అలతి రేఖల బుజ్జాయి | Devulapalli Subbaraya Sastri Tribute Guest Column By Anwar | Sakshi
Sakshi News home page

అలతి రేఖల బుజ్జాయి

Published Sat, Jan 29 2022 12:53 AM | Last Updated on Sat, Jan 29 2022 12:53 AM

Devulapalli Subbaraya Sastri Tribute Guest Column By Anwar - Sakshi

ఈ మధ్యే ‘బుజ్జాయి’ గారిని తలుచుకున్నాను. టెలిగ్రామ్‌ అనే యాప్‌లో ఎవరో షేర్‌ చేయగా చిరంజీవి అనే బొమ్మల కథ అందులో చేరింది. సినిమా నటులు చిరంజీవిని ప్రధానపాత్రను చేసి చిత్రించిన కామిక్‌  అది. బొమ్మల కథలను, అందు లోని పాత్రలను, ఆ సన్నివేశాలను, ఆ ముచ్చటైన అరేంజ్మెంట్‌ను ఈ రోజు కొత్తగా తెలుసుకున్న వాళ్ళం కాదు కదా! కానీ నన్ను ఈ కొత్తగా చూస్తున్న ‘చిరంజీవి’ మంత్రముగ్ధుణ్ణి చేసింది.  

చిత్రకారుడికి కాల్పనికమైన పాత్రలను సృష్టిం చడం పెద్ద గొప్ప విషయం కాదు. అలా అని మన మధ్య ప్రాణం పోసుకుని తిరుగుతున్న మనకు బాగా తెలిసి ఉన్నవారిని బొమ్మల్లో ప్రాణప్రతిష్ట చేయడం అతి కష్టమైనదా? అని అడిగితే...  ఒక బొమ్మను మాత్రమే చిత్రించడం అయితే పెద్ద కష్టమూ, గొప్పా కాదు. కానీ కామిక్స్‌లో కొన్ని వందల సార్లు ఒక పాత్రని, అందునా మనకు బాగా తెలిసి ఉన్న ఒక ప్రముఖుణ్ణి  ఏ వైపు నుంచి చూసినా అరచేయి కొలత నుండి అగ్గిపుల్ల మొనంత  కనబడే ఆ క్యారెక్టర్ని గీయడమనేది అంతగా క్రాఫ్ట్‌ నైపుణ్యం లేని  తెలుగు చిత్రకళా రంగంలో ఒక అసాధ్యమే.

నాకు తెలిసి ఈ పనే అంతర్జాతీయ స్థాయిలో  అమెరికన్‌ చిత్రకారులు ‘మార్ట్‌ డ్రకర్‌’  చేయగలి గారు. అయితే బొమ్మల్లో తెగ డిటైల్‌ ఉంటుంది.  బుజ్జాయి గారు అలా కాదు, మహామహా కార్య శీలులు మాత్రమే సాధించగలిగిన అమిత సింప్లి సిటీ ఆయన బొమ్మల బ్యూటీ. 

బుజ్జాయి బొమ్మలతో పోల్చుకోదగిన అలతి రేఖల ఆర్టిస్ట్‌ అంత సులువుగా మరెవరూ కాన రారు. ఏం రేఖ, ఎంత చక్కని కూర్పు! తొలి ఉదయపు లేత ఎండ కాంతివంటి  ఆయన రంగులు  బొమ్మల మీద  జిగేలు మనేవి. ఆయన బొమ్మలో రంగుని రేఖ తినేది కాదు, రేఖని రంగు మింగేది కాదు. సమన్వయం– సంతులత తెలిసిన ఒబ్బిడి రకం చిత్రకారులు ఆయన. మనిషీనూ అంతే. ఏళ్ళ క్రితం పనిగట్టుకుని మదరాసు వెళ్లి, ఒక రోజు ఆయనతో గడిపాము నేనూ, మా ఫ్రెండ్‌ విజయ్‌వర్ధన్‌.

ఆ రోజు ఆయన చిన్నతనపు కబుర్లు, ఆ బొమ్మల ముచ్చట్లు, యవ్వనపు రోజుల్లో బాపు గారు స్కూటర్‌ ఎక్కి వారి ఇంటి వద్దకు వచ్చి హారన్‌ మ్రోగించడం,  ఈయన వచ్చి బండెక్కడం, అవన్నీ చెబుతుంటే  కళ్లముందు ఒక చక్కని నలుపు తెలుపు రంగు సినిమా కదలాడినట్లు ఉంది. గొప్ప తపన, పనితనం తెలిసిన చిత్రకారులంతా తమ బొమ్మలతో దేశాన్ని ఉర్రూతలూగించిన సమయ మది.  మన వేపు బాపు, వపా, బుజ్జాయి, చిత్ర, శంకర్‌ దాదాపు ఆ మదరాసు వీధుల్లో నడకలుగా,  తెలుగు పత్రిక పేజీల్లో రేఖలను పరుగులుగా సాగిన కాలమది.

బుజ్జాయి బొమ్మలని ఆనిమేషన్‌ చిత్రాలుగా, చరిత్రలోని గొప్ప గాథలని బొమ్మల కథల్లో నిలుపు కుని ఉండాల్సిన పని. ఆయన బొమ్మలు చూసిన ప్రతిసారీ నా మనసుకు అనిపించేది ఒకటే. బ్బా!  ఎంత అలవోకగా ఈయన కాగితంపై బొమ్మని మిగులుస్తారు.  నిజానికి ఎంత పనిని మనం ఈయన వద్దనుండి రాబట్టుకోవలసింది! యురోపి యన్‌ దేశాల్లో ఆస్టెరిక్స్, టిన్‌ టిన్‌ వంటి వాటికి రెండింతల బొమ్మల సంపద మిగిలి ఉండాలి కదా.

ఎంతో కథా సాహిత్యం మన దగ్గర ఉన్నది, లేని దల్లా బుజ్జాయి వంటి  చిత్రకారులే కదా. పడమట వాలిన సూర్యుడు తెలవారగానే తూరుపున వచ్చే స్తారు. కానీ జాతి సాంస్కృతిక జీవనంలో ఒకరే బుజ్జాయి, ఒకరే బాపు, ఒకరే వడ్డాది పాపయ్య వంటి వారు ఒకరే ఉంటారు. వారు సశరీరంగా శాశ్వతులు కారు గానీ వారి స్ఫూర్తి మాత్రం తర తరాలుగా శాశ్వతంగా ఉండవలసినది. వారు జీవించి ఉన్నప్పుడే వారితో, వారి స్ఫూర్తితో వర్క్‌ షాపులు నడిపించి ఎందరో కొత్త తరం బుజ్జాయి లని తయారు చేసుకోవాల్సి  ఉండింది!

ఈరోజు బుజ్జాయి లేరు. ఆయన రచించిన పుస్తకాలు మాత్రం ఒక వరుసలో మిగిలాయి. ఏదో ఒక రోజున ఒక చిన్న హస్తం వచ్చి ఆ పుస్తకపు పేజీలు తెరిచి అందులోని బొమ్మలని చూసి వెలిగిన కన్నులతో బుజ్జాయి అంతటి చిత్రకారుడ వ్వాలనే కలలు కంటాయని కలగంటూ  బుజ్జాయి అని మనకు తెలిసిన దేవులపల్లి సుబ్బరాయశాస్త్రి గారికి నివాళి. 
– అన్వర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement