cartoonist mohan
-
ఒక పుస్తకం-ఒక మోహన్-ఒక ఆర్కే!
జ్ఞానోదయంనాడు ఈ పుస్తకాన్ని చూశాను. జ్ఞానము ఫటాపంచలయింది. సంవత్సరాలు పూర్తి మీద పూర్తి సంపూర్తి అయిపోతూనే ఉన్నాయి. ఒక్క బొమ్మ పూర్తి కాలేదు, అసలు మొదలు పెడితే కదా, పూర్తవడానికి! అసలే జీవితము బరువైంది, ఆపై ఈ పుస్తకం వచ్చి సిందుబాదు భుజాలమీద కూచున్నట్టుగా వచ్చి కూర్చుంది. ఎంతకూ దిగనంటుంది. అది దిగనంటుందా? దించుకోవడానికి నాకే ఇష్టం లేదా. ఏమో! తెల్లవారివారంగానే ప్రేమగా మా మొహాలను అద్దంలో చూసుకుని వాటి పై ఖాండ్రించి ఉమ్మేసి, మురిపెంగా మా కళాఖండాలను ముట్టుకుని నుసి మసి బారేంత కాల్చెయ్య గలిగిన దమ్మునిచ్చింది ఈ పుస్తకం. ఈ ముండమోపి బతుకులో కాస్తొ కూస్తొ అందం కనపడిదంటే వొక బాపు, వొక పతంజలి, వొక మోహన్, లాంటి మరి కొందరు ఒకే ఒకరులు అనే వాళ్ళ సాంగత్యమే, పొగురే, బలుపే. ఒకే ఒక కార్టూన్ కబుర్లు పుస్తకంతో స్నేహిత్యమే. 22 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఈ పుస్తకం రాబోతుందని అంధ్రజ్యోతి ఆదివారపు చాట పత్రికలో చాటింపు పడింది. ఆ తరువాత మాఊరికి వచ్చిన విశాలాంద్ర పుస్తకాల బండిలో ఈ పుస్తకం కంటపడింది. నా దురదృష్టవశాత్తు నేను కొనుక్కున్న పుస్తకంలో 90 వ నెంబరు పేజీ మిస్సు కాలేదు. అయి ఉంటే బావుణ్ణు. ఆ పేజిలో పైనుండి కిందికి రెండవ పేరాలో మోహన్ గారు ఇలా అంటాడు కదా " ఇలాంటి ప్రాజెక్ట్ మీద ఆసక్తి గల ఆర్టిస్టులెవరన్నా రావచ్చు. నాతో పాటు యానిమేషన్ చేసే అసిస్టెంట్స్ అందరితో కలిసి కూచుని బొమ్మలేసి, చూసి ఆనందం పొందవచ్చు. మరి జీతము, తిండి, బతుకూ ఎలా అనే తుఛ్చమైన ఐహికమైన ప్రశ్నలుంటే అవి గూడా పర్సనల్‌గా మాట్లాడుకుందాం. ఇలా పబ్లిగ్గా ఎందుకు. నేను 316243 అనే ఫోన్ నెంబర్ లో టెన్ టు సిక్స్ మాత్రమే కాకుండా ఆ తర్వాత గూడా గుమాస్తాగారికంటే హీనంగా పనిచేస్తూఉంటా. రండి ఇది మాయా యానిమేషన్స్, రెడ్ హిల్స్, హైదరాబాద్" ఈ మాటలు చదవడానికి ముందు నాకెప్పుడూ హైదరాబాదుకు వెళ్ళాలని కాని, మోహన్ గారిని కలవాలని గాని కోరికేమి ఉన్నది కాదు. నాకు ఆ సమయంలో ఒక ఉద్యోగం కావాలి. నేను బొమ్మలేస్తానని నాపై నాకు నమ్మకం ఉన్నది. మోహన్ గారి ఆ ఉద్యోగ ప్రకటన చూసిన తరువాత ఆయనని కలిసింది తొలుత నేను కాదు నా ప్రెండ్ కిశోర్, ఆ తరువాత లావణ్య. అదంతా చెప్పాల్సిన వేరే ముచ్చట. నాకు ఆయన ఉద్యోగం ఇచ్చాడా లేదా? జీతం, తిండి, బతుకూ కల్పించాడా లేదా వంటి తుఛ్చమైన ఐహికమైన ప్రశ్నలకు జవాబు మరో భాగంలో , మరెప్పుడయినా. నేను విశాలాంద్ర పుస్తకాల బండిలో కార్టూన్ కబుర్లు పుస్తకం కొనుక్కున్నా. హైద్రాబాదుకి చేరిన తరువాత ఆ పుస్తకానికి నల్లని చమన్ లాల్ బోర్డ్ తో అట్టవేసుకుని దానిపై తెల్లని జిరాక్స్ ముద్రణ గల లోత్రెక్ ఫోటో అతికించుకుని, పొస్టర్ కలర్‌తో నాదైన అక్షరాల్లో "కార్టూన్ కబుర్లు" అని రాసుకున్నాను. ఆ పుస్తకం చూసి మోహన్ గారు ముచ్చట పడ్డారు. అరే భలే ఉందబ్బా ఈ కవర్, నెక్స్ట్ ఎడిషన్‌కి ఇలా కవర్ వేద్దాము అని కూడా అన్నాడు. ( చాలా సంవత్సరాల తరువాత కొత్త కార్టూన్ కబుర్లు పుస్తకానికి నాతో డిజైన్ంగ్, లే అవుట్ చేయించుకుందామని ఆశ కూడా పడ్డారు) ఆ తరువాత, ఆ నా పుస్తకాన్ని పట్టుకుని అలానే అందరమూ కలిసి బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లో ఉండే హార్ట్ ఆనిమేషన్ స్టూడియోకి చేరి అక్కడ ప్రిన్సిపాల్ గారు శ్రీ జయదేవ్ గారిని కలిసి నమస్కరించాము. ఆ తదుపరి నా నల్లని కార్టూన్ కబుర్ల పుస్తకం కవరు తెరిచి లోపల తెల్లని పేజీ పై "జయదేవ్ గారికి ప్రేమతో మోహన్" అని వ్రాసి సంతకం చేసి ఇచ్చాడు. అలా ఇవ్వడానికి మీకు ఏ అధికారం లేదు మొర్రో, అది నా పుస్తకం కుయ్యో, దానిని మా ఊర్లో మా నాయన జేబులో డబ్బులు కొట్టేసి కొనుక్కున్నా అయ్యో అని ఎంత మొత్తుకున్నా వినిపించుకోవడానికి ఎవరికీ ఆసక్తి లేదు. అందరూ చిరునవ్వుతో గ్రూప్ ఫోటో దిగే మూడ్ లో ఉన్నారు. ఆ తరువాత నేను చాలా అనే అయిదారు కార్టూన్ కబుర్లు పుస్తకాలు కొనుక్కున్నా. ప్రతి పుస్తకం పై మోహన్ గారు టు అన్వర్ విత్ లవ్ మోహన్ అని సంతకం చేసి ఇచ్చేవాడు. అప్పుడప్పుడూ నా ప్రియతములకి నేను ఆ పుస్తకాలు పంచుకునే పని పెట్టుకున్నా. అ మధ్య కూడా డాక్టరమ్మ ఒక భార్గవి గారి ఇంట్లో కార్టూన్ కబుర్లు రెండు కనపడితే నీకు రెండు పుస్తకాలు ఎందుకమ్మా అని దబాయించి , ఒక పుస్తకాన్ని నా కొత్తవకాయ ప్రెండ్ సుస్మిత చేతిలో పెట్టాను. ఈ మధ్య మా అమ్మ సత్యవతి భారతదేశాన్ని, నిషా బార్ గల్లీని ఖాలీ చెసి వెడుతూ "పుత్తర్ నీకేమైనా పుస్తకాలు కావాలా తేల్చుకో" అంది. ఆవిడ పుస్తకాల బీరువాలోంచి కార్టూన్ కబుర్లు తీసుకుని గుండెలకు హత్తుకున్నా. ఈ పుస్తకాన్ని ఎన్నిసార్లు చదివి ఉంటానో లెక్కే లేదు. చదివిన ప్రతిసారి రూపాయి కాయిన్ టెలిఫోన్ బాక్స్ లోంచి మోహన్ గారికి ఫోన్ చేసేవాడిని. అప్పుడు మొబైళ్ళు లేని కాలమది. హైద్రాబాద్ బ్రతుకు మీద చిరాకు, దుఖం, బాధ, పగ కలిగినప్పుడల్లా ఇంటి గోడమీద రక్తపు చూపుడు వేలుతో రెండు పేర్లు రాసేవాణ్ణి. నా హిట్ లిస్ట్ అది. ఒకటి మోహన్ రెండు ఆర్కే. వీళ్ళు ఇద్దరూ కలిసి ఈ పుస్తకాన్ని వేయకుండా ఉండి ఉంటే నేను ఇక్కడికి వచ్చేవాడిని కాదు కదా. ఎప్పటికయినా ఆ పేర్ల మీద ఇంటూ మార్క్ వేసి వికట్టాటహాసం చేయాలని ఎనభైల సినిమా నాతెలుగు నరనరనా నింపుకున్న కొరిక అది. రెఢ్ హిల్స్ లో మేడమీద గదిలో బుద్దిగా బొమ్మలేసుకుంటున్న సమయాన మధ్యాహ్నపు కిటికి నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ "మోహనా ఓ మోహనా" అని పిలుపు వినపడేది. కిటికిలోంచి తొంగి చూస్తే బొద్దుగా ఉండే స్కూటర్ మీద , స్కూటర్ లా బొద్దుగా ఉండే ఆర్కే గారు ఒంటికాలి మీద వాలి, చిరునవ్వుతో కిటికి వంక నవ్వుతూ చూస్తూ కనపడేవాడు. అప్పుడు వయసు నలభయ్లలో ఉన్న మానవులు వీరు. కుర్చీలోంచి లేచి ప్యాంట్‌ని పొట్టమీదకు లాక్కుని, ఎదురు టేబుల్ మీద పెన్నుల పెట్టుకునే డబ్బాలోని దువ్వెనతో తల దువ్వుకుని మోహన్ గారు మెట్లు దిగేవాడు. చాయ్, సిగరెట్, మీనాక్షి సాదా, ఆర్కే అనేవి అప్పటి ఆయన అలవాట్లు. ఆర్కే గారు పని చేసే బ్యాంకు మోహన్ గారి ఆఫీసుకు దగ్గరే. అప్పుడప్పుడూ , ఎప్పుడూ మోహన్ గారు తన టేబుల్ సొరుగులోనుండి విత్ డ్రాయల్ ఫాం తీసి అందులో తనకు కావలసిన అమౌంట్ నెంబరు రాసి, ఫామ్ వెనుక డియర్ ఆర్కే, అన్వర్ నో, శంకర్ నో పంపిస్తున్నాను మర్యాదగా ఒక రెండు వందలు నా అకవుంట్ నుండి ఇవ్వగలవు. అసలు మోహన్ గారి అకవుంట్ లో డబ్బులే ఉండవు. పట్టుకు వెల్లిన కాగితాన్ని చదివి ఆర్కెగారు తన జేబులోంచి డబ్బులు తీసి మాకు ఇచ్చేవాడు. ఇలా డబ్బులు కలెక్ట్ చేసే పని మోహన్ గారు ప్రకాష్ అనే తన తమ్ముడికి గానీ, శంకర్ కి కానీ, నాకు కానీ అప్పగించేవాడు కాని. అక్కడే ఉండే మరో గొప్ప కళాకారుడు శ్రీరాం కి మాత్రం చచ్చినా ఇచ్చేవాడు. శ్రీరాం చాలా ఉన్నత శ్రేణికి చెందిన ఆర్టిస్ట్ అనే భయంతో కాదు, ఆ డబ్బులు తీసుకుని మోహన్ గారి స్నేహానికి ఎక్కడ రాజీనామా చేసి పోతాడేమోననే భరించలేని గౌరవం కొద్ది. ఒకానొక సమయంలో తెలుగులో గొప్ప పుస్తకాలు అనే లిస్ట్, తెలుగు పుస్తకాల్లో ఆకర్షణీయమైన తీరుతెన్నులు అనే లిస్ట్ తో రెండు ఆదివారపు పత్రికలు తమతమ ఉద్దేశాల కథనాలు ప్రకటించాయి . ఆ రెండిటి ఉద్దేశాల ప్రకారము ఆ జాబితాలో ఎక్కడానూ "కార్టూన్ కబుర్లు" లేదు. కార్టూన్ కబుర్లు చదివి, దానిని బుర్రకు ఎక్కించుకోవాలంటే ముందు అటువంటి లిస్ట్ తయారు చేసేవారికి ఒక బుర్ర ఉండాలి కదా, పోనీలే అని సమాథాన్ పడ్డాను. తెలుగులో గొప్ప వందపుస్తకాలు జాబితా అనేది ఒకటి ఉంటే అందులో కార్టూన్ కబుర్లు ఉంటుంది. తెలుగులో పది గొప్ప పుస్తకాలు అని ఒక వరుస వేసినా అందులో కార్టూన్ కబుర్లు చేరుతుంది. తెలుగులో రెండే గొప్ప పుస్తకాలు అని లెక్క తేలినపుడు కూడా అందులో ఒక పుస్తకం పేరు కార్టూన్ కబుర్లు అయి తీరుతుంది. మామూలుగానే తెలుగులో బొమ్మలు చూడటమూ, బొమ్మలు చదవడమూ అంటేనే అది అంధులు చదవవలసిన లిపి, బధిరులు వినదగ్గ సంగీతము అనే స్థాయికి చేర్చిన రచనల మధ్య, రచయితల మధ్య కార్టూన్ కబుర్లు కానీ కార్టూనిస్ట్ మోహన్ కానీ ఆతని వచన విన్యాసం కానీ మరియొక్కటి ఎప్పటికీ పుట్టనిది, మరియొక్కడు చేయలేనిది. మోహన్ గారి వచనం అనేది, బాపు గీత అనేది తయరయితే వచ్చేది కాదు. సమస్త జీవులకు ఒక సూర్యుండు వలె. అవి ఒకసారి మాత్రమే పుడతాయి దానిని చూసి , చదివి ఆనందించగల హృదయ సౌందర్యం అనేది మన సంస్కారం పై మాత్రమే ఆధారపడి ఉంటుంది. ప్రతి చిత్రకారుడి దగ్గర ఉండవలసిన పుస్తకం కార్టూన్ కబుర్లు, కార్టూన్ కబుర్లు చదవడం కొరకైనా ప్రతి చిత్రకారుడు నేర్చుకోదగ్గ భాష తెలుగు. ఏ రచయిత చదువుకొనంత, ఏ కవి వినలేనంత, ఏ చిత్రకారుడు గీయలేనంత ఏ జర్నలిస్ట్ చూడలేనంతటి ఒకడే మోహన్, ఒకే కార్టూన్ కబుర్లు పుస్తకం. వాస్తవానికి ఒక కార్టూన్ కబుర్లు పుస్తకం మరో రెండు కార్టూన్ కబుర్లుగా రావలసినది, రాలేదు. రాదు కూడా. ఎందుకని సమగ్ర బాపు బొమ్మల కళ. ఎందుకని బొమ్మల్లో చంద్ర మరియూ అతని గొప్ప డిజైనింగ్, ఎందుకని బొమ్మల బాలి-బాలి బొమ్మలు, ఎందుకని కరుణాకర్ ఒక మానవ శరీరసౌదర్య మూర్తి చిత్రణ, ఎందుకని గోవర్ధన గిరిని కుంచె చివరి గీతతో పైకెత్త గల గోపి బొమ్మల పూల మాల, ఎందుకని ఎందుకని ఎందుకని చాలా చాలా గొప్ప పనులు పుస్తకాలుగా రావో అందుకే ఇదీనూ రాదు . అంతవరకూ ఒక కార్టూన్ కబుర్లు ప్రస్తుతానికైతే ఉంది. అందుకని ఆ పుస్తకానికి జిందాబాద్. ఆర్కే గారికి జిందాబాద్ . నాకు మీ నమస్కారాలు. మోహన్ గారికి హేపీ బర్త్ డేలు. (చదవండి: అత్యంత ఖరీదైన పుస్తకం: విశ్వ జనుల విశ్వశాంతి గీతమే ‘An Invaluable Invocation’) -
గంధపు బొమ్మ
-
కార్టూనిస్టు మోహన్ సంస్మరణ సభ
-
రేఖ దేశీయం ఊహ విశ్వ మోహనం
రెండో మాట వ్యంగ్య చిత్రకారుడిగా ప్రసిద్ధ కార్టూనిస్ట్ అబూ అబ్రహాం ప్రశంసలందుకున్న వ్యక్తి మోహన్. తన చిత్రాల ఫొటో ఎగ్జిబిషన్‌ను ‘లుంబినీ’ వద్ద కొన్నిరోజులపాటు నిర్వహిం చాడు. ‘ప్రపంచీకరణ’ బాగోతాన్ని వ్యతిరేకిస్తూ ముంబై రెసిస్టెన్స్ గ్రూపు ఏర్పాటు చేసిన ‘వరల్డ్ సోషల్ ఫోరమ్’ సదస్సుకు 42 దేశాల ప్రతినిధులు హాజరైనప్పుడు మోహన్, సామ్రాజ్యవాద చర్యలను ప్రతిఘటించే పెక్కు వ్యంగ్య చిత్రాలతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశాడు. 1990 నుంచీ తెలుగునాట తొలి యానిమేషన్ కళాకారుడుగా గణనలోకి వచ్చాడు. మనం గోర్జినీని గీసిన ‘స్లీపింగ్ వీనస్’ తైలవర్ణ చిత్రాన్ని చూడకపోవచ్చు. టిటాన్ రూపించిన ‘వర్జిన్’ ఊహాచిత్రాన్నీ చూసి ఉండకపోవచ్చు. ఏంజిలో బ్రోంజినో ‘వీనస్ కుపిడ్’విరచిత చిత్రకళనూ చూడకపోవచ్చు. అలాగే లియొ నార్ ద విన్సీ ‘మోనాలిసా’ను చూచి ఉన్నా, ‘మడోన్నా’ చిత్రాన్ని చూడడం సాధ్యపడకపోవచ్చు. అలాగే మైఖేల్ ఏంజిలో సూర్యచంద్రుల సృష్టినీ, టింటిరెట్టో ‘త్రీగ్రేసెస్’ చిత్రాన్నీ చూసి ఉండకపోవచ్చు. కానీ కొత్త రంగుల ప్రపం చంలో తన రేఖలే తప్ప తనకు ఇతర ‘లక్ష్మణరేఖ’లంటూ లేవని నిరూపిం చాడు– తెలుగు చిత్రకళారంగంలో లబ్ధప్రతిష్టుడైన వ్యంగ్య చిత్రకారుడూ, డిజైనరూ మోహన్. ఎప్పటికప్పుడు నూతన కళాసృష్టిని అభిలషించినవాడు. పలు పత్రికలకు, మ్యాగజైన్లకు, గ్రంథాలకు, ప్రజా ఉద్యమ ప్రచారకులకు అర్థవంతమైన రాజకీయ, సామాజిక, ఆర్థిక సమస్యలపై అసంఖ్యాకంగా కార్టూన్లు, కేరికేచర్లు, రేఖాచిత్రాలు, పోస్టర్లు చిత్రించిన ఘనాపాటి ఆయన. హైటెక్ పెయింటింగ్ కళలో దూసుకువచ్చాడు. ‘చలనకళ’ అనదగిన ‘యానిమేషన్’ చిత్రకళాసృష్టిలో తెలుగునాట తొలిపాదం మోపినవాడిగానే కాక, హైటెక్ చిత్రకళలో వినూత్న ప్రయోగం చేశాడు. మాస్టర్ పీస్ ఒక ప్రచురణ సంస్థ కొద్దికాలం క్రితం ప్రచురించిన ఒక క్యాలెండర్ దేశంలో వెలువడిన క్యాలెండర్లన్నింటిలోకి ప్రమాణాలలో, పరికల్పనలో అగ్రేసర స్థానంలో నిలుస్తుందనిపించుకుంది. పన్నెండు మాసాలనూ ఆరు రుతువు లుగా విభజించుకుని ఒక్కొక్క రుతువును ప్రకృతిమాతతో అనుసంధానం చేసి విభిన్న రంగుల సమ్మిశ్రమంతో రాగరంజితంగా ఆ క్యాలెండర్లో చిత్రిం చినవాడు మోహన్. కన్నుల పండువుగా ‘చక్షూరాగాలు’ పలికించాడు. నిత్య వర్ణప్రపూరితమైన ప్రకృతిని మించిన రంగులను ఎంత హైటెక్ కళ అయినా, కంప్యూటర్ చిప్ అయినా కొత్తగా అందించలేదు. విభిన్న వర్ణాలలో కలర్ ‘వేరియేషన్స్’తో కాంబినేషన్స్‌ను చిత్రకారుడు అందిస్తాడే గానీ ప్రకృతి మాతృకనే ‘కరప్ట్’ చేయలేడు. ప్రజాకళల్లో భాగంగా ఒక పాపులర్ కవితకు భావచిత్రాలు అందించడం ప్యారిస్ కమ్యూన్ నాటికే (1871) ప్రయోగంలోకి వచ్చింది. మన మోహన్ ఈ క్యాలండర్లో తెలుగు కవుల, తాత్వికుల భావనా స్రవంతిలోకి తొంగి చూడలేదు. ఆరు రుతువులకు వేసిన చిత్రాలలో, మానవ, మానవేతర ప్రకృతిని ప్రతిబింబించిన రూపాలలో ప్రధానంగా పాశ్చాత్య భావుకుల కవన ఝరిలో జాలువారిన సుందరభావాలకు ప్రాధాన్యం ఇచ్చాడు. కారణం, మన ప్రసిద్ధ చిత్రకారులలో పెక్కుమంది పురాణ గాథలనూ, రామాయణ, భారత ఇతిహాసాలనూ ఆధారంగా చేసుకుని కథా చిత్రాలను ఇప్పటికే గీసి గీసి పాప్యులరైజ్ చేసి ఉండడం కావచ్చు. మోహన్ క్యాలెండర్ చిత్రీకరణకు ప్రోద్బలం చేసిన పదకవితలు–టెన్నిసన్, ఆర్కిబాల్, నెన్నెత్లెస్లీ, ఉమర్ ఖయ్యాం కలాల నుంచి జాలువారిన కొన్ని ఆణిముత్యాలు. అతని రేఖ దేశీయం, ఊహ విశ్వమోహనం, భావన సార్వకాలీనం. ఈ చిరు ముత్యాలసరాల ఎంపిక టి. శివాజీది. డిజైన్, కలర్, కూర్పు మస్తాన్‌ది. మొత్తం క్యాలెండర్‌ను ఇంద్రధనుస్సులా దీపించేటట్టు హైటెక్ కుంచె మెరుగులతో రోచిర్నివహంగా దిద్ది తీర్చిన చిత్రకారుడు మోహన్. క్యాలెండర్ల అలంకరణ కళలో (డెకోరేటివ్ ఆర్ట్) మోహన్ క్యాలెండర్‌ను ఒక మాస్టర్‌పీస్‌గా పేర్కొనడం అతిశయోక్తి కాబోదు. మోహన్–హైటెక్ పెయింటింగ్ కళ ప్రసిద్ధ కవుల, తాత్వికుల ఆప్తవాక్యాలను చిత్రకళ ద్వారా ఆత్మీయ కళాఖండాలుగా మలచడం సామాన్యమైన పనికాదు. ఈ విశ్వం చిత్తవృత్తులూ, ఆగ్రహానుగ్రహాల సమాహారమే ఆరు రుతువులు. ఈ రుతువులన్నీ ప్రకృతి మంత్ర కవాటాలు. వాటిని విభిన్న వర్ణాలతో మానవ, మానవేతర ప్రకృతి సంబంధం ద్వారా కళ్లకు పసందు చేశాడు మోహన్. సాహిత్యాది సర్వకళల వికాసానికి దోహదం చేసిన ఒకనాటి యూరోపియన్ సాంస్కృతిక పునరుజ్జీవన దశలో వెల్లివిరిసిన ఫ్లారెంటైన్ పెయింటిం గ్స్‌కు మోహన్ క్యాలెండర్ చిత్రకళ ఏ మాత్రం తీసిపోదని చెప్పవచ్చు. చరి త్రకు అందని పూర్వ యుగపు గుహలలోని కుడ్యచిత్రాలు ఎన్నెన్నో. ఆదిమ కళ నుంచి నేటి ఆధునిక చిత్రకళలు ఎన్ని మలుపులు తిరుగుతున్నాయో! కార్టూన్ల దశ నుంచి కంప్యూటర్ చిత్రాల దాకా కలర్ చిప్ తోడు నీడగా నూతన రీతులను చిత్రకళ ఆవిష్కరించుకుంటోంది. రినైజాన్స్ యుగం మానవుణ్ణి ప్రపంచానికి కేంద్ర బిందువుగా సాక్షాత్కరింపచేసింది. పారిస్ కమ్యూన్ మానవ జన్మ సార్థక్యాన్నీ, అతని పురోగతనీ ప్రజా సమ్మతం చేయడానికి ప్రయత్నించింది. కళల్లో వాస్తవికతా వాదాన్ని మరింత ముందుకు నడిపించింది. అందుకే కాబోలు, సుప్రసిద్ధ ఫిజీషియన్ హిప్పోక్రాట్స్ ‘మానవుడి జీవితకాలమా స్వల్పం, అస్థిరం. కళాసృష్టి మాత్రం శాశ్వతం’ అని ఉంటాడు, ఈ మర్మం తెలిసిన మోహన్ కూడా జలవర్ణ చిత్రాలు, తైలవర్ణ చిత్రాలు, ఆక్రిలిక్ చిత్రాలకే కట్టుబడి ఉండకుండా అధునాతనమైన హైటెక్ పెయింటింగ్ కళాక్షేత్రంలో కూడా కాలుమోపి నిలదొక్కుకున్నాడు. తన వద్ద ఉపాంగాలు పుష్టిగా లేకపోయినా, జల్లెడ (స్కానర్స్) లేకుండానే 1990 నుంచీ తెలుగునాట తొలి యానిమేషన్ కళాకారుడుగా గణనలోకి వచ్చాడు. వ్యంగ్య చిత్రకారుడిగా ప్రసిద్ధ కార్టూనిస్ట్ అబూ అబ్రహాం ప్రశంసలందుకున్న వ్యక్తి మోహన్. తన చిత్రాల ఫొటో ఎగ్జిబిషన్‌ను ‘లుంబినీ’ వద్ద కొన్నిరోజులపాటు నిర్వహిం చాడు. ‘ప్రపంచీకరణ’ బాగోతాన్ని వ్యతిరేకిస్తూ ముంబై రెసిస్టెన్స్ గ్రూపు ఏర్పాటు చేసిన ‘వరల్డ్ సోషల్ ఫోరమ్’ సదస్సుకు 42 దేశాల ప్రతినిధులు హాజరైనప్పుడు మోహన్, సామ్రాజ్యవాద చర్యలను ప్రతిఘటించే పెక్కు వ్యంగ్య చిత్రాలతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశాడు. ‘నో సో బ్యూటిఫుల్ లైఫ్’ అనే చిత్రదర్శిని గ్రంథంలో ప్రపంచీకరణవల్ల, ప్రజా వ్యతిరేక సంస్కరణలవల్ల వర్ధమాన దేశాల పేద ప్రజలు పడుతున్న బాధలను చిత్రీకరించాడు. ఆ గ్రంథాన్ని సుప్రసిద్ధ సామాజిక కార్యకర్త, రచయిత్రి అరుంధతీరాయ్ ఎంతగానో ప్రశంసించింది. ‘ఆకులందున అణగిమణగి...’ మోహన్ తన ‘వసంతం’(స్ప్రింగ్) చిత్రకల్పనలో మానవ–మానవేతర ప్రకృతి సంబంధాన్ని వస్తువుగా స్వీకరించినప్పుడు ‘‘ఆకులందున అణగి మణగి కవిత కోయిల పలుకవలెనోయ్’’ అనీ, ఆ పలుకులను విని అభిమానం రెక్కలు తొడుక్కోవాలనీ చెప్పిన గురజాడవారి పాదం గుర్తుకు రావలసిందే. అంతేగాదు, ‘‘ఆమని సంతసమావహిల్ల... మల్లెలు, మొల్లలు, జాజులెల్ల కడల బొదల/ నందనోద్యానమిది యను చందమున ప్రమదావనము కన్నుల పండువ’’ చేస్తుందన్న శ్రీపాదవారి కవిత గుర్తుకు వస్తుంది. ఇక నిప్పులు చెరగే ‘గ్రీష్మ’(వేసవి) రుతువుకు వేసిన చిత్తరువు చూడగానే ‘‘తోచె గ్రీష్మావసాన ముత్తుంగ సౌధజాల/బహిరంగణా ప్రదోష ప్రభాత దంపతీ విస్తృతాతి/దృఢ పరీరంభ పునరుప దేష్టయగుచు..’’ అన్న దేవులపల్లి మనసుకు స్ఫురిస్తాడు. ‘వర్ష రుతువు’ చిత్రం చూచినప్పుడు ‘‘మిగుల జగంబు ఒగ్గడిల మించె తదుద్ధిత వృష్టి అద్భుతం బగుచు/... నిర్జర జర్జరీ భవన్నగ విగళచ్ఛిలా ఘన ఘనాఘోషణ భీషణంబుగన్...’’అన్న ఓ ప్రాచీన కవి భీకర వర్షధారా వర్ణన గుర్తుకు రాకమానదు. అలాగే, ‘శరదృతువు’ చిత్తరువు చూడగానే నన్నయ్య తన కొసమెరుపుగా అందించిపోయిన ‘‘శారద రాత్రులు జ్వలలసత్తర తారక హార పంక్తులన్ చారు తరంబులయ్యె’’ అన్న పద్యం స్ఫురించాల్సిందే. ఇక ‘శిశిరం’చిత్ర రచన చూడగానే ‘‘హిమముచే సంబరం బెల్ల నిమురు కొనగ... వచ్చు నింక హేమంత మహిమ’’ అన్న పోతన కళ్లముందు నిలబడతాడు. అందుచేతనే, కళామర్మం బలంగా ఆవిష్కరించుకుంటున్న కొద్దీ కళా సౌందర్యం ముమ్మరించి కళాస్రష్ట కాస్తా అజ్ఞాతంలోకి వెళ్లిపోతాడన్న ఆస్కార్ వైల్డ్ ఉక్తికి విలువ వచ్చి ఉంటుంది. చరిత్రలో చిత్రలేఖన వాదాలు ఒకటీ,అరానా? ఎన్నెన్నో– ఆదర్శవాదం, వాస్తవిక వాదం, కాల్పనిక వాదమని స్థూలార్థంలో మూడు ప్రధాన వాదాలుగా చెప్పుకున్నా ఆధునిక వాదాలతో చిలవలు, పలవలతో శాఖా చంక్రమణం చేస్తున్న శైలీ భేదాలు మరెన్నో. మోడల్ ఆర్ట్ ‘మోడరన్ ఆర్ట్’గా పరిణమించి వాదాలు అనుభవ వేదాలుగా మారాయి. వాటికి మారుపేర్లే– అనుభవవాదం (ఇంప్రెషనిజం), అసంప్రదాయ వర్ణ చిత్రణవాదం (ఫావిజం ఊ్చuఠిజీటఝ), స్థూలతావాదం (క్యూబిజం), అనాగతావాదం (ఫ్యూచరిజం–కాలాన్ని, కాలగతినీ ప్రేక్షకుడి అనుభూతికి తేవడం), అభివ్యక్తివాదం (ఎక్స్ప్రెషనిజం), అధివాస్తవిక వాదం (సర్రయలిజం), నైరూప్య చిత్రణ (ఆబ్స్ట్రాక్ట్), డాడాయిజం, అతుకు చిత్రణ (కొల్లేజి) లేదా ‘స్క్రాప్ కళ’ వగైరా వగైరా. ఈ అన్నింటిలో కాకపోయినా పెక్కింటిలో మోహన్ అంతో ఇంతో ప్రయోగాలు చేయకపోలేదు. ఆధునికులలో అత్యాధునికుడిగా ముందంజ వేస్తున్న మోహన్ రూపించిన నవీన ‘‘క్యాలండర్ చిత్రకళ’’ను అందరూ చూసి అనుభూతి పొందాలి. శయన మందిరాలలో మోహన్ రుతు చక్రగతిని ఫ్రేములో బంధించుకోవచ్చు. ఒకనాడు యూదులు క్యాలండర్ కళకు ప్రాచుర్యం ఇచ్చినందుననే కళా విమర్శకుడు వీసెన్‌బర్గ్ ఆ క్యాలండర్‌ను ‘‘రుతుగ్రంథ’’ రాజంలోకి (ఆౌౌజు ౌజ ్ఛ్చటౌnట) ఎక్కించాడని అంటారు. మోహన్ క్యాలండర్ చిత్రకళ కూడా రుతువుల చాటున ప్రేక్షకులపై విరిసిన సమ్మోహనాస్త్రం. ‘‘ల్యాండ్‌స్కేప్స్’’ చిత్రకళను ఒక మహాకావ్యంగా భావించిన రోరిక్ అన్నట్టుగా ‘నేను’అన్న భావాన్ని ‘మనం’గా మలచి పంచిపెట్టే, సుఖ దుఃఖాల సమన్వయకర్త చిత్రకారుడు అనుకుంటే– ఆ భావాన్ని మోహన్ తనదైన ‘హైటెక్’శైలిలో ‘సత్యం, శివం, సుందరం’గా ఈ నవీన క్యాలెండర్ చిత్రకళను మలిచాడనే చెప్పవచ్చు. డాంటే మహాకవి ‘పుర్గటోరియో’ అన్న కవి తలో ఓ కన్యను చిత్రిస్తూ ‘‘హేల్! ఫుల్ ఆఫ్ గ్రేస్’’ అంటాడు. ఈ వర్ణన మోహన్ క్యాలండర్ చిత్రకళా వైభవానికి కూడా వర్తిస్తుంది. ‘అహో! మోహన రేఖస్య మాధుర్యం’ అనుకుందాం! ఆనందిద్దాం! ఈమెయిల్: abkprasad2006@yahoo.co.in -
ఐదో దిక్కున అతడు ఇప్పుడు
నేను కృష్ణశాస్త్రి కవితలకీ, బొలీవియన్ జంగిల్ వార్కీ, టెట్ అఫెన్సివ్‌కీ, బాపూ చిత్తప్రసాద్ బొమ్మలకీ పుట్టిన బిడ్డని. బయాఫ్రాలో చనిపోయిన బిడ్డల ఏడుపు నుంచీ, మా పేటలో జూట్ కార్మికుల మురికి బ్రతుకుల నుంచీ, జామిని రాయ్, లాత్రెక్, ఇల్యా రెపిన్ పెయింటింగ్‌ల నుండీ పుట్టాను. అరవయ్యో దశకం తెచ్చిన నెత్తురూ, కన్నీళ్లూ, విప్లవకేకలూ నా వెంట ఉంటాయి. నా పదహైదేళ్ళ వయసులో మొదటిసారిగా విన్న వాయిస్ ఇది. ఇది మోహన్‌ది. నా ఫ్రెండ్ రఘు అని ఒకడు జర్నలిస్ట్ కావాలని కొరిక కొద్దీ ఆ రోజుల్లో గోవిందరాజు చక్రధర్ గారి ‘మీరూ జర్నలిస్ట్ కావచ్చు’ పుస్తకం కొన్నాడు. అందులో చదివిన మోహన్ గారి ఇంటర్వ్యూలోని వాక్యాలు ఇవి. ఇందులో నాకు ఏం అర్థం అయ్యింది? ఎందుకు అర్థం కావాలి? అయినా ఒక తోసుకోవడం అనేది మనసులో మొదలెట్టించిన మనిషి పట్ల ఆరాధన కల్పించిన వాక్యాలవి. ఇప్పుడు మాత్రం ఇంతకాలం తర్వాత అయినా ఏం అర్థం చేసుకున్నానని మోహన్ గురించి వ్రాయడానికి, కొత్తగా మాట్లాడ్డానికి? జగమెరిగిన ఆయన బొమ్మల గురించి, ఆయన రాతల గురించి, ఆయన ధిక్కారాన్ని గురించి, పోరాటానికి బాసటగా చెయ్యెత్తిన కుంచె గురించి అంతా అందరికీ తెలిసిందే అయినా ఇంకా కోరేవాళ్లు కోరుతూనే వుంటారు. ఇంకా ఇంకా చదవాలనుకుంటారు. అందుకోసమైనా వ్రాయాలి. ఇప్పుడు ఇలా వ్రాయడానికి నాకు నేను ఒక ప్రశ్న వేసుకుంటున్నాను... మోహన్ నిష్క్రమించి మనకు ఏం దూరం చేసి వెళ్ళారు, ఏం ఖాళీ పెట్టి వెళ్ళారని ప్రశ్నించుకుంటే బొమ్మలా? రాతలా? ప్రేమా? ప్రోత్సాహమా? వీటన్నిటికన్నా ముఖ్యంగా ఆయన ఈ గడ్డపై ఉన్న ఒకే ఒక గురుకులాన్ని పాడుపెట్టి వెళ్ళిపోయారు. ఒక చౌరస్తాని ఒంటరి చేసి వెళ్ళిపోయారు. ఆ గురుకులంలో బొమ్మలు పలికేవి, సంగీతం ప్రవహించేది, సాహిత్యం పరిమళించేది, రాజకీయాలతో వాతావరణం వేడెక్కేది. అక్కడికి నువ్వు చెంబుతో వెళితే చెంబుడు జ్ఞానం దక్కేది, లోటాతో వెళితే లోటాడు. కానీ ఆక్కడి నుండి ఎవడూ ఎప్పుడూ ఖాళీ చేతులతో మళ్ళేవాడు కాడు. నాకు తెలిసిన ప్రపంచంలో ఇటువంటి కళాకేంద్రం ఎక్కడా నిర్మించబడలేదు. అది నిర్మితమయ్యింది ఇటుకతో, ఇసుకతో, కలపతో కాదు. రక్తమాంసాలు అíస్థి మజ్జ సంహితమైన ఒకే ఒక మనిషి తను ఎక్కడ నిలబడితే అక్కడ తానే గురుకులమైనాడు. మోహన్ ఖాళీతో ఇపుడున్న నుండి రాబోయే తరాలకు జరిగిన అతి పెద్ద నష్టం ఇదే. చిత్రం ఏమిటంటే అక్కడ తను స్వయంగా చేత దిద్దబెట్టి ఎవడితో బొమ్మ వ్రాయించలేదు, కేవలం ఏది బొమ్మ అవునో, ఏది బొమ్మ కాదో కనుగునే కన్నయినాడు. పాట పాడే గొంతున్న వాడి ఎదుట నిలువెల్లా చెవియై పులకరించినాడు. అక్షరాన్ని పరుసవేదిగా మార్చగలిగిన వేలికి తను ఉంగరంలా మారి పదిమంది కన్నులు పడేలా వాడికి తళుకు దిద్దినాడు. మోహన్ ఒక ఎపిటైజర్, నీకు బొమ్మలు ప్రాణమా? సాహిత్యం ఊపిరా? పోరాటం మార్గమా? వీరందరికి తను ఆకలిమందులా పనిచేసాడు. అంతేకాదు రచయితగానీ కళాకారుడుగానీ కొన్ని గుణాలని పెంపొందించుకోవాలన్నాడు. నీకు కాస్త పేరు, కీర్తి తగిలిందా! ఢమాలున ‘రాక్షసుడొచ్చీ’ మన రొమ్ము తట్టి కోరలు మెలేస్తాడు. దాంతో మనం మీసాలు మెలేస్తాం. కానీ వాడు కేవలం జీవం తొణికిసలాడే వ్యక్తి యొక్క చమట వాసన తగిలినా తన ఓటమిని ఒప్పుకుని పారిపోతాడు. లేకపోతే ఆ రాక్షసుడు మనలోని జీవాన్ని తీసుకెళ్లిపోతాడు. ఆ పై మనం పనేం చెయ్యకా ఒక వేళ చేసినా మన మీసాలు తిప్పేవాళ్ళకోసం ఎదురు చూస్తూ అటువంటి వాడెవడు రాకా ఆ తరువాత మనం ఒట్టి తోలుతిత్తుల్లా తిరగాల్సివుంటుంది. మోహన్ చాలామంది మనుషులు తోలుతిత్తులుగా మారకుండా వుండటానికి శ్రమ పడ్డాడు. బొమ్మలేసేవాడ్నీ వ్రాయగలిగేవాడ్నీ చేత చేవ ఉన్న ప్రతి ఒక్కడినీ జీవితులుగా ఉంచడానికి శ్రమించాడు. పనిపట్ల అసంతృప్తులుగా మిగిల్చాడు, ఇది కాదు ఇంకా మన్నికైన పనికోసం మనకు మనమే పరిగెత్తేలా నేర్పాడు. మావరకు పరిగెడతాం కానీ ఇక ముందు తరాలకు పరుగు తెలీకుండా అయిపోతుంది కదా అనుకోవడమే ఒక అతిపెద్ద నష్టం ఇప్పుడు. ఇంకా ఈ భూమ్మీద తనకంటూ స్వంత ఇల్లు లేని మోహన్ ఒక గదిని కనిపెట్టాడు. తను ఈ హైద్రాబాద్ మహానగరంలో ఏ ఇంట్లో చేరినా ముందు చేసే పని ఆ ఇంటి తలుపు పీకెయ్యడం. తలుపుల్లేని ఆ ఇంట్లో ‘ఏ తేరా ఘర్, ఏ మేరా ఘర్, హమారా ఘర్ ఏ అపునా ఘర్‘ అని ప్రతివాడూ పాడుకుంటూ వచ్చి వుండే గది అది. వచ్చినవాడా! నువ్వెవరు? అనేది మోహన్‌కు శుద్ధ అనవసరమైన ప్రశ్న. నువ్వెవరైనా ఇక్కడికి రావొచ్చు, ఉండొచ్చు, పనుంటే చేసుకోవచ్చు, లేకపోయినా నష్టం లేదు. ఆకలేస్తే కిచెన్‌లో ఏదో ఒకటుంటుంది, లేకపోతే నీకు నువ్వే వండుకుని ఇంత తిని మిగిలితే మోహన్‌కు పెట్టవచ్చు, లేదా పస్తయినా పెట్టవచ్చు. ఏమీ అనుకునేది లేదిక్కడ. నువ్వు ఒక పరాయివాడివి ఉన్నావనే విషయమే తెలీని మోహన్‌కు నువ్వు వెళ్ళిపోయావని ఎన్నడూ తెలియదు. నువ్విక్కడ పెద్దిభొట్ల సుబ్బరామయ్య పక్కన చైర్లో కూర్చోవచ్చు. ‘మో’ ఎదురుగా నిలబడి ‘అగ్గిపెట్టుందా గురూ’ అని కూడా అడగవచ్చు. పైగా ఇస్తారు కూడా. ఈ గదికి స్థాయీభేదం తెలీదు. కళాకారుల్నీ కవులనీ రచయితలనీ మేధావులనీ పాఠకుల్నీ పాటగాళ్ళనీ భూమ్మీది సమస్త జాతి మానవుల్నీ కలిపిన గదిది. మక్సీమ్ గోర్కి, ఆలూరి బైరాగి, లియో టాల్‌స్టాయ్, చిత్తప్రసాద్, సైగల్, అల్లా రఖా, బాబ్ మార్లే, పాల్ రాబ్సన్, దేవానంద్, జీన్ మొరియూ, ఫ్రాన్సిస్ ఫోర్డ్ కపోలా, డాల్టన్ ట్రంబో, మాస్తి వెంకటేశ, యూసుఫ్ కర్ష్, జపటిస్టా సబ్ కమాండెంట్ మార్కొస్, ఎమ్మెన్ రాయ్ వంటి వేలాదివేల వాల్ ఆఫ్ హానర్లు ఇక్కడ. ఇదిగో నువ్వు కూర్చున్న ఈ కుర్చీలోనే కేశవరెడ్డి కూచుని వుండినాడు. ఈ ప్రదేశంలోనే సినారె మోహన్ బొమ్మల కోసం వేచినాడు. గోరటి వెంకన్న ‘పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల’ అని కన్నీరు పెట్టింది ఇక్కడే. శ్రీరమణ చిలుకల పందిరి వాలింది ఇక్కడే. ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పులలోన కరిగిపోయె! ఇచ్చోటనే లేత ఇల్లాలి నల్లపూసల సౌరు గంగలో కలిసిపోయె! ఇచ్చోటనే ఎట్టి పేరెన్నిక గన్న చిత్రలేఖకుని కుంచియ నశించె! అని పైడి తెరేశ్, లెల్లె సురేశ్, రమణజీవి, పాండూ తదితర వైయక్తిక గొంతులు సంయుక్తంగా ఖణఖణమనిపించిందిక్కడే. మోషే డయాన్ పిల్లనగ్రోవి నీటి రంగుల పాట పలికింది ఇక్కడే. ఇక్కడే రవీంద్రభారతి కూడా జన్మలో ఎరుగని కచ్చేరీలు ప్రవహించేవి. గొప్ప గ్యాలరీవాళ్ల వర్కుషాపులు కూడా ఊహించలేని బొమ్మలు గీతల్లో మంత్రముగ్ధంగా తయారయ్యేవి. నిజానికే అదే అసలైన లామకాన్. కళా పిచ్చి, సాహిత్యం వెర్రి గల నావంటి పిలగాళ్ళ పాలిట మక్కానూ జేరూసలేమూనూ. ఇప్పుడదంతా ఒక చరిత్ర. ఇప్పుడా గది మూతపడి వుంది. అది అక్కడ నిన్నటిదాకా మోహన్ వున్న గది. ఈ రోజు గదిలో ఎవరూ లేరు గదినిండా నిశ్శబ్దం. సాయంత్రం ఆరున్నర, గదిలోపల చినుకులవలె చీకట్లు. ఖండపరశుగళ కపాలగణముల కనుకొలకులలో ఒకటివలె చూపులేని చూపులతో తేరి చూస్తున్నది గది. అతని దీపం ఆ గదిలో మూలనక్కి మూలుగుతున్నది. ప్రమిదలో చమురు త్రాగుతూ పలు దిక్కులు చూస్తున్నది. అకస్మాత్తుగా ఆ దీపం ఆకాశతారను చూసింది. రాకాసి కేకలు వేసింది. (నీకూ నాకూ చెవుల సోకని కేకలు.) ఆకాశతార ఆదరపు చూపులు చాపింది. అలసిపోయింది పాపం, దీపం. ఆకాశతార ఆహ్వానగానం చేసింది. దీపం ఆరిపోయింది. తారగా మారిపోయింది. (శ్రీశ్రీ) - అన్వర్ -
‘కళ’గా బతికి...!
