప్రపంచమంతా తలతిప్పి ఆర్‌ కే లక్ష్మణ్‌ అనే
సంతకం వైపు చూస్తుంది. అక్టోబర్‌ 24న
రాశిపురం కృష్ణస్వామి లక్ష్మణ్‌ శతజయంతి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement