వైఎస్సార్‌సీపీలోకి కోడుమూరు మాజీ ఎమ్మెల్యే
సాక్షి, హైదరాబాద్: కర్నూలు జిల్లా కోడుమూరు మాజీ ఎమ్మెల్యే డి.మురళీకృష్ణ ఆదివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఆయన నివాసంలో కలుసుకుని పార్టీలో చేరాలన్న తన అభీష్టాన్ని మురళీకృష్ణ వెల్లడించారు. వైఎస్ జగన్ ఆయనకు పార్టీ కండువా కప్పి వైఎస్సార్ సీపీలోకి ఆహ్వానించారు. కోడుమూరు ప్రస్తుత ఎమ్మెల్యే మణి గాంధీపై 2009 ఎన్నికల్లో మురళీకృష్ణ గెలుపొందారు. కర్నూలు ఎంపీ బుట్టా రేణుక, జిల్లా పార్టీ అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, ఎమ్మెల్యేలు వై.బాలనాగిరెడ్డి, యక్కలదేవి ఐజయ్య, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, పి.రవీంద్రనాథ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డి సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది.
నేడు పులివెందులకు వైఎస్ జగన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, విపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం వైఎస్సార్ జిల్లా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. మూడురోజుల క్రితం కురిసిన వడగళ్ల వానకు పులివెందుల, లింగాల మండలాల్లో అరటి, బత్తాయి తదితర పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. సోమవారం ఉదయం పులివెందుల చేరుకోనున్న జగన్.. ఆ మండలంలోని నల్లపురెడ్డిపల్లె, నల్లగొండువారిపల్లె, కొత్తపల్లె గ్రామాలతో పాటు లింగాల మండలంలోని ఇప్పట్ల, చిన్నకుడాల గ్రామాల పరిధిలో దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తారని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి తెలిపారు. రైతులతో మాట్లాడతారని చెప్పారు. రైతులు కోలుకోలేని విధంగా తోటలు దెబ్బతిన్నాయని తాను చెప్పడంతో పార్టీ అధ్యక్షుడు వెంటనే పర్యటనకు బయలుదేరారని వివరించారు. పర్యటన అనంతరం వైఎస్ జగ న్ రాత్రికి హైదరాబాద్ చేరుకుంటారు.