అమ్మ భాషంటే కంటగింపా?
రెండో మాట
‘ఒక భాషను నిత్యం వాడుకలో పెట్టుకోనప్పుడు, సంభాషణల్లో, తమ భాషీయుల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలలో మాతృభాషను వాడే వారి సంఖ్య అధికంగా తగ్గిపోతున్నప్పుడు లేదా తన భాషను ఒక తరం మరొక తరానికి వారసత్వంగా అందించగల స్థితిలో లేనప్పుడూ ఆ భాష ఉనికి కాస్తా ప్రమాదంలో పడినట్లే లెక్క’ అని యూనెస్కో చాటింది. అందుకని తక్షణం జరగవలసిన పని ప్రభుత్వ, ప్రయివేట్ స్కూళ్లు అన్న తేడా లేకుండా రెండింటా మాతృభాషా మాధ్యమంలో బోధనను తప్పనిసరి చేయాలి.
‘‘తెలుగు రాష్ట్రాల్లోని పాఠశాలల్లో పిల్లలకు ప్రావీణ్యంగల ఉపాధ్యాయులు తల్లి భాషలో బోధించడమే ఉత్తమమైన విధానమని భాషా నిపుణులు భావిస్తున్నారు. అయినా, తల్లిదండ్రుల దృష్టి వేరే విధంగా ఉండి తమ పిల్లల్ని ఇంగ్లిష్ భాషా మాధ్యమంలో బోధిస్తున్న స్కూళ్లలోనే పెద్ద సంఖ్యలో చేరుస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో తల్లి భాషైన తె లుగును పక్కకు నెట్టేసి ఇంగ్లిష్‌ను ముందుకు నెడుతున్నారు. 2013-2016 మధ్య ఇంగ్లిష్ మాధ్యమంలో ఎస్‌ఎస్‌సీ పరీక్షలు రాసిన విద్యార్థుల సంఖ్య 60 వేలకు పెరిగితే అదే సమయంలో తెలుగు మాధ్యమాన్ని ఎంపిక చేసుకున్నా వారి సంఖ్య 40 వేలకు పడిపోయింది! ’’ వార్తలు (28-2-2016)
దాదాపు 3,000 సంవత్సరాల చరిత్ర ఉండే తెలుగు జాతి తన మాతృ భాషను ప్రాథమిక, మాధ్యమిక, కళాశాల, పట్టభద్ర, పట్టభద్రానంతర విద్యా స్థాయిలలోనూ, వ్యవహారశైలిలోనూ కాపాడుకోలేక పోవడానికి కారణమేమై ఉంటుందని పైన తెల్పిన విపరిణామం ప్రశ్నిస్తోంది. ఈ ప్రశ్నకు జవాబు సరిగ్గా 13 ఏళ్లనాడే, ఈ మాసంలోనే ఐక్యరాజ్య సమితి విద్యా, సాంస్కృతిక శాఖ చేసిన ప్రకటనలో దొరుకుతుంది! 21వ శతాబ్దం ముగిసిపోయే నాటికే విభిన్న చరిత్రలు గల అనేక ప్రపంచ దేశాల మాతృభాషలకు ‘కాలం మూడబోతోందని’ ఆ సంస్థ హెచ్చరించి ఉందని మరచిపోరాదు. ఎందుకంటే, సామ్రాజ్య పెట్టుబడిదారీ వ్యవస్థలు తీవ్ర ఆర్థిక సంక్షోభాల మధ్య నలిగిపోతున్నందున, ఆ వ్యవస్థలను బతికించుకోవాలంటే ఆ సంక్షోభాల వలలోకి బడుగు వర్ధమాన స్వతంత్ర దేశాలను కూడా లాగాలి! తమ సరుకులను ఈ దేశాలకు భారీ స్థాయిలో ఎగుమతులు చేసి ఆ ‘సంతల’ స్వాధీనం ద్వారా రాజకీయ పెత్తనం మరి కొన్నేళ్లు నిలబెట్టుకోవడానికి ‘‘సరళీకృత’’ ఆర్థిక విధానాలను ప్రపంచంపై అవి రుద్దాయి. ‘తాటితోనే దబ్బనం’ అన్నట్టు ఈ సామ్రాజ్యవాద పెట్టుబడిదారీ దేశాలు లాభాల వేటలో భాగంగా వర్ధమాన దేశాల ప్రజల భాషా మాధ్యమాన్ని కూడా (ఇంగ్లిష్ మాధ్యమం ప్రవేశపెట్టి) మార్చి వేయాలి.
అమ్మ భాషలకు అంగ్రేజీ గండం
ఈ పరిణామం ఫలితంగానే క్రమక్రమంగా 7,000 ప్రపంచ భాషలలో సగానికి పైగా అంతరించాయనీ, కింది స్థాయిలో ఇంగ్లిష్ మాధ్యమం వ్యాప్తి వల్ల మాతృ భాషల ఉనికి మూలాలే దెబ్బ తినబోతున్నాయనీ ‘‘యునెస్కో’’ నిపుణుల పారిస్ సమావేశం హెచ్చరించింది. ఇంగ్లిష్ మాధ్యమం వల్ల మాతృభాషా మాధ్యమానికి, జాతుల తల్లి భాషలకు ప్రమాదం ఉండబోదని ‘విశాల హృదయం’తో భావించేవారు ఇప్పటికైనా తమ అభిప్రాయాన్ని మార్చుకొనక తప్పదని గ్రహించాలి. మన దేశానికి చెందిన విద్యాధిక శ్రేణులలోని కొందరు సహా అనేక దేశాల భాషా నిపుణులు, ఆచార్యులు, పాఠ్య ప్రణాళిక పరిశోధకులు పరభాషా మాధ్యమాన్ని ‘వ్యాపార’ కళగా చూడగల్గుతున్నారు. 2013-2016 మధ్య గత నాలుగేళ్ల వ్యవధిలోనే ఎస్‌ఎస్‌సీ ఇంగ్లిష్ మాధ్యమంలో చదివేవారి సంఖ్య పెరుగుతూ, ప్రభుత్వ తెలుగు స్కూళ్లలో తెలుగు మాధ్యమం కనుమరుగైపోవటం ఆందోళనకరం.
మన పాత తరాల విద్యావంతులంతా ఉభయ భాషలూ నేర్చినవారే. ఎస్‌ఎస్‌సీతో విద్యాభ్యాసం ముగించిన పెద్దలు కూడా ఈనాటి పోస్ట్ గ్రాడ్యుయేట్ల కన్నా ఇంగ్లిష్‌లో పరిశుద్ధంగా మాట్లాడగలుగుతున్నారు. వారు తెలుగు భాషా మాధ్యమంలో మాధ్యమిక విద్యను అభ్యసించడం అందుకు ఒక ప్రధాన కారణం. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఇది గుర్తించి... ప్రాథమిక, మాధ్యమిక దశల్లోనే గాక, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ దశల్లో కూడా (ఇంజనీరింగ్, మెడిసిన్‌తో సహా) విద్యార్థులు మాతృభాషా స్పృహను కోల్పోకుండా కన్నడ సజీవశక్తిగా వర్ధిల్లే కనీస ఏర్పాట్లు చూసుకున్నారు.
‘పరభాషలో నవ్వలేను, ఏడ్వలేను’
భాషాపరమైన పరాయీకరణకు అలవాటు పడిన పాలకులకు, వారి పనుపున డూడూ బసవన్నలుగా ఉనికిని కాపాడుకునే కొందరు విద్యావేత్తలకు ఒక పాఠంగా యునెస్కో.. మాతృభాషల ప్రాధాన్యాన్ని ఇలా నినాదంగా వినిపించ వలసి వచ్చింది. ‘నేను నా అభిమాన భాషనే మాట్లాడతా/నేనిలా ఉన్నానంటే నా భాషే కారణం/మా తల్లి భాషలోనే మా బిడ్డలకు నేర్పుతాం/ అసలు తామంటూ ఎవరో తెలియడం వారికి అవసరం గనక ’’! అంతే కాదు. ‘నవాజో’ జాతి పెద్దలు తమ పిల్లలకు మనిషి ఉనికి రహస్యాన్ని తెలుపడానికి ఉపయోగించే ఈ సామెతను కూడా అది 13 ఏళ్ల క్రితమే ఇలా ప్రచారంలో పెట్టింది. ‘నీవు శ్వాసించకపోతే గాలి లేనట్లే/నీవు నీ భాషలో మాట్లాడకపోతే ఈ ప్రపంచం లేనట్లే’! ఫ్రెంచి పదాలను వాడుకోకుండా పరాయి భాషా పదాలను వాడితే ఫ్రెంచ్ ప్రభుత్వం భారీ జరిమానా విధిస్తుందట. అలాగే మెక్సికన్‌లలో తల్లి భాషలోగాక, ఎరువు తెచ్చుకున్న భాషలో మాట్లాడితే నీ పేగు బంధాన్ని ఎక్కడ పాతిపెట్టావురా? అని ఎద్దేవా చేస్తారట.
పానుగంటి లక్ష్మీనరసింహారావు సాక్షి వ్యాసాల ద్వారా తల్లి భాషను ఎందుకు నిర్లక్ష్యం చేయరాదో, చేస్తే రాబోయే నష్టాలేమిటో చాలా వ్యంగ్యంగా చెప్పారు. ‘‘ఆంగ్లేయ భాష యేల చదువుకొంటివని నేను అధిక్షేపించను. ఇంతకన్న అధిక జ్ఞానమును కూడ నీవు ఆ భాషలో సంపాదింపుము.
ఆంగ్లేయ భాషయే కాదు. ఇంకా అనేక భాషలు కూడా నేర్చుకొనుము. నీ భాషకు వన్నె పెట్టుకొనుము. కానీ, ఆంధ్రుడివై ఉండియు ఆంధ్ర భాషలో ఆ అని నోరే మెదపలేనివాడవు కావద్దు. నాయనలారా, మనమెంత లక్షాధికారులమైనను, కోటీశ్వరులమైనను మన బతుకులు ముష్టి బతుకులే గాని మరియొకటి కాదు. ఈ ముష్టి దేవులాటలో వారి ఇంగ్లీష్ మాటలు కూడా ఎందులకు? ఆ ఏడుపేదో మాతృభాషతోడనే ఏడ్చిన మంచిది కాదా? మన ఏడుపు సహజంగానూ, సొంపుగానూ, స్వతంత్రముగానూ ఉండునే. ఏడుపులో కూడా మనకీ అస్వతంత్రత ఏమి ఖర్మము? పుట్టుక చేతనే కాక, బుద్ధి చేత, స్వభావం చేత, యోగ్యత చేత, ఆంధ్రులని అనిపించుకొనుడు’’ అని ఆయన హితవు చెప్పాడు.
‘‘అన్యభాషలు నేర్చి ఆంధ్రభాష రాదని సకిలించే ఆంధ్రుడా చావవెందుకురా’’ అని ప్రజాకవి కాళోజీ ధర్మాగ్రహంతో ప్రశ్నించాడు. తాజాగా కవి ఛాయారాజ్ ‘‘నా ప్రేమ, నా అభిమానం, మిత్రులకు అర్థం కావాలి/నా ఆగ్రహం, నా ఆవేశం శత్రువులకు అర్థం కావాలి/నా శ్రమ, నా శక్తీ నా భాషలోనే వ్యక్తం కావాలి/పుట్టుక దగ్గర, చావుదగ్గర పరభాషలో నవ్వలేను, ఏడ్వలేను’’! అందుకే ఈ మాతృభాషా రసాయనిక ప్రక్రియను అర్థం చేసుకున్న తర్వాతనే గాంధీ, విశ్వకవి రవీంద్రుడూ మాతృభాషలో పాలన, మాతృభాషలో బోధన, మాతృభాషలో న్యాయ స్థానాల తీర్పుల అవసరం గురించి నొక్కి చెప్పవలసి వచ్చింది.
మళ్లీ మాతృ భాషా ఉద్యమం
ఒకనాడు గిరీశం (కన్యాశుల్కం) తెల్లవాళ్ల స్కూళ్లలో తెలుగు మీద ఖాతరీ లేదండీ అని ఫిర్యాదు చేశాడు గానీ, ఇప్పటి తెలుగోళ్ల పాలనలో కూడా ఇంగ్లిషు మాధ్యమం బడుల్లోనే కాదు, తెలుగు బడుల్లో కూడా వానాకాలం చదువులేననే అభిప్రాయం ప్రబలంగా ఉంది. ఉపాధ్యాయుల శిక్షణలోనూ అదే ధోరణి. ఉపాధి మిషపైన, టెక్నాలజీ పేరిట, ఇళ్లలో తల్లిదండ్రుల ధోరణీ ఇదే అమ్మా, నాన్న పదాలను భాషా మ్యూజియం వస్తువులుగా మార్చాం. తెలుగువాడు తన మాతృభాషా పరిరక్షణ కోసం నేటికి ఎందుకింత తపన పడవలసి వస్తోందో, ఉద్యమాలు చేయవలసి వస్తోందో ఒక్కసారి దృష్టి సారించాల్సి ఉంది. ఒకనాడు ఇంగ్లిష్ భాషపై గ్రీకు, లాటిన్ ఫ్రెంచ్ భాషల పెత్తనాన్ని వదిలించుకోవడానికి ఇంగ్లండ్ ప్రజలకు 300 సంవత్సరాలు పట్టిందని మరవరాదు. నేడు మనమూ అలాంటి దుస్థితిలోనే ఉన్నాం.
దేశీయ భాషల ఉన్నతిని, విద్యా, పాలనా స్థాయిల్లో మాతృభాషల వాడకాన్ని విస్తృతం చేయడానికి పాలకులు శ్రద్ధ చూపక పోవడానికి అసలైన కారణం ఉంది. బ్రిటిష్ పాలకుల విధానాలను వ్యతిరేకించేవారిపైన దేశద్రోహ నేరాన్ని (సెడిషన్) మోపడానికి కారకుడైన లార్డ్ మెకాలే దొరే గుమాస్తాగిరీ విద్యా విధానానికి పాదులు తీస్తూ (మినిట్ ఆఫ్ డిసెంట్) ‘మా తిండికి, మా వేషభాషలకు అలవాటు పడిన భారతీయులు మా ఇంగ్లిష్‌వారికి శాశ్వతంగా బానిసలుగా పడి ఉంటారు’ అన్నాడు. ఈ ప్రకటనకు మనం ఇప్పుడు ఆమోద ముద్ర వేస్తున్నామా? అందుకే ఒక భాషను కోల్పోవడమంటే దాని చుట్టూ అల్లుకున్న ప్రకృతిని, సంస్కృతిని, పద సంపదనూ కోల్పోవడమేనని ప్రపంచ భాషా శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు కోడై కూస్తున్నారు. ఈ విషయంలో యునెస్కో మరొక అమూ ల్యమైన హెచ్చరికను కొసమెరుపుగా పేర్కొనక తప్పదు. ‘ఒక భాష తాలూకు భాషీయులు ఆ భాషను నిత్యం వాడుకలో పెట్టుకోనప్పుడు, సంభాషణల్లో, తమ భాషీయుల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలలో మాతృ భాషను వాడే వారి సంఖ్య అధికంగా తగ్గిపోతున్నప్పుడు లేదా తన భాషను ఒక తరం మరొక తరానికి వారసత్వంగా అందించగల స్థితిలో లేనప్పుడూ ఆ భాష ఉనికి కాస్తా ప్రమాదంలో పడినట్లే లెక్క’ అని చాటింది. అందుకని తక్షణం జరగవలసిన పని ప్రభుత్వ, ప్రయివేట్ స్కూళ్లు అన్న తేడా లేకుండా రెండింటా మాతృభాషా మాధ్యమంలో బోధనను తప్పనిసరి చేయాలి.
ఏబీకే ప్రసాద్, సీనియర్ సంపాదకులు.. abkprasad2006@yahoo.co.in