మాతృభాషకు మరణ శాసనం | special story on Mother tongue and telugu language | Sakshi
Sakshi News home page

మాతృభాషకు మరణ శాసనం

Published Tue, Jan 10 2017 1:49 AM | Last Updated on Mon, Oct 8 2018 3:56 PM

మాతృభాషకు మరణ శాసనం - Sakshi

మాతృభాషకు మరణ శాసనం

రెండో మాట
అసలు విషయం–తెలుగు భాషకు ఎట్టకేలకు విశిష్ట భాషా ప్రతిపత్తి దక్కిందని పరమానంద భరితులమవుతున్న సందర్భంలో, మద్రాసు హైకోర్టులో ఒక తమిళుడు మన భాషా ప్రతిపత్తికి అడ్డుతగలడానికి ప్రయత్నించి విఫలమైనందుకు సంతోషిస్తున్న సమయంలో కూడా మనం విశ్రమించలేక పోతున్నాం. ఎందుకంటే, ప్రపంచ బ్యాంకు ప్రజా వ్యతిరేక సంస్కరణల కత్తుల బోనులో ‘ప్రభుత్వం’ అనే శక్తి చిక్కుబడిపోయింది. మాతృభాషను పెంచుకోవాలి, అన్యభాషల్ని గౌరవించాలి.

‘ప్రపంచ భాషల పాలపుంతలో ప్రతి అక్షరమూ, ప్రతి పదమూ ఒక నక్షత్రమే. ప్రపంచీకరణ నేపథ్యంలో అంతరించిపోతున్న వందలాది భాషల సంరక్షణ, ఉద్ధరణ ఉమ్మడి బాధ్యతగా అందరూ భావించవలసిన తరుణం వచ్చింది.’
– ఐక్య రాజ్యసమితి విద్యా సాంస్కృతిక మండలి ఆదేశం

ప్రభుత్వ మునిసిపల్‌ పాఠశాలలన్నింటిలోనూ తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా రద్దు చేస్తూ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జీవో ఎంఎస్‌ నం. 14 ఉత్తర్వును జారీ చేసింది. ఒక్క 2016–17 విద్యా సంవత్సరంలో పదవ తరగతికి మాత్రం ఈ జీవో వర్తించదు.

చదవేస్తే ఉన్న మతి పోయిందన్నట్టు, ఒకటో తరగతి నుంచి పదవ తరగతి వరకు తెలుగు మాధ్యమానికి చీడపీడలు పట్టించడానికి రెండు తెలుగు రాష్ట్రాల పాలకులూ కారకులు కావడమే విషాదం. మన మాతృభాషతో ఉన్న మాధ్యమాన్ని నవనవంగా పెంచుకుంటూ, వాక్కును నిత్య వాడకంలో సునిశితం చేసుకుంటూ తెలుగును అభివృద్ధి చేసి, పరిరక్షించవలసిన వాస్త వాన్ని వారు నిర్దాక్షిణ్యంగా నిరాకరిస్తున్నారు.

ప్రపంచీకరణ మత్తు
ఐక్య రాజ్యసమితి సకాలంలో చేసిన హెచ్చరికలను కొందరు పాలకులు పట్టిం చుకోకపోవడానికి కారణం ఉంది. మార్కెట్‌ దోపిడీ ఆర్థిక వ్యవస్థకు ఆంగ్లో– అమెరికన్‌ సామ్రాజ్య పెట్టుబడి వ్యవస్థలు తెర తీసి, వర్ధమాన దేశాలను ప్రపంచీకరణ మత్తులోకి దించడంతో పలు సమూహాల మాతృభాషల మీద ఇంగ్లిష్‌ పెత్తనం తీవ్రమైంది. వేల ఏళ్లుగా ఉనికిలో ఉన్న స్థానిక భాషల మనుగడ ప్రశ్నార్థకం కావడం దాని ఫలితమే. విస్తృత ప్రపంచీకరణ నేప థ్యంలో ఆంగ్ల మాధ్యమం ఎంత వి«ధ్వంసానికి కారణమవుతున్నదో ప్రపంచ శాస్త్రవేత్తలు నిర్వహించిన సర్వే, విశ్లేషణల వల్ల సులభంగానే అవగతమవు తోంది. వివిధ దేశాలకు చెందిన 600 మాతృభాషల వృద్ధిక్షయాల గురించి చేసిన విస్తృత అధ్యయనమది.

మాతృభాషకు ఆఫ్రికా ఖండమే జన్మనిచ్చిం దని కూడా వారు నిర్ధారించారు. ఆ ఖండంలో రాతియుగం నాటి ప్రజలు వాడిన మాండలీకం కూడా అదేనని కనుగొన్నారు. ఆ భాషకు కనీసం లక్ష ఏళ్ల క్రితం లిపి ఏర్పడి ఉంటుందని మొదట భావించినా, నిజానికి అది మరింత పురాతనమైనదేనని తేల్చారు. అయితే భాషలు దేనికవే వివిధ ఖండాలలో స్వతంత్రంగా కూడా స్థిరపడ్డాయి. 70 వేల సంవత్సరాల నాడే ఆఫ్రికా ఖండం నుంచి మిగిలిన భూభాగాలకు వలసలు జరిగాయనీ, అయితే అన్ని ప్రపంచ భాషలూ ఏకైక పురాతన భాష నుంచి జాలువారినవేనని కూడా శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంతోనే దేశీయ భాషల మనుగడను ఆంగ్లం హరించివేయడాన్ని ఎవరూ సమ్మతించలేకపోతున్నారు.

ఇప్పుడు జనాభా రీత్యా చైనా ప్రపంచంలోనే అత్యంత పెద్ద దేశం. అయినా పురాతన చరిత్ర కలిగిన పలు భాషలకు మంగళం పాడిన ఆంగ్లం సహా, ఇతర దేశీయ భాషల మీద చైనీస్‌ (మండారిన్‌) ఆధిపత్యం చలాయిం చజాలదు. కానీ ఇంగ్లిష్‌ మాదిరిగానే వ్యాపార, వలస భాష కాగలదు. ఈ తెలివిడితోనే అమెరికా, బ్రిటన్, జర్మనీలు  చైనీస్‌ను శరవేగంగా నేర్పడానికి ఐదేసి వందల పాఠశాలలను ప్రారంభించిన సంగతిని విస్మరించరాదు. ఏ దేశమైనా ఆర్థికంగా బలోపేతమై దూసుకువచ్చినా, ఆ దేశ భాష మన దేశీయ మాతృభాషల స్థానాన్ని తొలగించి నిలబడలేదు. కాగా ఈ చారిత్రక సత్యాన్ని దేశీయ భాషలు మాట్లాడే ప్రాంతాలు త్వరగా గుర్తిస్తే మంచిది. పూర్తిగా పరాయి భాషను నెత్తిన పెట్టుకుని మాతృభాష మూలాలకు ఏ రీతిలో చేటు చేస్తున్నామో అప్పుడే అర్థమవుతుంది. ఆ మూలాలకు చేటు కలగని వ్యూహ రచనలో మాతృ ప్రతిపత్తిపైన సాధికారతను పునఃప్రతిష్టించుకోవాలి.

అంతా ఇంగ్లిష్‌లోనే ఉందట
మార్కెట్‌ లేదా సంత రాజకీయాలతో తమ ఆర్థిక గుత్తాధిపత్యాన్ని విస్తరిం చుకోవడానికి ఆంగ్లో–అమెరికన్లు ప్రపంచీకరణ ద్వారా వర్ధమాన దేశాల గ్రామసీమలను తమ సరుకులతో నింపడానికి ఇంగ్లిష్‌ మాధ్యమం ద్వారానే ‘వల’పన్నవలసి ఉంటుంది. మన చేతలను కట్టడి చేసి, మన బుద్ధులను శాసిస్తూ, మన దుస్తులను మార్చేసే సూత్రం మెకాలే విద్యా విధానం ద్వారా తెల్లవాడు ప్రవేశపెట్టాడు. అందుకే, ‘మన దుస్తులకూ, మన అలవాట్లకూ, మన తిండికీ అలవాటు పడిన భారతీయుడు మనకు శాశ్వతంగా లొంగి ఉంటాడు’ అంటూ మెకాలే ప్రకటించగలిగాడు. ఇంగ్లిష్‌ మాధ్యమాన్ని ఇప్పుడు మళ్లీ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల స్థాయిలో కూడా ప్రవేశపెట్టడా నికి చెబుతున్న కారణం కూడా చిత్రంగా ఉంది. నిజం చెప్పాలంటే ఈ నిర్ణయం కొద్దిమంది విద్యార్థుల కోసమే గానీ, అసంఖ్యాక గ్రామీణ, పట్టణ ప్రాంత పేద విద్యార్థుల అభివృద్ధి కోసం కాదు. ‘విద్యార్థులు, ఉపాధ్యా యులు, సాధారణ ప్రజానీకం యావత్తూ ఆంగ్ల మాధ్యమాన్నే ఉత్సాహంగా సమర్థిస్తున్నారు.

అన్ని మునిసిపల్‌ పాఠశాలల్లోను విద్యార్థులకు ఫౌండేషన్‌ కోర్సును విధిగా ఆంగ్ల మాధ్యమంలోనే బోధించాలని తల్లితండ్రులు, ఉపా ధ్యాయులు కోరుకోవడం వల్ల ఆ మాధ్యమాన్ని ప్రవేశపెట్ట వలసి వచ్చింది. విద్యార్థుల భవిష్యత్తును దిద్దడంలో ఆంగ్ల బోధనా మాధ్యమం అత్యంత కీలక పాత్ర వహిస్తుంద’ని చంద్రబాబు నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తాజా జీవో (ఎంఎస్‌ నం.14)లో నిస్సిగ్గుగా ప్రకటించారు. మాతృభాషా రక్షణ ధ్యేయంతో అంతకు ముందు తీసుకువచ్చిన జీవో 86 దీనితో అటకె క్కింది. ఈ అనాలోచిత నిర్ణయం వెనుక చంద్రబాబుతో పాటు అసంఖ్యాక విద్యా సంస్థల సూత్రధారి కూడా ఉన్నా ఆశ్చర్యపోనక్కరలేదు.

గతంలో ప్రాథమిక విద్య అన్ని దశలలోను, ప్రభుత్వ సంస్థలపైన త్రిభాషా సూత్రం మేరకే నామఫలకాలన్నీ (మొదట మాతృభాష, తరువాత హిందీ, ఆంగ్లం) ఉండేవి. ఇక ఇప్పుడు ఈ రెండు రాష్ట్రాలలోను విద్య, భాష లకు సంబంధించి సరైన విధానం లేదని స్పష్టమవుతోంది. అసలు తెలుగు మాధ్యమంలో చదివేవారికి ఇంగ్లిష్‌ రాదని అనుకోవడం తెలివి తక్కువతనం. మాతరమంతా ఆంగ్లాంధ్రాలు రెండూ వచ్చినవారే. వీరిలో బహు భాషా వేత్తలు కూడా ఉన్నారు. ఇప్పుడు మాత్రం పోటీ పరీక్షలకు తయారుచేసే మిడిమిడి భట్టీయ జ్ఞానంతోనే తృప్తిపడుతున్నారు. ఇప్పుడు పోటీ పరీక్షలకు విద్యార్థుల్ని ‘రాపిడి’ పెట్టే లక్ష్యంతో తెలుగు మీడియంకే ఎసరు పెడు తున్నారు. తెలుగు మీడియం రద్దు నిర్ణయాన్ని పలు ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలూ, మేధావులూ వ్యతిరేకించడం అందుకే.

ఈ దేశంలో పార్లమెంటు తోగానీ, ఉన్నతాధికార గణాలతోగానీ, సంబంధిత సంస్థాగత నిపుణులతో గానీ నిమిత్తం లేకుండా నియంతలాగా సొంత నిర్ణయాలు తీసుకుని ఒక నాయకుడు తేరుకోలేని గందరగోళం మధ్య రకరకాల దారులు తొక్కుతుం డగా, మరొక రాష్ట్ర పాలకుడు ‘సహవాస దోషంతో’ నిరంకుశుడిగా ప్రజా మోదం లేని, చర్చకు ఆస్కారం లేని నిర్ణయాలతో ముందుకు సాగుతూం డటం దేశానికీ, రాష్ట్రాలకే అనర్థం. ప్రపంచీకరణ విధానాలను, ప్రజా వ్యతిరేక సంస్కరణలను పాలకులు బేషరతుగా నెత్తి కెక్కించుకున్న తరువాతనే స్థానిక పోటీ పరీక్షలలోనూ, కేంద్ర స్థాయి సివిల్‌ పబ్లిక్‌ పరీక్షలలోనూ మాతృ భాష లలో జవాబులు రాసే, రాయించే అవకాశాలను లేకుండా చేశారు, లేదా జీవశక్తిని పిండివేశారు. కేంద్ర ప్రభుత్వ నియామకాల్లో, పారిశ్రామిక సంస్థల్లో ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం గత 30 సంవత్సరాలుగా సెలక్షన్‌ కమిషన్‌ ద్వారా నియామకాలు జరుగుతున్నాయి.

కానీ ఆంధ్రప్రదేశ్‌ పెద్ద రాష్ట్రాలలో ఒకటైనప్పటికీ,  హిందీ తర్వాత తెలుగు భాష రెండవ స్థానాన్ని ఆక్రమిస్తున్నప్పటికీ ఈ నియా మకాల్లో ఆంధ్రుల సంఖ్య కేవలం ఒక్కశాతం. పై సంస్థల్లోనేకాక, సీఆర్‌పీఎఫ్, బీఎస్‌ఎఫ్, ఇతర ప్రభుత్వ సంస్థల్లోనూ, సర్వే ఆఫ్‌ ఇండియా, ఓఎన్‌ జీసీ, ఇండియన్‌ ఎయిర్‌లైన్స్, భారత్‌ సంచార్‌ నిగమ్‌ వగైరాలలో కేంద్ర సెలక్షన్‌ కమిషన్‌ అభ్యర్థుల నియామకాలు చేస్తుంది. కానీ అందుకు జరిపే పరీక్షల్ని హిందీ, ఇంగ్లిష్‌ భాషలకే పరిమితం చేయడంవల్ల  హిందీయేతర భాషా రాష్ట్రాల ప్రజలకు జరుగుతున్న తీవ్ర అన్యాయాన్ని ప్రధానమంత్రులూ, రాష్ట్రాల ముఖ్యమంత్రులూ పట్టించుకోవడం లేదు.

పరాయి భాష తురాయి కాదు
అసలు విషయం–తెలుగు భాషకు ఎట్టకేలకు విశిష్ట భాషా ప్రతిపత్తి దక్కిం దని పరమానందభరితులమవుతున్న సందర్భంలో, మద్రాసు హైకోర్టులో ఒక తమిళుడు మన భాషా ప్రతిపత్తికి అడ్డుతగలడానికి ప్రయత్నించి విఫల మైనందుకు సంతోషిస్తున్న సమయంలో కూడా మనం విశ్రమించలేక పోతున్నాం. ఎందుకంటే, ప్రపంచ బ్యాంకు ప్రజా వ్యతిరేక సంస్కరణల కత్తుల బోనులో ‘ప్రభుత్వం’ అనే శక్తి చిక్కుబడిపోయింది. ఫలితంగా తెలుగువాడి శ్వాసనూ, భాష ఎదుగుదలనూ విద్యాసంస్థల్లో దాని పురోగతినీ తెలుగు ఏలి కలే అడ్డుకొంటున్నారు. మాతృభాషను పెంచుకోవాలి, అన్యభాషల్ని గౌర వించాలి. ఏ మీడియంలో చదువుకోవాలో తేల్చవలసింది పాలకులూ తల్లిదం డ్రులూ కాదు, విద్యార్థులే.

ఇక్కడొక సంగతి. ప్రసిద్ధ నటుడు బల్రాజ్‌ సాహనీ (పంజాబీ) విశ్వకవి రవీంద్రుణ్ణి ఉడికించడం కోసం సంభాషణకు దిగాడు: టాగూర్‌ అడిగారు, ‘ఇంతకీ నీదేభాష?’ ‘పంజాబీయేగానీ, అందులో చెప్పు కోదగిన సొగసు లేదు. అందుకనే ఇంగ్లిష్‌ రాస్తాను’ అన్నాడు బల్రాజ్‌.  ‘నీవు పంజాబీని కించపరుస్తావా? గురునానక్‌ లాంటి మహాకవిని, గ్రంథకర్తను పంజాబీ భాషా సౌందర్యానికి హారతులందించిన విశిష్ట వ్యక్తిని కాదంటావా? తప్పు తప్పు. ఎంత ఇంగ్లిష్‌లో రాసినా నీది పంజాబీ మాధుర్యం సోకగల రచన కాదు. నా రచనలన్నీ మొదట బెంగాలీలోనేగానీ, ఇంగ్లిష్‌లో కాదు. నేను బెంగాలీ నుంచే ఇతర భాషల వారి కోసం ఇంగ్లిష్‌లో చేస్తానేగానీ.. ఎంత లేదన్నా తల్లిభాష తల్లిభాషే, పరాయి భాష ఎంత తురాయి కట్టుకున్నా పరా యిదే సుమా!’’ అన్నాడు విశ్వకవి.
సీనియర్ సంపాదకులు, ఏబీకే ప్రసాద్
abkprasad2006@yahoo.co.in

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement