‘ప్రాణహిత-చేవెళ’లపై ఉద్యమిస్తాం..
సాక్షి, హైదరాబాద్: మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రైతుల కళ్లలో ఆనందం చూడాలని పరితపించారని, జలయజ్ఞంతో ప్రాజెక్టుల నిర్మాణాలకు సిద్ధపడ్డారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు జి.సురేశ్‌రెడ్డి తెలిపారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును ముట్టుకుంటే సీఎం కేసీఆర్ రక్తపాతాన్ని కళ్ల చూడాల్సి వస్తుందని, అవసరమైతే తాము ప్రాణత్యాగాలకు సిద్ధపడతామని హెచ్చరించారు. సోమవారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సురేశ్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ..
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్‌ను మార్చాలనే ఆలోచన ఎందుకు వచ్చిందనే దానిపై సీఎం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతాంగ సంక్షేమమే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని, రంగారెడ్డి జిల్లాలో ప్రతి పల్లె, ప్రతి బస్తీ తిరిగి సీఎం ప్రజావ్యతిరేక విధానాలు ఎండగడతామన్నారు. ప్రాజెక్టు డిజైన్ మారిస్తే.. అనుమతులు రావడం సులభం కాదని చెప్పారు. కరువులేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలి..
తెలంగాణను కరువులేని రాష్ట్రంగా సీఎం కేసీఆర్ తీర్చిదిద్దాలని మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి చెప్పారు. సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యనేతల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు రాష్ట్రాల సీఎంలు ప్రాజెక్టుల పేరుతో ప్రజల మధ్య చిచ్చుపెడుతున్నారని ఆరోపించారు. వైఎస్సార్ ప్రారంభించిన జలయజ్ఞంలో ప్రారంభించిన ప్రాజెక్టులను వెంటనే పూర్తిచేయాలని, ఆ తర్వాతే కొత్త ప్రాజెక్టుల జోలికి వెళ్లాలని సీఎం కేసీఆర్‌కు సూచించారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్ మారిస్తే ఊరుకొబోమన్నారు.
వైఎస్సార్ ఆనాడు రైతుల కోసం ప్రాజెక్టుల నిర్మాణాలకు శ్రీకారం చూట్టార ని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి తెలిపారు. వైఎస్సార్ ప్రాణహిత-చేవెళ్లకు శంకుస్థాపన చేసేటప్పుడు కేంద్రమంత్రిగా ఉన్న కేసీఆర్ అప్పుడు ఎందుకు దాని గురించి మాట్లాడలేదని ప్రశ్నించారు. ఇవాళ డిజైన్ మార్పు చేయాలనుకోవడంలో అర్థం ఏమిటని నిలదీశారు. ప్రాణహిత-చేవెళ్ల డిజైన్ మార్పుపై పార్టీలకతీతంగా ఉద్యమం తెస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో పార్టీ నేతలు కె.శివకుమార్, నల్లా సూర్యప్రకాష్, గట్టు శ్రీకాంత్‌రెడ్డి, శ్యాంసుందర్ రెడ్డి, భీష్వ రవీందర్, సిదార్థరెడ్డి, ప్రపుల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.