తన ఆదివాసీల సామాజిక, సాంస్కృతిక జీవితం గురించి లోతుగా రాయడమే కాదు పిల్లల ప్రపంచం గురించి కూడా రాస్తోంది కవయిత్రి జసింతా కెర్కెట్టా. ఎక్కడ చూస్తే అక్కడ వారై – విశ్వరూపమున విహరిస్తున్న ఈ కాలంలో పిల్లల కోసం జసింత రాసిన ‘జిర్హుల్’ అనే పుస్తకానికి ‘రూమ్ టు రీడ్ యంగ్ రైటర్–2024’ అవార్డ్ ప్రకటించారు. పాలస్తీనాలో బాంబు దాడుల్లో మరణించిన, హింసకు గురవుతున్న పిల్లలను దృష్టిలో పెట్టుకొని ఈ అవార్డ్‌ను జసింత తిరస్కరించింది.
‘రూమ్ టు రీడ్ ఇండియా’ అనేది అక్షరాస్యత, లింగసమానత్వం... మొదలైన వాటిపై పనిచేసే స్వచ్ఛంద సంస్థ. ఈ సంస్థకు ఏరోస్పేస్ దిగ్గజం ‘బోయింగ్’తో సంబంధం ఉంది అని ఆరోపిస్తూ తనకు ప్రకటించిన అవార్డ్‌ను జసింత కెర్కెట్టా తిరస్కరించింది. ‘బోయింగ్‌కు ఇజ్రాయెల్ సైన్యంతో 75 ఏళ్లుగా సంబంధం ఉంది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్)కు ఆయుధాలను సరాఫరా చేసే కీలక సంస్థ అయిన బోయింగ్ ‘రూమ్ టు రీడ్ ఇండియా ట్రస్ట్’కు నిధులు అందజేస్తుంది’ అని జసింత తన తిరస్కరణ కారణాలపై ఆ ట్రస్ట్‌కు లేఖ రాసింది.
‘ఆయుధాలతో పిల్లల ప్రపంచం నాశనం అవుతున్నప్పుడు ఆయుధాల వ్యాపారం, పిల్లల సంరక్షణ ఏకకాలంలో ఎలా కొనసాగుతాయి?’ అని ఆ లేఖలో ప్రశ్నించింది జసింత.‘సాహిత్యంలో వైవిధ్యమైన, పిల్లల కోసం రాస్తే పుస్తకాలు తక్కువగా వస్తున్నాయి. బాల సాహిత్యానికి సంబంధించిన జిర్హుల్ పుస్తకానికి అవార్డ్ రావడం సరిౖయెనదే అయినా ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈ అవార్డ్‌ను స్వీకరించలేను’ అని చెప్పింది.ఈ తిరస్కరణ మాట ఎలా ఉన్నా ‘సాహిత్యానికి జసింత కెర్కెట్టా చేసిన కృషి విలువైనదిగా భావిస్తున్నాం’ అని స్పందించింది ‘రూమ్ టు రీడ్ ఇండియా’ ట్రస్ట్. ఇప్పుడు మాత్రమే కాదు సామాజిక కారణాలతో తనకు వచ్చిన కొన్ని అవార్డ్‌లను గతంలోనూ తిరస్కరించింది జసింత.
ఉద్యమ నేపథ్యం...
ఝార్ఖండ్‌లోని ఖుద΄ోష్ గ్రామంలో ఆదివాసీ కుటుంబంలో పుట్టిన జసింత మాస్ కమ్యూనికేషన్, వీడియో ్ర΄పొడక్షన్‌లో డిగ్రీ చేసింది. రాంచీలోని ఒక ప్రముఖ దినపత్రికలో పని చేసింది. కెరీర్ పరంగా ఎంత ముందుకు వెళ్లినా తన మూలాలను మాత్రం మరవలేదు. ‘ఆదివాసీ అండ్ మైనింగ్ ఇన్ ఫైవ్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఝార్ఖండ్’ పేరుతో అధ్యయన పత్రాన్ని వెలువరించింది.
