ఐదో దిక్కున అతడు ఇప్పుడు | Anwar Writes on Cartoonist Mohan | Sakshi
Sakshi News home page

ఐదో దిక్కున అతడు ఇప్పుడు

Published Mon, Sep 25 2017 12:27 AM | Last Updated on Mon, Sep 25 2017 12:27 AM

Anwar Writes on Cartoonist Mohan

నేను కృష్ణశాస్త్రి కవితలకీ, బొలీవియన్‌ జంగిల్‌ వార్‌కీ, టెట్‌ అఫెన్సివ్‌కీ, బాపూ చిత్తప్రసాద్‌ బొమ్మలకీ పుట్టిన బిడ్డని. బయాఫ్రాలో చనిపోయిన బిడ్డల ఏడుపు నుంచీ, మా పేటలో జూట్‌ కార్మికుల మురికి బ్రతుకుల నుంచీ, జామిని రాయ్, లాత్రెక్, ఇల్యా రెపిన్‌ పెయింటింగ్‌ల నుండీ పుట్టాను. అరవయ్యో దశకం తెచ్చిన నెత్తురూ, కన్నీళ్లూ, విప్లవకేకలూ నా వెంట ఉంటాయి.

నా పదహైదేళ్ళ వయసులో మొదటిసారిగా విన్న వాయిస్‌ ఇది. ఇది మోహన్‌ది. నా ఫ్రెండ్‌ రఘు అని ఒకడు జర్నలిస్ట్‌ కావాలని కొరిక కొద్దీ ఆ రోజుల్లో గోవిందరాజు చక్రధర్‌ గారి ‘మీరూ జర్నలిస్ట్‌ కావచ్చు’ పుస్తకం కొన్నాడు. అందులో చదివిన మోహన్‌ గారి ఇంటర్వ్యూలోని వాక్యాలు ఇవి. ఇందులో నాకు  ఏం అర్థం అయ్యింది? ఎందుకు అర్థం కావాలి? అయినా ఒక తోసుకోవడం అనేది మనసులో మొదలెట్టించిన మనిషి పట్ల ఆరాధన కల్పించిన వాక్యాలవి. ఇప్పుడు మాత్రం ఇంతకాలం తర్వాత అయినా ఏం అర్థం చేసుకున్నానని మోహన్‌ గురించి వ్రాయడానికి, కొత్తగా మాట్లాడ్డానికి? జగమెరిగిన ఆయన బొమ్మల గురించి, ఆయన రాతల గురించి, ఆయన ధిక్కారాన్ని గురించి, పోరాటానికి బాసటగా చెయ్యెత్తిన కుంచె గురించి అంతా అందరికీ తెలిసిందే అయినా ఇంకా కోరేవాళ్లు కోరుతూనే వుంటారు. ఇంకా ఇంకా చదవాలనుకుంటారు. అందుకోసమైనా వ్రాయాలి.

ఇప్పుడు ఇలా వ్రాయడానికి నాకు నేను ఒక ప్రశ్న వేసుకుంటున్నాను... మోహన్‌ నిష్క్రమించి మనకు ఏం దూరం చేసి వెళ్ళారు, ఏం ఖాళీ పెట్టి వెళ్ళారని ప్రశ్నించుకుంటే బొమ్మలా? రాతలా? ప్రేమా? ప్రోత్సాహమా? వీటన్నిటికన్నా ముఖ్యంగా ఆయన ఈ గడ్డపై ఉన్న ఒకే ఒక గురుకులాన్ని పాడుపెట్టి వెళ్ళిపోయారు. ఒక చౌరస్తాని ఒంటరి చేసి వెళ్ళిపోయారు. ఆ గురుకులంలో బొమ్మలు పలికేవి, సంగీతం ప్రవహించేది, సాహిత్యం పరిమళించేది, రాజకీయాలతో వాతావరణం వేడెక్కేది. అక్కడికి నువ్వు చెంబుతో వెళితే చెంబుడు జ్ఞానం దక్కేది, లోటాతో వెళితే లోటాడు. కానీ ఆక్కడి నుండి ఎవడూ ఎప్పుడూ ఖాళీ చేతులతో మళ్ళేవాడు కాడు. నాకు తెలిసిన  ప్రపంచంలో ఇటువంటి కళాకేంద్రం ఎక్కడా నిర్మించబడలేదు. అది నిర్మితమయ్యింది ఇటుకతో, ఇసుకతో, కలపతో కాదు. రక్తమాంసాలు అíస్థి మజ్జ సంహితమైన ఒకే ఒక మనిషి తను ఎక్కడ నిలబడితే అక్కడ తానే గురుకులమైనాడు.

మోహన్‌ ఖాళీతో ఇపుడున్న నుండి రాబోయే తరాలకు జరిగిన అతి పెద్ద నష్టం ఇదే. చిత్రం ఏమిటంటే అక్కడ తను స్వయంగా చేత దిద్దబెట్టి ఎవడితో బొమ్మ వ్రాయించలేదు, కేవలం ఏది బొమ్మ అవునో, ఏది బొమ్మ కాదో కనుగునే కన్నయినాడు. పాట పాడే గొంతున్న వాడి ఎదుట నిలువెల్లా చెవియై పులకరించినాడు. అక్షరాన్ని పరుసవేదిగా మార్చగలిగిన వేలికి తను ఉంగరంలా మారి పదిమంది కన్నులు పడేలా వాడికి తళుకు దిద్దినాడు. మోహన్‌ ఒక ఎపిటైజర్, నీకు బొమ్మలు ప్రాణమా? సాహిత్యం ఊపిరా? పోరాటం మార్గమా? వీరందరికి తను ఆకలిమందులా పనిచేసాడు. అంతేకాదు రచయితగానీ కళాకారుడుగానీ కొన్ని గుణాలని పెంపొందించుకోవాలన్నాడు. నీకు కాస్త పేరు, కీర్తి తగిలిందా! ఢమాలున ‘రాక్షసుడొచ్చీ’ మన రొమ్ము తట్టి కోరలు మెలేస్తాడు.

దాంతో మనం మీసాలు మెలేస్తాం. కానీ వాడు కేవలం జీవం తొణికిసలాడే వ్యక్తి యొక్క చమట వాసన తగిలినా తన ఓటమిని ఒప్పుకుని పారిపోతాడు. లేకపోతే ఆ రాక్షసుడు మనలోని జీవాన్ని తీసుకెళ్లిపోతాడు. ఆ పై మనం పనేం చెయ్యకా ఒక వేళ చేసినా మన మీసాలు తిప్పేవాళ్ళకోసం ఎదురు చూస్తూ అటువంటి వాడెవడు రాకా ఆ తరువాత మనం ఒట్టి తోలుతిత్తుల్లా తిరగాల్సివుంటుంది. మోహన్‌ చాలామంది మనుషులు తోలుతిత్తులుగా మారకుండా వుండటానికి శ్రమ పడ్డాడు. బొమ్మలేసేవాడ్నీ వ్రాయగలిగేవాడ్నీ చేత చేవ ఉన్న ప్రతి ఒక్కడినీ జీవితులుగా ఉంచడానికి శ్రమించాడు. పనిపట్ల అసంతృప్తులుగా మిగిల్చాడు, ఇది కాదు ఇంకా మన్నికైన పనికోసం మనకు మనమే పరిగెత్తేలా నేర్పాడు. మావరకు పరిగెడతాం కానీ ఇక ముందు తరాలకు పరుగు తెలీకుండా అయిపోతుంది కదా అనుకోవడమే ఒక అతిపెద్ద నష్టం ఇప్పుడు.  

ఇంకా ఈ  భూమ్మీద తనకంటూ స్వంత ఇల్లు లేని మోహన్‌ ఒక  గదిని కనిపెట్టాడు. తను ఈ హైద్రాబాద్‌ మహానగరంలో ఏ ఇంట్లో చేరినా ముందు చేసే పని ఆ ఇంటి తలుపు పీకెయ్యడం. తలుపుల్లేని ఆ ఇంట్లో ‘ఏ తేరా  ఘర్, ఏ మేరా ఘర్, హమారా ఘర్‌ ఏ అపునా ఘర్‌‘ అని ప్రతివాడూ పాడుకుంటూ వచ్చి వుండే గది అది. వచ్చినవాడా! నువ్వెవరు? అనేది మోహన్‌కు శుద్ధ అనవసరమైన ప్రశ్న. నువ్వెవరైనా ఇక్కడికి రావొచ్చు, ఉండొచ్చు, పనుంటే చేసుకోవచ్చు, లేకపోయినా నష్టం లేదు. ఆకలేస్తే కిచెన్‌లో ఏదో ఒకటుంటుంది, లేకపోతే నీకు నువ్వే వండుకుని ఇంత తిని మిగిలితే మోహన్‌కు పెట్టవచ్చు, లేదా పస్తయినా పెట్టవచ్చు. ఏమీ అనుకునేది లేదిక్కడ. నువ్వు ఒక పరాయివాడివి ఉన్నావనే విషయమే తెలీని మోహన్‌కు నువ్వు వెళ్ళిపోయావని ఎన్నడూ తెలియదు.

నువ్విక్కడ పెద్దిభొట్ల సుబ్బరామయ్య పక్కన చైర్‌లో కూర్చోవచ్చు. ‘మో’ ఎదురుగా నిలబడి ‘అగ్గిపెట్టుందా గురూ’ అని కూడా అడగవచ్చు. పైగా ఇస్తారు కూడా. ఈ గదికి స్థాయీభేదం తెలీదు. కళాకారుల్నీ కవులనీ రచయితలనీ మేధావులనీ పాఠకుల్నీ పాటగాళ్ళనీ భూమ్మీది సమస్త జాతి మానవుల్నీ కలిపిన గదిది. మక్సీమ్‌ గోర్కి, ఆలూరి బైరాగి, లియో టాల్‌స్టాయ్, చిత్తప్రసాద్, సైగల్, అల్లా రఖా, బాబ్‌ మార్లే, పాల్‌ రాబ్సన్, దేవానంద్, జీన్‌ మొరియూ, ఫ్రాన్సిస్‌ ఫోర్డ్‌ కపోలా, డాల్టన్‌ ట్రంబో, మాస్తి వెంకటేశ, యూసుఫ్‌ కర్ష్, జపటిస్టా సబ్‌ కమాండెంట్‌ మార్కొస్, ఎమ్మెన్‌ రాయ్‌ వంటి వేలాదివేల వాల్‌ ఆఫ్‌ హానర్లు ఇక్కడ. ఇదిగో నువ్వు కూర్చున్న ఈ కుర్చీలోనే కేశవరెడ్డి కూచుని వుండినాడు. ఈ ప్రదేశంలోనే సినారె మోహన్‌ బొమ్మల కోసం వేచినాడు.

గోరటి వెంకన్న ‘పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల’ అని కన్నీరు పెట్టింది ఇక్కడే. శ్రీరమణ చిలుకల పందిరి వాలింది ఇక్కడే. ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పులలోన కరిగిపోయె! ఇచ్చోటనే లేత ఇల్లాలి నల్లపూసల సౌరు గంగలో కలిసిపోయె! ఇచ్చోటనే ఎట్టి పేరెన్నిక గన్న చిత్రలేఖకుని కుంచియ నశించె! అని పైడి తెరేశ్, లెల్లె సురేశ్,  రమణజీవి, పాండూ తదితర వైయక్తిక గొంతులు సంయుక్తంగా ఖణఖణమనిపించిందిక్కడే. మోషే డయాన్‌ పిల్లనగ్రోవి నీటి రంగుల పాట పలికింది ఇక్కడే. ఇక్కడే రవీంద్రభారతి కూడా జన్మలో ఎరుగని కచ్చేరీలు ప్రవహించేవి. గొప్ప గ్యాలరీవాళ్ల వర్కుషాపులు కూడా ఊహించలేని బొమ్మలు గీతల్లో మంత్రముగ్ధంగా తయారయ్యేవి. నిజానికే అదే అసలైన లామకాన్‌. కళా పిచ్చి, సాహిత్యం వెర్రి గల నావంటి పిలగాళ్ళ పాలిట మక్కానూ జేరూసలేమూనూ. ఇప్పుడదంతా ఒక చరిత్ర. ఇప్పుడా గది మూతపడి వుంది. అది అక్కడ నిన్నటిదాకా మోహన్‌ వున్న గది.

ఈ రోజు గదిలో ఎవరూ లేరు
గదినిండా నిశ్శబ్దం.
సాయంత్రం ఆరున్నర,
గదిలోపల చినుకులవలె చీకట్లు.

ఖండపరశుగళ కపాలగణముల
కనుకొలకులలో ఒకటివలె
చూపులేని చూపులతో తేరి
చూస్తున్నది గది.

అతని దీపం ఆ గదిలో
మూలనక్కి మూలుగుతున్నది.
ప్రమిదలో చమురు త్రాగుతూ
పలు దిక్కులు చూస్తున్నది.

అకస్మాత్తుగా ఆ దీపం
ఆకాశతారను చూసింది.
రాకాసి కేకలు వేసింది.
(నీకూ నాకూ చెవుల సోకని కేకలు.)
ఆకాశతార ఆదరపు చూపులు చాపింది.
అలసిపోయింది పాపం, దీపం.
ఆకాశతార ఆహ్వానగానం చేసింది.
దీపం ఆరిపోయింది.
తారగా మారిపోయింది. (శ్రీశ్రీ)

- అన్వర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement