ముంబై: పోలీసు స్టేషన్‌లో అధికారులతో సంభాషణను రికార్డ్ చేయడం అధికారిక రహస్యాల చట్టం ప్రకారం నేరం కాదని బాంబే హైకోర్టు పేర్కొంది. పోలీస్ స్టేషన్‌లో బెదిరింపు సంభాషణను రికార్డ్ చేసినందుకు గూఢచర్యం ఆరోపణలతో ఇద్దరు సోదరులపై నమోదైన అభియోగాలను కొట్టివేస్తూ బాంబే హైకోర్టు తీర్పునిచ్చింది.
ఈ కేసు హైకోర్టుకు చేరిన దరిమిలా దీనిపై విచారణ జరిగింది. భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ) కింద వారిపై నేరపూరిత కుట్ర ఆరోపణలను రద్దు చేయడానికి నిరాకరిస్తూనే, ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మహారాష్ట్రకు చెందిన ఇద్దరు సోదరులపై గూఢచర్యం ఆరోపణలను కోర్టు రద్దు చేసింది. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్‌ఐఆర్) ప్రకారం ఈ రికార్డింగ్ పోలీస్ స్టేషన్‌లో జరిగిందని జస్టిస్ విభా కంకన్‌వాడి, జస్టిస్ ఎస్‌జీ చపాల్‌గావ్‌కర్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది.
అధికారిక రహస్యాల చట్టం- 1923లో నిషేధిత ప్రదేశం అంటే ఏమిటో తెలిపారు. అయితే దానిలో పోలీస్ స్టేషన్ అనేది లేదు. అందుకే వారిపై అధికారిక రహస్యాల చట్టం కింద మోపిన అభియోగాలు నిరాధారమైనవని తెలియజేస్తూ హైకోర్టు ఈ తీర్పునిచ్చింది. మహారాష్ట్రకు చెందిన సోదరులు సుభాష్, సంతోష్ రాంభౌ అథారేలపై నేరపూరిత కుట్రతో పాటు, అధికారిక రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించినట్లు 2022 జూలై 19న పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయ్యింది. సుభాష్ ఒక పోలీసు అధికారితో జరిపిన సంభాషణను రికార్డ్ చేసిన దరిమిలా వారిపై కేసు నమోదయ్యింది.
2022, ఏప్రిల్ 21న ముగ్గురు వ్యక్తులు అథారే ఇంటిలోకి అక్రమంగా చొరబడి, వారి తల్లిపై దాడి చేసిన ఘటనపై ఆ సోదరులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే దీనిని నాన్-కాగ్నిజబుల్ (ముందస్తు కోర్టు అనుమతి లేకుండా పోలీసులు అరెస్టు చేయలేని నేరాలు) నేరంగా పోలీసులు నమోదు చేయడంపై అథారే సోదరులు అసంతృప్తితో పోలీసులను ప్రశ్నించారు. ఈ కేసులో ఇన్వెస్టిగేటింగ్ అధికారితో జరిగిన సంభాషణను వారు రికార్డ్ చేశారు. ఈ నేపధ్యంలో ఆ అధికారి వారితో ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని బెదిరించారు.
కాగా ఈ రికార్డింగ్‌ను వారు పోలీసు డైరెక్టర్ జనరల్‌కు పంపారు. ఈ నేపధ్యంలో ఆ సోదరులపై అధికారిక రహస్యాల చట్టం- 1923 ఉల్లంఘన కింద కేసు నమోదయ్యింది. అయితే ఈ ఎఫ్‌ఐఆర్ ప్రతీకార చర్యలా ఉందని, కల్పిత సాక్ష్యాధారాల ఆధారంగా కేసు నమోదు చేశారని, అందుకే దానిని రద్దు చేయాలని ఆ సోదరుల తరఫు న్యాయవాది హైకోర్టులో వాదించారు. దీనిపై ప్రాసిక్యూషన్ తన వాదనలో వారు చేసిన రికార్డింగ్ పోలీసు సిబ్బందిని బెదిరించినట్లుగా ఉందని పేర్కొన్నారు.
సెక్షన్ 2(8) కింద నిషేధించబడిన స్థలం అనే నిర్వచనంలో పోలీసు స్టేషన్ లేదని నొక్కి చెబుతూ, అధికారిక రహస్యాల చట్టం దీనికి వర్తించదని హైకోర్టు తెలిపింది. అలాగే ఈ ఉదంతంలో కుట్ర, నేరపూరిత బెదిరింపు ఆరోపణలకు సంబంధించి తదుపరి చర్యలకు సాక్ష్యాధారాలు అవసరమా కాదా అని నిర్ధారించే బాధ్యతను దిగువ కోర్టుకు అప్పగించింది. ఈ కేసులో అధికారిక రహస్యాల చట్టం కింద వచ్చిన ఆరోపణలను కోర్టు రద్దు చేసింది. అథారే సోదరుల తరఫున న్యాయవాది ఏజీ అంబేద్కర్ వాదనలు వినిపించగా, పోలీసు సిబ్బంది తరపున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎన్ఆర్ దయామ వాదనల్లో పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: మరణశిక్షను ఆపిన సుప్రీంకోర్టు
Comments
Please login to add a commentAdd a comment