R Gandhi
-
కేంద్రంతో ఆర్బీఐకి భిన్నాభిప్రాయాలు సహజమే..
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్‌కి మధ్య భిన్నాభిప్రాయాలు ఉండటం సహజమేనని, ఇది ఆరోగ్యకరమైన ధోరణేనని ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్ ఆర్ గాంధీ వ్యాఖ్యానించారు. అయితే, రెండు పక్షాలు తరచూ చర్చించుకుంటే ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, ఆర్బీఐ తమ డిమాండ్లకు తలొగ్గేలా చేసేందుకు కేంద్రం సెక్షన్ 7ని ప్రయోగించడమనేది తీవ్ర చర్చనీయాంశంగా మారడం దురదృష్టకరమని గాంధీ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వాలు స్వల్పకాలిక దృక్పథంతో ఆలోచిస్తే.. రిజర్వ్ బ్యాంక్ మాత్రం ఎకానమీ శ్రేయస్సు కోసం దీర్ఘకాలిక దృష్టికోణం నుంచి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. ‘ఏదైనా అంశంపై భిన్నాభిప్రాయాల కారణంగా ఒక్కోసారి అంగీకారం కుదరకపోవచ్చు. ఇవి కొత్తేమీ కాదు. అయితే, ప్రభుత్వం, ఆర్బీఐ మధ్యమధ్యలో చర్చించుకున్న పక్షంలో ప్రస్తుతం నెలకొన్న వివాదంలాంటివి తలెత్తవు’ అని గాంధీ పేర్కొన్నారు. ఆర్బీఐ స్వయంప్రతిపత్తిపై కేంద్రం దాడి చేస్తోందన్న వివాదం నెలకొన్న నేపథ్యంలో గాంధీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. డిమాండ్లన్నీ అంగీకరించాలనేమీ లేదు.. బ్యాంకింగ్ వ్యవస్థకు సంబంధించి నిబంధనలు సడలించాలంటూ ఆర్బీఐని కేంద్రం కోరుతున్న అంశంపై స్పందిస్తూ.. ప్రభుత్వ డిమాండ్లన్నింటినీ రిజర్వ్ బ్యాంక్ అంగీకరించాలని లేదన్నారు. సంబంధిత వర్గాలన్నింటి అభిప్రాయాలు సేకరించి, ఎకానమీకి మేలు చేసే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుం దని చెప్పారు. నవంబర్ 19న జరిగే రిజర్వ్ బ్యాంక్ బోర్డు సమావేశంలోనే వివాదాస్పద అంశాలన్నీ పరి ష్కారం కావాలనేమీ లేదని, కొన్నింటిని ఆ తర్వాత రోజుల్లోనైనా చర్చించుకునే అవకాశం ఉందని గాంధీ చెప్పారు. మరోవైపు, వార్షిక ఆడిట్ తర్వాత ఆర్బీఐ తన దగ్గరున్న మిగులు నిధుల నుంచి ప్రభుత్వానికి తగు వాటాలను బదలాయిస్తుందని ఆయన తెలిపారు. దీనిపై నిర్దిష్ట ఫార్ములా ఉండాలంటూ ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ గతంలోనే సూచించారని తెలిపారు. కానీ అప్పట్లో దీనికి అంగీకరించని ప్రభుత్వం ఇప్పుడు అలాంటి ఫార్ములానే కావాలని కోరుతోందని పేర్కొన్నారు. దీనిపై చర్చ జరిగి, తగు విధివిధానాలు రూపొందించుకుంటే ఆర్బీఐ వాటికి కట్టుబడి ఉంటుందని చెప్పారు. -
పేటీఎంలో చేరిన ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్
న్యూఢిల్లీ : పెద్ద నోట్ల రద్దు తర్వాత డిజిటల్ లావాదేవీల్లో దూసుకుపోయిన ప్లాట్‌ఫామ్ ఏదైనా ఉందా? అంటే అది పేటీఎం సంస్థనే. వన్97 కమ్యూనికేషన్‌కు చెందిన ఈ సంస్థలో సెంట్రల్ బ్యాంక్ మాజీ డిప్యూటీ గవర్నర్ రమ సుబ్రహ్మణ్యం గాంధీ చేరారు. పేటీఎం అడ్వయిజరీగా ఆయన బాధ్యతలు చేపట్టినట్టు తెలిసింది. పేమెంట్ సిస్టమ్స్, రెగ్యులేషన్స్, కార్పొరేట్ గవర్నెన్స్‌లో గాంధీకున్న అనుభవాలు, నైపుణ్యాలు పేటీఎంకు ఎంతో ఉపయోగపడనున్నాయని కంపెనీ చెప్పింది. గాంధీ తొలి మానిటరీ పాలసీ కమిటీలో సభ్యుడు కూడా. రిజర్వు బ్యాంక్‌కు చెందిన రెండు స్థానిక ఆఫీసులకు అధినేతగా వ్యవహరించారు. ఆర్బీఐలో పలు వ్యూహాత్మక పాత్రలు పోషించిన ఆయన, ఐటీ, పేమెంట్ సిస్టమ్స్, ఫైనాన్సియల్ లిటరసీ, ఇతర అభివృద్ధి కార్యకలాపాలకు పలు ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్‌లను చేపట్టారు. 1956లో తమిళనాడులో జన్మించిన గాంధీ, అన్నమలై యూనివర్సిటీలో ఆర్థిక శాస్త్రంలో పోస్టు గ్రాడ్యుయేషన్ చేశారు. న్యూయార్క్‌లోని సిటీ యూనివర్సిటీ, అమెరికన్ యూనివర్సిటీల నుంచి క్యాపిటల మార్కెట్, మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్‌లలో కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవల్ క్వాలిఫికేషన్ కలిగి ఉన్నారు. ఫైనాన్సియల్ సర్వీసెస్ స్పేస్‌లో ఇన్స్టిట్యూషన్లను బలోపేతం చేసేందుకే తన జీవితాన్ని అంకితం చేస్తున్నట్టు గాంధీ చెప్పారు. పేటీఎం తనను చేర్చుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. -
వర్చువల్ కరెన్సీలతో రిస్కులు
⇒ ఆర్థిక, చట్టపరమైన సమస్యలు ⇒ ఆర్బీఐ డిప్యుటీ గవర్నర్ ఆర్ గాంధీ ముంబై: బిట్‌కాయిన్ వంటి వర్చువల్ కరెన్సీల వాడకంలో అనేక రిస్కులు ఉన్నాయని రిజర్వ్ బ్యాంక్ డిప్యుటీ గవర్నర్ ఆర్ గాంధీ హెచ్చరించారు. ఆర్థికంగా, చట్టపరంగా, వినియోగదారుల హక్కుల పరిరక్షణపరంగా, భద్రతాపరంగానూ పలు ముప్పులు ఉంటాయని ఆయన వివరించారు. పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్, సాఫ్ట్వేర్ సంస్థల సమాఖ్య నాస్కామ్ నిర్వహించిన సదస్సులో పాల్గొన్న సందర్భంగా గాంధీ ఈ విషయాలు తెలిపారు. డిజిటల్ ఎలక్ట్రానిక్ రూపంలో ఉండే వర్చువల్ కరెన్సీలకు .. హ్యాకింగ్, పాస్వర్డ్ చౌర్యం, మాల్వేర్ దాడుల ముప్పు కూడా ఉంటుందని గాంధీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. నియంత్రణ వ్యవస్థలు లేవు... వర్చువల్ కరెన్సీలను నియంత్రించేందుకు ఎలాంటి కేంద్రీయ బ్యాంకులు లేవని ఆయన చెప్పారు. కస్టమర్ల సమస్యలు, ఫిర్యాదుల పరిష్కారానికి ఎటువంటి వ్యవస్థా వీటికి ఉండదన్నారు. చట్టవిరుద్ధమైన, అక్రమ కార్యకలాపాలకు వర్చువల్ కరెన్సీలు ఉపయోగపడుతున్నట్లు అనేక కేసులు కూడా నమోదైనట్లు గాంధీ చెప్పారు. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ఆధారిత బిట్‌కాయిన్ తదితర వర్చువల్ కరెన్సీలు వేటికైనా ప్రారంభ దశలోనే విశ్వసనీయత ఉంటుందని, తర్వాత దశల్లో కూడా దాన్ని కాపాడుకుంటేనే మనుగడ ఉండగలదని ఆయన చెప్పారు. ‘ప్రారంభ దశలో అడ్వెంచరిస్టులు, రిస్కులు తీసుకునే వారు ఉంటారు. తర్వాత మిగతావారు చేరతారు. రిస్కులు తీసుకోవడానికి ఇష్టపడని వారు కూడా క్రమంగా చేరాలంటే వర్చువల్ కరెన్సీకి ఆమోదయోగ్యత ఉంటుందని, కొనసాగుతుందన్న నమ్మకం వారిలో కలగాలి. అప్పుడే ఇటువంటి కరెన్సీలకు మనుగడ ఉంటుంది‘ అని గాంధీ వివరించారు. నియంత్రణ సంస్థల పరిధిలో ఉన్నప్పుడే ఏ కరెన్సీపైన అయినా నమ్మకం ఉంటుందని గాంధీ వివరించారు. కరెన్సీ చలామణీ కనుమరుగు అపోహే... వర్చువల్ కరెన్సీ రాకతో కరెన్సీ చలామణీ పూర్తిగా కనుమరుగవుతుందన్నది అపోహేనని గాంధీ స్పష్టం చేశారు. ఫైనాన్షియల్ టెక్నాలజీ కంపెనీలు.. ఆర్థిక సేవల పరిశ్రమలో వేగంగా పెను మార్పులు తీసుకొస్తున్నాయని ఆయన చెప్పారు. బ్యాంకుల వంటి ఆర్థిక సేవల సంస్థలు కూడా ఫైనాన్షియల్ టెక్నాలజీ ప్రయోజనాలను గుర్తిస్తున్నాయని గాంధీ ఈ సందర్భంగా అన్నారు. -
కొత్త నోట్లు దాచుకోవద్దు: ఆర్బీఐ
ముంబై: పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో తలెత్తిన నోట్ల కష్టాలను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నామని భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్బీఐ) తెలిపింది. నవంబర్ 10 నుంచి డిసెంబర్ 10 వరకు నెల రోజుల వ్యవధిలో 4 లక్షల 61 వేల కోట్ల విలువ చేసే నోట్లు బ్యాంకులు, ఏటీఎంల ద్వారా పంపిణీ చేశామని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఆర్ గాంధీ తెలిపారు. ఇందులో 1.70 లక్షల కోట్ల రూపాయల విలువ చేసే రూ. 2 వేల నోట్లు, కొత్త రూ. 500 నోట్లు ఉన్నాయని చెప్పారు. మిగతా మొత్తానికి చిన్న నోట్లు పంపించామన్నారు. కొత్త నోట్లను దాచుకోవద్దని, చెలామణి చేయాలని ప్రజలకు సూచించారు. డిసెంబర్ 10 వరకు బ్యాంకుల్లో రూ.12 లక్షల 44 వేల కోట్ల విలువైన పాత రూ.500, వెయ్యి రూపాయల నోట్లు జమ అయ్యాయని వెల్లడించారు. ఇవన్నీ తమ వద్దకు వచ్చాయని చెప్పారు. పాత పెద్ద నోట్ల మార్పిడి వ్యవహారాల్లో పలు బ్యాంకుల్లో వెలుగు చూసిన అక్రమాలపైనా ఆర్బీఐ స్పందించింది. బ్యాంకుల ఆడిటింగ్ లో అన్ని విషయాలు బయటపడతాయని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఎస్ ఎస్ ముంద్రా అన్నారు. బ్యాంకు కార్యకలాపాలపై నిఘా కొనసాగుతుందని తెలిపారు. పాత పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్యాంకుల్లో లావాదేవీలకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజీని భద్రపరచాలని ఆదేశించారు. బెంగళూరులో అవకతవకలకు పాల్పడిన ఆర్బీఐ ఉద్యోగిని సస్పెండ్ చేసినట్టు వెల్లడించారు. నకిలీ ఖాతాల్లో పెద్ద మొత్తంలో నగదు డిపాజిట్ చేసిన ఢిల్లీ యాక్సిస్ బ్యాంకుకు షోకాజ్ నోటీసు జారీచేసినట్టు ముంద్రా తెలిపారు. -
తెలుగు ప్రాచీనమే: మద్రాసు హైకోర్టు
- మద్రాసు హైకోర్టు తీర్పు - తెలుగుకు ప్రాచీన హోదాను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ కొట్టివేత సాక్షి ప్రతినిధి, చెన్నై/న్యూఢిల్లీ: తెలుగు భాషకు ప్రాచీన హోదా కల్పిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం సమంజసమేనని మద్రాసు హైకోర్టు సోమవారం తీర్పు చెప్పింది. తెలుగు ప్రాచీనమేనని స్పష్టం చేసింది. తెలుగుతోపాటు వివిధ ప్రాంతీయ భాషలకు ప్రాచీన హోదాను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషనన్ను కొట్టివేసింది. తెలుగు, కన్నడం, మలయాళం, ఒరియా తదితర భాషలకు కేంద్రం కల్పించిన ప్రాచీన హోదా రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ చెన్నైకి చెందిన ఆర్ గాంధీ అనే సీనియర్ న్యాయవాది మద్రాసు హైకోర్టులో ఇటీవల ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలుచేశారు. రెండువేల ఏళ్లకు పైగా చరిత్ర, సంస్కృతి, వ్యాకరణం, సాహిత్య విలువలు.. వీటిల్లో ఏ ఒక్క అర్హతా లేని భాషలకు కేంద్రం ఇష్టారాజ్యంగా ప్రాచీన హోదా కల్పించిందని, దీనిని రద్దుచేయాలని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన మద్రాస్ హైకోర్టు.. ఏ ప్రాతిపదికన ఆయా భాషలకు ప్రాచీన హోదా కల్పించారో వివరణ ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది. కేంద్రం వివరణ తరువాత ఇరుపక్షాల వాదనలు గత నెలలోనే విన్న మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్, న్యాయమూర్తి ఆర్ మహదేవన్ సోమవారం తీర్పు ప్రకటించారు. ఒక భాషకు ప్రాచీన హోదా కల్పించడంపై కేంద్రం కొన్ని నిబంధనలు రూపొందించిందని, ఆ మేరకు భాషా పండితుల అధ్యయనం ఆధారంగా తెలుగు, ఒరియా, కన్నడం, మలయాళంలకు ప్రాచీన హోదా ప్రకటించిందని న్యాయమూర్తులు ధ్రువీకరించారు. కేంద్రం నిర్ణయం సక్రమమా, కాదా పరిశీలించేందుకు హైకోర్టుకు అంతటి భాషా నిపుణులు లేరు కాబట్టి కేంద్రం తీసుకున్న నిర్ణయంలో జోక్యం చేసుకోవడం కుదరదని స్పష్టం చేశారు. న్యాయవాది దాఖలు చేసిన పిల్‌ను కొట్టివేస్తున్నట్లు ప్రకటించారు. ‘తెలుగు’కు ఇది శుభదినం: యార్లగడ్డ తెలుగుకు ప్రాచీన హోదా కల్పించడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను మద్రాసు హైకోర్టు కొట్టివేయడం సంతోషకరమని పద్మభూషణ్ ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు. ఇది తెలుగు ప్రజలకు శుభదినం అని పేర్కొన్నారు. సోమవారం ఢిల్లీలో యార్లగడ్డ విలేకరులతో మాట్లాడారు. మాతృభాషపై ఉభయ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తెలుగును ఆధునిక అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్ది ప్రపంచ భాషగా మార్చేందుకు కృషి చేయాలని కోరారు. కేసును మద్రాసు కోర్టు కొట్టివేయడంతో కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప, సీపీఐ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ఎంపీలకు యార్లగడ్డ మిఠాయిలు ఇచ్చి ఆనందాన్ని పంచుకున్నారు. -
వైఎస్సార్సీపీలోకి మాజీ ఎమ్మెల్యే గాంధీ
జగన్ సమక్షంలో పార్టీలో చేరిక పలమనేరు, న్యూస్‌లైన్: చిత్తూరుజిల్లా వేపంజేరి మాజీ ఎమ్మెల్యే ఆర్.గాంధీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. ఆయన గతంలో తెలుగుదేశం ఎమ్మెల్యేగా పనిచేశారు. శనివారం ఉదయం ఆయన పలమనేరు నియోజకవర్గంలోని పెద్దపంజాణి మండలం పెద్దవెలగటూరులో జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ఆయనకు కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్ర సమైక్యత విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు విధానాలు నచ్చకే తాను పార్టీని వీడినట్లు గాంధీ పేర్కొన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని పోరాడుతున్న జగన్మోహన్రెడ్డికి మద్దతు తెలిపేందుకు తాను వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీలో చేరానన్నారు. చిత్తూరు జిల్లాలో దశాబ్దాలుగా టీడీపీని అంటిపెట్టుకొని చిత్తశుద్ధితో పనిచేసే నాయకులంతా ఎందుకు పార్టీని వీడుతున్నారో చంద్రబాబు ఆత్మవిమర్శ చేసుకోవాలని కోరారు. పార్టీలో ఎన్టీఆర్ ఆశయాలెప్పుడో పోయాయని, ఇప్పుడంతా స్వార్ధపూరిత రాజకీయాలు నడుస్తున్నాయని చెప్పారు. తనకు ఎమ్మెల్యే, ఎంపీ పదవులు అవసరం లేదని సమైక్యాంధ్ర కోసం పాటుపడుతున్న జగన్మోహన్ రెడ్డి వెంట ఓ సైనికుడిలా, పార్టీలో సామాన్య కార్యకర్తలా పనిచేస్తానన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి, వైఎస్సార్సీపీ పలమనేరు నియోజకవర్గ సమన్వయకర్త అమరనాథ రెడ్డి, పార్టీ జిల్లా కన్వీనర్ నారాయణస్వామి, రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు మిథున్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.