‘ఇండిజినస్ వాయిస్ ఆఫ్ ఆసియా’ అనే పరిశోధన పత్రానికి ఇండిజినస్ పీపుల్స్ ఫ్యాక్ట్ అవార్డు లభించింది. జర్నలిస్ట్‌గానే కాదు కవిత్వానికి సంబంధించి సృజనాత్మక రచనలతోనూ ఎన్నో అవార్డ్‌లు అందుకుంది. తన కవిత్వం విషయానికి వస్తే అది ఆకాశపల్లకిలో ఊరేగదు. జ్ఞాపకాలను నెమరు వేసుకునేలా ఉంటుంది. గాయాలను గుర్తు తెచ్చుకునేలా ఉంటుంది. బూటకపు అభివృద్ధిని ప్రశ్నించేలా ఉంటుంది.
జసింత మనోహర్‌పూర్‌లోని మిషినరీ బోర్డింగ్ స్కూల్‌లో చదువుతున్న రోజుల్లో తల్లి పుష్ప అనిమ తండ్రి చేతిలో తరచు హింసకు గురయ్యేది. మరచి΄ోలేని ఆ హింసాత్మక దృశ్యాలు తన కవిత్వంలో కనిపిస్తాయి. వ్యక్తిగత చేదు అనుభవాలే కాదు అభివృద్ధి పేరుతో ఆదివాసీ గ్రామాల్లో జరుగుతున్న విధ్వంసం కూడా జసింత కవిత్వంలో కనిపిస్తుంది.జసింత కెర్కెట్టా జర్నలిస్ట్ మాత్రమే కాదు సోషల్ యాక్టివిస్ట్ కూడా. బాలికల విద్యకు సంబంధించి ఎన్నో ఆదివాíసీ గ్రామాల్లో పనిచేసింది. ఫోర్బ్స్ ఇండియా ‘టాప్ 20 సెల్ప్‌మేడ్ ఉమెన్’లో ఒకరిగా ఎంపిక అయింది.
పిల్లల్లో సామాజిక చైతన్యం
‘పిల్లలూ... మీరు ఎన్ని పువ్వుల గురించి విన్నారు? పూలన్నింటి గురించి తెలియనప్పుడు, కొన్ని పువ్వుల గురించి మాత్రమే తెలిసినప్పుడు... అవి మాత్రమే గొప్ప పుష్పాలూ, ప్రత్యేకమైన పుష్పాలూ ఎలా అవుతాయి? ఇవి మాత్రమే కాదు జిరాహుల్, జతంగి, సోనార్టి, సరాయ్, కోయినార్, సనాయ్ లాంటి ఎన్నో పూలు ఉన్నాయి’ అంటూ పది పువ్వుల గురించి జసింత కవిత్వం రాసింది. ఈ పువ్వుల గురించి ఎప్పుడూ వినని, ఎప్పుడూ చూడని పిల్లలు కూడా జసింత రాసిన కవిత్వం చదివి, పక్కన ఉన్న బొమ్మలు చూస్తే ఎక్కడ ఏ పువ్వు కనిపించినా ఇట్టే గుర్తు పట్టేస్తారు.
ఈశ్వర్ ఔర్ బజార్, జసింతా కీ డైరీ, ల్యాండ్ ఆఫ్ ది రూట్స్‌తో సహా ఏడు పుస్తకాలు రాసింది. ‘జిర్హుల్’లో పువ్వుల ప్రపంచం కనిపించిన్పటికీ అది అణగారిన వర్గాల కోసం ప్రతీకాత్మకంగా రాసిన పుస్తకం. ఆదివాసీ సంస్కృతి ఆధారంగా చేసుకొని పిల్లల్లో సామాజిక, రాజకీయ చైతన్యాన్ని పెం΄పొందించడమే ఈ పుస్తక లక్ష్యం. గాజాలో పదహారువేల మందికి పైగా చిన్నారులు మరణించారు. నెత్తుటేరులు పారాయి. ఈ నేపథ్యంలో ‘రూమ్ టు రీడ్ యంగ్ రైటర్’ అవార్డ్‌ను జసింత తిరస్కరించింది.
Comments
Please login to add a commentAdd a comment