రేఖ దేశీయం ఊహ విశ్వ మోహనం | Abk prasad colum on cartoonist Mohan | Sakshi
Sakshi News home page

రేఖ దేశీయం ఊహ విశ్వ మోహనం

Published Tue, Sep 26 2017 12:38 AM | Last Updated on Fri, May 25 2018 6:35 PM

Abk prasad colum on cartoonist Mohan - Sakshi

రెండో మాట

వ్యంగ్య చిత్రకారుడిగా ప్రసిద్ధ కార్టూనిస్ట్‌ అబూ అబ్రహాం ప్రశంసలందుకున్న వ్యక్తి మోహన్‌. తన చిత్రాల ఫొటో ఎగ్జిబిషన్‌ను ‘లుంబినీ’ వద్ద కొన్నిరోజులపాటు నిర్వహిం చాడు. ‘ప్రపంచీకరణ’ బాగోతాన్ని వ్యతిరేకిస్తూ ముంబై రెసిస్టెన్స్‌ గ్రూపు ఏర్పాటు చేసిన ‘వరల్డ్‌ సోషల్‌ ఫోరమ్‌’ సదస్సుకు 42 దేశాల ప్రతినిధులు హాజరైనప్పుడు మోహన్, సామ్రాజ్యవాద చర్యలను ప్రతిఘటించే పెక్కు వ్యంగ్య చిత్రాలతో ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేశాడు. 1990 నుంచీ తెలుగునాట తొలి యానిమేషన్‌ కళాకారుడుగా గణనలోకి వచ్చాడు.

మనం గోర్జినీని గీసిన ‘స్లీపింగ్‌ వీనస్‌’ తైలవర్ణ చిత్రాన్ని చూడకపోవచ్చు. టిటాన్‌ రూపించిన ‘వర్జిన్‌’ ఊహాచిత్రాన్నీ చూసి ఉండకపోవచ్చు. ఏంజిలో బ్రోంజినో ‘వీనస్‌ కుపిడ్‌’విరచిత చిత్రకళనూ చూడకపోవచ్చు. అలాగే లియొ నార్‌ ద విన్సీ ‘మోనాలిసా’ను చూచి ఉన్నా, ‘మడోన్నా’ చిత్రాన్ని చూడడం సాధ్యపడకపోవచ్చు. అలాగే మైఖేల్‌ ఏంజిలో సూర్యచంద్రుల సృష్టినీ, టింటిరెట్టో ‘త్రీగ్రేసెస్‌’ చిత్రాన్నీ చూసి ఉండకపోవచ్చు. కానీ కొత్త రంగుల ప్రపం చంలో తన రేఖలే తప్ప తనకు ఇతర ‘లక్ష్మణరేఖ’లంటూ లేవని నిరూపిం చాడు– తెలుగు చిత్రకళారంగంలో లబ్ధప్రతిష్టుడైన వ్యంగ్య చిత్రకారుడూ, డిజైనరూ మోహన్‌. ఎప్పటికప్పుడు నూతన కళాసృష్టిని అభిలషించినవాడు. పలు పత్రికలకు, మ్యాగజైన్లకు, గ్రంథాలకు, ప్రజా ఉద్యమ ప్రచారకులకు అర్థవంతమైన రాజకీయ, సామాజిక, ఆర్థిక సమస్యలపై అసంఖ్యాకంగా కార్టూన్లు, కేరికేచర్లు, రేఖాచిత్రాలు, పోస్టర్లు చిత్రించిన ఘనాపాటి ఆయన. హైటెక్‌ పెయింటింగ్‌ కళలో దూసుకువచ్చాడు. ‘చలనకళ’ అనదగిన ‘యానిమేషన్‌’ చిత్రకళాసృష్టిలో తెలుగునాట తొలిపాదం మోపినవాడిగానే కాక, హైటెక్‌ చిత్రకళలో వినూత్న ప్రయోగం చేశాడు.

మాస్టర్‌ పీస్‌
ఒక ప్రచురణ సంస్థ కొద్దికాలం క్రితం ప్రచురించిన ఒక క్యాలెండర్‌  దేశంలో వెలువడిన క్యాలెండర్లన్నింటిలోకి ప్రమాణాలలో, పరికల్పనలో అగ్రేసర స్థానంలో నిలుస్తుందనిపించుకుంది. పన్నెండు మాసాలనూ ఆరు రుతువు లుగా విభజించుకుని ఒక్కొక్క రుతువును ప్రకృతిమాతతో అనుసంధానం చేసి విభిన్న రంగుల  సమ్మిశ్రమంతో రాగరంజితంగా ఆ క్యాలెండర్‌లో చిత్రిం చినవాడు మోహన్‌. కన్నుల పండువుగా ‘చక్షూరాగాలు’ పలికించాడు. నిత్య వర్ణప్రపూరితమైన ప్రకృతిని మించిన రంగులను ఎంత హైటెక్‌ కళ అయినా, కంప్యూటర్‌ చిప్‌ అయినా కొత్తగా అందించలేదు. విభిన్న వర్ణాలలో కలర్‌ ‘వేరియేషన్స్‌’తో కాంబినేషన్స్‌ను చిత్రకారుడు అందిస్తాడే గానీ ప్రకృతి మాతృకనే ‘కరప్ట్‌’ చేయలేడు. ప్రజాకళల్లో భాగంగా ఒక పాపులర్‌ కవితకు భావచిత్రాలు అందించడం ప్యారిస్‌ కమ్యూన్‌ నాటికే (1871) ప్రయోగంలోకి వచ్చింది. మన మోహన్‌ ఈ క్యాలండర్‌లో తెలుగు కవుల, తాత్వికుల భావనా స్రవంతిలోకి తొంగి చూడలేదు.

ఆరు రుతువులకు వేసిన చిత్రాలలో, మానవ, మానవేతర ప్రకృతిని ప్రతిబింబించిన రూపాలలో ప్రధానంగా పాశ్చాత్య భావుకుల కవన ఝరిలో జాలువారిన సుందరభావాలకు ప్రాధాన్యం ఇచ్చాడు. కారణం, మన ప్రసిద్ధ చిత్రకారులలో పెక్కుమంది పురాణ గాథలనూ, రామాయణ, భారత ఇతిహాసాలనూ ఆధారంగా చేసుకుని కథా చిత్రాలను ఇప్పటికే గీసి గీసి పాప్యులరైజ్‌ చేసి ఉండడం కావచ్చు. మోహన్‌ క్యాలెండర్‌ చిత్రీకరణకు ప్రోద్బలం చేసిన పదకవితలు–టెన్నిసన్, ఆర్కిబాల్, నెన్నెత్‌లెస్లీ, ఉమర్‌ ఖయ్యాం కలాల నుంచి జాలువారిన కొన్ని ఆణిముత్యాలు. అతని రేఖ దేశీయం, ఊహ విశ్వమోహనం, భావన సార్వకాలీనం. ఈ చిరు ముత్యాలసరాల ఎంపిక టి. శివాజీది. డిజైన్, కలర్, కూర్పు మస్తాన్‌ది. మొత్తం క్యాలెండర్‌ను ఇంద్రధనుస్సులా దీపించేటట్టు హైటెక్‌ కుంచె మెరుగులతో రోచిర్నివహంగా దిద్ది తీర్చిన చిత్రకారుడు మోహన్‌. క్యాలెండర్‌ల అలంకరణ కళలో (డెకోరేటివ్‌ ఆర్ట్‌) మోహన్‌ క్యాలెండర్‌ను ఒక మాస్టర్‌పీస్‌గా పేర్కొనడం అతిశయోక్తి కాబోదు.

మోహన్‌–హైటెక్‌ పెయింటింగ్‌ కళ
ప్రసిద్ధ కవుల, తాత్వికుల ఆప్తవాక్యాలను చిత్రకళ ద్వారా ఆత్మీయ కళాఖండాలుగా మలచడం సామాన్యమైన పనికాదు. ఈ విశ్వం చిత్తవృత్తులూ, ఆగ్రహానుగ్రహాల సమాహారమే ఆరు రుతువులు. ఈ రుతువులన్నీ ప్రకృతి మంత్ర కవాటాలు. వాటిని విభిన్న వర్ణాలతో మానవ, మానవేతర ప్రకృతి సంబంధం ద్వారా కళ్లకు పసందు చేశాడు మోహన్‌.

సాహిత్యాది సర్వకళల వికాసానికి దోహదం చేసిన ఒకనాటి యూరోపియన్‌ సాంస్కృతిక పునరుజ్జీవన దశలో వెల్లివిరిసిన ఫ్లారెంటైన్‌ పెయింటిం గ్స్‌కు మోహన్‌ క్యాలెండర్‌ చిత్రకళ ఏ మాత్రం తీసిపోదని చెప్పవచ్చు. చరి త్రకు అందని పూర్వ యుగపు గుహలలోని కుడ్యచిత్రాలు ఎన్నెన్నో. ఆదిమ కళ నుంచి నేటి ఆధునిక చిత్రకళలు ఎన్ని మలుపులు తిరుగుతున్నాయో! కార్టూన్‌ల దశ నుంచి కంప్యూటర్‌ చిత్రాల దాకా కలర్‌ చిప్‌ తోడు నీడగా నూతన రీతులను చిత్రకళ ఆవిష్కరించుకుంటోంది. రినైజాన్స్‌ యుగం మానవుణ్ణి ప్రపంచానికి కేంద్ర బిందువుగా సాక్షాత్కరింపచేసింది. పారిస్‌ కమ్యూన్‌ మానవ జన్మ సార్థక్యాన్నీ, అతని పురోగతనీ ప్రజా సమ్మతం చేయడానికి ప్రయత్నించింది. కళల్లో వాస్తవికతా వాదాన్ని మరింత ముందుకు నడిపించింది.

అందుకే కాబోలు, సుప్రసిద్ధ ఫిజీషియన్‌ హిప్పోక్రాట్స్‌ ‘మానవుడి జీవితకాలమా స్వల్పం, అస్థిరం. కళాసృష్టి మాత్రం శాశ్వతం’ అని ఉంటాడు, ఈ మర్మం తెలిసిన మోహన్‌ కూడా జలవర్ణ చిత్రాలు, తైలవర్ణ చిత్రాలు, ఆక్రిలిక్‌ చిత్రాలకే కట్టుబడి ఉండకుండా అధునాతనమైన హైటెక్‌ పెయింటింగ్‌ కళాక్షేత్రంలో కూడా కాలుమోపి నిలదొక్కుకున్నాడు. తన వద్ద ఉపాంగాలు పుష్టిగా లేకపోయినా, జల్లెడ (స్కానర్స్‌) లేకుండానే 1990 నుంచీ తెలుగునాట తొలి యానిమేషన్‌ కళాకారుడుగా గణనలోకి వచ్చాడు. వ్యంగ్య చిత్రకారుడిగా ప్రసిద్ధ కార్టూనిస్ట్‌ అబూ అబ్రహాం ప్రశంసలందుకున్న వ్యక్తి మోహన్‌. తన చిత్రాల ఫొటో ఎగ్జిబిషన్‌ను ‘లుంబినీ’ వద్ద కొన్నిరోజులపాటు నిర్వహిం చాడు. ‘ప్రపంచీకరణ’ బాగోతాన్ని వ్యతిరేకిస్తూ ముంబై రెసిస్టెన్స్‌ గ్రూపు ఏర్పాటు చేసిన ‘వరల్డ్‌ సోషల్‌ ఫోరమ్‌’ సదస్సుకు 42 దేశాల ప్రతినిధులు హాజరైనప్పుడు మోహన్, సామ్రాజ్యవాద చర్యలను ప్రతిఘటించే పెక్కు వ్యంగ్య చిత్రాలతో ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేశాడు. ‘నో సో బ్యూటిఫుల్‌ లైఫ్‌’ అనే చిత్రదర్శిని గ్రంథంలో ప్రపంచీకరణవల్ల, ప్రజా వ్యతిరేక సంస్కరణలవల్ల వర్ధమాన దేశాల పేద ప్రజలు పడుతున్న బాధలను చిత్రీకరించాడు. ఆ గ్రంథాన్ని సుప్రసిద్ధ సామాజిక కార్యకర్త, రచయిత్రి అరుంధతీరాయ్‌ ఎంతగానో ప్రశంసించింది.

‘ఆకులందున అణగిమణగి...’
మోహన్‌ తన ‘వసంతం’(స్ప్రింగ్‌) చిత్రకల్పనలో మానవ–మానవేతర ప్రకృతి సంబంధాన్ని వస్తువుగా స్వీకరించినప్పుడు ‘‘ఆకులందున అణగి మణగి కవిత కోయిల పలుకవలెనోయ్‌’’ అనీ, ఆ పలుకులను విని అభిమానం రెక్కలు తొడుక్కోవాలనీ చెప్పిన గురజాడవారి పాదం గుర్తుకు రావలసిందే. అంతేగాదు, ‘‘ఆమని సంతసమావహిల్ల... మల్లెలు, మొల్లలు, జాజులెల్ల కడల బొదల/ నందనోద్యానమిది యను చందమున ప్రమదావనము కన్నుల పండువ’’ చేస్తుందన్న శ్రీపాదవారి కవిత గుర్తుకు వస్తుంది. ఇక నిప్పులు చెరగే ‘గ్రీష్మ’(వేసవి) రుతువుకు వేసిన చిత్తరువు చూడగానే ‘‘తోచె గ్రీష్మావసాన ముత్తుంగ సౌధజాల/బహిరంగణా ప్రదోష ప్రభాత దంపతీ విస్తృతాతి/దృఢ పరీరంభ పునరుప దేష్టయగుచు..’’ అన్న దేవులపల్లి మనసుకు స్ఫురిస్తాడు. ‘వర్ష రుతువు’ చిత్రం చూచినప్పుడు ‘‘మిగుల జగంబు ఒగ్గడిల మించె తదుద్ధిత వృష్టి అద్భుతం బగుచు/... నిర్జర జర్జరీ భవన్నగ విగళచ్ఛిలా ఘన ఘనాఘోషణ భీషణంబుగన్‌...’’అన్న ఓ ప్రాచీన కవి భీకర వర్షధారా వర్ణన గుర్తుకు రాకమానదు. అలాగే, ‘శరదృతువు’ చిత్తరువు చూడగానే నన్నయ్య తన కొసమెరుపుగా అందించిపోయిన ‘‘శారద రాత్రులు జ్వలలసత్తర తారక హార పంక్తులన్‌ చారు తరంబులయ్యె’’ అన్న పద్యం స్ఫురించాల్సిందే. ఇక ‘శిశిరం’చిత్ర రచన చూడగానే ‘‘హిమముచే సంబరం బెల్ల నిమురు కొనగ... వచ్చు నింక హేమంత మహిమ’’ అన్న పోతన కళ్లముందు నిలబడతాడు.

అందుచేతనే, కళామర్మం బలంగా ఆవిష్కరించుకుంటున్న కొద్దీ కళా సౌందర్యం ముమ్మరించి కళాస్రష్ట కాస్తా అజ్ఞాతంలోకి వెళ్లిపోతాడన్న ఆస్కార్‌ వైల్డ్‌ ఉక్తికి విలువ వచ్చి ఉంటుంది. చరిత్రలో చిత్రలేఖన వాదాలు ఒకటీ,అరానా? ఎన్నెన్నో– ఆదర్శవాదం, వాస్తవిక వాదం, కాల్పనిక వాదమని స్థూలార్థంలో మూడు ప్రధాన వాదాలుగా చెప్పుకున్నా ఆధునిక వాదాలతో చిలవలు, పలవలతో శాఖా చంక్రమణం చేస్తున్న శైలీ భేదాలు మరెన్నో. మోడల్‌ ఆర్ట్‌ ‘మోడరన్‌ ఆర్ట్‌’గా పరిణమించి వాదాలు అనుభవ వేదాలుగా మారాయి. వాటికి మారుపేర్లే– అనుభవవాదం (ఇంప్రెషనిజం), అసంప్రదాయ వర్ణ చిత్రణవాదం (ఫావిజం ఊ్చuఠిజీటఝ), స్థూలతావాదం (క్యూబిజం), అనాగతావాదం (ఫ్యూచరిజం–కాలాన్ని, కాలగతినీ ప్రేక్షకుడి అనుభూతికి తేవడం), అభివ్యక్తివాదం (ఎక్స్‌ప్రెషనిజం), అధివాస్తవిక వాదం (సర్రయలిజం), నైరూప్య చిత్రణ (ఆబ్‌స్ట్రాక్ట్‌), డాడాయిజం, అతుకు చిత్రణ (కొల్లేజి) లేదా ‘స్క్రాప్‌ కళ’ వగైరా వగైరా.

ఈ అన్నింటిలో కాకపోయినా పెక్కింటిలో మోహన్‌ అంతో ఇంతో ప్రయోగాలు చేయకపోలేదు. ఆధునికులలో అత్యాధునికుడిగా ముందంజ వేస్తున్న మోహన్‌ రూపించిన నవీన ‘‘క్యాలండర్‌ చిత్రకళ’’ను అందరూ చూసి అనుభూతి పొందాలి. శయన మందిరాలలో మోహన్‌ రుతు చక్రగతిని ఫ్రేములో బంధించుకోవచ్చు. ఒకనాడు యూదులు క్యాలండర్‌ కళకు ప్రాచుర్యం ఇచ్చినందుననే కళా విమర్శకుడు వీసెన్‌బర్గ్‌ ఆ క్యాలండర్‌ను ‘‘రుతుగ్రంథ’’ రాజంలోకి (ఆౌౌజు ౌజ  ్ఛ్చటౌnట) ఎక్కించాడని అంటారు. మోహన్‌ క్యాలండర్‌ చిత్రకళ కూడా రుతువుల చాటున ప్రేక్షకులపై విరిసిన సమ్మోహనాస్త్రం. ‘‘ల్యాండ్‌స్కేప్స్‌’’ చిత్రకళను ఒక మహాకావ్యంగా భావించిన రోరిక్‌ అన్నట్టుగా ‘నేను’అన్న భావాన్ని ‘మనం’గా మలచి పంచిపెట్టే, సుఖ దుఃఖాల సమన్వయకర్త చిత్రకారుడు అనుకుంటే– ఆ భావాన్ని మోహన్‌ తనదైన ‘హైటెక్‌’శైలిలో ‘సత్యం, శివం, సుందరం’గా ఈ నవీన క్యాలెండర్‌ చిత్రకళను మలిచాడనే చెప్పవచ్చు. డాంటే మహాకవి ‘పుర్గటోరియో’ అన్న కవి తలో ఓ కన్యను చిత్రిస్తూ ‘‘హేల్‌! ఫుల్‌ ఆఫ్‌ గ్రేస్‌’’ అంటాడు. ఈ వర్ణన మోహన్‌ క్యాలండర్‌ చిత్రకళా వైభవానికి కూడా వర్తిస్తుంది. ‘అహో! మోహన రేఖస్య మాధుర్యం’ అనుకుందాం! ఆనందిద్దాం!


ఈమెయిల్‌: abkprasad2006@yahoo.co.in

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement