టీడీపీ విధానాలతోనే చేనేత సంక్షోభం | Former MLA Kethi Reddy YSRCP Relay Initiatives for hand crafts | Sakshi
Sakshi News home page

టీడీపీ విధానాలతోనే చేనేత సంక్షోభం

Published Tue, Sep 12 2017 7:25 AM | Last Updated on Wed, Oct 3 2018 7:38 PM

టీడీపీ విధానాలతోనే చేనేత సంక్షోభం - Sakshi

టీడీపీ విధానాలతోనే చేనేత సంక్షోభం

నేతన్నల సంక్షేమ పథకాలన్నీ నీరుగార్చారు : మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి
సంక్షేమ పథకాల అమలులో పక్షపాత వైఖరి : మాజీ ఎంపీ అనంత
చేనేత కార్మికులకు న్యాయం జరిగే వరకూ పోరాటం
వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు ప్రారంభం


ధర్మవరం :
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సింది పోయి..ఉన్న సంక్షేమ పథకాలను ఎత్తేస్తూ చేనేత వ్యవస్థను దెబ్బతీస్తున్నారని మాజీ ఎంపీ, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకటరామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే, ధర్మవరం నియోజకవర్గ సమన్వయకర్త కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి విమర్శించారు. టీడీపీ విధానాలతోనే చేనేత రంగం నిర్వీర్యమవుతోందన్నారు. చేనేతలకు అందాల్సిన ముడిపట్టు రాయితీ బకాయిలు వెంటనే చెల్లించాలన్న డిమాండ్‌తో కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి నేతృత్వంలో స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట చేపట్టిన రిలే దీక్షలకు మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి హాజరై ప్రారంభించారు.

ఈ సందర్భంగా ‘అనంత’ మాట్లాడుతూ, జిల్లాలో వ్యవసాయం తర్వాత అత్యధికంగా ఉపాధినిస్తున్న చేనేత రంగాన్ని తెలుగుదేశం ప్రభుత్వం విస్మరించడం దారుణమన్నారు. జిల్లాలో 27వేల మంది గుర్తింపు కలిగిన చేనేత కుటుంబాలకు అందాల్సిన అన్ని రకాల సంక్షేమ పథకాలనూ నిలిపివేసి కష్టాల్లోకి నెడుతున్నారన్నారు. టీడీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో విపరీతమైన పక్షపాత ధోరణిని అవలంబిస్తోందన్నారు. జిల్లాలో రైతులు, చేనేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడతుంటే ఏ ఒక్క ప్రజాప్రతినిధికీ పట్టడం లేదన్నారు. ఎంత సేపూ సొంత ఆదాయం తప్ప.. ప్రజా సంక్షేమం గురించి ఆలోచించే నాయకుడే టీడీపీలో లేరని దుయ్యబట్టారు. అవసానదశలో ఉన్న చేనేత రంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉందన్నారు.  

చేనేతలకు న్యాయం జరిగే వరకు పోరాటాలు  
చేనేతలకు అందాల్సిన అన్ని సంక్షేమ పథకాలనూ నిలిపివేసి చేనేత రంగ పతనానికి  ప్రభుత్వం కారణమవుతోందని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి విమర్శించారు.  చేనేతల ఇబ్బందులను గుర్తించి అప్పట్లో ముడిపట్టు రాయితీని తీసుకొచ్చామని, జిల్లా వ్యాప్తంగా 27వేల మందికి, ఒక్క ధర్మవరంలోనే 13 వేల మందికి ప్రతినెలా రూ.600 చొప్పున రాయితీ అందేదన్నారు.  టీడీపీ అధికారంలోకొచ్చిన తర్వాత రాయితీని నిలిపివేయడాన్ని చూస్తే చేనేతల పట్ల పాలకులకు ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో అర్థమవుతుందన్నారు. సీఎం చంద్రబాబు ధర్మవరం వచ్చి రూ.600 సబ్సిడీని రూ.1,000కి పెంచుతున్నట్లు ప్రకటించారేగానీ రాయితీ నిధులు కేటాయించలేదన్నారు. వైఎస్సార్‌సీపీ తరఫున మూడు దఫాలు చేనేతల నుంచి సంతకాల సేకరణ చేసి, ముడిపట్టు రాయితీ అందలేదని కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తే స్పందించారన్నారు. ఇప్పటికి మొత్తం 21 నెలల బకాయి పెండింగ్‌లో ఉందన్నారు. జిల్లాలో 65 మంది చేనేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్ప డితే కేవలం 11 మందికి మాత్రం పరిహారం ఇచ్చి చేతులు దులుపుకున్నారన్నారు.

చేనేతల గురించి ఆలోచన చేస్తోంది తమ పార్టీ మాత్రమేనని, చేనేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడితే తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి వారిని పరామర్శించి, ఆర్థిక సాయం అందజేశారని గుర్తు చేశారు. చేనేతలకు న్యాయం జరిగే వరకు పోరాటాలు ఆపేదిలేదన్నారు. దీక్షల్లో వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు లాలేనాయక్, చందమూరి నారాయణరెడ్డి, నాయకులు చింతా యల్లయ్య, బాలం గోపాల్, డోల్‌ దాస్, తేజా, పెద్దన్న, పురుషోత్తంరెడ్డి, రంగస్వామి, ఎస్‌వీ రమణారెడ్డి, శేఖర్‌రెడ్డి, తోపుదుర్తి వెంకటరాముడు, మేడాపురం వెంకటేష్, ఎస్‌పీ బాషా, గడ్డం కుమార్, మాసపల్లి సాయికుమార్, పెద్దన్న కూర్చున్నారు. చేనేత విభాగం జిల్లా అధ్యక్షుడు బీరే ఎర్రిస్వామి, పట్టణ అధ్యక్షుడు గడ్డం కుళ్లాయప్ప, చేనేత నాయకులు బీరే జయచంద్ర, గుర్రం రాజ, లాయర్‌ కిష్ట, పాలబావి శీనా, గుండా ఈశ్వరయ్య, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement