తెలుగును ప్రాచీన భాష నుంచి ప్రపంచ భాష చేయాలన్న తపనతో విశేష కృషి చేస్తున్న సిలికానాంధ్ర మనబడి, మన తెలుగును అమెరికాలో ఎక్కువమంది నేర్చుకొనేలా, తెలుగుపై మక్కువ కలిగించటానికి, వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టింది.
న్యూయార్క్: తెలుగును ప్రాచీన భాష నుంచి ప్రపంచ భాష చేయాలన్న తపనతో విశేష కృషి చేస్తున్న సిలికానాంధ్ర మనబడి, మన తెలుగును అమెరికాలో ఎక్కువమంది నేర్చుకొనేలా, తెలుగుపై మక్కువ కలిగించటానికి, వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టింది. కాలిఫోర్నియాలోని బే ఏరియా ప్రాంతంలో తెలుగువారు నివసించే ప్రాంతాలయిన సన్నివేల్, శాన్ జోస్, క్యుపర్టినో ,శాంతా క్లారా, ఫ్రే మాంట్, శాన్ రామోన్, ప్లజంటన్ నగరాల్లో మనబడిలో చేర్పించండి.. తెలుగు భాష నేర్పించండి' అనే నినాదాలతో బస్సులు, రైళ్ళపై వ్రాసిన పెద్దపెద్ద ప్రకటనలు అందరిని ఆకర్షిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మనబడి ఉపాధ్యక్షుడు దీనబాబు కొండుభట్ల మాట్లాడుతూ తాము చేపట్టిన ఈ కార్యక్రమం అమెరికాలో నివసించే తెలుగువారినే కాకుండా భారతీయులను ఇతర జాతీయులను కూడా ఆకర్షిస్తోందని, రోజు సమాచారం కోసం వారు చేస్తున్న ఫోన్ కాల్స్ అందుకు నిదర్శనం అని చెప్పారు.
ఇక మనబడి డీన్ రాజు చమర్తి మాట్లాడుతూ, భారత్ కు వెలుపల నివసిస్తున్న తెలుగువారంతా తమ పిల్లలు అమ్మ భాష తెలుగును తప్పకుండా నేర్చుకునేలా ప్రోత్సాహించి, తరతరాల భాష మనుగడకు వారి వంతు భాద్యతను పోషించాలని అభ్యర్థించారు. పొట్టి శ్రీరాములు విశ్వ విద్యాలయం గుర్తింపుతోపాటు, అమెరికాలోని వేక్ కౌంటీ మరియు ఫ్రేమాంట్ యూనిఫైడ్ స్కూల్ డిస్ట్రిక్ట్ వారి గుర్టింపు పొంది,1000 మందికి పైగా స్వచ్ఛంద భాషా సైనికులతో అమెరికాలోని 35 రాష్ట్రాలు,12కి పైగా దేశాలలో దాదాపు 4500 మంది విద్యార్ధులకు తెలుగు వ్రాయడం, చదవటం, మాట్లాడటం నేర్పిస్తున్న సిలికానాంధ్ర మనబడి 2015-16 విద్యా సంవత్సరానికి సెప్టెంబర్ 12 నుంచి తరగతులు ప్రారంభించటానికి ఏర్పాట్లు పూర్తి చేసిందని తెలిపారు. పిల్లలను మనబడిలో చేర్పించాలనుకొనే తల్లితండ్రులు manabadi.siliconandhra.org ని వెంటనే సందర్శించ వలసిందిగా కోరారు.