ఒక పుస్తకం-ఒక మోహన్-ఒక ఆర్కే! | Sakshi Special Story On Cartoonist And Writer T Mohan In Telugu - Sakshi
Sakshi News home page

ఒక పుస్తకం-ఒక మోహన్-ఒక ఆర్కే!

Published Sun, Dec 24 2023 1:38 PM | Last Updated on Sun, Dec 24 2023 6:31 PM

Special Story on Cartoonist And Writer T Mohan  - Sakshi

జ్ఞానోదయంనాడు ఈ పుస్తకాన్ని చూశాను. జ్ఞానము ఫటాపంచలయింది. సంవత్సరాలు పూర్తి మీద పూర్తి సంపూర్తి అయిపోతూనే ఉన్నాయి. ఒక్క బొమ్మ పూర్తి కాలేదు, అసలు మొదలు పెడితే కదా, పూర్తవడానికి! అసలే జీవితము బరువైంది, ఆపై ఈ పుస్తకం వచ్చి సిందుబాదు భుజాలమీద కూచున్నట్టుగా వచ్చి కూర్చుంది. ఎంతకూ దిగనంటుంది. అది దిగనంటుందా? దించుకోవడానికి నాకే ఇష్టం లేదా. ఏమో! తెల్లవారివారంగానే ప్రేమగా మా మొహాలను అద్దంలో చూసుకుని వాటి పై ఖాండ్రించి ఉమ్మేసి, మురిపెంగా మా కళాఖండాలను ముట్టుకుని నుసి మసి బారేంత కాల్చెయ్య గలిగిన దమ్మునిచ్చింది ఈ పుస్తకం.

ఈ ముండమోపి బతుకులో కాస్తొ కూస్తొ అందం కనపడిదంటే వొక బాపు, వొక పతంజలి, వొక మోహన్, లాంటి మరి కొందరు ఒకే ఒకరులు అనే వాళ్ళ సాంగత్యమే, పొగురే, బలుపే. ఒకే ఒక కార్టూన్ కబుర్లు పుస్తకంతో స్నేహిత్యమే. 22 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఈ పుస్తకం రాబోతుందని అంధ్రజ్యోతి ఆదివారపు చాట పత్రికలో చాటింపు పడింది. ఆ తరువాత మాఊరికి వచ్చిన విశాలాంద్ర పుస్తకాల బండిలో ఈ పుస్తకం కంటపడింది. నా దురదృష్టవశాత్తు నేను కొనుక్కున్న పుస్తకంలో 90 వ నెంబరు పేజీ మిస్సు కాలేదు. అయి ఉంటే బావుణ్ణు. ఆ పేజిలో పైనుండి కిందికి రెండవ పేరాలో మోహన్ గారు ఇలా అంటాడు కదా " ఇలాంటి ప్రాజెక్ట్ మీద ఆసక్తి గల ఆర్టిస్టులెవరన్నా రావచ్చు.

నాతో పాటు యానిమేషన్ చేసే అసిస్టెంట్స్ అందరితో కలిసి కూచుని బొమ్మలేసి, చూసి ఆనందం పొందవచ్చు. మరి జీతము, తిండి, బతుకూ ఎలా అనే తుఛ్చమైన ఐహికమైన ప్రశ్నలుంటే అవి గూడా పర్సనల్గా మాట్లాడుకుందాం. ఇలా పబ్లిగ్గా ఎందుకు. నేను 316243 అనే ఫోన్ నెంబర్ లో టెన్ టు సిక్స్ మాత్రమే కాకుండా ఆ తర్వాత గూడా గుమాస్తాగారికంటే హీనంగా పనిచేస్తూఉంటా. రండి ఇది మాయా యానిమేషన్స్, రెడ్ హిల్స్, హైదరాబాద్" ఈ మాటలు చదవడానికి ముందు నాకెప్పుడూ హైదరాబాదుకు వెళ్ళాలని కాని, మోహన్ గారిని కలవాలని గాని కోరికేమి ఉన్నది కాదు. నాకు ఆ సమయంలో ఒక ఉద్యోగం కావాలి. నేను బొమ్మలేస్తానని నాపై నాకు నమ్మకం ఉన్నది.

మోహన్ గారి ఆ ఉద్యోగ ప్రకటన చూసిన తరువాత ఆయనని కలిసింది తొలుత నేను కాదు నా ప్రెండ్ కిశోర్, ఆ తరువాత లావణ్య. అదంతా చెప్పాల్సిన వేరే ముచ్చట. నాకు ఆయన ఉద్యోగం ఇచ్చాడా లేదా? జీతం, తిండి, బతుకూ కల్పించాడా లేదా వంటి తుఛ్చమైన ఐహికమైన ప్రశ్నలకు జవాబు మరో భాగంలో , మరెప్పుడయినా. నేను విశాలాంద్ర పుస్తకాల బండిలో కార్టూన్ కబుర్లు పుస్తకం కొనుక్కున్నా. హైద్రాబాదుకి చేరిన తరువాత ఆ పుస్తకానికి నల్లని చమన్ లాల్ బోర్డ్ తో అట్టవేసుకుని దానిపై తెల్లని జిరాక్స్ ముద్రణ గల లోత్రెక్ ఫోటో అతికించుకుని, పొస్టర్ కలర్తో నాదైన అక్షరాల్లో "కార్టూన్ కబుర్లు" అని రాసుకున్నాను. ఆ పుస్తకం చూసి మోహన్ గారు ముచ్చట పడ్డారు. అరే భలే ఉందబ్బా ఈ కవర్, నెక్స్ట్ ఎడిషన్కి ఇలా కవర్ వేద్దాము అని కూడా అన్నాడు.

( చాలా సంవత్సరాల తరువాత కొత్త కార్టూన్ కబుర్లు పుస్తకానికి నాతో డిజైన్ంగ్, లే అవుట్ చేయించుకుందామని ఆశ కూడా పడ్డారు) ఆ తరువాత, ఆ నా పుస్తకాన్ని పట్టుకుని అలానే అందరమూ కలిసి బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లో ఉండే హార్ట్ ఆనిమేషన్ స్టూడియోకి చేరి అక్కడ ప్రిన్సిపాల్ గారు శ్రీ జయదేవ్ గారిని కలిసి నమస్కరించాము. ఆ తదుపరి నా నల్లని కార్టూన్ కబుర్ల పుస్తకం కవరు తెరిచి లోపల తెల్లని పేజీ పై "జయదేవ్ గారికి ప్రేమతో మోహన్" అని వ్రాసి సంతకం చేసి ఇచ్చాడు. అలా ఇవ్వడానికి మీకు ఏ అధికారం లేదు మొర్రో, అది నా పుస్తకం కుయ్యో, దానిని మా ఊర్లో మా నాయన జేబులో డబ్బులు కొట్టేసి కొనుక్కున్నా అయ్యో అని ఎంత మొత్తుకున్నా వినిపించుకోవడానికి ఎవరికీ ఆసక్తి లేదు. అందరూ చిరునవ్వుతో గ్రూప్ ఫోటో దిగే మూడ్ లో ఉన్నారు. ఆ తరువాత నేను చాలా అనే అయిదారు కార్టూన్ కబుర్లు పుస్తకాలు కొనుక్కున్నా. ప్రతి పుస్తకం పై మోహన్ గారు టు అన్వర్ విత్ లవ్ మోహన్ అని సంతకం చేసి ఇచ్చేవాడు.

అప్పుడప్పుడూ నా ప్రియతములకి నేను ఆ పుస్తకాలు పంచుకునే పని పెట్టుకున్నా. అ మధ్య కూడా డాక్టరమ్మ ఒక భార్గవి గారి ఇంట్లో కార్టూన్ కబుర్లు రెండు కనపడితే నీకు రెండు పుస్తకాలు ఎందుకమ్మా అని దబాయించి , ఒక పుస్తకాన్ని నా కొత్తవకాయ ప్రెండ్ సుస్మిత చేతిలో పెట్టాను. ఈ మధ్య మా అమ్మ సత్యవతి భారతదేశాన్ని, నిషా బార్ గల్లీని ఖాలీ చెసి వెడుతూ "పుత్తర్ నీకేమైనా పుస్తకాలు కావాలా తేల్చుకో" అంది. ఆవిడ పుస్తకాల బీరువాలోంచి కార్టూన్ కబుర్లు తీసుకుని గుండెలకు హత్తుకున్నా. ఈ పుస్తకాన్ని ఎన్నిసార్లు చదివి ఉంటానో లెక్కే లేదు. చదివిన ప్రతిసారి రూపాయి కాయిన్ టెలిఫోన్ బాక్స్ లోంచి మోహన్ గారికి ఫోన్ చేసేవాడిని. అప్పుడు మొబైళ్ళు లేని కాలమది. హైద్రాబాద్ బ్రతుకు మీద చిరాకు, దుఖం, బాధ, పగ కలిగినప్పుడల్లా ఇంటి గోడమీద రక్తపు చూపుడు వేలుతో రెండు పేర్లు రాసేవాణ్ణి. నా హిట్ లిస్ట్ అది.

ఒకటి మోహన్ రెండు ఆర్కే. వీళ్ళు ఇద్దరూ కలిసి ఈ పుస్తకాన్ని వేయకుండా ఉండి ఉంటే నేను ఇక్కడికి వచ్చేవాడిని కాదు కదా. ఎప్పటికయినా ఆ పేర్ల మీద ఇంటూ మార్క్ వేసి వికట్టాటహాసం చేయాలని ఎనభైల సినిమా నాతెలుగు నరనరనా నింపుకున్న కొరిక అది. రెఢ్ హిల్స్ లో మేడమీద గదిలో బుద్దిగా బొమ్మలేసుకుంటున్న సమయాన మధ్యాహ్నపు కిటికి నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ "మోహనా ఓ మోహనా" అని పిలుపు వినపడేది. కిటికిలోంచి తొంగి చూస్తే బొద్దుగా ఉండే స్కూటర్ మీద , స్కూటర్ లా బొద్దుగా ఉండే ఆర్కే గారు ఒంటికాలి మీద వాలి, చిరునవ్వుతో కిటికి వంక నవ్వుతూ చూస్తూ కనపడేవాడు. అప్పుడు వయసు నలభయ్లలో ఉన్న మానవులు వీరు. కుర్చీలోంచి లేచి ప్యాంట్ని పొట్టమీదకు లాక్కుని, ఎదురు టేబుల్ మీద పెన్నుల పెట్టుకునే డబ్బాలోని దువ్వెనతో తల దువ్వుకుని మోహన్ గారు మెట్లు దిగేవాడు.

చాయ్, సిగరెట్, మీనాక్షి సాదా, ఆర్కే అనేవి అప్పటి ఆయన అలవాట్లు. ఆర్కే గారు పని చేసే బ్యాంకు మోహన్ గారి ఆఫీసుకు దగ్గరే. అప్పుడప్పుడూ , ఎప్పుడూ మోహన్ గారు తన టేబుల్ సొరుగులోనుండి విత్ డ్రాయల్ ఫాం తీసి అందులో తనకు కావలసిన అమౌంట్ నెంబరు రాసి, ఫామ్ వెనుక డియర్ ఆర్కే, అన్వర్ నో, శంకర్ నో పంపిస్తున్నాను మర్యాదగా ఒక రెండు వందలు నా అకవుంట్ నుండి ఇవ్వగలవు. అసలు మోహన్ గారి అకవుంట్ లో డబ్బులే ఉండవు. పట్టుకు వెల్లిన కాగితాన్ని చదివి ఆర్కెగారు తన జేబులోంచి డబ్బులు తీసి మాకు ఇచ్చేవాడు. ఇలా డబ్బులు కలెక్ట్ చేసే పని మోహన్ గారు ప్రకాష్ అనే తన తమ్ముడికి గానీ, శంకర్ కి కానీ, నాకు కానీ అప్పగించేవాడు కాని. అక్కడే ఉండే మరో గొప్ప కళాకారుడు శ్రీరాం కి మాత్రం చచ్చినా ఇచ్చేవాడు. శ్రీరాం చాలా ఉన్నత శ్రేణికి చెందిన ఆర్టిస్ట్ అనే భయంతో కాదు, ఆ డబ్బులు తీసుకుని మోహన్ గారి స్నేహానికి ఎక్కడ రాజీనామా చేసి పోతాడేమోననే భరించలేని గౌరవం కొద్ది.

