తెలుగు ప్రాచీనమే: మద్రాసు హైకోర్టు
- మద్రాసు హైకోర్టు తీర్పు
- తెలుగుకు ప్రాచీన హోదాను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ కొట్టివేత
సాక్షి ప్రతినిధి, చెన్నై/న్యూఢిల్లీ: తెలుగు భాషకు ప్రాచీన హోదా కల్పిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం సమంజసమేనని మద్రాసు హైకోర్టు సోమవారం తీర్పు చెప్పింది. తెలుగు ప్రాచీనమేనని స్పష్టం చేసింది. తెలుగుతోపాటు వివిధ ప్రాంతీయ భాషలకు ప్రాచీన హోదాను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషనన్‌ను కొట్టివేసింది. తెలుగు, కన్నడం, మలయాళం, ఒరియా తదితర భాషలకు కేంద్రం కల్పించిన ప్రాచీన హోదా రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ చెన్నైకి చెందిన ఆర్ గాంధీ అనే సీనియర్ న్యాయవాది మద్రాసు హైకోర్టులో ఇటీవల ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలుచేశారు.
రెండువేల ఏళ్లకు పైగా చరిత్ర, సంస్కృతి, వ్యాకరణం, సాహిత్య విలువలు.. వీటిల్లో ఏ ఒక్క అర్హతా లేని భాషలకు కేంద్రం ఇష్టారాజ్యంగా ప్రాచీన హోదా కల్పించిందని, దీనిని రద్దుచేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన మద్రాస్ హైకోర్టు.. ఏ ప్రాతిపదికన ఆయా భాషలకు ప్రాచీన హోదా కల్పించారో వివరణ ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది.
కేంద్రం వివరణ తరువాత ఇరుపక్షాల వాదనలు గత నెలలోనే విన్న మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్, న్యాయమూర్తి ఆర్ మహదేవన్ సోమవారం తీర్పు ప్రకటించారు. ఒక భాషకు ప్రాచీన హోదా కల్పించడంపై కేంద్రం కొన్ని నిబంధనలు రూపొందించిందని, ఆ మేరకు భాషా పండితుల అధ్యయనం ఆధారంగా తెలుగు, ఒరియా, కన్నడం, మలయాళంలకు ప్రాచీన హోదా ప్రకటించిందని న్యాయమూర్తులు ధ్రువీకరించారు.
కేంద్రం నిర్ణయం సక్రమమా, కాదా పరిశీలించేందుకు హైకోర్టుకు అంతటి భాషా నిపుణులు లేరు కాబట్టి కేంద్రం తీసుకున్న నిర్ణయంలో జోక్యం చేసుకోవడం కుదరదని స్పష్టం చేశారు. న్యాయవాది దాఖలు చేసిన పిల్‌ను కొట్టివేస్తున్నట్లు ప్రకటించారు.
‘తెలుగు’కు ఇది శుభదినం: యార్లగడ్డ
తెలుగుకు ప్రాచీన హోదా కల్పించడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను మద్రాసు హైకోర్టు కొట్టివేయడం సంతోషకరమని పద్మభూషణ్ ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు. ఇది తెలుగు ప్రజలకు శుభదినం అని పేర్కొన్నారు. సోమవారం ఢిల్లీలో యార్లగడ్డ విలేకరులతో మాట్లాడారు. మాతృభాషపై ఉభయ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటికైనా తెలుగును ఆధునిక అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్ది ప్రపంచ భాషగా మార్చేందుకు కృషి చేయాలని కోరారు. కేసును మద్రాసు కోర్టు కొట్టివేయడంతో కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప, సీపీఐ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ఎంపీలకు యార్లగడ్డ మిఠాయిలు ఇచ్చి ఆనందాన్ని పంచుకున్నారు.