పూసిన జ్ఞాన వసంత గోపురం మోహన్ సుదీర్ఘ స్వప్న సంచారి కళాసాహిత్యాలే బతుకై బతుకే సాహిత్యమై బతికినవాడు తరగని మేధో గని కవులకు కళాకారులకు ఆశ్రయ నిధి (కార్టూనిస్టు మోహన్‌కి నివాళి) – గోరటి వెంకన్న -
కార్టూనిస్టుల గడ్డ- మోహన్ సార్ అడ్డా
ఆ అడ్డామీదికొస్తే కూలి గ్యారంటీ లేదు కానీ... కళ రావడం గ్యారంటీ. కళకు కాసులు కావాలంటే ఏ ఫైనాన్స్ కంపెనీనో, చిట్‌ఫండ్ పెట్టుకోమంటారు... ఆయన రాసిన కార్టూన్ కబుర్లు, వ్యాసాలు, గీసిన కార్టూన్లు చూస్తే చాలు ఏదో చేతబడి అయినట్లుగా ఓ రెండ్రోజుల్లో ఆయన ముందు వచ్చి వాలుతాం! అదే మోహన్ సార్ తావీదు మంత్రం. ఇప్పటికీ ఆ మంత్రం నుంచి బయటపడలేక ఆయన చుట్టే తిరుగుతున్నాం. మంత్రం బాగా పనిచేస్తే, ఏ పేపర్లోనో, యానిమేషన్లోనో, చిత్రకారుడిగానో రాణిస్తూ మా కుటుం బాలకు ఇంత అన్నం పెట్టుకుంటున్నామంటే అది ముమ్మాటికీ మాకు ఆయన పెట్టిన భిక్షే! కొత్తగా ఏం బొమ్మలు వేశావబ్బా! అని అడుగుతారు. వేశామంటే కుదర్దు చూపించాలి కూడా.. మాకు ఇప్పటికీ భయమే ఏ బొమ్మ గీసినా ఆయన చూస్తారని.. అలా ఆయన తన కార్టూన్ కబుర్ల ఫైన్ ఆర్ట్ కోర్సులు ప్రవేశపెట్టి పైనుంచి మా బొమ్మలను చూస్తూ మాలాంటి కార్టూనిస్టులకు ఒళ్లు దగ్గర పెట్టుకొని బొమ్మలు వేయాలని పరోక్షంగా హెచ్చరిస్తూనే ఉంటారు. విశాలాంధ్రలో రిపోర్టరుగా కెరీర్ ప్రారంభించిన మోహన్ అదే పత్రికలో కార్టూనిస్టుగా పనిచేసి తర్వాత హైద్రాబాద్‌లో ఆంధ్రప్రభ, ఆ తర్వాత ఉదయం దినపత్రికల్లో కార్టూనిస్టుగా పనిచేశారు. ఉదయంలోనే తన కార్టూన్లు, కేరికేచర్లు, వ్యాసాలతో విశ్వరూపం ప్రదర్శిం చారు. రొటీన్‌గా వస్తున్న కార్టూన్లకు భిన్నంగా తన రేఖా విన్యాసంతో పతంజలి కథలకు, రకరకాల ప్రయోగాలతో బొమ్మలు గీశారు. తెలుగునాట చిత్రప్రసాద్ను పరిచయం చేసి సునీల్ జానా అనే ప్రఖ్యాత ఫోటో గ్రాఫర్ తెలంగాణ సాయుధ పోరాటానికి చెందిన ఫోటోలు ఢిల్లీ నుంచి తెప్పించి వాటిని పుస్తక రూపంలో మనముందుంచారు. బ్యాక్ అండ్ వైట్‌తో తన ఇంక్ డ్రాయింగ్స్‌ని చిత్తప్రసాద్‌ను మరిపించే విధంగా గీశారు. మా అందరినీ చిత్తప్రసాద్‌కు వీరాభిమానులుగా చేసేశారు. తన గురించి తన బొమ్మల గురించి ఎవరైనా పొగిడితే, మా దృష్టి మరల్చి వీడి బొమ్మలు చూడబ్బా.. వీడు మొనగాడు అంటూ ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారుల జాబితాను ముందుంచేవారు. తెలుగు మీడియంలో చదివిన మాకు విదేశీ చిత్రాలను, ఆ రచయితలను, కార్టూనిస్టులను వాళ్ల గొప్పతనాన్ని చెప్పి, మేం ఏ ఇంగ్లిష్ రచనా చదవకుండానే కొన్ని వందల పుస్తకాలు చదివిన జ్ఞానాన్ని మాకు పంచిపెట్టారు. నిజంగానే మోహన్ ఒక ఆర్ట్ బైబిల్. మీసాన్ని చిటికెన వేలితో తడుముతూ, బొమ్మలు గీసే మోహన్ సార్ లేడు అన్న భావం మాకు ఇంకా కలగటం లేదు. ఎందుకంటే ఆయన మాలోనే ఉన్నాడు. తన దగ్గరికొచ్చిన ప్రతి వ్యక్తిలో ఏదో రకంగా చేరిపోయారు. ఆయనను వదిలించుకోవటం ఎవరితరం కాదు. అందుకే ఆయన్ని మాతోనే ఉంచుకున్నాం.. ఉన్నారు.. ఉంటారు. మోహన్ సార్ జిందాబాద్! -శంకర్ -
ప్రఖ్యాత కార్టూనిస్ట్ మోహన్ ఇకలేరు!
-
‘తెలుగు పత్రికా రంగంలో మోహన్ ధ్రువతార’
-
‘తెలుగు పత్రికా రంగంలో మోహన్ ధ్రువతార’
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ కార్టునిస్ట్ మోహన్ మృతి పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్ర్భాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు. కార్టునిస్ట్ మోహన్ తెలుగు పత్రికా చరిత్రలో గొప్ప కార్టూనిస్టుల కోవకు చెందినవారని వైఎస్ జగన్ అన్నారు. ప్రముఖ దినపత్రికల్లో రాజకీయ కార్టునిస్టుగా పనిచేసిన మోహన్ దశాబ్దాల పాటు అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ, మోహన్ కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కాగా కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కార్టునిస్టు మోహన్ బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన మృతదేహాన్ని ఉదయం 10 గంటలకు మధ్యాహ్నం ఒంటిగంట వరకూ సోమాజీగూడ ప్రెస్‌క్లబ్ లో సందర్శనార్థం ఉంచనున్నారు. -
ప్రఖ్యాత కార్టూనిస్ట్ మోహన్ ఇకలేరు!
సాక్షి, హైదరాబాద్: ప్రఖ్యాత కార్టూనిస్ట్, ఇలస్ట్రేటర్, పెయింటర్, యానిమేటర్, పత్రికా రచయిత మోహన్ ఇకలేరు. జీర్ణకోశ వ్యాధితో బాధపడుతున్న ఆయన కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందారు. ఆయనకు కుమారుడు ఉన్నారు. మోహన్ పూర్తిపేరు తాడి మోహన్. 1951, డిసెంబర్ 24న ఏలూరులో ఆయన జన్మించారు. 1970లో విశాలాంధ్ర పత్రికలో సబ్ ఎడిటర్‌గా పాత్రికేయ వృత్తిలోకి ప్రవేశించిన మోహన్.. అనంతరం ఆంధ్రప్రభ, ఉదయం పత్రికల్లో పనిచేశారు. సాక్షి మీడియాతో మోహన్‌కు ప్రత్యేక అనుబంధం ఉంది. సాక్షి టీవీలో కార్టూన్ యానిమేషన్ విభాగంలో ఆయన సేవలందించారు. పొలిటికల్ కార్టూనిస్ట్‌గా మోహన్ తెలుగు పత్రికా రంగంలో చూపిన ప్రభావం అపారం. వ్యంగ్య చిత్రాలలో గీయడంలో మోహన్‌ది ప్రత్యేకమైన శైలి. ఆయన కార్టూన్లు, బొమ్మలు తెలుగునాట విశేష ప్రాచుర్యాన్ని పొందాయి. మోహన్ గొప్ప పొలిటికల్ కార్టూనిస్ట్ అని, మంచి ఆలోచనపరుడు, రాజకీయాలపై గట్టి పట్టున్నవారు అని, ఆయన తనకు మంచి స్నేహితుడు అని 'సాక్షి' ఎడిటోరియల్ డైరెక్టర్ కే రామచంద్రమూర్తి సంతాపం తెలిపారు. పలువురు ప్రముఖులు కూడా కార్టూనిస్ట్ మోహన్ మృతిపై సంతాపం వ్యక్తం చేశారు.