వైఎస్సార్‌సీపీలోకి మాజీ ఎమ్మెల్యే గాంధీ
జగన్ సమక్షంలో పార్టీలో చేరిక
పలమనేరు, న్యూస్‌లైన్: చిత్తూరుజిల్లా వేపంజేరి మాజీ ఎమ్మెల్యే ఆర్.గాంధీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్‌మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. ఆయన గతంలో తెలుగుదేశం ఎమ్మెల్యేగా పనిచేశారు. శనివారం ఉదయం ఆయన పలమనేరు నియోజకవర్గంలోని పెద్దపంజాణి మండలం పెద్దవెలగటూరులో జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా జగన్‌మోహన్ రెడ్డి ఆయనకు కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్ర సమైక్యత విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు విధానాలు నచ్చకే తాను పార్టీని వీడినట్లు గాంధీ పేర్కొన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని పోరాడుతున్న జగన్‌మోహన్‌రెడ్డికి మద్దతు తెలిపేందుకు తాను వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీలో చేరానన్నారు.
చిత్తూరు జిల్లాలో దశాబ్దాలుగా టీడీపీని అంటిపెట్టుకొని చిత్తశుద్ధితో పనిచేసే నాయకులంతా ఎందుకు పార్టీని వీడుతున్నారో చంద్రబాబు ఆత్మవిమర్శ చేసుకోవాలని కోరారు. పార్టీలో ఎన్టీఆర్ ఆశయాలెప్పుడో పోయాయని, ఇప్పుడంతా స్వార్ధపూరిత రాజకీయాలు నడుస్తున్నాయని చెప్పారు. తనకు ఎమ్మెల్యే, ఎంపీ పదవులు అవసరం లేదని సమైక్యాంధ్ర కోసం పాటుపడుతున్న జగన్‌మోహన్ రెడ్డి వెంట ఓ సైనికుడిలా, పార్టీలో సామాన్య కార్యకర్తలా పనిచేస్తానన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి, వైఎస్సార్‌సీపీ పలమనేరు నియోజకవర్గ సమన్వయకర్త అమరనాథ రెడ్డి, పార్టీ జిల్లా కన్వీనర్ నారాయణస్వామి, రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు మిథున్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.