tanguturi prakasam
-
టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి.. సీఎం జగన్ నివాళి
అమరావతి: స్వాతంత్య్ర సమరయోధుడు, ఆంధ్ర రాష్ట్ర తొట్టతొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భాంగా ఆ మహనీయుడికి ఏపీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ సీఎం క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్బంగా సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధనలో టంగుటూరి ప్రకాశం పంతులు కీలక పాత్ర పోషించారని తన జీవితాన్ని ప్రజా సేవకు అంకితం చేసిన ఆ మహనీయుడని కొనియాడుతూ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. స్వాతంత్ర్య సమరయోధుడిగా, ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశం పంతులు గారు రాష్ట్రానికి, దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయం. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధనలో ఆయన పాత్ర కీలకం. తన జీవితాన్ని ప్రజా సేవకు అంకితం చేసిన ఆ మహనీయుడు ప్రకాశం పంతులు గారి జయంతి సందర్భంగా నివాళులు. pic.twitter.com/oFfEdyidHz — YS Jagan Mohan Reddy (@ysjagan) August 23, 2023 ఇది కూడా చదవండి: అవును.. సీఎం జగన్ మహిళా పక్షపాతే -
టంగుటూరి ప్రకాశం జయంతి నిర్వహించాలి
అనంతపురం న్యూసిటీ: జిల్లాలోని అన్ని పాఠశాలల్లో ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతిని మంగళవారం నిర్వహించాలని డీఈఓ అంజయ్య ఓ ప్రకటనలో సూచించారు. టంగుటూరి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ప్రకటించిందన్నారు. ఉప విద్యాశాఖాధికారులు, మండల విద్యాశాఖాధికారులు, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు. -
తిండి బజార్లు
ఈ మధ్య తెలుగు భాషా వికాసానికి ఇంటర్నెట్లో జోరుగా చర్చలు సాగుతున్నాయి. నా ఉద్దేశం ఒక్క భోజనం విషయం లోనే తెలుగు వ్యాపారస్తులు గణనీయమైన పురోగతిని సాధిస్తున్నారని చెప్పగలను. మరీ తొలి రోజుల్లో భోజనశాలలు లేవు. కేవలం మాధవ కబళమే. లేదా ఉంచ వృత్తి. అడిగితే లేదనకుండా ప్రతివారూ ఒక కబళం పెట్టేవారు. కొందరు ఉదారంగా వారాలిచ్చేవారు. తరువాత వచ్చినవి పూటకూళ్లమ్మ ఇళ్లు. ఆవిడకి పేరు లేదు. ఆవిడ నరసమ్మయినా, లక్ష్మమ్మయినా పూట పూటకీ కూడు పెట్టే అమ్మే. గురజాడవారూ పూటకూళ్లమ్మకి పేరు పెట్టలేదు. టంగుటూరి ప్రకాశం పంతులుగారి తల్లిగారు పేరు సబ్బమ్మ. ఆవిడ పూటకూళ్లు పెట్టి కొడుకుకి చదువు చెప్పించారని విన్నాను. ఆమె కొడుకు ముఖ్యమంత్రి అయ్యాడు. దరిమిలాను సత్రాలు వచ్చాయి. కరివెనవారి సత్రం, ఉసిరికల సత్రం, గరుడా వారి సత్రం, కనకమ్మ సత్రం, సుంకువారి సత్రం - ఇలాగ. ఘంటసాల వంటి గాన గంధర్వుడిని పెట్టి పోషించిన మహారాజావారి సత్రం ఇప్పటికీ విజయనగరంలో ఉంది. తరువాత వచ్చిన హోటళ్లవారు ఇంత గొప్ప ఆలోచనల్ని చేయలేదని చెప్ప గలను. నా చిన్నతనంలో కోమల విలాస్, కొచ్చిన్ కేఫే, గణేష్ హోటల్, ఉడిపి హోటల్ బొత్తిగా నేలబారు పేర్లు. ఇప్పుడిప్పుడు భోజనశాలలు రుచుల్ని మప్పాయి. ఒక హోటల్ పేరు ‘పకోడీ’. నేనయితే పేరుకి మరికాస్త రుచిని జతచేసి ‘ఉల్లి పకోడీ’ అనేవాడిని. మరొక హోటల్ ‘అరిటాకు’. ఇంకొకటి ‘వంటకం’. ఇంకో హోటల్ ‘ఆవకాయ్’. మరీ కస్టమర్ల మన స్సుల్లోకి జొరబడిన వ్యాపారి తన దుకా ణాన్ని ‘ఇక చాలు’ అన్నారు. ఏమిచ్చినా ఎవరూ అనలేని మాట. తింటున్న ప్పుడు అలవోకగా వినిపించే మాట. ఇక ‘వంకాయ’ తెలుగువాడి జాతీయ వంటకం. ఒక వ్యాపారి తన హోటల్ని ‘వంకాయ’ అన్నాడు. బొత్తిగా నేల బారుగా ఉంటుందేమోనని మరొకాయన ఇంగ్లిషులో ‘బ్రింజాల్’ అన్నాడు. హైదరాబాదులో జూబ్లీహిల్స్‌లో ‘కారంపొడి’ అనే బోర్డు చూశాను. పక్కనే మరో హొటల్ ‘ఉలవచారు’. మరొక హొటల్ పేరు ‘గోంగూర’. ఈ లెక్కన ‘పప్పుచారు’, ‘కందిపప్పు’, ‘పనసపొట్టు’, ‘కొరివి కారం’, ‘చెనిక్కాయ పచ్చడి’కి చాన్సుంది. ఎవరెక్కడ ఏ మర్యాద చేసినా అత్తారింటికి సాటిరాదు. అందుకే ఒక హోటల్ పేరు ‘అత్తారిల్లు’. మరొకాయన అక్కడ ఆగక ఇంట్లోకే జొరబడ్డాడు - ‘వంటిల్లు’. అమెరికాలో తెలుగువారిని రెచ్చగొట్టే హోట ల్ని మా మిత్రుడొకాయన కాలిఫోర్నియాలో ప్రారంభించారు. ఆ పేరు చదవగానే తప్పిపోయిన మనిషి కనిపించినంత ఆనందం కలుగుతుంది. పేరు ‘దోశె’. మరొక దేశభక్తుడు తన హోటల్ని ‘జైహింద్’ అన్నాడు. ఓనరుని బట్టి పేరొచ్చిన హోటల్ ‘బాబాయి హోటలు’. తమిళులు ఈ విషయాల్లో వెనుకబడ్డారని తమరు భావిస్తే పొరబడ్డారనక తప్పదు. చెన్నైలో ఒక హోటల్ పేరు ‘వాంగో! సాపడలామ్’ (రండి, భోంచేద్దాం). కట్టుకున్న పెళ్లాం కూడా ఇంత ముద్దుగా పిలుస్తుందనుకోను. మరొకా యన కసిగా ‘కొల పసి’ అన్నాడు. కొలై అంటే చంపడం. పసి అంటే ఆకలి. ‘చంపుకు తినే ఆకలి’ హోటల్ పేరు. మరో హోటల్ ‘కాపర్ చిమ్నీ’ (రాగి గొట్టాం). ఈ లెక్కన ‘ఇత్తడి మూకుడు’, ‘ఇనుప తప్పేలా’, ‘సిలవరి బొచ్చె’ వంటి పేర్లకి అవకాశముంది. ఇంగ్లిష్‌వారు - దాదాపు అందరూ సినీమా ప్రియులు. నవలా సాహిత్యంలోనే తలమానికంగా నిలిచిన ‘టు కిల్ ఏ మాకింగ్ బర్డ్’ (రచయిత్రి హార్పర్ లీ ఈ మధ్యనే కన్నుమూసింది), హాలీవుడ్ సినిమాగా కూడా చాలా పాపులర్. ఆ పేరు ఒరవడిలో ‘టెక్విలా మాకింగ్ బర్డ్’ అని ఒక రెస్టారెంటు పేరు. టెక్విలా మెక్సికన్ మత్తు పానీయం. బ్రాడ్ పిట్ అనే పాపులర్ హీరో గారి పేరు గుర్తుకొచ్చేలాగ ఒకాయన ‘బ్రెడ్ పిట్’ అని తన హోటల్ పేరు పెట్టాడు. ‘ది గాడ్ ఫాదర్’ హాలీవుడ్లో చరిత్రను సృష్టించిన చిత్రం. ఒక రెస్టారెంటు పేరు ‘ది కాడ్ ఫాదర్’ అన్నారు. కాడ్ ఒక ప్రముఖమయిన చేప పేరు. ‘ప్లానెట్ ఆఫ్ ఏప్స్’ పాపులర్ చిత్రం. మిమ్మల్ని ఆకర్షించిందా? ‘ప్లానెట్ ఆఫ్ గ్రేప్స్’కి దయచెయ్యండి. ఇదీ మిమ్మల్ని అలరిస్తుంది. ఇంకొకాయన ‘పన్’లో ముళ్లపూడిని తలదన్నే మహానుభావుడు. Let us eat అంటే ‘భోంచేద్దాం’ అని పిలుపు. ఈయన తన హోటల్‌కి ‘లెట్టూస్ ఈట్’ (Lettuce Eat) అన్నాడు. లెట్టూస్ ఒకానొక ఆకుకూర. భాషకి జన్మస్థలం నోరు. నోటినుంచి వచ్చే భాషనీ, వ్యాకరణాన్నీ, ధ్వనినీ, వ్యంగ్యాన్నీ సంధించి ఊరించే వ్యాపారులు ఇటు భాషకీ, దానిని ఉద్ధరిస్తున్న మనకీ గొప్ప ఉపకారాన్ని చేస్తున్నారని మనం గర్వపడాలి. - గొల్లపూడి మారుతీరావు -
వైఎస్ఆర్ సీపీ కార్యాలయంలో ప్రకాశం జయంతి వేడుకలు
హైదరాబాద్ : లోటస్‌పాండ్‌లోని వైఎస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో స్వాతంత్ర్య సమరయోధుడు, ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యాలయంలోని ప్రకాశం పంతులు చిత్ర పటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ రాజకీయ కార్యదర్శి ఎస్. రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే రోజా, పార్టీ నేత విజయ్చందర్తోపాటు పలువురు పూలమాల వేశారు. స్వాతంత్ర్య సమరయోధుడిగా.... న్యాయవాదిగా... ముఖ్యమంత్రిగా ప్రకాశం పంతులు చేసిన సేవలను వారు ఈ సందర్భంగా స్మరించుకున్నారు. -
ఘనంగా టంగుటూరి జయంతి
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 142వ జయంతి వేడుకలను శనివారం స్థానిక ఆంధ్ర ప్రదేశ్ భవన్లో ఘనంగా నిర్వహించారు. ఏపీ భవన్ వద్ద ఉన్న టంగుటూరి విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం భారత ఎన్నికల మాజీ కమిషనర్ జి.వి.జి.కృష్ణమూర్తి ఈ వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ ఆడిటోరియంలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ పంతులు గారితో, గాంధీజీతో తాను గడిపిన చిన్న నాటి రోజులను గుర్తు తెచ్చుకున్నారు. రాజ్యసభ సభ్యుడు జేడీ శీలం మాట్లాడుతూ ప్రకాశం పంతులు తెలుగువారు గర్వించదిగన మహనీయుడని పేర్కొన్నారు. టంగుటూరి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా జరుపుకోవడం సంతోషకరమని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ సతీష్ చంద్ర పేర్కొన్నారు. ఏపీ భవన్ ప్రత్యేకాధికారి అర్జ శ్రీకాంత్ ప్రారంభోపాన్యాసం చేస్తూ సైమన్ కమిషన్ గో బ్యాక్ అంటూ తెలుగు వారి సాహసాన్ని చూపారని టంగుటూరిని కొనియాడారు. ఈ కార్యక్రమానికి దేశ రాజధానిలోని వివిధ తెలుగు సంస్థల ప్రతినిధులు మణినాయుడు, ఎస్.వి.ఎల్.నాగరాజు, సుశీలాదేవి, సత్యప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సభ అనంతరం నిర్వహించిన రక్తదాన శిబిరంలో పలువురు రక్తదానం చేశారు. -
స్వాతంత్ర్య పోరాటంలో తెలుగుయోధులెందరో!
ఆంగ్లేయుల పాలన నుంచి భారత దేశ విముక్తి కోసం ఎంతో మంది పోరాడారు. ఆ పోరాటంలో తెలుగువారు భోగరాజు పట్టాభి సీతారామయ్య, పింగళి వెంకయ్య, దుర్గాబాయి దేశ్‌ముఖ్, కొండ వెంకటప్పయ్య, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య..... మేము సైతం అంటూ పాల్గొన్నారు. భోగరాజు పట్టాభిసీతారామయ్య : భారత జాతీయోద్యమ సమయంలో గాంధీజీచే ప్రభావితుడై స్వాతంత్ర్య ఉద్యమంలో చేరారు. అనతి కాలంలోనే గాంధీ మహత్ముడికి సన్నిహితుడై కాంగ్రెస్‌లో ప్రముఖ స్థానం పొందారు. 1948లో జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత పార్లమెంటు సభ్యుడిగా, మధ్యప్రదేశ్ రాష్ట్ర గవర్నర్‌గా పనిచేశారు. కృష్ణా జిల్లా ముఖ్య కేంద్రమైన మచిలీపట్నంలో ఆయన ఆంధ్రాబ్యాంక్‌ను స్థాపించారు. నాటి కృష్ణా జిల్లాలోని గుండుగొలను గ్రామం (ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా)లో భోగరాజు పట్టాభి సీతారామయ్య జన్మించారు. పింగళి వెంకయ్య : దేశానికి పతాకాన్ని అందించిన యోధుడు పింగళి వెంకయ్య. ఈయన కృష్ణాజిల్లా మచిలీపట్నం సమీపంలోని మొవ్వ మండలం భట్లపెనుమర్రులో వెంకయ్య జన్మించారు. చిన్నతనం నుంచి చురుగ్గా ఉండే ఆయన.. దక్షిణాఫ్రికాలో బోయర్ యుద్ధంలో పాల్గొన్నాడు. అక్కడే మహాత్మాగాంధీని కలిశాడు. భారత్ వచ్చిన వెంకయ్య... ఆ తర్వాత జెండా రూపొందించాలనే తలంపుతో 1916 లో "భారతదేశానికొక జాతీయ జెండా " అనే పుస్తకాన్ని ఇంగ్లీషులో రాసి ప్రచురించారు. ఆయన రూపొందించిన నాటి పతాకమే నేటి త్రివర్ణ జాతీయ జెండాగా రూపొందింది. దుర్గాబాయి దేశ్‌ముఖ్ : భారతీయ స్వాతంత్ర సమరయోధురాలు, న్యాయవాది, సామాజిక కార్యకర్త.. ఇలా భిన్న పార్శ్వాలున్న వ్యక్తి దుర్గాబాయి దేశ్‌ముఖ్. 1909, జులై 15న ఆమె తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. పదేళ్ల వయసులోనే హిందీ పాఠశాలను నెలకొల్పి అన్ని వయసులవారికీ బోధించేవారు. చిన్ననాటి నుంచే స్వాతంత్ర్య పోరాటంలో పాలుపంచుకుంది. తెలుగుగడ్డ పై మహాత్మా గాంధీ రాకను పురస్కరించుకుని 12 ఏళ్ళ వయసులోనే ఈమె విరాళాలను సేకరించి ఆయనకు అందజేసింది. మహాత్ముని సూచన మేరకు మారు ఆలోచించకుండా తన చేతులకు ఉన్న బంగారు గాజులను కూడా విరాళంగా అందించింది. మహాత్ముడు ఆంధ్రదేశంలో పర్యటించినప్పుడు ఆయన ప్రసంగాలను దుర్గాబాయి తెలుగులోకి అనువదించేవారు. 1953లో ఆర్థికమంత్రి చింతామణి దేశ్ ముఖ్ తో వివాహం జరిగింది. కొండా వెంకటప్పయ్య : కొండా వెంకటప్పయ్య ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, దేశభక్త బిరుదాంకితుడు. ఇంకా చెప్పాలంటే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రోద్యమానికి ఆద్యుడు. 1866 ఫిబ్రవరి 22వ తేదీన పాత గుంటూరులో కొండా వెంకటప్పయ్య జన్మించాడు. సహాయ నిరాకరణోద్యమం రోజులలో బీహార్‌కు డాక్టర్ రాజేంద్రప్రసాద్, తమిళనాడుకు రాజాజీ ఎలాంటివారో ఆంధ్రదేశానికి కొండా వెంకటప్పయ్య అలాంటివాడు. దుగ్గిరాల గోపాల కృష్ణయ్య : రామదండు అనే దళాన్ని స్థాపించి.. చీరాల - పేరాల ఉద్యమంతో ఒక్కసారిగా జాతీయస్థాయిలో పేరుప్రఖ్యాతులు సంపాదించిన వ్యక్తి ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాల కృష్ణయ్య. ఈయన1889 జూన్ 2 న కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలులో జన్మించారు. 1921 లో సహాయనిరాకరణోద్యమ సందర్భంగా గాంధీగారి ఉపన్యాసాలను అనువదించినందుకు ప్రభుత్వం ఈయనకు ఇచ్చిన భూమిని రద్దుచేసింది. సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొని ఏడాది పాలు తిరుచిరాపల్లి జైల్లో ఉన్నారు. 1923 లో అఖిలభారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. చీరాలపేరాలలో సమాంతర ప్రభుత్వాన్ని నిర్వహించిన ఘనత ఆయనదే. టంగుటూరి ప్రకాశం పంతులు : సుప్రసిద్ధ స్వాతంత్ర్య సమర యోధుడు మరియు ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు. నిరుపేద కుటుంబంలో పుట్టి, ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగి, మళ్లీ మరణించే సమయానికి కట్టుబట్టలతో మిగిలిన నిజాయితీపరుడు. 1940, 50లలోని ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ప్రముఖంగా వెలుగొందారు. ప్రత్యేకాంధ్ర రాష్ట్ర సాధనలో నిర్ణాయక పాత్ర పోషించాడు. మద్రాసులో సైమన్ కమిషన్ వ్యతిరేక ప్రదర్శనలో తుపాకి కెదురుగా గుండె నుంచి ఆంధ్రకేసరి అని పేరు పొందారు.