ఒకానొక సమయంలో తెలుగులో గొప్ప పుస్తకాలు అనే లిస్ట్, తెలుగు పుస్తకాల్లో ఆకర్షణీయమైన తీరుతెన్నులు అనే లిస్ట్ తో రెండు ఆదివారపు పత్రికలు తమతమ ఉద్దేశాల కథనాలు ప్రకటించాయి . ఆ రెండిటి ఉద్దేశాల ప్రకారము ఆ జాబితాలో ఎక్కడానూ "కార్టూన్ కబుర్లు" లేదు. కార్టూన్ కబుర్లు చదివి, దానిని బుర్రకు ఎక్కించుకోవాలంటే ముందు అటువంటి లిస్ట్ తయారు చేసేవారికి ఒక బుర్ర ఉండాలి కదా, పోనీలే అని సమాథాన్ పడ్డాను. తెలుగులో గొప్ప వందపుస్తకాలు జాబితా అనేది ఒకటి ఉంటే అందులో కార్టూన్ కబుర్లు ఉంటుంది. తెలుగులో పది గొప్ప పుస్తకాలు అని ఒక వరుస వేసినా అందులో కార్టూన్ కబుర్లు చేరుతుంది. తెలుగులో రెండే గొప్ప పుస్తకాలు అని లెక్క తేలినపుడు కూడా అందులో ఒక పుస్తకం పేరు కార్టూన్ కబుర్లు అయి తీరుతుంది.

మామూలుగానే తెలుగులో బొమ్మలు చూడటమూ, బొమ్మలు చదవడమూ అంటేనే అది అంధులు చదవవలసిన లిపి, బధిరులు వినదగ్గ సంగీతము అనే స్థాయికి చేర్చిన రచనల మధ్య, రచయితల మధ్య కార్టూన్ కబుర్లు కానీ కార్టూనిస్ట్ మోహన్ కానీ ఆతని వచన విన్యాసం కానీ మరియొక్కటి ఎప్పటికీ పుట్టనిది, మరియొక్కడు చేయలేనిది. మోహన్ గారి వచనం అనేది, బాపు గీత అనేది తయరయితే వచ్చేది కాదు. సమస్త జీవులకు ఒక సూర్యుండు వలె. అవి ఒకసారి మాత్రమే పుడతాయి దానిని చూసి , చదివి ఆనందించగల హృదయ సౌందర్యం అనేది మన సంస్కారం పై మాత్రమే ఆధారపడి ఉంటుంది. ప్రతి చిత్రకారుడి దగ్గర ఉండవలసిన పుస్తకం కార్టూన్ కబుర్లు, కార్టూన్ కబుర్లు చదవడం కొరకైనా ప్రతి చిత్రకారుడు నేర్చుకోదగ్గ భాష తెలుగు. ఏ రచయిత చదువుకొనంత, ఏ కవి వినలేనంత, ఏ చిత్రకారుడు గీయలేనంత ఏ జర్నలిస్ట్ చూడలేనంతటి ఒకడే మోహన్, ఒకే కార్టూన్ కబుర్లు పుస్తకం.

వాస్తవానికి ఒక కార్టూన్ కబుర్లు పుస్తకం మరో రెండు కార్టూన్ కబుర్లుగా రావలసినది, రాలేదు. రాదు కూడా. ఎందుకని సమగ్ర బాపు బొమ్మల కళ. ఎందుకని బొమ్మల్లో చంద్ర మరియూ అతని గొప్ప డిజైనింగ్, ఎందుకని బొమ్మల బాలి-బాలి బొమ్మలు, ఎందుకని కరుణాకర్ ఒక మానవ శరీరసౌదర్య మూర్తి చిత్రణ, ఎందుకని గోవర్ధన గిరిని కుంచె చివరి గీతతో పైకెత్త గల గోపి బొమ్మల పూల మాల, ఎందుకని ఎందుకని ఎందుకని చాలా చాలా గొప్ప పనులు పుస్తకాలుగా రావో అందుకే ఇదీనూ రాదు . అంతవరకూ ఒక కార్టూన్ కబుర్లు ప్రస్తుతానికైతే ఉంది. అందుకని ఆ పుస్తకానికి జిందాబాద్. ఆర్కే గారికి జిందాబాద్ . నాకు మీ నమస్కారాలు. మోహన్ గారికి హేపీ బర్త్ డేలు.

(చదవండి: అత్యంత ఖరీదైన పుస్తకం: విశ్వ జనుల విశ్వశాంతి గీతమే ‘An Invaluable Invocation’)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement