తెలుగువాడి వర్ణఫలం ‘వాసు’
పత్రికల్లో రంగు వెలిసిపోతున్న తెలుగు బొమ్మ చివరి వెలుగు వాసు. బొమ్మల్ని తన బొమ్మల బల్ల వరకే పరిమితం చేసుకున్న సంయమన శీలి. అక్కడి నుంచి లేచాడా.. బొమ్మ కన్నా ప్రపంచం గొప్పదని ఎరుక ఉన్నవాడు.
ఉదయాన్నే ఇంట్లోకి వచ్చి పడే దినపత్రిక లోగిల్లో తీరైన రేఖతో ప్రభాత వర్ణాల ఆ నీటి రంగుల ముగ్గు పేరు వాసు - తెలుగమ్మాయిల బుగ్గల ఎరుపు ముక్కు చివరి ముక్కెరను తాకి బంగారు కాంతిని జిగేల్మనిపించినా అది వాసే. అమ్మా, నాయనమ్మల కంచి ధర్మవరం బెనారస్ పోచంపల్లి చీరల ధగధగల మధ్య అల్లరల్లరిగా ఆటలాడే పిల్లిమొగ్గల, కోతి చేష్టల పిల్లకాయల నిండు పండులాంటి ముద్దు మొఖాల చిరునవ్వుకు సంతకం తెలిస్తే అది వాసు. ఈ రోజు తెలుగు వాడి వర్ణ ఫలం పేరు వాసు.
తెలుగురేఖ దీటుకు దాని ఎనలేని సానకు బాపు, బాలి, గోపి, మోహన్, కరుణాకర్ వంటివారు శిఖర స్థాయికి చేరిస్తే ఆ పతాకం వెనుక నుంచి పంచ రంగుల సూర్యుణ్ణి వెలుగింప జేసింది చిత్రకారులు చంద్ర, ఆపై ఆయన ప్రియాతి ప్రియ అంతే వాసి వాసు. పాపం చాలామంది శిష్యులు ఒక పెద్ద నడక నడిచాకా వెనక్కి తిరిగి చూసే ఓపికా అవసరమూ లేక నడిచిన దారి గురుతులు మరిచి ‘పాపం ఆయనా! నా గురువా? అబ్బే!’ అని మొహమాటపడతారు కానీ... ఏనాడు చంద్రగారి పక్కన నిలబడి నాలుగునిముషాలైనా ఆయన చిత్రకళా విన్యాసాన్ని ప్రత్యక్షంగా చూడని వాసు, నిద్దరలో కూడా ఇదంతా చంద్ర బొమ్మల భిక్షేనని ఆయన్ని కన్నులక ద్దుకుంటారు. బొత్తిగా వెర్రి ఏకలవ్యుడు. చంద్ర మాత్రం ద్రోణుడు కారు.
పత్రికల్లో రంగు వెలిసిపోతున్న తెలుగు బొమ్మ చివరి వెలుగు వాసు. ఒక చిత్రకారుడిగా ఆయన బొమ్మలు ప్రపం చానికి తెలియడమే తప్ప ఆయన గురించి ఫలానా సంవ త్సరం, ఫలానా నెల, ఫలానా ప్రాంతంలో ఫలానా జిల్లాలో పుట్టారు. అప్పుడు అది ఆ జిల్లే కానీ ఇప్పుడు అది ఈ జిల్లా అయ్యింది. పైగా రాష్ర్టం కూడా బదలాయించింది వంటి సమాచారం ఒక అనవసరం. మన వెర్రి కాకపొతే కళాకా రుడికి ఫలానా ఫలానా ఏమిటి? పైగా వాసు వంటి వారికి! వాసు అంటే కొందరి వ్యక్తి కాదు అది అందరి బొమ్మ. కోన సీమ పచ్చని బయలుపై ఠీవిగా నడిచే కోడెదూడ మెడన మెరిసే మువ్వల వరుస తళుకు వాసు కుంచెదే, భద్రాది రాములవారి గోపురంపై నీడ కప్పిన కొబ్బరాకు పచ్చదనం కూడా అదే. ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన అమ్మవారి నల్లని విగ్రహపు నవ్వు రంగు కూడా అంతే, శ్రీశైల మల్లికార్జుని కొలువులో సేదతీరుతున్న మల్లియలకు అద్దిన తెల్లని తెలుపు ముత్యపు రంగు కూడా వాసూదే.
వాసు ఒక రకంగా కర్మ యోగి ఒక్క ఖానా, పీనా, పిలానాలో తప్ప మరే ఆర్టు గ్రూపుల్లో, గ్రూప్ ఫొటోల్లో తోసుకువచ్చి కనపడే రకం కాదు. ప్రేక్షకుల్లో ఒక ప్రేక్షకుడిగా మాత్రమే ఉండాలనుకుంటాడు. మన బొమ్మలో చేవ సత్తా వుంటే దాన్ని ప్రపంచం చూస్తుంది కానీ మన మొహం వెళ్ళి ప్రపంచం ముందు ఎందుక్కనపడాలని పేరు ప్రఖ్యాతులపై సిగరెట్ పొగ ఊదే ఒక తెంపరి. బొమ్మల్ని తన బొమ్మల బల్ల వరకే పరిమితం చేసుకున్న సంయమన శీలి, అక్కడి నుంచి లేచాడా బొమ్మ కన్నా ప్రపంచం గొప్పదని ఎరుక ఉన్నవాడు. వాసు ఆర్టిస్ట్‌గా కన్నా, ఒక స్నేహిగా, ఒక నిరంతర ప్రయా ణిగా, తనకు నచ్చినవారి మధ్య ఒక సందడిగా బతకాలను కునే మామూలు మనిషి. నేను 24 గంటలు కేవలం ఆర్ట్‌నే పీలుస్తానని హడావుడిగా ఆర్ట్ అ్‌ప్‌డేట్స్ కోసం పాకులాడే బాపతు కాదు కాబట్టే ప్రపంచానికి వాసు బొమ్మ తెలిసినంత వాసు అంటే ఏమిటో ఎవరికీ తెలుపదలుచుకోలేదు.
తెలుగు బొమ్మల పెద్దలు బాపు, చంద్ర, మోహన్, బాలి, కరుణాకర్‌ల తరువాత తన బొమ్మల్తో ఈ తరానికి స్ఫూర్తి కలిగిస్తున్న ఈ కాలపు ఒకే ఒక చిత్రకారుడు వాసు. చాలా ఏళ్ళ తరువాత బొమ్మల కాలేజీలో చదువుకునే పిల్లలు, చిత్రకారులమవుదామనుకుని తపించే జనం ఓనామహ శివా యహ దిద్దినంత సీరియస్‌గా ఇప్పుడు వాసు రంగుని రేఖని సాధన చేస్తున్నారు. ఇది నిజంగా గొప్ప విప్లవం. అందుకు తరచు ఫేస్‌బుక్‌లో కనబడే వాసూలా గీయాలనుకునే చాలామంది బొమ్మలే సాక్షి. ఇప్పుడు వాయిస్ ఆఫ్ ఇమేజెస్ పేరిట వాసు తన మొదటి బొమ్మల ప్రదర్శన హైదరాబాద్ రవీంద్రభారతి కళాభవన్‌లో డిసెంబర్ 3, 4, 5న ఏర్పాటు చేస్తున్నారు. వర్ణానికి, వర్గానికి, ప్రాంతానికి కట్టుబడని ఈ కళాకారుడి దారిలో వెలిసిన బొమ్మల మైలురాళ్ళ జాతర ఇది. ఈ శుభ సమయాన ఇక్కడ హైదరాబాద్‌లో ప్రారంభ మవుతున్న ఈ రంగుల పండుగను ఇరు రాష్ట్రాల కళాభిమా నులు తమకు తామే పూనుకుని రెండు తెలుగు రాష్ట్రాల ప్రముఖ నగరాల్లో బొమ్మల కొలువుగా కొలువు తీరుస్తే బావుంటుంది.
నిజానికి ఈ ప్రదర్శన ఎప్పుడో జరగ వలసింది. కానీ ఇప్పుడు ఇన్నేళ్ళ తరువాత జరుగుతున్న వాసు బొమ్మల కొలువు కూడా ఎవరో బలవంతపెట్టి చేయిం చడం తప్ప వాసు తనకు తాను చేస్తున్నది అని నేను అనుకోవడం లేదు. ఆ పర్సన్- బిహైండ్ ది సీన్ ఎవరో అదే చేత్తో వాసు బొమ్మల పుస్తకం కూడా మార్కెట్లో తెస్తే మా తరం, మా తదుపరి తరం చిత్రకారులకు చాలా పెద్ద బొమ్మల బాలశిక్ష అవుతుంది. నిజానికి వాసు తన బొమ్మల పుస్తకానికి తన సొంత జేబులోంచి చెల్లని అయిదు వందలు, వెయ్యి రూపాయల నోటు తీయనవసరం లేకుండా కొండంత ప్రేమతో ఆ పుస్తక భారం వహించే పెద్దలు ఎంతోమంది వాసు అభిమానులుగా వున్నారు. కానీ ముందుగా చెప్పు కున్నట్టు ఇటువంటి సరదాలు ఏం పట్టని వాసు కర్మ యోగి. అదే మన ఖర్మ.
(డిసెంబర్ 3, 4, 5 తేదీల్లో హైదరాబాద్ రవీంద్రభారతిలోని కళాభవన్‌లో వాసు మొదటి బొమ్మల ప్రదర్శన సందర్భంగా)
అన్వర్, సాక్షి కార్టూనిస్టు