Maha Shivratri: మళ్ళీ రావు ఆ బంగారు రోజులు.. | artist Anwar Recalls Maha Shivratri On Old Days At nandyala | Sakshi
Sakshi News home page

Maha Shivratri: మళ్ళీ రావు ఆ బంగారు రోజులు..

Published Fri, Mar 8 2024 3:47 PM | Last Updated on Fri, Mar 8 2024 4:19 PM

artist Anwar Recalls Maha Shivratri On Old Days At nandyala - Sakshi

మాది నంద్యాల. అనగనగా రోజుల్లో కుందూ నదీ తీరాన ఉన్న ఈ పట్టణాన్ని పూర్వం నందియాల అని పిలిచేవారుట. 14వ శతాబ్దంలో నందన అనే మహారాజు గారు మా మండలం చుట్టూ నవ నందులను నిర్మించడంవల్ల దీనికి నంది మండలమని పేరొచ్చిందని కాల క్రమేణా అదే నంద్యాలగా రూపాంతరం చెందిందని అంటారు. చుట్టూ నవనందులు ఉన్నా మాకు మహనంది మీదే మక్కువ ఎక్కువ. ఒక్క రోజు సెలవు దొరికితే చాలు "పొదామా అంటే, పోదామా" అనుకుంటూ మేము పిల్లలమంతా అద్దె సైకిల్లు తీసుకుని పొద్దున మహనందికి తయారు.  

పోయి పెద్ద కోనేరులో ఈతలు కొట్టి అలిసి పోయి, సేద తీరడానికి  చిన్న కోనేరులో ఈతలు కొట్టి తేరుకుని సాయంత్రానికంతా తిరిగి ఇళ్ళు చేరుకునేవాళ్లం. ఈతల మధ్యలో సమయం దొరికితే మహనందీశ్వరుణ్ణి కూడా దర్శించుకుని దండం పెట్టుకునేవాళ్లం. మీరు ఈ మాట ఇక్కడ జాగ్రత్తగా వినాలి. దండం పెట్టుకునేవాళ్లం అన్నాను  అంతే కానీ  కొరికలు కోరుకునే వాళ్లం అనలేదు. దేవుడు ఉన్నది కోరికలు తీర్చడానికని, కోరికలు తీర్చుకోడానికే  దేవుడుకి దండం పెట్టుకోవాలని మేము నేర్చుకోలేదు.

ఒకరోజు గుడిలోకి వెళ్ళి నేనూ, నా ఫ్రెండు శంకర్ దండం పెట్టుకున్నాక.. శంకర్ కిందికి వంగి దేవుడి పళ్ళెంలో ఉన్న నోట్లని గుప్పిట నిండుగా పట్టుకుని ఆక్కడి నుండి పారిపోయాడు. నాకు కూడా అక్కడ ఉన్న ఒక అయిదురూపాయల నోటు టెంప్ట్ చేసింది కానీ , తీసుకోలేకపోయాను. అందుకు నా మీద  దేవుడికి కోపం వచ్చి చేతకాని నన్ను ఆర్టిస్ట్ కమ్మని శపించి, ధైర్యం, చాకచక్యం పుష్కలంగా ఉన్న శంకర్‌ను ప్రముఖ పొలిటీషియన్ కమ్మని వరమిచ్చాడు. గుడిలో పులిహోర మాత్రం ఇద్దరికీ సమానంగా ఇచ్చాడు. 

శివుడు మా ప్రాంతపు ఎక్కువ దేవుడు. మా నూనెపల్లె నడిబొడ్డున శివాలయం ఉంది. తెల్లవారిన దగ్గర  నుంచి "బ్రహ్మమురారి సురార్చిత లింగం | నిర్మలభాసిత శోభిత లింగమ్ | జన్మజ దుఃఖ వినాశక లింగం | తత్-ప్రణమామి సదాశివ లింగమ్ |" అని ఎప్పుడూ వినపడుతూనే ఉండేది. అప్పుడు నేనూ, నావంటి నూనెపల్లె పిల్లలం కలిసి శివాలయం ముందు నుండి ఆటలాడుతూ పరిగెడుతూ బ్రహ్మమురారి సురార్చిత లింగం అని పాడుకుంటూ మంచి నీళ్ళ బాయి దగ్గర మలుపు తిరగగానే మసీదు నుంచి అజాన్ రాగానే అల్లాహు అక్బర్ | అష్-హదు అన్-లా ఇలాహ ఇల్లల్లాహ్|  అష్-హదు అన్న ముహమ్మద అర్-రసూల్ అల్లాహ్| హయ్యా అలస్-సలాహ్| హయ్యా అలల్-ఫలాహ్| అల్లాహు అక్బర్. అని ముగింపు పాడుకునేవాళ్లం. ఆ రోజుల్లో మీరెవరు అని అంటే మేము నూనెపల్లె వాళ్లం అని మాత్రమే మా ప్రవర. 

మాది నిజానికి ప్రకాశం జిల్లా. మా జేజి నాయన తన కుటుంబాన్ని తీసుకుని బ్రతుకు తెరువుకోసం నూనెపల్లె చేరినపుడు ఆయనని వెల్ కం టు నూనెపల్లె అని స్వాగతించింది మా ఊరి మహాదేవుడు శివుడు, తన గుడి అరుగు మీద స్థలం చూపి నువ్వు ఇక్కడ టైలరింగ్ చేసుకోవచ్చబ్బా!  అన్నాట్టా. మా పెద్దల  బ్రతుకు గిర్రున తిరగడానికి కుట్టు మిషన్ చక్రం కదిలింది ఈ శివాలయం గుడి నీడ నుండే.

మామూలుగా పండగలన్నీ ఉదయపు సంబరాలయితే ఒక్క మహా శివరాత్రి మాత్రం సాయంత్రం నుండి మొదలయ్యే ఉత్సాహం. ప్రతి పండగకు ముందు పిల్లలమంతా కూడి రాబోయే పండగ గురించి ఎన్నెన్ని విశేషాలు చెప్పుకునే వాళ్లమో! లెక్కే లేదు.  అప్పుడు మా చొక్కాకు ఒక జేబు, నిక్కరకు రెండు జేబులు ఉన్నా ఆ మూడు జేబుల నిండా కబురులు తరగని అక్షయ నిధుల్లా పోటెత్తేవి.

అప్పుడు మా ఊరి రోడ్లు ఎప్పుడూ ఎద్దుల బళ్లతోనూ, గుర్రపు జట్కాలతోనూ , రిక్షాల మూడు చక్రాలతోనూ, సైకిల్ బెల్లులతోనూ,  సైడ్, సైడ్ జరుగు జరుగు అని హెచ్చరిస్తూ కదిలేవి. ఒకటీ రెండు  బస్సులు ఉన్నా, అవి ఎప్పుడో ఒకప్పుడు వస్తూ పోతూ ఆగుతూ కదులుతూ  ఉండేవి. ఆ రోజుల్లో ప్రతి పండగకు మా ఊరి శివాలయం ముందు పందిరి కట్టి హరికథలు నడుస్తూ ఉండేవి. మామూలు  రోజుల్లో  చీకటి పడగానే త్వరగా నిద్రపోయే ఊరి రహదారులు పండగ రోజుల్లో మాత్రం తెల్లవార్లూ మేలుకుని ఉంటాయి.

కథలు చెప్పడానికి వచ్చిన హరిదాసు గారి కథా గమనాన్ని, మృదుమధురమైన గానాన్ని, కాలి అందియలు ఘల్లు మనడాన్ని, చేతిలోని చిడతలు ఝల్లు మనడాన్ని, ఆ పిట్టకథలను, ఆ వేదాంత చర్చను, మధ్య మధ్యలో పాపులర్  సినిమాల పాటల చమత్కారపు పేరడీలను ఊరు ఊరంతా, దారి దారంతా గడ్డం క్రింద చేయిపెట్టుకుని అలా కళ్ళప్పగించి చూస్తూ, వింటూ  ఉండేది. ఈ హరి కథల కోసమని చీకటిపడే సమయానికంతా ఊరిని, దారిని బందు పెట్టేవారు. ఇక ఆ రాత్రి ఆ దారిన ఒక వాహనం నడవదు, ఈ చివరి నుండి ఆ చివరి వరకు ఒక్క సైకిలు చక్రమూ  తిరగదు.

ఊరి జనం అంతా చేతికందిన చాపలు, దుప్పట్లు, బొంతలు, బియ్యం బస్తాల జనపనార పట్టాలు పట్టుకుని రోడ్దుని ఆక్రమించుకునేవారు. అందరికన్నా ముందు అక్కడికి చేరుకునేది నావంటి పిల్లలు. వారి వారి అమ్మా నాయనల కోసమో, అవ్వా తాతల కోసం కాదు. స్కూలు, ట్యూషన్ క్లాస్‌మెంట్‌ కోసమని, ప్రాణ స్నేహితుల కోసమని తగు మాత్రం స్థలం రిజర్వు చేసి పెట్టేవారు. ఎన్నయినా చెప్పండి మళ్ళీ రావు ఆ బంగారు రోజులు. ఆకాశానికి నక్షత్రాలు పూచే ఆ సాయంకాలాలు, అరచేతుల్లో గాజు మొబైల్ అద్దాలకు బదులు దేవుడు రాసిన గీతలు కనపడే రోజులు మరిక లేవు. 

ఇవన్నీ మామూలు రోజుల్లోని పండగల సాయంకాలాల గుడి బయటి దృశ్యాలు. హరికథల పండగ  రోజుల్లో బాగా నిద్ర అనిపిస్తే ఇంటికి రావచ్చు. శివరాత్రి సంగతి వేరు. శివరాత్రి రోజున శివాలయం బయట రోడ్డుకి అడ్డంగా పెద్ద తెల్లని  తెర కట్టేవారు. తెరకి అటూ ఇటూ జనం కూర్చునేవారు. చాపలు, దుప్పట్లు, బొంతలు, బియ్యం బస్తాల జనపనార పట్టాలు మామూలే. పిల్లలు ముందు గానే వచ్చి స్థలం రిజర్వు చేసి పెట్టడమూ మామూలే. ఆ రాత్రి శివాలయం ముందు మూడు ఆటలు సినిమాలు వేసేవారు. పౌరాణిక సినిమాలే వేసేవారు. మూడు సినిమాలలో ఒక సినిమా మాత్రం దక్షయజ్ఞం ఖచ్చితంగా ఉండేది. 'ఉమా చండీ గౌరీ శంకరుల కథ కూడా తప్పకా ఉండేది. మేము ఆ సినిమాని ఉప్మా, చట్ని, గారె, సాంబారుల కథ అని పిలుచుకుని, గట్టిగా నవ్వి ఆపై కళ్ళు మూసి దేవుడికి దండం పెట్టుకుని లెంపలు వేసుకునేవాళ్లం 

ఆ శివరాత్రి రాత్రులలో, ముఖ్యంగా దక్షయజ్ఞం సినిమా చూస్తున్నప్పుడు మా ఊరి శివాలయంలో ఉండే ఆ  చంద్రచూడుడు, చంద్రశేఖరుడు,  విషకంఠుడు, పినాకపాణి , మహాశివుడు క్లైమాక్స్ లో గుడి లోపలినుండి  ఆ ఫలాన తెరమీదకు వచ్చి నందమూరి రామారావు ఒంటి  మీదికి పూని శివతాండవం చేయిస్తాడు చూడు!  తీవ్ర దుఃఖంతో, మహా కోపంతో, తన జూట నుండి  ఒక  కేశాన్ని పెరికి నేలకేసి కొడితే ఆ వెంట్రుక    నుండి ఆయన పెద్ద కొడుకు  వీరభద్రుడు పుట్టుకొస్తాడు చూడు. అది మాకు శివరాత్రి అంటే. ఆ ఒక్క దృశ్యం చూడడం కోసమే కదా సంవత్సరమంతా వేచి వేచి  శివరాత్రి జాగారం చేసేది.

ఈ రోజుల్లో లాగా ఏ క్షణన  కావాలిస్తే ఆ క్షణాన కళ్ళముందుకి నర్తనశాలలు, పాండవ వనవాసాలు, వినాయక విజయాలు వచ్చే కాలం కాదు కదా. ఆ రోజుల్లో ప్రతి అనుభవానికి ఒక గొప్ప విలువ ఉండేది. లిప్త పాటు అదృష్టాల్ని ఒడిసిపట్టుకుని బ్రతుకు పుస్తకంలో మెరుపుల  నెమలీకలా దాచుకుని తీరాల్సిందే. పండగ పూట సినిమాలు చూస్తూ జాగారం చెయడమేమిటి  కలికాలం అని పెద్ద తరం వాళ్ళు విసుక్కుంటున్నా సరే, దారి మీద మూడాటల తెర ఆడుతూనే ఉండేది. సినిమా టాకీసులలో రాత్రి మూడాటలు ఆడుతూనే ఉండేవి, గుళ్ళల్లో పూజలు, అవధూతల ఆశ్రమాల్లో భజనలు కొనసాగుతూనే ఉండేవి. ఏదో ఒక రకంగా, ఒక రూపంగా భక్తి అనేది కళ్ల మీదికి  నిదుర మూత వాలకుండా కాపాడుతూ ఉండేది. ఒక రాత్రి ముగిసేది. ఆ తరువాతి పగటిని  రాత్రిలా జనం అంతా నిద్రపోయేవారు. సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే వచ్చే జాగారపు యామిని ప్రస్తుతం మరణించి చాలా కాలం అయ్యింది. ఇప్పుడు ప్రతి ఇంట్లో జనం మెలకువగానే ఉంటున్నారు. పగళ్ళు నిద్రపోతూనే ఉంటున్నారు.

శివుడికి ఒకరోజు, రాత్రికి ఒక కాలం, సినిమాకి ఒక వారం అంటూ ఏమీ ఉండటం లేదు. శివరాత్రికి చలికాలం శివ శివ అని పారిపోతుంది అనేవారు. చలికాలం రాకముందే చలి పారిపోయే కాలం వచ్చినట్లుంది. భస్మాసురుడికి భయపడి శివుడు పరుగులెత్తాడు అని అనుకునేవారు. అసురుడి దాకా ఎందుకు మామూలు మనిషికి భయపడే చూసే పరమశివుడు ఎప్పుడో పారిపోయినట్లుగా అనిపిస్తుంది. నాకు మాత్రం ఆలయాలు ఉన్నాయి కానీ, దేవుడులు అక్కడ ఉండటం లేరేమో అని గట్టి నమ్మకమే ఉంది. పండగ ప్రతి సంవత్సరం వస్తూనే ఉంది కానీ, అనుభవాలు మిగలడం లేదు నిన్నటి రాత్రికి ఈ శివరాత్రికి తేడా కనపడ్డం లేదు. మా చిన్నప్పుడు చెప్పుకునేవాళ్ళు. మద్రాసులో బతికిన కాలేజీ, చచ్చిన కాలేజీ అనేవి ఉన్నాయని. ఇప్పుడు నేను రాసుకున్నదంతా చచ్చిపోయిన మా  నూనెపల్లె కథ, ఒక వదలని దుఃఖపు గీతి రాత.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement